English | Telugu

ఈ ఇద్ద‌రు సెల‌బ్రిటీ కిడ్స్‌కు కొవిడ్ పాజిటివ్‌! ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

నిన్న‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ స‌మీరా రెడ్డి క‌రోనావైర‌స్‌కు గుర‌య్యారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించ‌గానే త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ నుంచి హార్ట్‌ఫెల్ట్ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. కొంత‌మంది ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్ గురించి ఆరా తీశారు. త‌న అత్త‌య్య త‌ప్ప ఇంట్లో ఉన్న మిగ‌తా వాళ్లంద‌రూ కొవిడ్‌-19 పాజిటివ్‌గా టెస్టులో నిర్ధార‌ణ అయ్యింద‌నే వాస్త‌వాన్ని లేటెస్ట్ పోస్ట్‌లో ఆమె వెల్ల‌డించారు. పిల్ల‌లు హ‌న్స్, నైరాల‌కు కూడా కొవిడ్ సోకిన‌ట్లు ఆమె తెలిపింది. త‌న పిల్ల‌ల ఫొటోను షేర్ చేసిన స‌మీరా, "చాలా మంది హ‌న్స్‌, నైరా గురించి అడుగుతున్నారు. ఇదే అప్‌డేట్.." అంటూ రాసుకొచ్చింది.

"గ‌త వారం హ‌న్స్‌కు హై ఫీవ‌ర్‌, త‌ల‌నొప్పి, ఒంటినొప్పి, క‌డుపునొప్పి, తీవ్ర నిస్స‌త్తువ లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. నాలుగు రోజుల పాటు వాటితో త‌ను ఇబ్బందిప‌డ్డాడు. టెస్ట్ చేయించ‌గా కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. ఆ వెంట‌నే నైరాకు సైతం ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం మొద‌లైంది. త‌న‌కు ఫీవ‌ర్‌, క‌డుపునొప్పి వ‌చ్చాయి. టెస్ట్‌లో త‌న‌కూ పాజిటివ్ వ‌చ్చింది. పిల్ల‌ల త‌ర్వాత నేను, అక్ష‌య్ (భ‌ర్త‌) కూడా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. ల‌క్కీగా మా అత్త‌య్యకు మాత్రం నెగ‌టివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆమె మాతో కాకుండా వేరేగా ఉంటోంది." అని ఆమె వెల్ల‌డించింది.

"పిల్ల‌లిద్ద‌రినీ సౌక‌ర్యంగా ఉంచేందుకు నేను చేయాల్సిందంగా చేశాను. ఇద్ద‌రూ త్వ‌ర‌గానే కోలుకున్నారు. మేం మెడికేష‌న్లు మొద‌లుపెట్టాం. ఆవిరి పీల్చ‌డం, ఉప్పునీరు పుక్కిలించ‌డం, శ్వాస‌క్రియ వ్యాయామం, ప్రాణాయామం, మంచి పోష‌కాహారం తీసుకోవ‌డం లాంటివి చేస్తూ, డాక్ట‌ర్లు సూచ‌న‌లు పాటిస్తూ వ‌స్తున్నాం. నెగ‌టివ్‌గా ఆలోచించ‌వ‌ద్ద‌నీ, భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌నీ అంద‌ర్నీ కోరుతున్నాను. మిమ్మ‌ల్ని మీరు సుర‌క్షితంగా ఉంచుకుంటూ, ఇత‌రుల్ని క్షేమంగా ఉంచండి." అని ఆమె రాసుకొచ్చింది.