English | Telugu

5 లక్షలకు సింగర్‌ నేహా కక్కర్‌ మోసం... ఆమెకు సంబంధం లేదట!

మోసాలు పలు రకాలు. ఒకప్పుడు ఒకరిని మోసం చెయ్యాలంటే దానికి ఎంతో ప్రాసెస్‌ ఉండేది. దాని కోసం ఎన్నో రోజులు కేటాయించాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది. దానితోపాటే టెక్నాలజీ మారింది. దాంతో మోసం చేసే తీరు కూడా మారింది. ఈమధ్యకాలంలో ఎవరూ ఊహించని విధంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. ఇలా కూడా మోసం చేస్తారా అనే రేంజ్‌ అవి ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఓ మోసం వెలుగులోకి వచ్చింది.

ముంబై వేదికగా జరిగిన ఈ మోసంలో బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ నేహా కక్కర్‌ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా పేరు మాత్రం ఆమెదే ఉంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని వర్లి ప్రాంతానికి చెందిన మహిళా న్యాయవాది షబ్నం మహమ్మద్‌ హుసేస్‌ సయ్యద్‌ ఈ మోసానికి బలయ్యారు. బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ ఒక ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలిపే వీడియోలు, కథనాలను చూశారు షబ్మమ్‌. వాటిని ఆమె నమ్మారు. ఇది 2025 జూన్‌లో జరిగింది. జూన్‌ 18 నుండి అక్టోబర్‌ 9, 2025 వరకు మొత్తం రూ. 5 లక్షల మొత్తాన్ని ఫోన్‌ పే ద్వారా పలు ఎకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు షబ్నమ్‌.

ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఎటువంటి అప్‌డేట్‌ రాకపోవడంతో తను మోసపోయినట్టు గ్రహించారు షబ్నమ్‌. దాంతో వర్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం మరియు భారత శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీన్నిబట్టి సైబర్‌ మోసగాళ్ళు ఎంత తెలివిగా అమాయకుల్ని వల్లో వేసుకొని డబ్బు దండుకుంటున్నారో అర్థమవుతుంది. ఒక సెలబ్రిటీ పేరును వాడుకొని ఈ విధమైన మోసం చేయడంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.