English | Telugu

ప్రశాంత్‌వర్మను పక్కన పెట్టి మరో సౌత్‌ డైరెక్టర్‌ని లాక్‌ చేసిన రణవీర్‌సింగ్‌!

ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీ అంటే అన్ని భాషల ఇండస్ట్రీలు ఆశ్చర్యంగా చూసేవి. ఎందుకంటే హిందీలో చేసే సినిమాలు భారీ లెవల్‌లో ఉండడమే కాకుండా మల్టీస్టారర్స్‌ ఎక్కువగా చేసేవారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను బాగా పెంచుకునేవారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. సౌత్‌ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్‌ వన్‌ ఇండస్ట్రీ అనిపించుకుంటోంది. అలాగే తమిళ్‌, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కూడా లైన్‌లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా సౌత్‌ డైరెక్టర్లపైనే కన్నేశారు. కొన్ని సినిమాలు చేసి సక్సెస్‌ అయిన డైరెక్టర్లతో సినిమాలు చేసేందు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ మలయాళ దర్శకుడితో సినిమా చేసేందుకు బాలీవుడ్‌ హీరో రణవీర్‌సింగ్‌ ఆసక్తిగా ఉన్నాడు. 

మలయాళంలో వరస హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు బాసిల్‌. కేవలం మలయాళంలోనే కాదు, ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాలతో డైరెక్టర్‌గా ఒక డిఫరెంట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. చేసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ కావడంతో రణవీర్‌ దృష్టిని ఆకర్షించాడు. బాసిల్‌ దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా. తన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. బాసిల్‌కు బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. రణవీర్‌సింగ్‌తో ఓ హిందీ సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యారని సమాచారం. ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తోందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

నిజానికి హనుమాన్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో రణవీర్‌సింగ్‌ ఒక సినిమా ప్లాన్‌ చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ అయింది. ఇక సెట్స్‌కి వెళ్ళడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయింది. ప్రశాంత్‌వర్మను పక్కన పెట్టడానికి కారణం ఏమిటో తెలియదు. బాసిల్‌తో సినిమా చేసేందుకే ప్రశాంత్‌ వర్మను పక్కన పెట్టారా.. అనే చర్చ కూడా నడుస్తోంది. రణవీర్‌సింగ్‌, బాసిల్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఏ కాన్సెప్ట్‌తో రాబోతోంది. మరి ఈ సినిమాతో రణవీర్‌, బాసిల్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.