English | Telugu

'ఆదిపురుష్' హీరోయిన్ కృతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో మీకు తెలుసా?!

అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యం రెండూ ఉన్న తార‌ల్లో కృతి స‌న‌న్ ఒక‌రు. న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన స్వ‌ల్ప కాలంలోనే త‌న‌దైన ముద్ర‌ను వేయ‌డ‌మే కాకుండా, ల‌క్ష‌లాది మంది అభిమానులను సంపాదించుకుంది కృతి. చాలామంది తార‌లు టీనేజ్ దాట‌క ముందే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నారు. ఆ ర‌కంగా చూస్తే కృతి ఆల‌స్యంగా అంటే 24 ఏళ్ల వ‌య‌సులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ న‌ట‌న‌లో ఈజ్‌తో, ఆన్‌స్క్రీన్ బ్యూటీతో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న '1.. నేనొక్క‌డినే' (2014) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై అల‌రించిన ఆమెకు, అదే ఏడాది టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న చేసిన ఫ‌స్ట్‌ బాలీవుడ్ ఫిల్మ్ 'హీరోపంతి'తో మొద‌టి హిట్ ల‌భించింది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ మూవీస్‌లో భాగ‌మైంది కృతి.

బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన‌డానికి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ కృతి స‌న‌న్ అన‌డంలో సందేహించాల్సిన ప‌నిలేదు. ఎంత చ‌క్క‌టి ఫిజిక్‌తో క‌నిపిస్తుందో, అంత చ‌క్క‌టి ప్ర‌వ‌ర్త‌న‌తో ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకుందామె. ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుకున్న ఆమె, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఉన్న జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనిరేష‌న్ ఇంజ‌నీరింగ్ ప‌ట్టా పుచ్చుకుంది.

బాగా చ‌దువు సంధ్య‌లున్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చింది కృతి. ఆమె తండ్రి రాహుల్ స‌న‌న్ పేరుపొందిన చార్ట‌ర్డ్ అకౌంటెంట్ కాగా, త‌ల్లి గీతా స‌న‌న్ ఢిల్లీ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌. కృతికి నూపుర్ అనే చెల్లెలు ఉంది. నూపుర్ అంటే కృతికి చాలా ఇష్టం. త‌ను వెళ్లే ఈవెంట్స్‌, పార్టీల‌కు చెల్లెలిని కూడా తీసుకువెళ్తుంటుంది కృతి.

ఏడేళ్ల కెరీర్‌లో కృతి రెండు తెలుగు సినిమాలు, తొమ్మిది హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. మ‌రో నాలుగు సినిమాల్లో స్పెష‌ల్ అప్పీరెన్సులు ఇచ్చింది. చ‌క్క‌ని అవ‌య‌వ సౌష్ట‌వంతో క‌నిపించే కృతిని చూడ్డంతోటే ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ అనే విష‌యం అర్థ‌మైపోతుంది. ఆమె కథ‌క్ డాన్సర్ కూడా.

బ‌రేలీ కీ బ‌ర్ఫీ, లుకా చుప్పీ, హౌస్‌ఫుల్ 4, మిమి సినిమాల ద్వారా త‌నేమిటో నిరూపించుకున్న కృతి స‌న‌న్ త్వ‌ర‌లో హ‌మ్ దో హ‌మారే దో, బ‌చ్చ‌న్ పాండే, భేడియా సినిమాల ద్వారా మ‌న‌ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఏకంగా 'ఆదిపురుష్' మూవీలో సీత‌గా క‌నిపించ‌నున్నది. ఈ మూవీలో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఒడ్డూ పొడుగు విష‌యంలో స‌రిజోడుగా ఉండే ప్రభాస్‌, కృతి.. సీతారాములుగా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం ఖాయ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది చెప్తున్నారు అభిమానులు. 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న 'ఆదిపురుష్‌'పై అంచ‌నాలు అసాధార‌ణ స్థాయిలో ఉన్నాయి.