పతనం దిశగా రామ్‌దేవ్ పతంజలి!?

రామ్‌దేవ్ బాబా చిచ్చరపిడుగులాగా యోగాసనాలు చేస్తుంటే జనం చూశారు. చప్పట్లు కొట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా తన స్నేహితుడు బాల‌కృష్ణతో కలసి పతంజలి ఉత్పత్తుల సంస్థని ప్రారంభించారు. తనకున్న ఛరిష్మాతో పతంజలి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ సృష్టించి బాగానే సొమ్ము చేసుకున్నారు. పతంజిలి సంస్థ ఆయుర్వేద మందులు, ఉత్పత్తులు అమ్ముకుని ప్రశాంతంగా ఉంటే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఆధునిక అల్లోపతి వైద్యాన్ని విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేయడమే పతంజలి సంస్థ పతనానికి బీజం పడేలా చేసింది. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా మందులు తయారు చేయడం కూడా దీనికి తోడైంది. చివరికి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు పదేపదే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా వుంటే, పతంజలి సంస్థకు చెందిన పలు ఔషధాల తయారీ మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. స్వసరి గోల్డ్,  దృష్టి ఐ డ్రాప్స్, బ్రోన్‌కమ్, స్వసరి ప్రవాహి, లివొగ్రిట్, స్వసరి అవలేహ్, లిపిడామ్,స్వసరి వాటి, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, ఐగ్రిట్ గోల్డ్... నిషేధిత మందుల జాబితాలో వున్నాయి. 

పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత..  యధావిధిగా బాలికలదే పై చేయి 

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  . రిజల్ట్స్​ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు.  ఈ యేడు  విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు.  పదోతరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది.  పదోతరగతి ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 93.23,  బాలుర ఉత్తీర్ణత శాతం 89.42 నమోదైంది 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.  సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేట్‌వే అని బుర్రా వెంకటేశం తెలిపారు.  99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా నిలిచింది.  98.65 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో  సిద్దిపేట జిల్లా ఉంది.  98.27 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో  సిరిసిల్ల జిల్లా నిలిచింది.  65.10 ఉత్తీర్ణతతో  వికారాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది.  పదో తరగతి పరీక్షలు  5,05,813 లక్షల మంది విద్యార్థులు రాశారు.  పదోతరగతి పరీక్షలు రాసిన వారిలో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా పదోతరగతి పరీక్షలు రాసిన వారిలో 11,606 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు.  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదోతరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.    ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్​ 20లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. అలాగే మార్కుల నమోదుతో పాటు ఎలాంటి టెక్నికల్‌ ఇబ్బందులూ రాకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఫలితాలు విడుదల అవ్వగానే సర్వర్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సిరా చుక్కలతో కలిపి అగ్గి రాజేసిన యుగకర్త శ్రీశ్రీ

రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం..  ఆయనరచనల్లో 1950లోప్రచురించబడిన' మహాప్రస్థానం'అనే కవితా సంపుటి తెలుగుసాహితీ అభిమానులమనసుల్లోనే కాకుండా..సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.   ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు.  ఏప్రిల్ 30,  1910న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది.1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది.ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు.తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు.ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.  1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన ఈ విషయంస్వయంగా రాసాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన శ్రీ శ్రీ అమరుడు..  ఈ రోజు ఆ మహాకవి జయంతి సందర్భంగా...

పదిమందిలో భారతి పరువు పోయిందిగా!

భార్య చేసే పనులకు భర్త తిట్లు తినాలి.. భర్త చేసే పనులకు భార్య అక్షింతలు వేయించుకోవాలి.. ఇదీ భార్యాభర్తల మధ్య వుండే విచిత్రబంధం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన అనేక తలతిక్క పనుల్లో ఒక తలతిక్క పని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫొటో ముద్రించుకోవడం. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రి తన ఫొటో ముద్రించుకోవడం జరుగుతూ వుంటుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు జగన్ ఎక్కడబడితే తన తండ్రి ఫొటోనో, తన ఫొటోనే ఉండేలా చూసుకుంటూ తన ‘చిత్రానందం’ తీర్చుకుంటూ వున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని రైతుల పట్టాదారు పాసు పుస్తకాలన్నిటి మీదా తన ఫొటో ముద్రించుకున్నారు. రైతులకు తాతల నుంచో, తండ్రి నుంచో వచ్చిన భూమి అయి వుండవచ్చు. లేదా తానే కష్టపడి సంపాదించుకుని వుండవచ్చు. అలాంటి భూమి పాస్ బుక్ మీద ముఖ్యమంత్రి ఫొటో ముద్రించడం అంత నియంతృత్వం మరొకటి వుంటుందా? ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఇంతటి తెంపరితనాన్ని ప్రదర్శించలేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులలో ఎప్పటి నుంచో ఆగ్రహం వుంది. కానీ, తమ ఆగ్రహాన్ని బయటకి వ్యక్తం చేయలేకపోయారు. ఎందుకంటే, అలా ఆగ్రహం వ్యక్తం చేస్తే తన భూమే తనకు కాకుండా పోయే ప్రమాదం వుంది.. ఇంకా చెప్పాలంటే ప్రాణం కూడా పోయే అవకాశం వుంది. ఎందుకంటే, మాస్కులు లేవన్న పాపానికి డాక్టర్ మీద పిచ్చోడని ముద్ర వేసి, ప్రాణం పోయేంతవరకూ వేధించిన ఘనత జగన్ ప్రభుత్వానికిది. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి రోజులు పూర్తయ్యాయన్న సంకేతాలు స్పష్టంగా వస్తూ వుండటంతో రైతులకు నోరు తెరిచే ధైర్యం వస్తోంది. ఘనత వహించిన ముఖ్యమంత్రి జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని వేంపల్లెలో పర్యటిస్తున్న ఆమె మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్ళి జగన్‌కి ఓటు వేయాలని అభ్యర్థించారు. అప్పుడు మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి భారతి సమక్షంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ తన ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అంటారే తప్ప.. నా రైతు అని ఏనాడూ అనలేదని విమర్శించారు. దీనితోపాటు జగన్ అనుసరిస్తున్న అనేక రైతు వ్యతిరేక విధానాలను భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పలేక మౌనం వహించారు.

అమిత్ షా హెలికాప్టర్‌కి అలా జరగలేదు!

కేంద్ర హోం మంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా హెలికాప్టర్‌కి ప్రమాదం తప్పిందని, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయంలో ఊగిసలాటకి గురైందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అమిత్ షా హెలికాప్టర్‌కి అలాంటి సంఘటన జరగలేదని, అది ఒక ఫేక్ న్యూస్ అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించింది. ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలియక అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తను అందించాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని తెలిసి మళ్ళీ డిలీట్ చేశాయి. గతంలో సినీనటి సౌందర్య బీజేపీ కోసం ప్రచారం చేయడం కోసం హెలికాప్టర్లో ప్రయాణం చేయబోగా, హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయి ఆమె మరణించిన విషయం తెలిసిందే.

పొలిటికల్ కామెడీ.. కేఏపాల్ ను మించిపోయిన జగన్!

పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో కూడా చల్లటి వినాదాన్ని పంచగల దిట్ట ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ మాత్రమేనని ఇంత కాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు  ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అదినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ ను మించిపోయాడని అంటున్నారు. ఔను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతలు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు.   తన హయాంలో జరిగిన సర్వ తప్పిదాలనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆపాదిస్తూ.. ఐదేళ్లలో తన వైఫల్యానికి కారణం చంద్రబాబే అని చెబుతూ నవ్విస్తున్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ హడావుడి చేసి చివరకు ఒక రూపుదాల్చిన రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా... రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తాను మిగల్చిన జగన్.. తన వైఫల్యానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. అదెలాగో స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటే దుర్వాసుడైనా పగలబడి నవ్వి తీరతాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశారట. ఔను ఆయన అలా చేయకుండా ఉండి ఉంటే తాను అమరావతిని నిర్వీర్యం చేసినా, మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధినికి ఒక్క ఇటుకముక్క కూడా పేర్చలేకపోయినా.. హైదరాబాద్ ఉండేది కదా అంటున్నారు.  ఔను సోమవారం (ఏప్రిల్ 29) చోడవరంలో  మాట్లాడుతూ  జగన్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కాదని చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటి గురించి ఆయన మరచిపోవడమే కాకుండా, ప్రజలూ మర్చిపోవాలని అంటున్నారు. అదే సచివాలయంలో తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నా, అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నిర్మించిన భవనంలోనే నిర్వహిస్తున్నా. జగన్ ప్రభుత్వ తప్పిదాలకు మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు కూడా చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మించిన భవనంలోనే సాగుతోందని తెలిసినా జగన్ మాత్రం హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు తప్పు చేశాడని నిందిస్తుంటే వినేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.  ఇక మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా జగన్ పై జరిగిన గులకరాయి హత్యాయత్నం గురించి జగన్ చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టల గురించైతే ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ పడీపడీ నవ్వుతున్నారు.  దెబ్బ తగిలిన తొలి రోజు చిన్నసైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్, ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమిచ్చారు.  అంతే కాదు ఆ పట్టీని ఆయన దాదాపు 13 రోజుల పాటు ధరించి కాదు కాదు భరించారు.  డాక్టర్ చెల్లెమ్మ సునీత   జగనన్నా  గాయంపై రోజుల తరబడి పట్టీ ఉంచుకుంటే సెప్టిక్ ఔతుంది జాగ్రత్త అని హెచ్చిరించడంతో భయపడి తీసేశారు. అయినా గులకరాయి హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్ కు చికిత్స చేసి కుట్లు వేసి మరీ బ్యాండేజీ వేసిన నిపుణులైన గవర్నమెంట్ వైద్యుల బృందానికి ఆ విషయం తెలియదు పాపం. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలసి మూడు కుట్లు వేసి మరీ చికిత్స చేసినా పదమూడు రోజుల పాటు ఆయన నుదుటిపై అంతసైజు బ్యాండ్ ఎయిడ్ పట్టీ ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో అని జనం ఆందోళన కూడా పడ్డారు. అయితే నెటిజనులు మాత్రం జగన్ స్థాయి వ్యక్తికి గాయం తగిలినప్పుడు ఆ మాత్రం పట్టీ లేకపోతే ఎలా అని సెటైర్లూ వేశారు అది వేరే సంగతి.   గర్భిణులకు సిజేరియన్ చేసి కానుపు చేసిన వైద్యులు కూడా కుట్లను వారంలో తీసేస్తారు.. కానీ జగన్ కు మాత్రం 13 రోజుల పాటు కుట్లు వేసిన గాయానికి పట్టీ వేసి అలాగే ఉంచేశారు.  సరే 13 రోజుల తరువాత జగన్ నుదుటిపై పట్టీ తీసేశారు. పట్టీ తీసేసిన తరువాత ఆయన ముఖం చూసి జనం ఆశ్చర్యపోయారు.   మెడికల్ హిస్టరీలో ఇంతకు మించి మిరాకిల్ ఎక్కడైనా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు.  ఎందుకంటే.. 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదుటిపై  గీత కూడా కనిపించకపోవడమే.  మొత్తం మీద జగన్ తన చేష్టలు, చర్యలు, ప్రసంగాలతో భలే కామెడీ పండిస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు. 

క్లైమాక్స్ కు చేరిన వైఎస్ కుటుంబ రాజకీయం.. జగన్ కు అవినాష్ దెబ్బ గట్టిగానే తగులుతుందా?!

 ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే.. కడప జిల్లా ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా ఇక్కడ అధికార వైసీపీ ఆధిపత్యం కానవచ్చేది. అయితే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడప లోక్ సభ బరిలో అవినాష్ కు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోనే కడపలో సీన్ మారిపోయింది. షర్మిల ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్నే కాకుండా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, మొత్తం జిల్లాపైనా ప్రభావం చూపుతోంది. అన్నిటికీ మించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఈ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ప్రధాన అజెండాగా మారిపోయింది.  ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే   ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న  వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే.  హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉంది. హత్య  తెలుగుదేశం హయంలో జరగడం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశంఅన్నట్లుగా ఫోకస్ చేసి లబ్ధి పొందారు ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి నాడు లబ్ధి చేకూర్చిన కేసే ఇప్పుడు వారికి రివర్స్ లో నష్టం చేకూర్చేలా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ చేరింది. ఈ హత్య కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కోర్టుల్లో తీర్పులూ ఇంకా రాలేదు. కానీ ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో కడప ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నికలలో ఓటు ద్వారా తమ తీర్పు ఏమిటో చెప్పనున్నారు. అందుకే  వివేకా హత్య కేసు  క్లైమాక్స్ కి చేరిందని అంటున్నారు.  కోర్టుల్లో వివేకా హత్య కేసు సాగదీత కోసం   ఓ వర్గం సర్వశక్తులు ఒడ్డింది. అది  తెలుగు రాష్ట్రాల  ప్రజలు   చూస్తూనే ఉన్నారు. కడప జిల్లా వాసులు అయితే చూడటం తో  పాటు హత్య కు కారకులు, కారణాలు కూడా అర్ధం చేసుకున్నారు.  నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతుందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు కూడా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రులను దగ్గరకు చేర్చుకుంది. అలాగే ఏపీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది.  ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే వైసీపీకి ఎడారిలో నీటి ఊటను వెతుక్కోవడమే అవుతుంది. దీంతో ఇప్పుడు వివేకా హత్య కేసు కడప జిల్లాలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది.  సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన  వివేకా హత్యకేసు ఇప్పుడు  వైసీపీకి ఊపిరాడకుండా చేస్తోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంలో వైఎస్ జగన్ అప్పుడు సక్సెస్ అయ్యారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.   నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా  ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్  కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎంకు ఎన్నికలలో కచ్చితంగా ప్రతికూలాంశంగా మారిందనడంలో సందేహం లేదు. దానికి తోడు వివేకా కుమార్తె సునీత, సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. వివేకా హంతకుల పక్కన నిలబడిన సీఎంకు ఓటు వేయవద్దు, వైసీపీని ఓడించండి అంటూ చేస్తున్న ప్రచారం కడప వాసులను కదిలిస్తోంది.  ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు జగన్ పడుతున్న తాపత్రయం, ఎన్నికల ప్రచారంలో కోర్టుల తీర్పులతో పని లేకుండా జగన్ అవినాష్ కు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజలలో జగన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగమే పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి భారతికి ఎదురౌతున్న చేదు అనుభవాలు. ప్రజల నుంచి ఎదురౌతున్న ప్రశ్నలు. వీటన్నిటినీ బట్టి చూస్తే  ఎన్నికలలో వైసీపీకి  కడపలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ వ్యతిరేక పవనాలకు జగన్ అవినాష్ ను వెనకేసుకురావడమే కారణమంటున్నారు. అంటే కడప కహానీ క్లైమాక్స్ చేరిందనీ, జగన్ కు అవినాష్ నుంచే గట్టి దెబ్బతగిలినట్లు కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీకి గల్ఫ్ కార్మికుల బహిరంగ లేఖ !

గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.  ◉ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంది?   ◉ గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదు? ◉ గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ  సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జేబులోంచి ఇచ్చేది ఏముండదు. గల్ఫ్ దేశాల కంపెనీలు జీతాలు ఇస్తాయి... కార్మికులు తీసుకుంటారు. అరవింద్ గారు... గల్ఫ్ దేశాలలో పనిచేసే 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు. ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదు. మేము చేసిన ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన  కేంద్ర ప్రభుత్వం 10 నెలల తర్వాత పాత వేతనాలను కొనసాగిస్తామని ప్రకటించింది.  ◉ ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు.  ◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు. ◉ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు  పట్టించుకోలేదు.  ◉ కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నది.  ◉ 34 సంవత్సరాల క్రితం...1990 లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణ 'గల్ఫ్ యుద్ధం' జరిగిన సందర్బంగా అప్పటి భారత ప్రధాని వి.పి. సింగ్, విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ నాయకత్వంలో ఒక లక్షా 70 వేల మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తరలించారు. వి.పి. సింగ్ లాగా ఇప్పటి ప్రధాని మోదీ ఎందుకు ఉచితంగా విమానాలను ఏర్పాటు చేయలేకపోయారు.  ◉ గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకు రావడం వీలుకాదు. ప్లయిట్ చార్జీలు భరించడం, లీవ్ దొరకడం కష్టం. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం... ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం -  ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. 'ఆబ్సెంటీ ఓటర్స్' గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏమిటి? ◉ బీజేపీ మోదీ ప్రభుత్వం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే... ఏదో తెలియని భయం పట్టుకున్నదా? ◉ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏమిటి? ◉ బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున శాతం ప్రోత్సాహకం  ఇస్తున్నది. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా.  ◉ "ఇవాళ దుబాయిలో మనవాళ్ళు చేతికి కంకణం కట్టుకొని, నొదుట బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని తిరుగుతున్నరు అంటే... దానికి నరేంద్ర మోదీ గారే కారణం" అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్  వ్యాఖ్యానించడం ఘోర తప్పిదం.. సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దుబాయి (యూఏఈ దేశం) పై భారత్ ఆధిపత్యం చలాయిస్తున్నది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం దౌత్య నిబంధనలకు విరుద్ధం. దీనిపై మీ జవాబు ఏమిటి.  ◉ దుబాయిలో, మస్కట్, బహరేన్ లలో వంద సంవత్సరాలకు పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.  ◉ ఇలాంటి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి మాటల వలన దుబాయి, యూఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే ఎవరు బాధ్యత వహిస్తారు.  ◉ ఎమిగ్రేషన్ యాక్టు1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో... కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలను గత ఐదేళ్లుగా బీజేపీ ఎందుకు పెండింగ్ లో పెట్టిందని గ‌ల్ఫ్ జేఏసి నిల‌దీస్తోంది.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ నియోజకవర్గం ఓట‌ర్లు, ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తుంటారు. గ‌ల్ప్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుటుంబ స‌భ్యులు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో అర‌వింద్  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గ‌ల్ప్ కార్మికుల కుటుంబాలు బీజేపీపై కోపంతో ఉన్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దుః పెమ్మ‌సాని

దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని  సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.  కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నన్ను, జగన్‌తో పోల్చొద్దంటారు. తాను 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు. 30 ఏళ్లు కష్టపడి, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని ఆయ‌న చెప్పారు. క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగిన జ‌గ‌న్‌కు, త‌న‌కు పోలికే లేదంటారు. జ‌గ‌న్‌ తండ్రి నీడ‌లో కష్టపడకుండా ఎదిగిన జ‌గ‌న్‌కు త‌న‌కు పోలికే లేదని తేల్చి ప‌డేశారు. 2004లో ఆయన ఆస్తి కోటి రూపాయిలు ఉంది.  క్విడ్ ప్రోకో చేసి దాని మీద వైయస్ జగన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు, వైయస్ జగన్‌కు కంప్లీట్ డిఫరెంట్ ఉందంటారు పెమ్మ‌సాని.  ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పెమ్మ‌సాని తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో  ఆయన గురించి చ‌ర్చ మొద‌లైంది. ఆయన ఎవరు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఏమి చేసి ఈ స్థాయికి ఎదిగారు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.   పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఇంటర్మిడియట్‌లో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు కష్టపడి చదివి, ఆ క్రమంలో 27 ర్యాంక్ సాధించారు. హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సంపాదించారు. ఇలా ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. అక్కడ... పీజీ పూర్తి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఐదేళ్లపాటు కొనసాగారు. ఇదే సమయంలో... మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు.  ఇందులో భాగంగా... తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ ను తక్కువ ధరకు ఆన్ లైన్‌ లో అందించేవారు.  ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో... విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌ లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించి.. ఫార్మసీ, నర్సింగ్‌, లా, ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించారు!  అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ పెనియర్‌గా  ఎదిగారు. అమెరికాలో ఉన్న తన కంపెనీలలో ఎంతో మంది తెలుగు వారికి జబ్స్ ఇచ్చారు. 30 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేయలేదు.  త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంద‌ని ఎన్నిక‌ల పోటీ చేస్తున్నాన‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాదు. అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి త‌న జ‌న్మ‌భూమికి  ఏమైనా చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చంద్ర‌శేఖ‌ర్ చెబుతున్నారు.   వైఎస్ వార‌సుడిగా వ‌చ్చిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయ‌న‌ ఆస్తులు రూ.750 కోట్లు. ఆయ‌న‌పై  26 కేసులు ఉన్నాయి.  11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. మ‌రో 6 ఇత‌ర కేసులు ఉన్నాయి. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  జ‌గ‌న్ అన్ అఫీషియ‌ల్‌గా మోదీతో అండ‌ర్‌స్టాండింగ్‌, అవ‌గాహ‌న‌తో వున్నారు. అందుకే ఆయ‌న కేసుల విష‌యంలో క‌నీసం అఫిడ‌విట్ వేయ‌కుండా సిబిఐ సాగ‌దీస్తోంది. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయినా, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే.  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 10 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం.  రాజశేఖర్‌రెడ్డి చనిపోయినపుడు రిలయన్స్‌ వారే చంపించారంటూ వాళ్ల పెట్రోల్‌ బంకులను దహనం చేసి.. ఎంతోమంది అమాయకులు బలైపోవడానికి కారణమయిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక అంబానీ అనుచరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తన నాన్నను కాంగ్రెస్‌ వాళ్లే సీబీఐ కేసులో ఇరికించారని చెప్పిన జగన్‌, తన లాయర్‌ ద్వారా జ‌గ‌నే, వైఎస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేలా చేశారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు 

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

జగన్, కేటీఆర్ నోట ఉమ్మడి రాజధాని మాట.. వ్యూహత్మకమా.. కాకతాళీయమా?

ఎన్నికల వేళ  ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే ఐదేళ్ల అస్తవ్యస్థ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అర్ధం కాక మల్లగుల్లాలు పడుతోంది.  ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని విషయంపై అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ గళమెత్తుతున్నాయి. ఇది కాకతాళీయమా లేక ఉమ్మడి వ్యూహమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎన్నికల అంశంగా తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరో వైపు ఇదే ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి జగన్ సర్కార్ కారణమన్న విమర్శ నుంచి బయటపడవచ్చన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. రెండూ పార్టీల నుంచీ ఒకే వాదన ఒకే సారి తెరమీదకు రావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే వైసీపీ, బీఆర్ఎస్ లు రెండూ ఫ్రెండ్లీ పార్టీలు. పరస్పరం సహకారం అందిం చుకుం టుంటాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏపీ సీఎం జగన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ కోసం సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ పోలీసులను పంపించారు. అది కేసీఆర్ కు పెద్దగా ఉపయోగపడలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో మళ్లీ జగన్ సర్కారే కొలువుదీరనున్నదని జోస్యాలు చెబుతున్నారు. ఇది జగన్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. పరస్పర సహకారం కోసం రెండు పార్టీలూ, రెండు పార్టీల అధినేతల తహతహలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కారణమేమిటంటే రెండు రాష్ట్రాలలోనూ ఏకకాలంలో ఇాద్దరు శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు) ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరువురికీ ఇబ్బంది కరమైన విషయమే అనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే  వేములవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆదివారం (ఏప్రిల్ 28) మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు.  మరో వైపు సోమవారం (ఏప్రిల్ 29)చోడవరంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్, వైసీపీలు కూడబలుక్కునే ఉమ్మడి రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చాయని అటున్నారు.  ఏకకాలంలో అటు బీఆర్ఎస్ కూ, ఇటు వైసీపీకీ ఉమ్మడి రాజధాని అంశం గుర్తుకురావడంపై అటూ ఇటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాజధానిని ఆపగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అం టూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో  తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలేమిటన్న విమర్శలు వస్తుంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడడమేమిటని నిలదీస్తున్నారు. మొత్తం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, వైసీపీలు  వ్యూహాత్మకంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు ...ఇసుక మాఫియాపై కన్నెర్ర

ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.   ఇసుక తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.  నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అనుమతులు ఉన్నచోట మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు జరుపుకోవచ్చని సూచించింది.  అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతోపాటు, ఎన్జీటీని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంలో మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తవ్వకాలు జరపడం లేదన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని జేపీ వెంచర్స్ ను ఆదేశించింది.  ఎన్జీటీ తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషనర్ ఫిర్యాదుల మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం!?

ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు. మరి వృద్ధులకు బయటకి వచ్చే పరిస్థితి వుందా? ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్నికల కోడ్ వున్నప్పటికీ జగన్ కనుసన్నల్లో పనిచేసే అధికారులు మాత్రం వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వం, బ్యాంకుల్లో జమచేస్తాం.. వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందే అని కరాఖండీగా చెబుతున్నారు. వాలంటీర్లు లేనప్పటికీ వృద్ధులకు ఇళ్ళ దగ్గర పెన్షన్ పంపిణీ చేయడానికి అసవరమైన ప్రభుత్వ సిబ్బంది వున్నారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం ఇంత ఎండలో బయటకి వస్తే వృద్ధుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ అలా ఎవరైనా చనిపోతే ఆ చావులను తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసి శవరాజకీయం చేయాలన్నది వైసీపీ వ్యూహంలా అనిపిస్తోంది. పాపం అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బందిపడే వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం నాయనా? కొంతమంది కుర్రకారు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా... ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న అధికారులు నిజమైన వృద్ధులు. 

దేశంలో ట్రెండ్ మారుతోందా? కాషాయ దళంలో కలవరం!

గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే,  జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.  మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.   తగ్గిన పోలింగ్ పై రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. పోలింగ్ శాతం తగ్గింది అంటే,  అది అధికార పక్షానికి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు.  ఉత్తర భారత దేశంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. అనేక హిందీ రాష్ట్రాలు బీజేపీ అంటే ఊగిపోతాయి.  కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతోంది. పోలింగ్ శాతం ఢమాల్ అంటూ ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న చోట్లనే ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో బీజేపీకి, మోడీకి టెన్షన్ పట్టుకుంది.  పోలింగ్ శాతం తగ్గడం అంటే కచ్చితంగా ఓటర్లు నిరాశలో ఉన్న‌ట్లే. ఎండలు ఎక్కువ‌గా ఉన్నాయి కాబ‌ట్టి పోలింగ్ త‌గ్గింద‌ని బీజేపీ అంటోంది.  రెండు విడ‌త‌లైయ్యాయి. ఇంకా  అయిదు దశల ఎన్నికలు వున్నాయి. అప్పుడే పూర్తి పిక్చర్ వస్తుంది. దక్షిణభారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్లు 139 + కేంద్రపాలిత పాండిచ్చేరిలో 1 సీటు = మొత్తం 140.  ఇందులో బీజేపీ నేరుగా గెలవగలిగే /పొందగలిగే సీట్లు 25 లోపు. 1. కేరళ ..0, 2. ⁠తమిళనాడు …0-01, 3. ⁠కర్ణాటక …. 5-8 లేదా మరీ బాగా వస్తే 10 లోపు, 4. ⁠ఆంధ్రప్రదేశ్ … 5-6 5. ⁠ తెలంగాణ … 5-8, ఉత్తరభారతదేశంలోనూ ఈశాన్య భారతదేశంలోనూ, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలోనూ అన్ని రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్ల సంఖ్య 413. నేడు ఉత్తరభారతంలో ఈశాన్యభారతంలో  అన్ని రాష్ట్రాలలో బలమైన అన్ని ప్రధాన వర్గాలూ మోడీకి అమిత్ షాకు బీజేపీకి వ్యతిరేకంగా అట్టుడుకుతున్నాయి. ఇందులో బీజేపీకి వచ్చే సీట్లు 180 నుండి 200 సీట్లు, లేదా మరీ మహా బాగా వస్తే 225 సీట్లు.  ఈలెక్కన మొత్తమ్మీద బీజేపీకి వచ్చే సీట్లు 200 నుండి 225, లేదా మహా బాగా వస్తే అతికష్టం మీద 250.  ఈ పరిస్థితుల్లో, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్ డి ఏ పార్టీల సహాయము మద్దత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు.  రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ‌టం, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వచ్చింది.  ఈ కారణంగానే ఓటర్లు ఓటు వేసేందుకు బయటకు రాలేదనే టాక్ న‌డుస్తోంది. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఎక్కడకి పోతావు చిన్నవాడా! కేసులో చిక్కుకున్న కుర్రవాడా!

చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు.. ఆ పప్పులేవీ ఉడకకపోవడంతో పారిపోయే ప్రయత్నాలు. పారిపోవడానికి భారీ స్కెచ్.. 1800 కిలోమీటర్ల దూరం పారిపోయినా పోలీసులకు చిక్కడం.. ఇదీ బాలీవుడ్ నటుడు సాహిల్  ఖాన్ విషయంలో జరిగిన డ్రామా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్ ప్రధాన నిందితుడు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రూపొందించిన ప్రకటనలో నటించాను తప్ప బెట్టింగ్ యాప్‌తో తనకేమీ సంబంధం లేదని సాహిల్ ఖాన్ ఈ కేసు బయటపడిన మొదట్లో సాహిల్ ఖాన్ బుకాయించాడు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. సాహిల్ ఖాన్ కేవలం యాడ్‌లో నటించిన నటుడు మాత్రమే కాదని, ఈ బెట్టింగ్ యాప్‌లో భాగస్వామి అని కూడా తేలింది. దాంతో సాహిల్ ఖాన్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే సాహిల్ ఖాన్ జంప్ జిలానీ అయిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని వేటాడ్డం ప్రారంభించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాహిల్ ఖాన్ మొట్టమొదటగా తన గెటప్ మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు వెళ్ళాడు.. ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కి పారిపోవడానికి ప్లాన్ చేశాడు. బస్సు, కారు, ఆటో, టూ వీలర్ మీద లిఫ్ట్... ఇలా రకరకాలుగా నాలుగు రోజులపాటు  1800 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌కి చేరుకున్నాడు. అతను అలా చేరుకున్నాడో లేదో పోలీసులు ఇలా అరెస్ట్ చేశారు. అడ్వాన్స్ టెక్నికల్ సదుపాయాల ద్వారా ట్రాక్ చేసి సాహిల్ ఖాన్‌ను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణం విలువ ఎంతో తెలుసా.. 15 వందల కోట్లు.. బాప్ రే!

వామ్మో.. మొసలి మటాష్ చేసేదే!

వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి వెళ్లాడు. పొలంలో వున్న పొదల పక్క నుంచి నడుస్తుండగా, ఆ పొదల్లో పొంచి వున్న ఒక భారీ మొసలి ఒక్కసారిగా శేఖర్ మీదకి దూకింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్ మొసలి బారి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అతను ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పొలంలోకి మొసలి వచ్చిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. ఆ తర్వాత స్నేక్ సొసైటీ నిర్వాహకుడు వచ్చి ఆరు గంటలపాటు శ్రమించి మొసలిని బంధించాడు. ఇది చాలా భారీ మొసలి. ఆరడుగుల పొడవు, 185 కిలోల బరువు వుంది. ఈ మొసలి సమీపంలో వున్న చెరువు నుంచి వచ్చి వుండొచ్చని అనుకుంటున్నారు. ఈ మొసలి ఇప్పటికే చాలా మేకలను చంపి తిన్నట్టు సమాచారం. రైతు శేఖర్ టైమ్ బాగుండి బతికిపోయాడు. ఈ మొసలిని జూరాల జలాశయంలో విడిచిపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జగన్ సంతాప సందేశం!

ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్ చేసి చూస్తే, అదేదో జగన్ ఎవరికో సంతాప సందేశాన్ని తెలియజేస్తున్న కార్యక్రమంలా అనిపించడం ఖాయం. ఎందుకంటే, మేనిఫెస్టో విడుదల కార్యక్రమం అంటే, ఆ పార్టీ నాయకుడిలో ఎంత ఉత్సాహం వుండాలి? ఎంత ఆత్మవిశ్వాసం ప్రతిఫలించాలి? ఈ నాయకుడు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా వుండాలి. కానీ, జగన్‌లో అవేవీ కనిపించలేదు. ఏదో మేనిఫెస్టో విడుదల చేశామంటే చేశాం.. జనం నమ్మితే నమ్మారు లేకపోతే లేదు.. ఓట్లు వేస్తే వేశారు లేకపోతే లేదు అన్నట్టుగా ముఖ కవళికలు వున్నాయి తప్ప ఎంతమాత్రం జోష్ కనిపించలేదు. జగన్ ఇలా తద్దినం పెట్టినట్టుగా మేనిఫెస్టో చదవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఏపీలో వార్ వన్ సైడ్.. అది కూడా టీడీపీ సైడ్ అయిపోయిందని జగన్‌కి ఇప్పటికే అర్థమైంది. ఇప్పుడు తాను, తన పార్టీ వాళ్ళు పడుతున్న తంటా అంతా ఎందుకూ పనికిరాదని ఆయనకి అర్థమైపోయింది. అందుకే ఆగిపోయే పెళ్ళికి మంత్రాలెందుకన్నట్టుగా మేనిఫెస్టో కార్యక్రమాన్ని ముగించారు.