English | Telugu

ప్రేక్షకుల్ని భయపెట్టి.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌లో రికార్డు సాధించిన ‘సైతాన్‌’

అజయ్‌ దేవ్‌గన్‌, మాధవన్‌, జ్యోతిక, జాన్‌కి బోదివాలా ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్‌ మూవీ ‘సైతాన్‌’ మార్చి 8న విడుదలైంది. ఈ సినిమాకి పోటీగా మరే సినిమా లేకపోవడంతో సోలోగా రిలీజ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. మొదటి రోజే రూ.14 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసి హారర్‌ సినిమాల్లో మొదటి రోజు కలెక్షన్‌ రికార్డును అధిగమించింది. 2012లో విడుదలైన ‘రాజ్‌3’ చిత్రం మొదటిరోజు రూ.10 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డును బ్రేక్‌ చేయడానికి 12 ఏళ్ళు పట్టింది. శని, ఆది వారాల్లో కలెక్షన్స్‌ బాగా పెరిగే అవకాశం ఉండడంతో మొదటి వారంలోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసే అవకాశం ఉందని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు పేర్కొంటున్నాయి. 

గుజరాతీలో రూపొందిన ‘వశ్‌’ చిత్రానికి ‘సైతాన్‌’ రీమేక్‌. సూపర్‌ నేచురల్‌ హారర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అజయ్‌ దేవ్‌గన్‌, జ్యోతిక భార్యాభర్తలుగా నటించగా వారి కూతురుగా జాన్‌కిబోదివాలా చేసింది. మాధవన్‌ ఇప్పటివరకు చేయని ఓ నెగెటివ్‌ క్యారెక్టర్‌తో అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించాడు. 2001లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా ‘లిటిల్‌ జాన్‌’లో హీరోయిన్‌గా నటించిన జ్యోతిక.. 23 సంవత్సరాల తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

కబీర్‌ (అజయ్‌ దేవ్‌గణ్‌), జ్యోతి(జ్యోతిక) తమ కూతురు జాన్వీ(జాన్‌కి బోదివాలా)తో కలిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్‌ కోసం వెళతారు. ఓ ఆప్తుడిగా కబీర్‌కు పరిచయం అవుతాడు వన్‌రాజ్‌ (మాధవన్‌). అతడి ఎంట్రీతో కబీర్‌ ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. తనకు వున్న శక్తులతో జాన్వీని వశపరుచుకుంటాడు వన్‌రాజ్‌. అతను ఏది చెబితే అది చేస్తుంది జాన్వీ. ఆమెను అడ్డు పెట్టుకొని కబీర్‌ ఫ్యామిలీని నానా ఇబ్బందులకు గురిచేస్తాడు వన్‌రాజ్‌. 

అతని బారి నుంచి కబీర్‌ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడనే కథ. ఈ చిత్ర దర్శకుడు వికాస్‌ బెహల్‌ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించాడు అజయ్‌ దేవ్‌గన్‌. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది.