Read more!

English | Telugu

తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్‌.. ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో!

సాధారణంగా విదేశీ చిత్రాలను మనవాళ్ళు ఫ్రీమేక్‌ చేస్తుంటారు. కానీ, ఫ్రెంచ్‌లో రిలీజ్‌ అయిన  హిట్‌ సినమా ‘ది ఇన్‌టచబుల్స్‌’ను అధికారికంగా రైట్స్‌ తీసుకొని నిర్మించింది పివిపి సినిమా. ‘ఊపిరి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేసిన ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, కార్తీ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 25, 2016 విడుదలై మంచి విజయం సాధించింది. ఫ్రెంచ్‌ సినిమాలోని ప్రధాన ఇతివృత్తాన్ని తీసుకొని దానికి మన నేటివిటీని జోడిరచి ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు. నాగార్జున, కార్తీల జర్నీని ఎంతో అందంగా తీర్చిదిద్దారు దర్శకుడు వంశీ పైడిపల్లి. కార్తీ పాత్రలోని చలాకీతనం, అల్లరి,  నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం.. ఈ రెండిరటినీ ప్రతిబింబించేలా వీరి ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఒక అద్భుతమైన అనుభూతినిస్తూ సాగిపోతూ కట్టిపడేసాయి. 

ఇప్పుడీ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒరిజినల్‌గా ఇది ఫ్రెంచ్‌ సినిమా అయినప్పటికీ ఆ సినిమా జోలికి వెళ్ళకుండా తెలుగు వెర్షన్‌ స్క్రీన్‌ప్లే, ఇందులో వాడిన సీన్స్‌తోనే హిందీలో రీమేక్‌ చేయనున్నారని తెలుస్తోంది. నాగార్జున పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, కార్తీ క్యారెక్టర్‌లో  రాజ్‌కుమార్‌రావు నటిస్తారని సమాచారం. కరణ్‌ జోహర్‌ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో   తెరకెక్కే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది పరిశీలనలో ఉందట. అమితాబ్‌కి ఈ క్యారెక్టర్‌ ఎంతో నచ్చడంతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఓ ఘోర ప్రమాదంలో విక్రమాదిత్య అనే కోటీశ్వరుడు గాయపడతాడు. కాళ్ళు, చేతులు పనిచేయని కారణంగా వీల్‌ చైర్‌కే పరిమితమవుతాడు. అతనికి ఓ కేర్‌ టేకర్‌ అవసరం అవుతాడు. ఎంతో ఓపికగా విక్రమాదిత్య బాగోగులు చూసుకునే వ్యక్తి కోసం ప్రకటన ఇస్తారు. లో మిడిల్‌ క్లాస్‌కి చెందిన శ్రీను అప్పుడే జైలు నుంచి వస్తాడు. ఈ ఉద్యోగానికి అప్లయ్‌ చేస్తాడు. సాధారణ పరిస్థితులకు భిన్నంగా పెరిగిన శ్రీను అంటే విక్రమాదిత్యకు ఇష్టం ఏర్పడుతుంది. వెంటనే అతన్ని ఉద్యోగంలో జాయిన్‌ అవ్వమని చెప్తారు. ఇద్దరివీ భిన్నమైన మనస్తత్వాలు. వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? చివరికి ఎవరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. ఈ కథలో విక్రమాదిత్య, శ్రీను క్యారెక్టర్లకు పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎక్కువ స్కోప్‌ ఉంది. అందుకే నాగార్జున, కార్తీ ఈ క్యారెక్టర్లను అంత అద్భుతంగా పోషించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇవే క్యారెక్టర్లను పోషించడానికి సిద్ధమైన అమితాబ్‌, రాజ్‌కుమార్‌రావు ఏమేర ప్రేక్షకుల్ని మెప్పిస్తారో చూడాలి.