English | Telugu

ఆలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ ఇక అధికారికంగా భార్యాభ‌ర్త‌లు

చాలా కాలం నుంచి చాలా మంది ఎదురుచూస్తున్న రణబీర్ కపూర్, ఆలియా భట్ వివాహం గురువారం క‌న్నుల‌పండుగ‌గా జ‌రిగింది. కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న ఆ జంట అధికారికంగా దంప‌తులుగా మారారు. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంల ఉన్న‌ రణబీర్‌కు చెందిన‌ 'వాస్తు' నివాసంలో ఈ స్టార్ క‌పుల్‌ వివాహ ప్రమాణాలను చేశారు. నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోనీ రజ్దాన్, షహీన్ భట్, లవ్ రంజన్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ సహా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

5 సంవత్సరాలకు పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట సాంప్రదాయ పంజాబీ వివాహ వేడుకలో మునిగిపోయింది. ఈ శుభ‌దినం సంద‌ర్భంగా అతిథులు దాదాపు ఒకే ర‌క‌మైన రంగు దుస్తులు ధ‌రించి వ‌చ్చారు. కుటుంబ సభ్యులు పింక్ షేడ్స్‌లో ఉన్న‌ దుస్తులు ధరించి కనిపించగా, రణబీర్, ఆలియా స్నేహితులు వివాహ వేడుక తాలూకు అధికారిక రంగుల పాలెట్‌ను పాటించారు. వారంతా తెలుపు, బంగారు ఛాయ‌లున్న దుస్తులు ధ‌రించారు.

ఒక‌వైపు ఇంటి లోపల పెళ్లి వేడుక‌ జరుగుతుండగా, రణబీర్, ఆలియా వాళ్ల టీమ్ ఆ ఇంటి గేటు బ‌య‌ట కూడిన‌ మీడియా సభ్యులకు స్వీట్ బాక్స్‌లను పంపిణీ చేసింది. బుధవారం ప్రత్యేక పూజలు, మెహందీ వేడుకలతో పాటు వివాహానికి ముందస్తు ఉత్సవాలు నిర్వహించారు. నూతన వధూవరులు త్వరలో ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు, ఇందులో దీపికా పడుకోనే, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, వారి మాజీ సహనటులు, స్నేహితులు, దర్శకులు వంటి అతిథులు పాల్గొంటారు.

రణబీర్, ఆలియా తమ రాబోయే చిత్రం 'బ్రహ్మాస్త్ర' సెట్స్‌లో ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ప‌డ్డారు. రణబీర్ సన్నిహితుడు అయాన్ ముఖర్జీ ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఎపిక్‌కి దర్శకత్వం వహించాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున‌, మౌని రాయ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆలియా, ర‌ణ‌బీర్ ఇద్దరూ జంటగా మొదటిసారి కనిపించారు.