English | Telugu

గుండెపోటుతో 'రామ్ తేరీ గంగా మైలీ' హీరో మృతి!

 

రాజ్ క‌పూర్ చిన్న కుమారుడు రాజీవ్ క‌పూర్ మంగ‌ళ‌వారం, ఫిబ్ర‌వ‌రి 9 మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు తీవ్ర‌మైన గుండెపోటు రావ‌డంతో, సోద‌రుడు ర‌ణ‌ధీర్ క‌పూర్ ఆయ‌న‌ను హుటాహుటిన చెంబూర్‌లోని త‌మ నివాసం స‌మీపంలో ఉన్న ఇన్‌లాక్స్ హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. అప్ప‌టికే రాజీవ్ మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధ్రువీక‌రించారు.

"నా చిన్న‌త‌మ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అత‌ను ఇంక లేడు. డాక్ట‌ర్లు త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు కానీ కాపాడ‌లేక‌పోయారు." అని తెలిపారు ర‌ణ‌ధీర్ క‌పూర్‌. తండ్రి రాజ్ క‌పూర్ డైరెక్ట‌ర్ చేసిన మ్యూజిక‌ల్ హిట్‌ 'రామ్ తేరీ గంగా మైలీ' (1985) సినిమాతో పాపుల‌ర్ అయిన రాజీవ్ క‌పూర్‌.. ఆ త‌ర్వాత ఫేడ‌వుట్ అయిపోయారు. అన్న రిషి క‌పూర్ హీరోగా 'ప్రేమ్ గ్రంథ్' అనే సినిమాని ఆయ‌న డైరెక్ట్ చేశారు. 

లుకేమియాతో బాధ‌ప‌డుతూ గ‌త ఏడాది ఏప్రిల్‌లో రిషి క‌పూర్ మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఇంకా ఆరు ప‌దుల వ‌య‌సుకు రాక‌ముందే హార్ట్ ఎటాక్‌తో రాజీవ్ కూడా మృతి చెంద‌డంతో క‌పూర్ల ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.