English | Telugu

స్టార్‌ హీరో సినిమాకి కూడా డిస్కౌంట్లు తప్పడం లేదా.. ఇదీ బాలీవుడ్‌ దుస్థితి!

స్టార్‌ హీరో సినిమాకి కూడా డిస్కౌంట్లు తప్పడం లేదా.. ఇదీ బాలీవుడ్‌ దుస్థితి!

టాలీవుడ్‌లోని టాప్‌ హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే ఎలాంటి హైప్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, అభిమానులు సినిమాను మొదటిరోజే చూడాలని ఎంతగా ఎదురుచూస్తారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి రెండు వారాలు టిక్కెట్‌ రేట్లు పెంచినా తగ్గేదేలే అనే పరిస్థితి ఉంటుంది. కానీ, బాలీవుడ్‌లో సిట్యుయేషన్‌ మరోలా ఉంది. అక్కడ సూపర్‌స్టార్‌గా చెప్పుకునే సల్మాన్‌ఖాన్‌ సినిమాకి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్‌ నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ నటించిన ‘సికందర్‌’ మార్చి 30న విడుదల కాబోతోంది. దీనికి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేసినప్పటికీ రెస్పాన్స్‌ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ప్రేక్షకులను రప్పించేందుకు ఆఫర్లు ఇస్తున్నారు. మొదటి రోజు సినిమా చూసే వారికి స్పెషల్‌ డిస్కౌంట్లు ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో రెండు టికెట్లు కొనుగోలు చేస్తే ఫ్లాట్‌గా రూ.150 కూపన్‌ ఇస్తున్నారు. ఇది ఒకవిధంగా ఒన్‌ ప్లస్‌ ఒన్‌ ఆఫర్‌ లాంటిది. ఒక స్టార్‌ హీరో సినిమాకి ఇలా చేయడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 

కొన్ని సినిమాలకు సహజంగానే బజ్‌ తక్కువగా ఉంటుంది. దాన్ని పెంచేందుకు ఇలాంటి ఆఫర్స్‌ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అవసరం కూడా. ఎందుకంటే తమ సినిమా ఏ రేంజ్‌లో ఉంది అనేది మొదటి రోజే ఆడియన్స్‌కి తెలిస్తే మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయి హైప్‌ వస్తుంది. తద్వారా కలెక్షన్లు బాగా పెరుగుతాయి. ఇదే స్కీమ్‌ను ‘స్కై ఫోర్స్‌’ చిత్రానికి కూడా చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకి కార్పొరేట్‌ బుకింగ్స్‌ చేయడం ద్వారా ఆడియన్స్‌ని బాగా గ్యాదర్‌ చేశారు. అయితే ఎన్నిరోజులు చేసినా ఆ సినిమా నిలబడలేకపోయింది. డిఫరెంట్‌ సిట్యుయేషన్స్‌ క్రియేట్‌ చేయడం ద్వారా టికెట్స్‌ని అమ్మే ప్రక్రియ ఇటీవల బాలీవుడ్‌లో బాగా పెరిగిపోయింది. అయినప్పటికీ భారీ కలెక్షన్లు రాబట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోతున్నారు. ఈమధ్యకాలంలో మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న యానిమల్‌, ఛావా వంటి సినిమాలను తప్పిస్తే మిగతా సినిమాలకు కలెక్షన్లు రాబట్టడం కష్టతరం అయిపోతోంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ అనే టాక్‌ వస్తే ఎవరూ ఏం చెయ్యక్కర్లేదు. కళ్లు చెదిరిపోయే ఫిగర్స్‌ కనిపిస్తాయి. ఎలాంటి బజ్‌ లేని సినిమాలకే అది అవసరం. కొన్ని సందర్భాల్లో అది వర్కవుట్‌ అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. మరి సల్మాన్‌ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘సికిందర్‌’ ఈ ఆఫర్స్‌ వల్ల సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి.