Odala Pizza

 

 

ఊదల పిజ్జా

 

 

 

కావలసిన పదార్ధాలు:

ఊదలు – అర కప్పు

నెయ్యి / నూనె – 2 టీ స్పూన్లు

గోధుమ పిండి – అర కప్పు

ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు, టొమాటో తరుగు మష్రూమ్‌ తరుగు – అర కప్పు

బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను

టొమాటో సాస్‌ – పావు కప్పు

మొజెల్లా చీజ్‌ – తగినంత

స్వీట్‌ కార్న్‌ గింజలు – ఒక టేబుల్‌ స్పూను

ఉప్పు – తగినంత

 

తయారుచేసే విధానం:

ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. ఊదలను గ్రైండర్‌లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టౌ మీద పాన్‌ను వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్‌ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్‌ ట్రేలో అల్యూమినియం ఫాయిల్‌ పేపర్‌ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టొమాటో సాస్, మొజెల్లా చీజ్, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు, మష్రూమ్‌ తరుగు, స్వీట్‌ కార్న్‌ గింజలు ఒకదాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్‌ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది..