English | Telugu

ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ ఆస్తిపాస్తులు.. విలాస‌వంత‌మైన బంగ‌ళాలు!

కంగ‌న ర‌నౌత్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. గ్యాంగ్‌స్ట‌ర్‌, ఫ్యాష‌న్‌, త‌ను వెడ్స్ మ‌ను, క్వీన్‌, మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాలే ఆమె అభిన‌య సామ‌ర్థ్యం ఎలాంటిదో చెబుతాయి. ఫోర్బ్స్ ఇండియాస్ సెల‌బ్రిటీ 100 లిస్ట్‌లో ఆరుసార్లు కంగ‌న చోటు సంపాదించింది. ఉత్త‌మ న‌టిగా మూడు సార్లు జాతీయ అవార్డును అందుకున్న ఆమె, 2020లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని సైతం పొందింది. అయితే న‌టిగా ఎంత ప్ర‌తిభావంతురాలో, వార్త‌ల్లో వ్య‌క్తిగా అంత వివాదాస్ప‌దురాలు కూడా. భార‌తీయ సినిమాలో నెపోటిజం, లింగ వివ‌క్ష‌, పురుషాధిక్యంపై త‌ర‌చూ గ‌ళ‌మెత్తే ఆమె, వ్య‌క్తిగ‌తంగా ప‌లువురిని ల‌క్ష్యం చేసుకొని మాట్లాడుతుండ‌టం వివాదాల‌ను రేకెత్తిస్తుంటుంది.

17 సంవ‌త్స‌రాల కెరీర్‌లో భార‌తీయ సినిమాకు త‌న వంతు కంట్రిబ్యూష‌న్ అందించిన కంగ‌న 'త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్' మూవీలో డ్యూయ‌ల్ రోల్ చేసింది. అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 250 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి, ఆ ఫీట్ సాధించిన తొలి ఫిమేల్ సెంట్రిక్ ఇండియ‌న్ ఫిల్మ్‌గా చ‌రిత్ర సృష్టించింది.

కంగ‌న స్టార్‌డ‌మ్ గురించి మ‌న‌కు తెలుసు కానీ, రాజ్‌పుత్ ఫ్యామిలీకి చెందిన ఆమె, న‌టిగా మారాల‌ని డిసైడ్ చేసుకున్న‌ప్పుడు డ‌బ్బు కోసం ఎంత‌గా ఇబ్బందులు ప‌డిందో చాలా మందికి తెలీదు. తాను న‌టిని కావాల‌నుకుంటున్నాన‌ని ఇంట్లో చెప్పిన‌ప్పుడు తండ్రి ఆమెకు సింగిల్ పైసా ఇవ్వ‌లేదు. తాత‌య్య‌యితే, ఆమె ఇంటిపేరును కూడా తీసేసుకొని అప్పుడు వెళ్ల‌మ‌న్నాడు. అలాంటి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నుంచి వ‌చ్చిన ఆమె బాలీవుడ్‌లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ఎంత‌గా శ్ర‌మించిందో ఊహించుకోవాల్సిందే.

ప్ర‌పంచంలోని మిగ‌తా ఫిల్మ్ సెల‌బ్రిటీల త‌ర‌హాలోనే కంగ‌న ప్ర‌ధానంగా త‌న సినిమాల‌తో, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌తోనే సంపాదిస్తోంది. ఒక రిపోర్ట్ ప్ర‌కారం కంగ‌న ద‌గ్గ‌రున్న ఆస్తుల విలువ రూ. 95 కోట్లు. బాలీవుడ్‌లోని టాప్ 10 రిచ్చెస్ట్ యాక్ట్రెస్‌ల‌లో ఆమె ఒకరు. ఒక నిర్మాత‌గా సినిమా వ్యాపారంలోకి అడుగుపెట్టిన కంగ‌న‌, ఇప్ప‌టిదాకా కొన్ని మంచి సినిమాల కోసం చెప్పుకోద‌గ్గ డ‌బ్బునే పెట్టుబ‌డిగా పెట్టింది.

సినీ నిర్మాత‌గా ఆమె వార్షికాదాయం రూ. 7.6 కోట్లు. సినిమాకు స‌గ‌టున ఆమె తీసుకుంటున్న పారితోషికం రూ. 11 కోట్లు కాగా, అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ల‌లో న‌టించినందుకు రోజుకు ఆమె వ‌సూలు చేసే మొత్తం రూ. 1.5 కోట్లు! అలాగే ఆమెకు 'వెరో మోడా' అనే సొంత పాపుల‌ర్ బ్రాండ్ క్లాతింగ్ బిజినెస్ ఉంది. దాని ద్వారా ఆమెకు నెల‌కు రూ. 50 ల‌క్ష‌లు ఆదాయం ల‌భిస్తోంది.

ఇటీవ‌లి కాలంలో ఆమె రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబ‌డులు పెడుతోంది. ముంబైలో త‌ను నివాసం ఉంటున్న విలాస‌వంత‌మైన బంగ‌ళాను ఆమె 2017లో రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే మ‌నాలీలో రూ. 10 కోట్లు పెట్టి స్థ‌లం కొన్న ఆమె అందులో రూ. 30 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ క‌ట్టించింది. అందులో 7 బెడ్‌రూమ్‌లు, 7 బాత్‌రూమ్‌లు, ఒక జిమ్‌, ఒక యోగా రూమ్ లాంటివి ఉన్నాయి.