Read more!

English | Telugu

సినిమా కాన్ 2022లో రేపే రిలీజ్ కానున్న 'అవ‌తార్ 2' ట్రైల‌ర్?

 

జేమ్స్ కామెరూన్ 'అవతార్' సీక్వెల్స్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ సీక్వెల్స్ ప్లాట్ గురించి ఎటువంటి స‌మాచారం లీక్ కాకూడ‌ద‌ని ఆశిస్తున్నారు. అందుకే దానిపై వారు పెదవి విప్పడం లేదు. కాగా ఈ మాగ్నమ్ ఓపస్ మొదటి గ్లిమ్స్‌ రేపు సినిమాకాన్‌లో వెల్లడి కానుందని సోషల్ మీడియా సందడి చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ రెండో భాగం ఒరిజిన‌ల్‌ 'అవతార్' ప్రారంభమైన దాదాపు పదమూడేళ్ల తర్వాత 2022 డిసెంబర్ 16న విడుదల కానుంది.

అందిన స‌మాచారం ప్రకారం, లార్జ‌ర్ దేన్ లైఫ్‌ విజువల్స్‌తో కూడిన కామెరూన్‌ నాలుగు సీక్వెల్‌ల మొదటి ఫుటేజ్ రేపు సినిమాకాన్‌లో ప్రద‌ర్శిత‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ప్రస్తుతం లాస్ వెగాస్‌లో సినిమా కాన్‌ ఈవెంట్ జరుగుతోంది. ఆహూతుల‌కు 'అవ‌తార్ 2' ఫుటేజ్‌ని ఎంత నిడివితో చూపుతార‌నేది స్ప‌ష్టంగా తెలియ‌న‌ప్ప‌టికీ, బ్రాడ్ పిట్ 'బుల్లెట్ ట్రైన్‌'తో పాటు 'స్పైడ‌ర్‌-మ్యాన్‌: ఎక్రాస్ ద స్పైడ‌ర్‌-వెర్స్' గ్లిమ్స్‌ను ఒక్కోటి 15 నిమిషాల నిడివితో చూపుతార‌ని తెలియ‌జేశారు. కాబ‌ట్టి 'అవ‌తార్ 2' గ్లిమ్స్ కూడా అంతే నిడివితో ఉండ‌వ‌చ్చ‌ని ఊహిస్తున్నారు.

జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్‌ను చూడాల‌ని ద‌శాబ్ద కాలంగా ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు ఇది పండ‌గ లాంటి వార్తే. త‌మ ఆనందాతిరేకాల‌ను వారు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. 2009లో వ‌చ్చిన 'అవ‌తా'ర్ గ్లోబ‌ల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 2.7 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి, చ‌రిత్ర సృష్టించింది.