English | Telugu

చ‌రిత్ర సృష్టించిన‌ `ల‌గాన్` వ‌ర్సెస్ `గ‌ద‌ర్`కి 20 ఏళ్ళు!

2001 జూన్ 15.. బాలీవుడ్ కి ఓ మ‌రపురాని తేది. ఎందుకంటే.. అదే రోజున రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుద‌లవ‌డ‌మే కాదు, ఆ రెండూ సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఆ చిత్రాలే.. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ - గ్రేసీ సింగ్ జంట‌గా న‌టించిన `ల‌గాన్`, స‌న్నీ డియోల్ - అమీషా ప‌టేల్ జోడీగా క‌నువిందు చేసిన `గ‌ద‌ర్ - ఏక్ ప్రేమ‌క‌థ‌`. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా `దేశ‌భ‌క్తి` నేప‌థ్యంతో అల్లుకున్న క‌థ‌ల‌తోనే తెర‌కెక్కాయి.

మ‌న దేశానికి స్వాతంత్ర్యం రాక‌ముందు నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో `ల‌గాన్` రూపొందింతే.. స్వాతంత్ర్యం వ‌చ్చాక దేశ‌విభ‌జ‌న జ‌రుగుతున్న త‌రుణంలో జ‌రిగే క‌థాంశంతో `గ‌ద‌ర్` తెర‌కెక్కింది. అశుతోష్ గోవారిక‌ర్ డైరెక్ట్ చేసిన `ల‌గాన్`కి ఎ.ఆర్. రెహ‌మాన్ అందించిన బాణీలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా.. అనిల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `గ‌ద‌ర్`కి ఉత్త‌మ్ సింగ్ అందించిన స్వ‌రాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

ఇక అవార్డుల విష‌యానికి వ‌స్తే.. `ఉత్త‌మ విదేశీ చిత్రం` విభాగంలో `ఆస్కార్` నామినేష‌న్ పొంది అప్ప‌ట్లో వార్త‌లకెక్కిన `ల‌గాన్`.. ఎనిమిది జాతీయ పుర‌స్కారాల‌ను, ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను ద‌క్కించుకుంది. అలాగే మ‌రికొన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది. ఇక `గ‌ద‌ర్` విష‌యానికి వ‌స్తే.. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.

కొస‌మెరుపు ఏమిటంటే.. 1990లో ఇదే జూన్ నెల‌లో ఒకే తేది (జూన్ 22)న ఆమిర్ `దిల్`, స‌న్నీ డియోల్ `ఘాయ‌ల్` విడుద‌ల కాగా.. ఆ రెండు చిత్రాలు కూడా ఘ‌న‌విజ‌యం సాధించాయి. మొత్త‌మ్మీద‌.. 11 ఏళ్ళ గ్యాప్ లో జూన్ నెల వేదిక‌గా అటు ఆమిర్.. ఇటు స‌న్నీ.. రెండు సార్లు పోటీప‌డి మ‌రీ బాలీవుడ్ కి సెన్సేష‌న‌ల్ మూవీస్ ని అందించ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.