English | Telugu
నా బాడీ షేప్ జాతీయ సమస్యగా మారింది!
Updated : Mar 10, 2021
బాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ఎలాంటి విలువ ఉంటుందో, విద్యా బాలన్‌కు అలాంటి విలువ ఉంది. కేవలం తన పర్ఫార్మెన్స్‌తో 'డర్టీ పిక్చర్', 'కహాని' లాంటి సినిమాలను బ్లాక్‌బస్టర్ హిట్స్ చేయగలిగింది. అలాంటి ఆమె ఒక సమస్యతో తీవ్రంగా బాధపడింది. అది.. తన బరువు! అవును. ఆమె బరువు జాతీయ సమస్య అయిపోయింది. హీరోయిన్లలో ఎక్కువ మంది జీరో సైజ్‌తో కనిపిస్తుంటే, ఆమె మాత్రం ఎప్పుడూ బొద్దుగానే కనిపిస్తూ వస్తోంది. అందుకే చాలా కాలం తన శరీరాన్ని తను ద్వేషించానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె వెల్లడించింది. అయితే ఆ తర్వాత తనకు జ్ఞానోదయం కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
"మా ఫ్యామిలీకి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. అందుకని సినిమాల్లోకి వచ్చాక ఏది కరెక్ట్, ఏది కాదు.. అని చెప్పేవాళ్లే లేకుండా పోయారు. నా బాడీ షేప్ జాతీయ సమస్యగా మారిపోయింది. అందరూ నన్ను స్థూలకాయురాలిగా పరిగణిస్తూ వచ్చారు. నన్ను హార్మోన్ సమస్య తీవ్రంగా వెంటాడింది. చాలా కాలం నా శరీరాన్ని నేనే ద్వేషిస్తూ వచ్చాను." అని ఆమె ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆ సమయంలో ఆమె తీవ్రమైన ఫ్ట్రస్ట్రేషన్‌కు, ఆగ్రహానికి గురైంది. "ఆ పరిస్థితి నుంచి బయటపడటం అంత తేలిక కాలేదు. కాలక్రమంలో ఈ సమస్యను నేను అర్థం చేసుకున్నాను. నాకు స్థూలకాయం వచ్చింది తిండి ఎక్కువగా తినడం వల్ల కాదు. హార్మోన్ల సమస్య వల్ల. అది తెలిశాక నా శరీరాన్ని నేను ప్రేమించడం ప్రారంభించాను. జనం కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీకు తెలిసిందే." అని చెప్పింది విద్య.
బాలీవుడ్‌లో 'పరిణీత' (2005) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆకట్టుకున్న ఆమె డర్టీ పిక్చర్, కహానీ, భూల్ భులయ్యా, మిషన్ మంగళ్ సినిమాలతో ప్రేక్షకుల ఆరాధ్య తారగా మారింది. త్వరలో 'షేర్ని' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.