English | Telugu
కేన్సర్‌తో బాధపడుతూ 'కేజీఎఫ్ 2'లో నటించిన సంజయ్ దత్ అసలు హీరో!
Updated : Apr 14, 2022
'కేజీఎఫ్ చాప్టర్ 2'లో శక్తిమంతమైన విలన్ అధీర రోల్‌లో నటించడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంజయ్ దత్. గురువారం ఈ సినిమా రిలీజైన సందర్భంగా ఆయన భార్య మాన్యతా దత్ ఓ స్పెషల్ మెసేజ్‌ను షేర్ చేసి, తన భర్తను చూసి ఎంత గర్విస్తున్నదో తెలిపింది. అధీరగా సంజయ్ ప్రదర్శించిన అభినయం సినిమాకు ఓ ఎస్సెట్‌గా నిలిచింది. సంజయ్ కెరీర్‌లో 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను వెరీ స్పెషల్ ఫిల్మ్‌గా పేర్కొంది మాన్యత.
ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సంజయ్ దత్‌కు కేన్సర్ సోకింది. ట్రీట్‌మెంట్ కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, కేన్సర్‌ను జయించాక తిరిగి షూటింగ్‌కు హాజరై తన పోర్షన్లను పూర్తి చేశాడు. ఈ సినిమా షూటింగ్ కాలంలో సంజయ్ ఆరోగ్యపరంగా ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడిన మాన్యత, "ఒక్కటి కాదు అనేక రకాలుగా ఈ సినిమా మాకు ఒక ప్రత్యేక జర్నీ. బాధ్యత తెలీనివాడుగా, అంకితభావం లేనివాడుగా, బ్యాడ్ బాయ్‌గా సంజయ్ గురించి మాట్లాడేవాళ్లు ఈ సినిమాని చూస్తే, అతని అంకితభావం, నిబద్ధత ఎలాంటివో అర్థమవుతాయి. తన జీవితంలోనే అత్యంత క్లిష్ట కాలంలో ఈ సినిమాకి పనిచేశాడు. ఎలాంటి కంప్లయింట్ చేయకుండా ఎప్పట్లా అదే పాషన్‌తో తన సీన్లు చేశాడు" అని చెప్పింది.
తన దృష్టిలో కేజీఎఫ్ 2లో సంజయ్ దత్తే హీరో అని అభిప్రాయపడింది. "నాకు సంబంధించి, ఆ సినిమాలో అతనే హీరో. చివరి దాకా కూల్‌గా, పవర్‌ఫుల్‌గా, ఫైటర్‌గా అతను కనిపిస్తాడు. 'కేజీఎఫ్ 2' అనేది అధీరకు చెందిన సినిమా. సంజు బ్యాక్ విత్ ఎ బ్యాంగ్." అని చెప్పింది మాన్యత.
యశ్, సంజయ్ దత్‌తో పాటు 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, రావు రమేశ్, అయ్యప్ప శర్మ, ఈశ్వరీ రావు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.