English | Telugu

ఇప్పుడు నేనిలా ఉన్నానంటే దానికి కారణం సల్మాన్‌ ఖాన్‌!

గత రెండు దశాబ్దాలుగా ఇండియన్‌ సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న ఎంతో మంది నటీమణులు క్యాన్సర్‌ బారిన పడి ఆ తర్వాత పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చిన సంఘటనలు చూశాం. మనీషా కోయిరాలా, మహిమా చౌదరి, మమతా మోహన్‌దాస్‌, లీసా రే వంటి ప్రముఖ హీరోయిన్లు క్యాన్సర్‌ను జయించి తిరిగి తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న సోనాలి బెంద్రే కూడా ఉన్న విషయం తెలిసిందే. 2018లో జరిపిన వైద్య పరీక్షల్లో సోనాలికి మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ ఉన్నట్టుగా తేలింది. దీంతో న్యూయార్క్‌లో క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. నాలుగో స్టేజీలో ఉన్న క్యాన్సర్‌ అయినప్పటికీ దాన్ని జయించి 2021లో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు సోనాలి. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్న రోజుల గురించి, న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సమయంలో తనలో ఆత్మస్థయిర్యాన్ని పెంచిన ఓ హీరో గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు సోనాలి.

‘1994లో బాలీవుడ్‌ ఇండస్ట్రీ ద్వారా నటిగా పరిచయమయ్యాను. 1999 వరకు దాదాపు పాతిక హిందీ సినిమాల్లో నటించాను. మణిరత్నంగారి సినిమా ‘బాంబే’లో నేను చేసిన ‘హమ్మా హమ్మా..’ సాంగ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో కూడా చాలా ఆఫర్స్‌ వచ్చాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాను. నా మొదటి డెలివరీ వరకు నటించాను. ఆ తర్వాత తల్లిగా నా బాధ్యతను నిర్వర్తించాను. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత కొన్ని టీవీ షోలలలో హోస్ట్‌గా, జడ్జిగా కూడా వ్యవహరించాను. ఆ సమయంలోనే నాకు క్యాన్సర్‌ ఉందని తేలింది. దాంతో నా కెరీర్‌కి మరోసారి బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్నాను. ఆ రోజులు నా జీవితంలో ఎంతో విషాదభరితమైనవిగా చెప్పాలి. అలాంటి సమయంలో నాకు ఎంతో ధైర్యాన్నిచ్చిన హీరో సల్మాన్‌ ఖాన్‌. ట్రీట్‌మెంట్‌ ఎలా జరుగుతోంది అనే విషయాల గురించి ప్రతిరోజూ ఎంక్వయిరీ చేసేవారు. అంతేకాదు, రెండు సార్లు న్యూయార్క్‌ వచ్చి నన్ను పరామర్శించారు కూడా. నాలో నింపిన ధైర్యానికి ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్ని సందర్భాల్లో మెడిసన్స్‌ కంటే మన ఆత్మీయులు చెప్పే మాటలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని నాకు అర్థమైంది’ అంటూ సల్మాన్‌ఖాన్‌ తన ఆరోగ్యంపై చూపించిన కేర్‌ గురించి వివరించారు.

టాలీవుడ్‌ ప్రేక్షకులకు సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం, అభినయం కలగలిసి బాలీవుడ్‌ హీరోలా కాకుండా తెలుగమ్మాయిలానే కనిపించే సోనాలి.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోలతో కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించారు. అలాగే హిందీలో సల్మాన్‌ఖాన్‌ వంటి హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలలో హోస్ట్‌గా, జడ్జిగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు సోనాలి.