English | Telugu
టీనేజ్‌లో బ్రేకప్ అయ్యారు.. పదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు!!
Updated : May 24, 2021
వెటరన్ బాలీవుడ్ యాక్టర్లు, రాజకీయవేత్తలైన ధర్మేంద్ర, హేమమాలిని దంపతులు కుమార్తె ఇషా డియోల్ తల్లితండ్రుల అడుగు జాడల్లో ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టింది. ఆమె సోదరి అహనా డియోల్ మాత్రం గ్లామర్ వరల్డ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2002లో వచ్చిన 'కోయి మేరే దిల్ సే పూచే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఇషా కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. తల్లిలా డ్రీమ్ గాళ్‌గా పేరు తెచ్చుకోకపోయినా 2004లో వచ్చిన 'ధూమ్' మూవీతో స్టార్‌డమ్ అందుకుంది. ఇప్పటివరకూ 30 సినిమాల వరకు చేసిన ఇషాకు ఫాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.
స్కూల్ డేస్‌లో ఇషా ఫుట్‌బాల్ ప్లేయర్ అనే విషయం చాలా మందికి తెలీదు. మిడ్‌ఫీల్డర్ అయిన ఆమె తన స్కూల్ ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది. అంతే కాదు, ఆమె స్టేట్ లెవల్ హ్యాండ్‌బాల్ ప్లేయర్ కూడా. తల్లి లాగానే ఒడిస్సీ డాన్సర్ అయిన ఇషా యాక్టర్‌నవుతానంటే మొదట ధర్మేంద్ర ఒప్పుకోలేదు. కానీ తర్వాత కూతురి ఆసక్తిని చూసి సరేనన్నారు. ఒకసారి తన తండ్రిలాగా అందంగా ఉండే వ్యక్తిని పెళ్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పింది ఇషా. భరత్ తఖ్తానీ ప్రపోజ్ చేసినప్పుడు ఆమె కోరిక నెరవేరింది. ఆ ఇద్దరి లవ్ స్టోరీ ఆసక్తికరం.
ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తల కుటుంబంలో పుట్టాడు భరత్. కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో అతను గ్రాడ్యుయేట్. ఇషా, భరత్ వేర్వేరు స్కూళ్లలో చదువుకున్నారు. కానీ ఒక ఇంటర్-స్కూల్ కాంపిటిషన్ సందర్భంగా ఆ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. అప్పుడే ఆ ఇద్దరూ టీనేజ్‌లోకి వచ్చారు. ఇషాను చూడగానే ఆమె మీద మీద మనసు పారేసుకున్నాడు భరత్. చదువయ్యాక తండ్రికి వారసుడిగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన భరత్.. ఇవాళ పేరుపొందిన వజ్రాల వ్యాపారి. అతనికి ఆర్.జి. బ్యాంగిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది.
తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో "ఇంటర్-స్కూల్ కాంపిటిషన్‌లో కలుసుకున్న తర్వాత మా మధ్య పరిచయం పెరిగింది. కానీ అది పరిణతి చెందని వయసు. ఒకసారి అతను నా చేయిపట్టుకోవాలని చూశాడు. దాంతో 'నా చేతిని పట్టుకోవడానికి నీకెంత ధైర్యం' అని అరిచాను." అని వెల్లడించింది ఇషా.
అతడికైతే అది ఫస్ట్ లవ్. ఆమెకు ఇంకా ప్రేమ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఆ సంఘటన తర్వాత భరత్‌తో మాట్లాడ్డం మానేసింది ఇషా. కానీ భరత్ మాత్రం ఇషా చెల్లెలు అహనతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. "ఆమె ద్వారా ఇషాతో మళ్లీ ఎలాగైనా మాట్లాడాలని ప్రయత్నిస్తూ వచ్చాను. ఎందుకంటే ఆమె నా ఫస్ట్ లవ్ కదా" అని చెప్పాడు భరత్.
కానీ పదేళ్ల దాకా భరత్‌ను దగ్గరకు రానీయలేదు ఇషా. బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టాక తిరిగి ఆ ఇద్దరూ కలుసుకున్నారు. ఒకసారి నయాగరా జలపాతం చూడ్డానికి యు.ఎస్. వెళ్లింది ఇషా. ఆమె ఎక్కడ ఉందో భరత్‌కు చెప్పింది అహన. అప్పుడు తన ప్రేయసిని మళ్లీ కలిశాడు భరత్. ఈసారి భరత్‌కు కనెక్టయిపోయింది ఇషా. ఎంతగా అంటే.. మళ్లీ ఎన్నడూ విడిపోనంతగా! అప్పుడు మళ్లీ అడిగాడు భరత్.. "నీ చేయిని పట్టుకోవచ్చా?" అని. ఆమె నవ్వుతూ ఒప్పుకోవడమే కాదు, మళ్లీ ఆ చేతిని ఎన్నడూ విడిచిపెట్టలేదు.
ఒకసారి తల్లి హేమమాలినికి పరిచయం చేయాలని భరత్‌ను తన ఇంటికి ఆహ్వానించింది ఇషా. తన రూమ్‌లో అతడిని కూర్చోబెట్టి, "అమ్మా.. ఒకసారి ఇలా రా" అని పిలిచింది. పెట్ డాగ్స్‌తో ఆడుకుంటూ, క్యాజువల్‌గా వచ్చారు హేమ. "అక్కడ భరత్‌ను నేను అమ్మకు పరిచయం చేశాను. కొద్ది మాటల తర్వాత అమ్మకు అతను నచ్చేశాడు." అని వెల్లడించింది ఇషా. ఆ తర్వాత తండ్రికి కూడా అతడిని పరిచయం చేసింది. తండ్రి దగ్గర భరత్‌ను గంటసేపు ఒంటరిగా వదిలి, ఇవతలకు వచ్చేసింది.
"ధర్మేంద్ర జీవితాన్ని చూశారు. ఆయన కొన్ని విషయాలు అడిగి, వాటిని చేయగలవా అని అడిగారు. ఆ మీటింగ్ తర్వాత నేను మరింత బాధ్యతగా మారాను. ఆయనిచ్చిన లిస్టులో దాదాపు సగం దాకా ఇప్పటికే చేసేశాను". అని చెప్పాడు భరత్.
ఆ తర్వాత హేమమాలిని ఇంట్లో 2012 ఫిబ్రవరి 12న ఇషా, భరత్ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. అప్పటిదాకా ఆమెకు అఫిషియల్‌గా భరత్ ప్రపోజ్ చేయలేదు. ఆ వేడుకలో ధర్మేంద్ర, ఇషా సవతి అన్నలు సన్నీ డియోల్, బాబీ డియోల్ సమక్షంలో మోకాళ్ల మీద కూర్చొని, ఇషాకు ప్రపోజ్ చేసిన భరత్, ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. ఆ వేడుకలో ధర్మేంద్ర ఫ్యామిలీ కాకుండా ఇండస్ట్రీ నుంచి పాల్గొన్న ఒకే వ్యక్తి జయా బచ్చన్. తల్లి తర్వాత తనకు ఆమె తల్లి లాంటిదని ఇషా చెబుతుంది.
తమ అనుబంధాన్ని మరో లెవల్‌కు తీసుకు వెళ్లాలనుకున్న ఇషా డియోల్, భరత్ తఖ్తాని కొన్ని సంవత్సరాల డేటింగ్ అనంతరం 2012 జూన్ 29న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో లో-ప్రొఫైల్‌లో జరిగిన వేడుకలో దంపతులుగా మారారు. తమిళ సంప్రదాయం ప్రకారం (హేమమాలిని తమిళియన్) ఈ పెళ్లి వేడుక జరగగా, రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. బాలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు.
విశేషమేంటే 2017లో ఇషా, భరత్ రెండోసారి పెళ్లిచేసుకోవడం! అవును. అప్పుడు తొలి బిడ్డను కడుపులో మోస్తోంది ఇషా. సీమంతం సందర్భంగా ముంబైలోని ఇస్కాన్ టెంపులో మరోసారి.. ఈసారి సింధీ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆ ఏడాదే ఇషాకు రాధ్య పుట్టింది. రెండేళ్ల తర్వాత రెండో ఏంజెల్ మిరాయా జన్మించింది. ఆ ఇద్దరూ పుట్టాక ఎక్కువగా కూతుళ్లకు సమయాన్ని కేటాయిస్తూ వస్తోంది ఇషా.