English | Telugu

రెండు నెల‌ల త‌ర్వాత భార్య శిల్పాశెట్టిని తిరిగి క‌లుసుకున్న రాజ్ కుంద్రా!

పోర్నోగ్ర‌ఫీ కేసులో రెండు నెల‌లు జైల్లో గ‌డిపిన బిజినెస్‌మేన్ రాజ్ కుంద్రా మంగ‌ళ‌వారం విడుద‌లై, త‌న ఇంట్లో భార్య శిల్పాశెట్టిని తిరిగి క‌లుసుకున్నాడు. ఆయ‌న బ్లాక్ మెర్సిడెస్ కారులో జుహులోని త‌న బంగ్లాకు చేరుకున్నాడు. రెండు నెల్ల క్రితం అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట‌యిన కుంద్రాకు ముంబైలోని ఒక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన ఒక‌రోజు త‌ర్వాత ఆర్థ‌ర్ రోడ్ జైలు నుంచి న‌డుచుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు కుంద్రా. సోమ‌వారం రూ. 50 వేల సొంత పూచీక‌త్తుతో కుంద్రాకు చీఫ్ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ ఎస్‌.బి. భాజిపాలే బెయిల్‌ను అనుమ‌తించారు.

జైలు నుంచి కుంద్రా రిలీజైన కొన్ని నిమిషాల‌కే త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో శిల్పాశెట్టి ఒక మోటివేష‌న‌ల్ పోస్ట్‌ను షేర్ చేసింది. "నేల‌మీదికి నిన్ను తోసే క్ష‌ణాలుంటాయి, స‌రికొత్త సంక‌ల్పం, ప్రేర‌ణ‌తో తిరిగి నిల‌బ‌డ‌తావు." అంటూ మంగ‌ళ‌వారం త‌న పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది. భార్యాపిల్ల‌ల‌ను చూసిన రాజ్ కుంద్రా చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడ‌నీ, శిల్ప ప‌రిస్థితి కూడా అంతేన‌నీ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్‌, మ‌హిళ‌ల‌ను అస‌భ్య‌క‌రంగా చిత్రించ‌డం (ప్రొహిబిష‌న్‌) చ‌ట్టం త‌దిత‌రాల‌ కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు స‌ప్లిమెంట‌ర్ చార్జిషీట్ ఫైల్‌ చేసిన కొన్ని రోజుల త‌ర్వాత గ‌త శ‌నివారం మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషిన్ పెట్టుకున్నాడు కుంద్రా. తాను 'బ‌లిప‌శువు'గా మారాన‌ని, దానికి కార‌ణాలు ద‌ర్యాప్తు అధికారుల‌కు బాగా తెలుసున‌నీ ఆయ‌న ఆ పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. మొత్తం స‌ప్లిమెంట‌ర్ చార్జ్‌-షీట్‌లో కుంద్రాకు వ్య‌తిరేకంగా ఒక్క ఆరోప‌ణ కూడా లేద‌ని కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో ఆయ‌న లాయ‌ర్ ప్ర‌శాంత్ పాటిల్ తెలిపారు.

కుంద్రాకు వ్య‌తిరేకంగా పోలీసులు త‌యారుచేసిన 1500 పేజీల చార్జ్‌షీట్‌లో 43 మంది సాక్షుల స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ సాక్షుల్లో శిల్పాశెట్టి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌నితో బిజీగా ఉన్న త‌నకు భ‌ర్త కార్య‌క‌లాపాల గురించి తెలీద‌ని శిల్పాశెట్టి చెప్పిన‌ట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.