English | Telugu
గంగూలీ బయోపిక్‌లో హీరో ఫిక్స్ అయిపోయాడు.. ఎవరో తెలుసా?
Updated : Feb 21, 2025
ఇండియాలో క్రికెట్‌కి ఎంతటి ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. మన దేశం టీమ్ మ్యాచ్ ఉందంటే స్టేడియంకి వెళ్లిపోయి చూసేవాళ్లు కొందరైతే.. టీవీలను అంటి పెట్టుకొని మ్యాచ్ చూసేవారు కొందరు. క్రికెటర్లుగా గొప్ప పేరు సంపాదించుకున్నవారి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు.. అంతకుమించిన విజయాలు ఉంటాయి. అవి తెరరూపం దాలిస్తే చూడాలని ఎంతో మంది ఆశపడతారు. ఇప్పటికే కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, ధోని వంటి స్టార్ క్రికెటర్ల బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ధోని బయోపిక్‌కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతుంది. అతనే సౌరవ్ గంగూలీ. చాలా కాలంగా అతని బయోపిక్‌పై కసరత్తులు జరుగుతున్నాయి. ఎంతో మంది హీరోలను పరిశీలించిన తర్వాత సినిమా ప్రారంభించబోతున్నారు.
గంగూలీ క్రికెటర్‌గానే కాకుండా బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మూడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంతో ఆసక్తికరంగా ఉండే అతని జీవితానికి సంబంధించిన ఎన్నో వివరాలు సేకరించే పనిలో ఉంది చిత్ర యూనిట్. గంగూలీ పాత్రలో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావు కనిపించబోతున్నారు. కొంతకాలంగా రాజ్‌కుమార్ క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గంగూలీ బయోపిక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. వాస్తవానికి నాలుగేళ్ళ క్రితమే ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు. కానీ, అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. గంగూలీ పాత్ర కోసం రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖారానాతోపాటు మరో ముగ్గురు హీరోలను పరిశీలించారు. కానీ, కొన్ని కారణాల్ల వారెవరూ సెట్ అవ్వలేదు. గంగూలీ పాత్రకు రాజ్‌కుమార్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని ఫిక్స్ అయిన తర్వాత అతన్నే ఫైనల్ చేశారు.
ఈ బయోపిక్ గురించి గంగూలీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నా బయోపిక్ రూపొందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. నా పాత్ర పోషించేందుకు రాజ్‌కుమార్‌రావును ఎంపిక చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. తన డేట్స్ ఎడ్జస్ట్ చేసేందుకు కొంత సమయం కావాలని రాజ్‌కుమార్ అడిగారు. ఏది ఏమైనా త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని వివరించారు.