Read more!

English | Telugu

ఆర్య‌న్ బెయిల్ ఆర్డ‌ర్ ఔట్‌.. డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉంద‌న‌డానికి ఎలాంటి సాక్ష్యం లేదు!

 

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌కు క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో ప్ర‌మేయం ఉంద‌న‌డానికి అనుకూలంగా ఎలాంటి సాక్ష్యం లేద‌ని బాంబే హైకోర్టు తెలిపింది. అవును. ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్త‌ర్వులో న్యాయ‌స్థానం ఈ విష‌యం తెలిపింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆరోపించిన విధంగా నిందితుల మ‌ధ్య కుట్ర‌ను చూపించ‌డానికి ఎలాంటి సానుకూల సాక్ష్యం క‌నిపించ‌లేద‌ని కోర్టు పేర్కొంది. నిందితులు కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని చెప్ప‌డానికి ఆర్య‌న్ ఫోన్ నుంచి రిక‌వ‌రీ చేసిన వాట్సాప్ చాట్‌ల‌లో "అభ్యంత‌ర‌క‌ర‌మైంది ఏమీ లేదు" అని కూడా కోర్టు స్ప‌ష్టం చేసింది.

జ‌స్టిస్ నితిన్ సాంబ్రే అక్టోబ‌ర్ 28న ముగ్గురికి బెయిల్ మంజూరు చేశారు. ఆర్య‌న్‌, అత‌ని మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌ను అక్టోబ‌ర్ 2న క్రూయిజ్ షిప్‌లో ఎన్సీబీ అదుపులోకి తీసుకొని, విచారించి, ఆ మ‌రుస‌టి రోజు అరెస్ట్ చేసింది. 14 పేజీల బెయిల్ ఆర్డ‌ర్‌ను శ‌నివారం అందుబాటులోకి వ‌చ్చింది.

"సాధార‌ణ ఇన్‌టెన్ష‌న్‌తో నిందితులు చ‌ట్ట‌విరుద్ధ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు అంగీక‌రించార‌ని ఈ కోర్టును ఒప్పించేందుకు రికార్డులో ఎలాంటి సానుకూల ఆధారాలు లేవు. అయితే ఈ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ ప్ర‌కారం నిందితులు 1, 2 (ఆర్య‌న్ ఖాన్‌, అర్బాజ్ మ‌ర్చంట్‌) నిందితురాలు 3 (మున్‌మున్ ధ‌మేచా)తో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నారు. అయితే వారిపై ఆరోపించిన అంశంపై వారి మ‌ధ్య స‌మావేశం జ‌ర‌గ‌లేదు" అని కోర్టు చెప్పింది.

ఆర్య‌న్ ద‌గ్గ‌ర‌ ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ‌క‌పోయినా, మ‌ర్చంట్‌, ధ‌మేచాల నుంచి త‌క్కువ మొత్తంలో డ్ర‌గ్స్ (చ‌ర‌స్‌) ల‌భించిందనీ ఎన్సీబీ ఆరోపించింది. దీన్ని నార్కోటిక్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రాపిక్ స‌బ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం కుట్ర‌తో సంబంధం వున్న‌ట్లు ప‌రిగ‌ణించాల‌ని అది కోరింది. అయితే కోర్టు ఎన్సీబీ వాద‌న‌ను తోసిపుచ్చింది.