English | Telugu

సన్యాసం తీసుకొని భిక్షాటనతో కడుపు నింపుకుంటున్న హీరోయిన్‌!

వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఆ తర్వాతి కాలంలో భక్తి మార్గంలోకి వెళ్లిపోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో గ్రేసీ సింగ్‌, బర్ఖా మదన్‌, సోఫియా హయత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇలాంటి అందమైన హీరోయిన్లు ఇహపరమైన సుఖాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో హీరోయిన్‌ వారి బాటలోనే వెళుతోంది. సినిమాల్లో నటించడమే కాకుండా, బుల్లితెరపై హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నూపూర్‌ అలంకార్‌ సన్యాసినిగా మారిపోయి గుహల్లో పర్వతాల్లో ధ్యానం చేస్తూ కనిపిస్తోంది. అంతేకాదు, దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటోంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శక్తిమాన్‌ సీరియల్‌లో నూపూర్‌ పాత్రను అత్యద్భుతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు అలంకార్‌. అలాగే ఘర్‌ కీ లక్ష్మీ బేటియా, తంత్ర వంటి టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో, టీవీ సీరియల్స్‌ నటిస్తూ వస్తున్న అలంకార్‌ మూడు సంవత్సరాల క్రితం అందరికీ దూరంగా ఆధ్యాత్మిక బాట పట్టారు. సన్యాసినిగా మారిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెబుతోంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది.

‘నేను సన్యాసినిగా మారాలనుకున్నప్పుడు అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నా వ్యక్తిగత సమస్యలకు దూరంగా వెళ్ళడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని చాలా మంది భావించారు. వాస్తవానికి నేను పూర్తిగా దేవునికి అంకితమయ్యాను. ఒక తీర్థయాత్రా స్థలం నుంచి మరో తీర్థయాత్రా స్థలానికి ప్రయాణించడం, ధ్యానం చెయ్యడం దేవుని నామాన్ని స్మరించడం.. ప్రస్తుతం ఇదే నా జీవితం. నటన పరంగా నేను సినిమా ఇండస్ట్రీలో, టీవీ రంగంలో ఎన్నో సాధించాను. ఇప్పుడు సన్యాసినిగా మారిన తర్వాత నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది’ అంటూ వివరించారు అలంకార్‌.