English | Telugu
దసరాకి రెడీ అవుతున్న టైగర్... అందుకోగలరా?
Updated : Jun 8, 2023
దసరాకి ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్మ పడాల్సిందే. ఫ్యాన్స్ విజిల్స్ తో స్క్రీన్ మీద ఫైర్ పుట్టాల్సిందే అంటూ గట్టిగా సంకల్పించుకున్నారు టైగర్. ఈసారి దసరాను మిస్ చేసుకునే ఛాన్సే లేదన్నది టైగర్ నుంచి వస్తున్న మాట. మరి ఇప్పుడే కదా దేవర సినిమా స్టార్ట్ అయింది. మరి అప్పుడే ఎలా కుదురుతుంది? 2024 రిలీజ్ అని చెప్పేశారు కదా. అలాంటప్పుడు ఇంత తొందరపెట్టడం కూడా సరికాదు అని కొందరంటే, ఏ హిట్ మూవీనో దసరాకి రీరిలీజ్ చేస్తారేమో అనే అనుమానాలు మరికొందరివి. కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఇక్కడ దసరాకు రావాలనుకుంటున్న టైగర్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాదు, నార్త్ హీరో టైగర్ ష్రాఫ్.
టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న సినిమా గణ్‌పత్. ఈ సినిమాకు వికాస్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. జాకీ భగ్నాని నిర్మాత. యుకెలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. ఈ సినిమా ప్రస్తుతం పూర్తి కావస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణకు కాల్షీట్ కేటాయించేశారు టైగర్. ఈ నెల నుంచి నెక్స్ట్ షెడ్యూల్‌ని రెజ్యూమ్ చేయనున్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
మూవీ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ``టైగర్ ష్రాఫ్ వచ్చే వారం నుంచి ముంబైలో గణ్‌పత్ షూటింగ్‌లో పాల్గొంటారు. కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను, ప్యాచ్ వర్క్ నీ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. దీని తర్వాత మరో చిన్న షెడ్యూల్ కూడా ఉంటుంది. అందులో కొన్ని సాంగ్ సీక్వెన్స్ చేస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. వికాస్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. దసరాకు విడుదల చేయాలన్న సంకల్పంతో ఉన్నారు`` అని అన్నారు. హీరో పంతి తర్వాత టైగర్ ష్రాఫ్, కృతిసనన్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. 2014లో విడుదలైంది హీరోపంతి. దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు.