English | Telugu

సల్మాన్‌ఖాన్‌కి ఘోర అవమానం.. తలెత్తుకోలేకపోతున్న బాలీవుడ్‌ స్టార్‌!

సల్మాన్‌ఖాన్‌కి ఘోర అవమానం.. తలెత్తుకోలేకపోతున్న బాలీవుడ్‌ స్టార్‌!

దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న హీరో సల్మాన్‌ఖాన్‌. అతను హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కానీ, తాజాగా విడుదలైన సికందర్‌ మాత్రం అతనికి ఘోర అవమానాన్ని చవిచూపించింది. రంజాన్‌ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయింది. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండో రోజే చేతులెత్తేసింది. చాలా ఏరియాల్లో ఆడియన్స్‌ లేకపోవడం వల్ల షోలు క్యాన్సిల్‌ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి రంజాన్‌కి ఏదో ఒక సినిమా రిలీజ్‌ అవుతుంది. ఫలితం ఎలా ఉన్నా కొన్నిరోజులు థియేటర్ల దగ్గర హడావిడి ఉంటుంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా షోలు క్యాన్సిల్‌ అయ్యాయంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా సల్మాన్‌ చేసిన సినిమాల్లో టైగర్‌3 తప్ప మిగతా సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద ఎక్కువ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అయితే సికందర్‌ మాత్రం అతని కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌ అని చెప్పుకోవాలి. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి తొలిరోజు నుంచే ఫ్లాప్‌ టాక్‌ రావడం మాత్రం సల్మాన్‌కి పెద్ద అవమానంగానే భావించాలి. అతని వ్యక్తిగత కారణాలు కూడా సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయేమో అనిపిస్తుంది. కొందరు గ్యాంగ్‌స్టర్లకు సల్మాన్‌ టార్గెట్‌ అవ్వడం, అతని ఫ్యామిలీ కూడా ఇబ్బందులకు గురి కావడం వంటి అంశాలు తన కెరీర్‌పై దృష్టి పెట్టకుండా చేస్తున్నాయనేది వాస్తవం. కథలు, డైరెక్టర్ల ఎంపిక విషయంలో కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. అన్నింటినీ మించి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు, వారి అభిరుచిలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాలను కూడా సల్మాన్‌ పట్టించుకోవడం లేదు అనేది అతని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. 

ఎ.ఆర్‌.మురుగదాస్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేసుకోవడంలో సల్మాన్‌ కొంత విభిన్నంగా ఆలోచించినా కంటెంట్‌ పరంగా శ్రద్ధ పెట్టలేదు. ఈ సినిమాలో రష్మిక మందన్న, కాజల్‌ అగర్వాల్‌, సత్యరాజ్‌, కిశోర్‌ వంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ సౌత్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చెయ్యలేదు. అంతేకాదు, సినిమాను ప్రమోట్‌ చేసుకోవడంలో కూడా సల్మాన్‌ వెనుకడుగు వేశాడు. ఒకవిధంగా సినిమా ప్రమోషన్‌ గురించి అసలు పట్టించుకోలేదు. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పేరున్న డైరెక్టర్‌ అయినా తమ సినిమాను రిలీజ్‌ చేసుకోవడానికి, ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించుకోవడానికి ప్రమోట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్‌ థియేటర్స్‌కి వచ్చే పరిస్థితి లేదు. వారిని రప్పించగలగడమే సగం సక్సెస్‌ అని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో సినిమాని పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అనేది సికిందర్‌ రిజల్ట్‌ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.