English | Telugu
సంజయ్ దత్‌కి రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని.. మరి సంజు ఏం చేశాడు?
Updated : Feb 11, 2025
సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాల్లో రాణించిన వారికి అభిమానులు ఎక్కువగా ఉంటారు. కొందరు వీరాభిమానులు తమ అభిమాన తార కోసం, క్రికెటర్ కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్‌కి ఈ తరహా అభిమానులు ఎక్కువ. హీరోలంటే ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు, అలాగే హీరోయిన్లపై అభిమానంతో ఆలయాలు కట్టించిన వారు ఉన్నారు. ఇటీవల చావు బతుకుల్లో ఉన్న కొందరు అభిమానులు తాము అభిమానించే హీరోలను చివరి సారి చూడాలనుకుంటున్నట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వారి కోరిక మేరకు అభిమానుల్ని కలుసుకున్న హీరోలు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఒకప్పుడు హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ దత్, టాప్ హీరోయిన్ నర్గీస్ దత్‌ల కుమారుడైన సంజయ్.. 1981లో తండ్రి డైరెక్షన్‌లో వచ్చిన ‘రాకీ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసి మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని అలరించారు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ. 45 సంవత్సరాలుగా సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న 65 ఏళ్ళ సంజుకి ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఎన్నో సంవత్సరాలుగా సంజుని అభిమానిస్తున్న మహిళా అభిమాని రూ.72 కోట్ల ఆస్తి అతనికి చెందేలా వీలునామా రాయించింది. ఆమె పేరు నిషా పాటిల్. 62 ఏళ్ళ నిషాకి సునీల్‌దత్, నర్గీస్‌దత్ అంటే ఎంతో అభిమానం. అయితే వారిని ఆమె ఎప్పుడూ కలిసింది లేదు. కేవలం వారి సినిమాలు చూడడం ద్వారా విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంది. అలా సంజుని కూడా చిన్నతనం నుంచీ అభిమానిస్తోంది. 2018లో నిషా అనారోగ్యానికి గురైనప్పుడు తన రూ.72 కోట్ల ఆస్తి సంజయ్‌దత్‌కి చెందాలని వీలునామా రాయించారు.
నిషా పాటిల్ విషయం తెలుసుకున్న సంజయ్‌దత్ షాక్ అయ్యారు. 45 ఏళ్ళ తన సినీ కెరీర్‌లో ఇలాంటి అనుభవం సంజుకి ఎప్పుడూ ఎదురుకాలేదు. దానికి కారణం నిషా ఒక్కసారి కూడా సంజుని కలుసుకోలేదు. కానీ, ఆమె వయసుతోపాటు అభిమానం కూడా పెరుగుతూ వచ్చింది. సంజు కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న విషయం తెలిసిందే. అతనిపై బాంబ్ బ్లాస్ట్, ఎకె 47 వంటి ఆయుధాలు కలిగి ఉండడం వంటి కేసులు ఉన్నాయి. ఆ కారణంగా చాలా కాలం జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారినపడినప్పటికీ కోలుకున్నాడు. ఆ సమయంలో అతను ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నాడు. ఇవన్నీ నిషా పాటిల్‌ని ఎంతో బాధించాయి. అందుకే తన ఆస్తి అతనికి దక్కాలంటూ వీలునామా రాయించారు. 2018 నుంచి అనారోగ్యంతో ఉన్న నిషా ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆమె రాసిన వీలునామా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం ఆస్తిని సంజయ్‌దత్‌కి అందించేందుకు న్యాయవాదులు సిద్ధపడ్డారు.
ఒక అభిమాని తనపై చూపించిన అభిమానానికి చలించిపోయారు సంజు. ఆ అభిమానిని ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయినందుకు బాధపడ్డారు. అలాంటి అభిమానాన్ని పొందడం తన అదృష్టం అని సంజు పేర్కొన్నారు. తనపై అభిమానంతో రాసిచ్చిన ఆస్తిని సంజు సున్నితంగానే తిరస్కరించారు. నిషా తదనంతరం ఆమె బ్యాంక్ ఎకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని సంజుకి ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని బ్యాంక్ అధికారులకు ముందుగానే విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు సంజుకి తెలిపారు. తన లీగల్ టీమ్‌తో చర్చించి నిషా పాటిల్ ఆస్తిని వారి కుటుంబ సభ్యులకు చెందేలా చూస్తానని చెప్పారు సంజయ్‌దత్. అంత గొప్ప అభిమానిని జీవించి ఉన్నప్పుడు కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిషా పాటిల్ కుటుంబ సభ్యులను కలుసుకుంటానని ఈ సందర్భంగా సంజు తెలిపారు.