నాలుగు కంటైనర్లు... 2 వేల కోట్ల క్యాష్!

అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. ఆ లారీల మీద వున్నవి పెద్దపెద్ద కంటైనర్లు కాబట్టి లారీలు చాలా మెల్లగా ప్రయాణిస్తున్నాయి. ఈ లారీల ముందు ‘POLICE’ అనే బోర్డు కనిపిస్తోంది.  నాలుగు లారీల్లో చివరి లారీని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ యథాలాపంగా రేర్ వ్యూ మిర్రర్లోంచి చూశాడు.. వెనుక తమ లారీల వైపు దూసుకొస్తున్న పోలీస్ వెహికల్ కనిపించింది. అందులో పదిమందికి పైగా పోలీసులు వున్నారు. పోలీసు వెహికల్ని చూసి లారీ డ్రైవర్ ఎంతమాత్రం భయపడలేదు.. పోలీసు వెహికల్ వేగంగా ముందుకు వచ్చింది. లారీలన్నిటి ముందుకు వెళ్ళి రోడ్డు మధ్యలో సడన్ బ్రేక్‌తో ఆగింది. వెంటనే అందులోంచి పోలీసులు బిలబిలమంటూ కిందకి దిగారు. వస్తున్న లారీలను ఆపాలన్నట్టు సైగ చేశారు. కొందరు సిన్సియర్ పోలీసులయితే ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా రివాల్వర్స్ తీసి లారీలకు ఎయిమ్ చేసి నిల్చున్నారు. పోలీసుల దగ్గరకు వచ్చిన లారీలు ఆగాయి. సాధారణంగా లారీ డ్రైవర్లు అంతమంది పోలీసులను చూస్తే కిందకి దిగి నమస్తే సార్ అంటారు. కానీ ఈ నాలుగు కంటైనర్లను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లు ‘పోలీసులా.. అయితే ఏందంట’ అన్నట్టుగా డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని వున్నారు. పోలీసులు వాళ్ళని కిందకి దించారు. కంటైనర్లలో ఏముందో చెక్ చేసి షాకయ్యారు.. ఆ నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల రూపాయల క్యాష్ వుంది. పోలీసులకు అప్పుడెప్పుడో విడుదలైన మణిరత్నం సినిమా ‘దొంగ.. దొంగ’లో వున్న క్యాష్ కంటైనర్ గుర్తొచ్చింది. దాంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పై అధికారులకు సమాచారం అందించారు. నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ వుంది కదా.. ఆ రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ మరేదో కాదు.. రద్దయిన 5 వందల నోట్లు.. లారీలో వున్న వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆ కంటైనర్లు మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి చెందినవి. నోట్ల రద్దు సందర్భంగా కేరళలో కలెక్ట్ చేసిన 5 వందల రూపాయల నోట్లను హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. అంతే.. అంతకంటే పెద్ద మేటరేం లేదు. భలే కేసు పట్టుకున్నామని అప్పటి వరకు మురిసిపోయిన ఏపీ పోలీసులు నిట్టూర్చారు. ఆర్బీఐ అధికారుల నుంచి కన్ఫర్మేషన్‌ తీసుకుని కంటైనర్లని వదిలేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో రూ 2.40 కోట్ల నగదు సీజ్ 

తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళుతున్న వీరాంజనేయ అనే ట్రావెల్ బస్సులో డబ్బు దొరికింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇది హవాలా డబ్బా..లేక ఎన్నికల కోసం తరలిస్తున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు తీసుకెళుతున్నారు, ఎవరి కోసం తీసుకెళుతున్నారు అనే అంశాలు కూడా ఇంకా తెలియలేదు. డబ్బును తీసుకెళ్ళుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరి దగ్గర పోలీసులకు ఎలాంటి అనుమతి పత్రాలు లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడి క్కడ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఇలాంటి అధిక మొత్తంలో ఎవరు డబ్బులు పట్టుకెళ్ళినా వారిని పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు.

షర్మిల ఎఫెక్ట్.. కడపలో అవినాష్ సీన్ సితారేనా?

వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు.  అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు. రాజకీయ అధికారంలో కానీ, కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో కానీ ఆమెకు తీవ్ర నష్టం కలిగించారు. అన్న వైఖరితో విభేదించిన షర్మిల చివరికి పొరుగు రాష్ట్రం వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు. అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. వైఎస్ పై అభిమానంతో ఆ రాష్ట్రంలో షర్మిలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా జగన్ వారించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో అటువంటి వారిని షర్మిలకు దూరం చేశారు. పొంగులేటి వంటి వారు షర్మిలకు సహాయం చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనంగా అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  చివరకు ఆమె తెలంగాణ ఎన్నికల బరి నుంచి పార్టీని దూరంగా ఉంచి.. ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. వైసీపీతో ఢీ అంటే డీ అంటున్నారు.  స్వయంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారం కడప రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అవినాష్ కు నిద్రపట్టకుండా చేస్తోంది. తమ కుటుంబానికి పెట్టని కోటలాంటి కడప జిల్లాలో షర్మిల ప్రభావం వైసీపీకి అడుగడుగునా గండంగా మారింది. కడప ఎంపీగా  గెలిచేందుకు ఆమె సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆమె ప్రచార సరళి, ప్రచార వేగం, మాటల తూటాలూ   వైసీపీ నేతల  మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.  ఎన్నికల ప్రచారంలో ఆమె నేరుగా అవినాష్ రెడ్డి, జగన్ లనే అటాక్ చేస్తున్నారు. ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా  మనుషు పీకలు కోసే వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తారా అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేకా హంతకులను పక్కన పెట్టుకుని ఓట్లడగడానికి ఎలా వస్తున్నావంటూ జగన్ ను నిలదీసి ప్రశ్నిస్తున్నారు.   షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మరీ ముఖ్యంగా మహి ళల నుంచి విశేష  స్పందన వస్తున్నది.   ఈ స్థాయిలో షర్మిల  ప్రచారానికి ప్రజాస్పందన వస్తున్నదంటే వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. రాష్ట్రంలో  కాంగ్రెస్ కు లీడర్, క్యాడర్ లేరు. ఈ మాత్రంగానైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు వినపడుతోందంటే అందుకు కారణం వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమేనని అంగీకరించి తీరాలి. అటువంటి కాంగ్రెస్ ప్రచార సభలకు కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. షర్మిలకు లోపాయికారిగా వైసీపీ క్యాడర్ సహకారం అందిస్తున్నట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చు కోవడం కూడా  అవినాష్ రెడ్డికి కడపలో బిగ్ మైనస్గా మారిందని చెబుతున్నారు. సీబీఐ చార్జిషీటులో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని.. పబ్లిక్ డోమైన్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. అందుకే  వైఎస్ వివేకా హత్య పై చర్చ కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ విష యాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కడప కోర్టు గ్యాగ్ ఆర్డర్ కారణంగా జరిగింది ఏమైనా ఉందంటే జనం అవినాష్ రెడ్డి వైపు తప్పు ఉంది కనుకనే కోర్టును ఆశ్రయించారు అని జనం చర్చించుకోవడం మాత్రమే. 

అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతల అరెస్ట్ 

ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ ఎలక్షన్ కమిషనర్ కు జగన్ పై ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు.ఎన్నికల ప్రచారంలో అలవోకగా అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై జగన్ బురద జల్లుతున్నాడని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడుతున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన స్థాయి మరిచి చంద్రబాబు, పవన్‌ లపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని, కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన జగన్ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ 48 గంటల పాటు బ్యాన్ విధించినట్లు ఏపీ సీఎంపైనా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని ఈసీ పేర్కొంది. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. సిరిసిల్ల ప్రచారంలో కేసీఆర్ చవటలు, దద్దమలు, నిరోధులు అమ్ముకొండి అంటూ వ్యాఖ్యలు చేశారని…. ఇవి ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

సంప్రదాయబద్ధంగా జరిగిందే పెళ్ళి!!

‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని, ఏ హిందూ జంటకి అయినా ‘పెళ్ళి అయింది’ అని గుర్తించాలంటే వాళ్ళిద్దరికీ జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు, ఏడడుగులు లాంటి సంప్రదాయాలను పాటిస్తూ పెళ్ళి జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడెప్పుడో మేమిద్దరం మాకు తోచినట్టు పెళ్ళి చేసుకున్నాం, మేమిద్దరం ఇప్పుడు తన్నుకు చస్తున్నాం. మాకు విడాకులు ఇచ్చేయండి’ అని ఓ జంట సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వీరి వివాహం జరిగిన పద్ధతి గురించి తెలుసుకున్న సుప్రీం కోర్టు.. అసలు మీకు జరిగింది పెళ్ళే కాదు.. ఇక విడాకులు ఇవ్వడం ఏమిటి? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ ఆ దంపతుల పెళ్లి చెల్లదని తీర్పు వెలువరించింది. ఆ కేసుని డిస్మిస్ చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు పాటించకుండా జరిగే హిందూ వివాహం చెల్లదు అని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది.  ‘హిందూ ధర్మంలో వున్న అనేక సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. దానికి పవిత్రత ఉంది. భారతీయ సమాజంలో దానికి ఆ గౌరవం, హోదా ఇవ్వాల్సిందే’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘పెళ్ళి అంటే ఆటపాటల కార్యక్రమమో, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకొనే వాణిజ్య లావాదేవీనో కాదు. హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉంది. దానికి ఆ హోదా ఇవ్వాల్సిందే. హిందూ ధర్మ పద్ధతి ప్రకారం పెళ్లి తంతు లేకుండా ఒక్కటైన దంపతులు నిజానికి దంపతులే కాదు.. చట్టం వారిని దంపతులుగా గుర్తించదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం పెళ్లిలో కచ్చితంగా సంప్రదాయ ఆచారాలు, క్రతువులను నిర్వహించాల్సిందే.  అలాంటి ఆచార పద్ధతులను నిర్వహించకుండా జరిగిన పెళ్ళిని రిజిస్టర్ చేసినా అది చట్టబద్ధంగా చెల్లదు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.

తెలుగుదేశం కూటమి ఫిర్యాదులు బుట్టదాఖలేనా? ఎన్నికల సంఘం మౌనం సంకేతమదేనా?

కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా?  లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా?  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది. సీఎస్-డీజీపీలను బదిలీ విషయంలో ఈసీ కిమ్మనకపోవడం?  చివరాఖరికి ఇన్ చార్జి డీజీపీ ఆధ్వ ర్యంలో  ఎన్నికలు జరగడం విధాయకం కాకపోయినా పట్టించుకోకపోవడం చూస్తుంటే.. వారి బదిలీ విషయం అటకెక్కనట్లేకనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ డిజీపీ విషయంలో ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అలా మార్చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే  గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన మరుసటిరోజే  ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు.  అలాగే అప్పటి విపక్షం ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించి అప్పటి సీఎస్ పునేఠాను బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం, ఆ పార్టీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఫిర్యాదులిచ్చి నెలరోజులవుతున్నా, పోలింగ్ సమయం రోజుల వ్యవధిలోకి వచ్చేసినా  ఎందుకు స్పందించడం లేదని  ప్రశ్నిస్తున్నారు. ఇక సామాన్య జనంలో అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోకుండా అధిష్ఠానం ఇంకా వైసీపీ తోనే అంటకాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   గత ఎన్నికల ముందు బీజేపీతో విబేధించిన తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా వాయువేగంతో చర్యలు తీసుకున్న ఇదే ఎన్నికల సంఘం ఇప్పుడు  డీపీ-జనసేన ఎన్డీయే కూటమి ఉన్నా, తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు సీఎస్, ఇన్ చార్జి డీజీపీల బదిలీ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని తప్పించాలని స్వయంగా, కూటమిలో పెద్దపార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి ఫిర్యాదుచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి కూడా ఫిర్యాదుచేశారు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలే ఫిర్యాదుచేసినందున, ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను నిలిపివేసి, ఆయనను బదిలీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ధర్మారెడ్డి డెప్యూటేషన్ ను కొనసాగించాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ లేఖను కేంద్రంలోని బీజేపీ సర్కార్  ఆమోదించింది.  సొంత పార్టీ అధ్యక్షురాలి ఫిర్యాదులను పట్టిం చుకోకుండా బీజేపీ జగన్ వినతికి తలూపడం బీజేపీ, వైసీపీ బంధం కొనసాగుతోందా అన్న అను మానాలకు బలం చేకూర్చేలా ఉంది..  

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.  తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం  తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే, నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు.  లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఏపీ అధికారులు కళ్ళు తెరవాలి!!

‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు. ఇంత చిన్న లాజికల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది అధికారులకు అర్థం కావడం లేదు. ఆ అధికారులలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు పలువురు ద్వితీయ, తృతీయ స్థాయి అధికారులు కూడా వున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వైసీపీ త్వరలో అధికారం కోల్పోబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ, కొంతమంది అధికారులకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు.. వైపీపీ శాశ్వతంగా అధికారంలో వుంటుందన్న భ్రమల్లో బతుకుతూ ఆ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  ఐదేళ్ళుగా వైసీపీ సేవలో తరించిన అధికారగణం ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న ప్రస్తుత తరుణంలో కూడా నిస్పక్షపాతంగా పనిచేయడానికి మనసు రాక జగన్ ప్రభుత్వం సేవలో పునీతమవుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం ఎంతమాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను చూసి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మారాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తప్పిదాన్ని చేయించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు? మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన ఇద్దరూ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఒకవేళ ట్యాపింగ్ జరిగి వుంటే, దానికి సంబంధించిన అధికారులను శిక్షించాలి అంటున్నారు తప్ప.. మేమే ట్యాపింగ్ చేయమన్నాం అని చెప్పడం లేదు. కేసీఆర్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ప్రభుత్వ అధినేతగా నేను సమాచారం అడుగుతాను. అధికారులు ఏ మార్గంలో సమాచారం తెలుసుకుని తెచ్చి ఇస్తారో నాకు అవసరం లేదు.. నాకు సంబంధం లేదని చెప్పేశారు. అంటే, ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, కేటీఆర్ చాలా తెలివిగా తప్పంగా అధికారుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సీన్ రేపు ఏపీలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు జగన్ మెప్పు కోసం పనిచేస్తే, రేపు అధికారం పోయిన తర్వాత జగన్ కూడా చేతులు దులుపుకుంటాడు.. నాకేం సంబంధం.. అధికారులే బాధ్యులు అనేస్తాడు. అప్పుడు దోషుల్లా నిలబడాల్సింది అధికారులే. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్నే మోసం చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేయడులే అనుకోవడం అధికారుల అమాయకత్వం.

మోడీ అహంభావం.. జనం తిరస్కారం! తొలి రెండు విడతల పోలింగ్ సరళి సంకేతం అదేనా?

ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు విడతల ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. తీరా పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ వెనుకబాటుకు కారణాలేమిటని ఆలోచిస్తే అతి ఆత్మవిశ్వాసం, అహంభావం కారణాలుగా కనిపిస్తాయి.  బీజేపీకి ప్రజాదరణ తగ్గడానికి, లేదా ప్రజావ్యతిరేకత పెల్లుబకడానికి ప్రధాన కారణం మోడీ అహంభావ పూరిత వైఖరిగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, ఈ సారి తమ సీట్ల సంఖ్య ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని  400 మార్కు దాటుతుందని మోడీ ఘనంగా ప్రకటించారు. 2004లో వాజపేయి ప్రభుత్వం   భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో  ఎన్నికలకు వెళ్లి చతికిల పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తొలి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత   2004 ఫలితమే పునరావృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలకు ముందే మోడీ ఈ సారి మరిన్ని కఠోర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూ ఓట్లను ఆకర్షించేందుకు కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సీఏఏ( ను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రకటనలు ఒక విధంగా దుస్సాహసంగానే చెప్పాలి. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దేశంలో మత పరమైన చీలకకు కూడా వెనుకాడబోమని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.ఇది కూడా మోడీ సర్కార్ కు ప్రతికూలంగానే మారిందని అంటున్నారు.  ఇక ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు మోడీ సర్కార్ గత పదేళ్లుగా అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   తన ప్రభుత్వ విధానాలతో విభేదించే విపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి,సీబీఐ లను ప్రయోగించి విధేయులుగా మార్చుకోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను జనం విశ్వసించేలా పరిస్థితులు ఉండటం కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ.  బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలపై విమర్శనాత్మకంగా మాట్లాడే మేధావులను అర్బన్ నక్సలైట్లుగా  ముద్ర వేయడం మధ్య తరగతి వర్గంలో మోడీ సర్కార్ పట్ల విముఖత ఏర్పడేందుకు కారణమైందంటున్నారు. ఇక  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించించడం కూడా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన రేకెత్తిం చిందని అంటున్నారు. రెండోవిడత పోలింగ్ జరిగి 88 లోక్ సభ స్థానాలలో బీజేపీ మహా అయితే 28 స్థానాలలో విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయనీ, ఈ విడతలో పోటీలో ఉన్న   బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ గోవెల్, హేమమాలినీ,రాజీవ్ చంద్రశేఖర్, ఓం బిర్లా, తేజస్వీ సూర్య వంటి వారి విషయంలో ఫలితాలు రాకముందే ఓటమి ఖరారైపోయిందని అంటున్నారు. అదే విధంగా మొదటి విడత  102 స్థానాలకు జరి గిన పోలింగ్ లో బీజేపీ 30 స్థానాలలో విజయం సాధిస్తే గొప్పే అన్న అంచనాలు ఉన్నాయి. రాజపుట్, జాట్, ఠాగూర్ సామాజికవర్గాల పట్ల టికెట్ల విషయంలో బీజేపీ వివక్షా పూరితంగా వ్యవహరించిందన్న ఆగ్రహం ఆయా వర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాజస్తాన్ లో వసుంధరా రాజే, మహారాష్ట్ర లో చౌహన్ లను పక్కన పెట్టడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంటున్నారు. యూపీ, రాజ స్థాన్, ఎంపీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో దళితులు,ఆదివాసీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొదటి నుంచీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మోదీ ఈసారి మోడీ తన అద్భుత వాగ్ధాటితో చేస్తున్న వాగ్దానాలను కూడా ప్రజలు నమ్మేపరిస్థితి లేదంటున్నారు.  నల్లధనం వెలికి తీస్తా నని, అలా విదేశాలలో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాలలో వేస్తామని మోడీ చెప్పిన మాటల డొల్లతనాన్ని జనం అర్ధం చేసుకున్నారని, ఈ సారి అటువంటి వాగ్దానాలను జనం విశ్వసించే పరిస్థితి లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన మోడీ.. రెండో సారి అధకారంలోకి వచ్చిన తరువాత ఆదాయం రెట్టింపు మాట అటుంచి రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్న ఆగ్రహం వ్యవసాయ దారులలో తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన అనాలోచిత నిర్ణయం,  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని విస్మరించడం, కరోనా సమయంలో వలస కూలీల ఆకలి కేకలు,  వంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.   ఇక చివరి క్షణంలో  హిందూత్వ అంశాన్ని మోదీ తన ఆఖరి ఆయుధంగా ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకా శాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నిషేధం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి అధికారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.  అలాగే దైవ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని స్థానికులు, వ్యాపారులు, హోటళ్లు, సత్రాల నిర్వాహకులను కోరారు.

బీఆర్‌ఎస్‌కి గుండుసున్నా ఇచ్చిన రవిప్రకాష్ సర్వే

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే బిఆర్ఎస్ వర్గాల్లో ఆ ఒక్క స్థానం ఆశలను కూడా జర్నలిస్టు రవిప్రకాష్ తుస్సుమనిపించారు. బుధవారం నాడు ఆయన తన సొంత మీడియా ఛానల్లో తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయన్న అంశాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేశారు. ఇందులో ఆయన తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 8 స్థానాలు దక్కుతాయని, ఎం.ఐ.ఎం. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. బిఆర్ఎస్‌కి ఒక్క స్థానం కూడా దక్కదని బాంబు పేల్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఏ పార్టీ వున్నా ఎవరైనా సరే  ‘అయ్యోపాపం’ అంటారు. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరూ ఆ మాట అనడం లేదు.. అంత పాతాళానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ.

గుడివాడ, గన్నవరం తెలుగుదేశం ఖాతాలోకే.. కొడాలి, వంశీ ఇక ఇంటికే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది.  ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ దాకా, ఫలితం దాకా వేచి చూడాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సర్వేలు కుండబద్దలు కొట్టుస్తున్నాయి. అయితే కోడ్ అమలులో ఉన్నందున ప్రిపోల్ సర్వేలపై  నిషేధం ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో వచ్చే సర్వేల ప్రామాణికతను నిర్ధారించలేం. అయితే.. ప్రజల మూడ్ ను గమనించినట్లైతే ఆ సర్వేలలో నిజమెంతో ఇట్లే అవగతమైపోతుంది.  తాజాగా రైజ్ (RISE) సర్వే పేరిట సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న సర్వే ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. కోడ్ అమలులోకి రావడానికి ముందు వచ్చిన దాదాపు డజన్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన రైజ్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. తెలుగుదేశం కూటమి 108 నుంచి 120 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుందని పేర్కొంది. గత సర్వేలు కూడా దాదాపుగా ఇదే ఫలితాన్ని వెలువరించిన నేపథ్యంలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. కానీ ఈ సర్వేలో గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయం ఖరారైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజకవర్గాల పట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతో ఆరంభమైంది. ఇరువురూ తరువాత వైసీపీలో చేరారు. రాజకీయాలలో పార్టీలూ మారడం అరుదేమీ కాదు. కానీ వీరు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరిన తరువాత తెలుగుదేశంపై నోరుపారేసుకున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రాజకీయ విమర్శలు చేసి ఉంటే వారి పట్ల ప్రజలలో ఇంత ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదు. కానీ ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు.  దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గుడివాడలో నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైజ్ సర్వేలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓటమి బాటలో ఉన్నారని వెల్లడి కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  రైజ్ సర్వే ప్రకారం గుడివాడలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని కంటే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాముకు ప్రజాదరణ అధికంగా ఉందని పేర్కొంది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఇందులో రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత వరుసగా రెండు సార్లు వైసీసీ అభ్యర్థిగా గెలిచారు. ఐదో సారి మాత్రం కొడాలి నానికి గుడివాడలో శృంగభంగం తప్పదని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను ముందుగానే పసిగట్టిన వైసీపీ అధిష్ఠానం ఒక దశలో  గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడాలి నానిని తప్పించాలని కూడా యోచించిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి విపక్షంపైనా, విపక్ష నేత, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత భాషా ప్రయోగంతో చేసిన విమర్శలూ ప్రజలలో కొడాలి నాని ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, వారి ఆగ్రహానికి కూడా కారణమయ్యాయి. ఆ ప్రజాగ్రహమే రైజ్ సర్వేలో ప్రతిఫలించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక గన్నవరం అధికార పార్టీ అభ్యర్థి  వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపోందారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019 విజయం తరువాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి జగన్ గూటికి చేరిపోయారు.  గన్నవరంలో గెలుపు తన బలం అని భ్రమించిన వంశీ తెలుగుదేశంపైనా, తెలుగుదేశం నాయకత్వం పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  నియోజకవర్గ అభివృద్ధికి గుండు సున్నా చుట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది ఆయన నామినేషన్ దాఖలు ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో తెలుగుదేశం బలం కానీ, తన విజయానికి తన బలం కారణం కాదన్న విషయం వంశీకి బోధపడినట్లైంది. అందుకే ఇవే గన్నవరం నుంచి తన చివరి ఎన్నికలు అంటూ ప్రజాసానుభూతి కోసం బేల మాటలు మాట్లాడారు. వైసీపీలో తన వ్యతిరేక వర్గాన్ని ఈ ఒక్కసారికీ సహకారం అందించాలంటూ బతిమలాడుకున్నారు. ఆ మాటలే వంశీ ఓటమి బాటలో ఉన్నారన్న విషయాన్ని తేల్చేశాయి. ఇప్పుడు తాజాగా రైజ్ సర్వే కొడాలినాని, వల్లభనేని వంశీల సీన్ అయిపోయిందని తేల్చేసింది.  

తప్పుడు ప్రచారం కేసులో బిఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్ 

ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో   బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి  కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిశాంక్‌తోపాటు, ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్‌ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరినీ పంతంగి టోల్‌గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, క్రిశాంక్‌పై గతంలో 14 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

పిఠాపురంలో వంగా గీతకు మూసుకుపోయిన గెలుపు దారులు!?

రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా  కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో వంగా గీతకు గెలుపు దారులు మూసుకుపోయాయంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించినా.. నియోజకవర్గంలో పరిస్థితి రోజురోజుకూ వైసీపీకి ప్రతికేలంగా, జనసేనకు అనుకూలంగా మారుతున్నదని పరిశీలకులు అంటున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేనానికి తెలుగుదేశం అండ కొండంత బలంగా మారిందంటున్నారు. కాపుసామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తనను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమరాంగ్ అయ్యిందంటున్నారు.  ఇక అన్నిటికీ మించి వైసీపీని, ఆ పార్టీ అభ్యర్థి వంగాగీతనూ ఆందోళనకు గురిచేస్తున్న అంశం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీనటుల ప్రచారం. ఇప్పటికే హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లు పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  వీరంతా బుల్లితెర ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజులలో  రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం వెలతెలపోతున్నదంటున్నారు.   ఓటమి భయంతోనే  పవన్ కల్యాణ్  హైదరాబాద్ లో ఉండే  నటులలో సగం మందిని పిఠాపురంలో దింపారన్న వంగా గీత విమర్శలు ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ విమర్శలు ఆమెలోని ఓటమి భయాన్నే ఎత్తి చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల మూడ్ ను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తేలిపోయిందంటున్నారు.  వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోందంటున్నారు. 

కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. స్పందించని తెలంగాణ సమాజం

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచి ఆ పార్టీ పరిస్థితి పతనం నుంచి మరింత పతనానికి జారిపోతున్న చందంగానే కనిపిస్తోంది.  అయితే తమ ఓటమికి ప్రజా వ్యతిరేకత కారణం కాదనీ, ప్రజలు తమ వెంటే ఉన్నారనీ, కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందనీ చెప్పుకోవడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇసుమంతైనా సందేహించడం లేదు. అయితే వారి మాటలను జనం విశ్వసిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులే విశ్వసించడం లేదనడానికి ఆ పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న వలసలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా మారిందంటున్నారు. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర వినా.. బీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ముందే పరాజయాన్ని అంగీకరించేసినట్లుగా అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారంపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గాలలో జరిగే సభలకే ఆ పార్టీ ప్రచారం పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే పార్టీ క్యాడర్ తో సమావేశాలతోనే ప్రచారాన్ని మమ అనిపించేస్తున్నారు. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ప్రచారం మొత్తం రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికే పరిమితమైంది. నిండా ఆరు నెలలు కూడా నిండని రేవంత్ సర్కార్ పై విమర్శలను మించి దూషణలతో విరుచుకుపడుతూ అదే ప్రచారం అని జనాలను నమ్మించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది.  అభ్యంతరకరంగా మాట్లాడారంటూ కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్రంలో రాజకీయాలను కనుసైగతో సాధించిన కేసీఆర్ ను అధికారం కలోయిన క్షణం నుంచి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరాజయం పాలైన నాడే తన ఫామ్ హౌస్ బాత్ రూంలో కాలుజారి గాయపడ్డారు. దాని నుంచి కోలుకుని ప్రజలలోకి రావడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ లోగానే పార్టీ నుంచి వలసల వరద మొదలైంది.  పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగేశారు. సరే ఆరోగ్యం కుదుటపడింది. వలసల వల్ల పార్టీకి నష్టం లేదు, పార్టీ వీడిన వారంతా  తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన హుంకరించడం మొదలు పెట్టారో లేదో.. ఆయన కుమార్తె   కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై  తీహార్ జైలుకు వెళ్లారు. దాని నుంచి తేరుకుని కేంద్రం కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించడానికి రెడీ అవుతుండగానే  కూడా ఫోన్ టాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు అరెస్టులు జరిగి.. ట్యాపింగ్ ఉచ్చు నేరుగా పార్టీ నేతల మెడకే చుట్టుకునే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వచ్చాయి. ఇన్ని కష్టాల నడుమ పార్టీనీ  పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దచేసే పనిలో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ప్రసంగాలలో సంయమనం కోల్పోయారు.  సిరిసిల్ల సభలో  కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారంటూ అందిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం (మే 1) రాత్రి 8 గంటల నుంచిఈ   48 గంటల పాటు అంటే శుక్రవారం (మే 3) రాత్రి ఎనిమిది గంటల వరకూ కేసీఆర్ ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ఆ 48 గంటలూ కేసీఆర్ ఎటువంటి  సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదు.  అయితే ఈసీ చర్యల పై స్పందించిన కేసీఆర్ తన మాటలు, స్థానిక మాండలికం ఈసీ అధికారులకు అర్ధం కాలేదంటూ నిందలు వేశారు.  తన ప్రచారాన్ని 48 గంటలు నిషేధిస్తే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా 96 గంటల పాటు ప్రచారం చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయనపై నిషేధం విధించి గంటలు గడిచినా తెలంగాణలో ఎక్కడా నిరసన అన్నదే కనిపించని పరిస్ధితి ఉంది.  కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపునకు తెలంగాణ ప్రజల నుంచి స్పందన కరవైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ విధించిన నిషేధంపై ప్రజల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కావడం లేదు. ఆయన భాష అభ్యంతరకరంగానే ఉందన్న చర్చ కూడా జనబాహుల్యంలో సాగుతోంది. పరిశీలకులు సైతం అదే మాట చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం బీఆర్ఎస్ కు గోరుచుట్టుపై రోకలి పోటువంటిదేనని అంటున్నారు. 

 దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి 

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే సూచనతో ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలను ఎక్కించుకొని అటు, ఇటు తిప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులోకి వెళ్ళడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడగా వారిని స్థానికులు ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. అందులో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు అబ్బయ్య చౌదరినే కారణమని…ఆయన ప్రచార ఆర్భాటమే పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.