English | Telugu

అమితాబ్ కొత్త‌ ఫ్లాట్ విలువ అక్ష‌రాలా.. రూ. 31 కోట్లు!

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ముంబైలో ఓ విలాస‌వంత‌మైన ఆస్తిని కొనుగోలు చేశారని బిజినెస్ స్టాండ‌ర్డ్ రిపోర్ట్ చేసింది. క్రిస్ట‌ల్ గ్రూప్ అనే ట‌య‌ర్‌-2 బిల్డ‌ర్ 'అట్లాంటిస్' అనే ప్రాజెక్టు కింద నిర్మించిన ఆ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ విలువ రూ. 31 కోట్లు! గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే అమితాబ్ ఆ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌నీ, స్టాంప్ డ్యూటీ కింద రూ. 62 ల‌క్ష‌లు చెల్లించార‌నీ ఆ రిపోర్ట్ తెలిపింది. అపార్ట్‌మెంట్‌లో 27, 28 అంత‌స్తుల్లో ఉన్న ఆ డూప్లెక్స్ ఫ్లాట్ విస్తీర్ణం 5,184 చ‌ద‌ర‌పు అడుగులు. దానికి 6 కార్‌-పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి.

ఇప్ప‌టికే ముంబైలో ప్రతీక్ష‌, జ‌న‌క్‌, వ‌త్స‌, జ‌ల్సా అనే నాలుగు బిల్డింగులు అమితాబ్‌కు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న భార్య జ‌య‌, కుమారుడు అభిషేక్‌, కోడ‌లు ఐశ్వ‌ర్య‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌తో క‌లిసి 'జ‌ల్సా'లో నివాసం ఉంటున్నారు. 'జ‌ల్సా'ను తాను నిర్మాత ఎన్‌.సి. సిప్పీ నుంచి కొన్న‌ట్లు ఆమ‌ధ్య త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆయ‌న తెలిపారు.

కాగా అమితాబ్ లేటెస్ట్‌గా కొన్న ఫ్లాట్ ఉన్న అదే ప్రాజెక్టులో డైరెక్ట‌ర్ ఆనంద్ ఎల్‌. రాయ్‌, న‌టి స‌న్నీ లియోన్ కూడా ఫ్లాట్స్ కొనుగోలు చేశారని స‌మాచారం.