Read more!

English | Telugu

హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు.. ఆమెపై ఆంక్షలు విధించిన కోర్టు!

కొంతమంది సినిమా సెలబ్రిటీస్‌ కొన్ని విషయాలను ఎంతో తేలికగా తీసుకుంటారు. తమను ఎవరేం చేస్తారులే అనే ధీమాతో నిర్మాతల పట్ల, తమతో ప్రోగ్రామ్స్‌ చేయించుకునే నిర్వాహకుల పట్ల ఎంతో ఛీప్‌గా బిహేవ్‌ చేస్తుంటారు. ఎక్కువ శాతం ఇది హీరోయిన్ల విషయంలో జరుగుతుందనేది అందరికీ తెలుసు. అయితే కొందరు నిర్మాతలుగానీ, నిర్వాహకులుగానీ తమకు జరిగిన నష్టాన్ని బహిర్గతం చెయ్యరు. కానీ, కొందరు కోర్టును ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఓ ఘటన కోల్‌కత్తాలో జరిగింది. 

విషయంలోకి వెళితే.. కోల్‌కతాలో జరుగుతున్న దుర్గా మాత పూజలో పాల్గొని పెర్‌పార్మ్‌ చేసేందుకుగాను నిర్వాహకుల నుంచి రూ.12 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్న బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా మొహం చాటేసింది. 2018లో జరీన్‌పై నిర్వాహకులు చీటింగ్‌ కేసు వేశారు. ఈ కేసులో సోమవారం ఆమెకు మధ్యంతర బెయిల్‌ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతును విధిస్తూ కోల్‌కతాలోని సిటీ కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఖాన్‌ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత రూ.30,000 వ్యక్తిగత బాండ్‌పై డిసెంబర్‌ 26 వరకు మధ్యంతర బెయిల్‌ ఇస్తున్నామని తెలిపింది కోర్టు. అలాగే కోర్టు విచారణకు తప్పకుండా జరీన్‌ హాజరు కావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో జరీన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై కూడా నార్కెల్‌దంగా పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు అయింది. ఇదే కేసులో జరీన్‌ఖాన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయ్యింది. తాజాగా ఆమెకు ఈ కేసు విషయంలో కాస్త ఉపశమనం లభించింది. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలకు సినిమా స్టార్స్‌ను ఆహ్వానించడం సర్వసాధారణం. కానీ, జరీన్‌ ఖాన్‌ లాంటివారు దాన్ని దుర్వినియోగం చేస్తూ నిజాయితీగా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కూడా అప్రతిష్ట తీసుకొస్తున్నారని బాలీవుడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.