English | Telugu

దివ్యభార‌తి తొలి హిందీ చిత్రం `విశ్వాత్మ‌`కి 30 ఏళ్ళు!

90ల్లో భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రిచిన అందం.. దివ్య‌భార‌తి. నాలుగేళ్ళ త‌న కెరీర్ లో 20కి పైగా సినిమాల్లో నాయిక‌గా అల‌రించారు దివ్య‌భార‌తి. ఒక్క 1992 సంవ‌త్స‌రంలోనే ఈ టాలెంటెడ్ బ్యూటీ.. 12 సినిమాల్లో క‌నువిందు చేయ‌డం విశేషం. `బొబ్బిలి రాజా`(1990)తో తెలుగునాట బ్లాక్ బ‌స్ట‌ర్ డెబ్యూ ఇచ్చిన దివ్య‌భార‌తి.. 1992లో రిలీజైన `విశ్వాత్మ‌`తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1992 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో త‌న‌క‌దే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. `త్రిదేవ్`(1989) వంటి సంచ‌ల‌న చిత్రం అనంత‌రం ద‌ర్శ‌కుడు రాజీవ్ రాయ్ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో స‌న్నీ డియోల్ కి జోడీగా ద‌ర్శ‌న‌మిచ్చారు దివ్య‌భార‌తి. 1992 సంవ‌త్స‌రంలో ఆరో హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ ఇండియ‌న్ ఫిల్మ్ గా `విశ్వాత్మ‌` రికార్డుల‌కెక్క‌డం విశేషం. కెన్యాలో చిత్రీక‌రణ జ‌రిపిన తొలి భార‌తీయ చిత్రంగానూ `విశ్వాత్మ‌` ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also read: బాల‌య్య‌-గోపీచంద్ సినిమాలో కీల‌క పాత్ర‌లో అజ‌య్ ఘోష్‌!

ఇక `విశ్వాత్మ‌` అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చేది ఇందులోని విజు షా స్వ‌ర‌ప‌రిచిన ``సాత్ స‌మంద‌ర్ పార్`` అంటూ సాగే చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్. నైరోబీలోని పాపుల‌ర్ నైట్ క్ల‌బ్ బ‌బుల్స్ డిస్కోటెక్ లో దివ్య‌భార‌తి, ప్రధాన తారాగణంపై చిత్రీకరించిన ఈ జ‌న‌రంజ‌క గీతం.. కాల‌క్ర‌మంలో క‌ల్ట్ క్లాసిక్ గా నిలిచింది. న‌జీరుద్దీన్ షా, చంకీ పాండే, అమ్రిష్ పురి, సోన‌మ్, గుల్ష‌న్ గ్రోవ‌ర్, శ‌ర‌త్ స‌క్సేనా, మ‌హేశ్ ఆనంద్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని గుల్ష‌న్ రాయ్ అప్ప‌ట్లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. 1992 జ‌న‌వ‌రి 24న విడుద‌లైన `విశ్వాత్మ‌`.. నేటితో 30 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.