English | Telugu

షాక్‌లో బాలీవుడ్‌.. రూ.250 కోట్ల డ్రగ్ రాకెట్‌లో హీరోయిన్లు!

బాలీవుడ్‌ పరిశ్రమకు పెద్ద షాక్‌ తగిలిందని అక్కడి మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. ముంబై పోలీసులు అతి పెద్ద డ్రగ్‌ రాకెట్‌ని బయట పెట్టే పనిలో ఉన్నారట. దాదాపు 252 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ని పలుచోట్ల వినియోగించినట్టు పోలీసులకు సమాచారం అందింది. అందులో బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ డ్రగ్స్‌ వ్యవహారం అండర్‌వరల్డ్‌ వరకు వెళ్లిందనే సమాచారం కూడా పోలీసుల దగ్గర ఉందని తెలుస్తోంది.

ఈ కేసులో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌, డాన్సర్‌ నోరా ఫతేహి పేర్లు ఉన్నట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు శ్రద్ధా కపూర్‌ సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌, సోషల్‌ మీడియా స్టార్‌ ఓర్రీ, దర్శకులు అబ్బాస్‌ మస్తాన్‌, రాజకీయ నాయకుడి కుమారుడు జీషాన్‌ సిద్దిఖీ పేర్లు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ముంబై, దుబాయ్‌లలో జరిగిన అతి పెద్ద పార్టీల్లో ఈ డ్రగ్స్‌ వినియోగం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహమ్మద్‌ సలీం సుహైల్‌ షేక్‌ అనే వ్యక్తి ఈ పార్టీల నిర్వాహకుడు. దావూద్‌ ఇబ్రహీం అనుచరుడైన సలీం డోలాకు మహ్మద్‌ సలీం సన్నిహితుడని సమాచారం.

ఈ డ్రగ్‌ రాకెట్‌లో శ్రద్ధా కపూర్‌ పేరు వినిపించడానికి దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ కారణమని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో హసీనా పార్కర్‌ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్ర పోషించింది. అందుకే ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై నోరా ఫతేహి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని, ఈ వివాదంలోకి తన పేరును ఎందుకు లాగుతున్నారని మీడియాపై మండిపడ్డారు.

ఈ కేసు ప్రాథమిక దశలోనే ఉందని, ఇందులో ఇన్‌వాల్వ్‌ అయినవారు ఎవరు అనే డీటైల్స్‌ ఇప్పుడే చెప్పలేమని పోలీసులు మీడియాకు తెలియచేశారని సమాచారం. అవసరాన్ని బట్టి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చిన ఈ డ్రగ్‌ రాకెట్‌ కేసులో నిజానిజాలు ఏమిటి అనేది పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది.