Read more!

English | Telugu

‘ఫైటర్‌’ ఆ హాలీవుడ్‌ మూవీ ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిందా?

ఒకప్పుడు హాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన చాలా సినిమాలను ఇండియాలో కూడా రిలీజ్‌ చేసేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇంగ్లీష్‌ సినిమాలను మాత్రమే ప్రదర్శించే థియేటర్లు అప్పట్లో ఉండేవి. రాను రాను అలాంటి థియేటర్లు కనుమరుగై పోయాయి. ఎందుకంటే హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో.. ఒక్కోసారి అంతకుమించి ఇండియన్‌ సినిమాలు రూపొందుతున్నాయి. ఇటీవలికాలంలో బాలీవుడ్‌పైన హాలీవుడ్‌ ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఒకప్పటి బాలీవుడ్‌ వేరు, ఇప్పటి బాలీవుడ్‌ వేరు. సినిమాల చిత్రీకరణలో విప్లవం వచ్చింది. ఒకప్పటి టేకింగ్‌కి, ఇప్పటి టేకింగ్‌కి బాలీవుడ్‌ సినిమాల్లో ఎంతో మార్పు కనిపిస్తోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను హాలీవుడ్‌ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా చిత్రీకరిస్తున్నారు. 

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనే  ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైటర్‌’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ చూస్తుంటే 37 సంవత్సరాల క్రితం వచ్చిన ‘టాప్‌గన్‌’ చిత్రం గుర్తొస్తుంది. టామ్‌ క్రూజ్‌కి ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్‌ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత 36 సంవత్సరాలకు 2022లో టాప్‌గన్‌ మేవరిక్‌ పేరుతో సీక్వెల్‌ వచ్చింది. ఇందులోనూ టామ్‌ క్రూజ్‌ హీరోగా నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘ఫైటర్‌’  చిత్రం ‘టాప్‌గన్‌’ని పోలి ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘టాప్‌గన్‌’ చిత్రాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే టీజర్‌లో హృతిక్‌, దీపిక గెటప్స్‌ ఆ చిత్రంలోని పాత్రలను పోలి ఉండడమే దానికి కారణంగా కనిపిస్తోంది. ‘పైటర్‌’  టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆకాశంలో వార్‌ నేపథ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఇంతవరకూ సముద్రగర్భంలో...భూమ్మీద మాత్రమే దేశ భక్తి నేపథ్యంలో వార్‌ సినిమాలొచ్చాయి. కానీ ఫైటర్‌ ఓ కొత్త అనభూతిని పంచబోతుంది. ఆకాశంలో జెట్‌ ల మధ్య ఎలాంటి వార్‌ జరగబోతుందో? ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆకాశంలో ఇంత పెద్ద భారీ కాన్సాస్‌ పై ఇంతవరకూ ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్‌ మేకర్స్‌ ఆడియన్స్‌కి హాలీవుడ్‌ సినిమా అనుభూతిని కలిగించేందుకు ‘ఫైటర్‌’ చిత్రంతో వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.