వార్డు మెంబర్‌గా గెలవని వారు.. ఓట్ల చోరీ అంటున్నారు : బండి సంజయ్

  కాంగ్రెస్ నాయకులది బిచ్చగాళ్ల బతుకు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ముస్లీంల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకుని నమాజ్ చేస్తారు. మేం అలా కాదు. నేను   కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా కేవలం హిందూ ఓటు బ్యాంక్ ద్వారనే గెలిచానని గల్లా ఎగిరేసి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటూ తయారు చేస్తామని బండి సంజయ్ తెలిపారు.  ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం. కరీంనగర్‌లో ప్రతి ఓట్లు తీసేయాలి. దొంగ ఓట్లు అంటూ చేసే దుప్ఫ్రచారం ప్రజలను అవమానంచడమేన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శిస్తున్నరని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి  అధికారంలోకి  వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్‌ చేశారు. కరీంనగర్‌లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్‌ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు బీజేపీకీ వస్తాయని ప్రశ్నించారు.

భయానకంగా భౌ- భౌ...బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు

  బౌ..బౌ మనే శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల తో గ్రామాల నుంచి పట్టణాల దాకా భయోత్పాతం సంతరించుకొంటోంది. కాలనీలు, వీధుల్లో వీటి అరుపులు వినిపిస్తేనే అలజడి  రేగుతోంది. వెంటపడి కరవడం, కాట్లు చేయడంతో ప్రాణాంతకంగా మారింది. వీధి కుక్కల బెడదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం వేయడం కూడా నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవాలని ఈనెల 22న ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా వీటి అలజడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 3.50 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి కాట్లతో  ర్యాబిస్ వ్యాధికి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీటితో భయానకమే అవుతుంది. *కడపలో లోనే 14376 మందికి కుక్క కాట్లు వీధి కుక్కల స్వైర  విహారం ప్రజలను భయపెడుతోంది. ఒక కడప జిల్లాలోనే ఇంచుమించు రెండున్నర ఏళ్ల కాలంలో 14376 మంది కాటేశాయంటే ఏ స్థాయిలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయో ఊహించవచ్చు. జిల్లాలో 2023లో 5485 మందిని, 2024 లో 5549 మందిని 2025 ఇప్పటివరకు 3342 మందిని వీధి కుక్కలు కాటేశాయి.  అంటే సగటున సుమారు 400 మందిని నెలకు కుక్కలు కాటేస్తున్నాయి. ఇది అధికారులు అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా అయితే ఇంతకు మూడింతలు గా కుక్క కాట్లు తప్పడం లేదు. కుక్కకాటు గురైన కొందరు దానిపై అవగాహన లేకపోవడం, చిన్నచిన్న గాయాలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం లాంటి కారణాలతో ఇవి పూర్తి గా నమోదు కావడం లేదు. నిజంగా అన్ని నమోదు అయితే నెలకు 1500 కు పైమాటే అని అధికారులే అనధికారికంగా చెబుతున్న మాటలు. *పెంపుడు కుక్కలూ కాటేస్తున్నాయి వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలూ(పెట్ డాగ్స్)కాటేస్తున్నాయి. వీటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి . ఒక అంచనా ప్రకారం  నెలకు సుమారు 200 మందిని పెంపుడు కుక్కలు కూడా కాటేస్తున్నాయి. యజమానుల కుటుంబ సభ్యులు,వారి ఇంటికి వచ్చేవారు, చుట్టుపక్కల వారికి వీటి తో  ఏర్పడుతోందని చెప్పుకొస్తున్నారు. దీంతో కుక్కలు పెంచుకునే యజమానులు వాటిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది *ఒకే రోజు 27 మందిని కాటేసిన ఒకే కుక్క  బద్వేల్ పట్టణంలో ఓ కుక్క భయానక వాతావరణాన్ని సృష్టించింది. కుక్కల్లో ఆవేశపూరిత కుక్కలు ,పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ కుక్క బద్వేల్ లో ఈ ఏడాది మే 26న 27 మందిని కాటేసి కలకలం రేపింది .దీంతో బద్వేలు వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి కుక్కలు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవాలి *నివేదిక కోరిన డిల్లీ  బద్వేల్ లో ఒకేరోజు 27 మందిని కాటేసిన కుక్క వ్యవహారంపై ఢిల్లీలోని సెంట్రల్ మీడియా స్కానర్ రాష్ట్ర వైద్య శాఖను నివేదిక కోరింది. ఆ వీధి కుక్క ఎంతమందిని కాటేసింది. వారికి వ్యాక్సిన్స్ వేశారా, చికిత్స చేశారా,వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలతో నివేదిక కోరడం జరిగింది .ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు బద్వేల్ కు వెళ్లి వ్యాక్సిన్ విచారణ చేసి అందుబాటులో ఉన్నాయి, వీరందరికీ వ్యాక్సిన్ చేశారని నివేదిక పంపడం జరిగింది. *ఇద్దరు మృతి   కడప జిల్లాలో రాబిస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున మనషులపై  పై దాడి చేస్తునన్నా  గాయాలు కావడం వైద్యం చేయించుకోవడంతో బయటపడుతున్నారు .ఒకటి రెండు చోట్ల ర్యాబిస్ కారణంగా మృత్యువాత పడ్డారు .2003 వ సంవత్సరం పులివెందులలో ఒకరు 2024లో కడపల ఒకరు మృతి చెందారు. వీధి కుక్కల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు దేశమంతా వీటి వ్యవహారం చర్చ అంశంగా మారింది *సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా! వీధి కుక్కల వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం  ఢిల్లీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.వీధి కుక్కలకు  స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వదిలేయాలని, వ్యాధులు ఆవేశపూరిత  ప్రవర్తన కలిగిన కుక్కలను షెల్టర్ కు తరలించాల్సిందేనని, బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరంగానూ, ఉల్లంఘనగాను పేర్కొంది .వీధుల్లో ఆహారం పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జంతు  ప్రేమికులు వీధి కుక్కలను  దత్తత  తీసుకోవచ్చు కానీ మళ్ళీ వాటిని మళ్ళీ వీధుల్లో వదిలేయ కూడదని సూచించింది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రియల్ టైం పరిశీలన కోసం ప్రత్యేక డ్యాష్  బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబరు నెల నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అయనా మున్సిపాలిటీలు, పంచాయతీలో వీధి కుక్కల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అధికారులపై ఉంది.  

ఏపీలో భారీ వర్షాలపై..హోం మంత్రి అనిత సమీక్ష

  బంగాళాఖతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లా స్ధాయి అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.  సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని  హోం మంత్రి  ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశా నిర్దేశం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.  మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఎడతెరిపి లేని వర్షాలకు పంట నష్టం నివారణకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

కుక్కలతో విసిగిపోయి... ఢిల్లీ సీఎంపై దాడికి ప్రయత్నం

  తన ఇంటి దగ్గర ఊర కుక్కల బెడద పెరిగిందని ఒక దుండగుడు గతవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై  దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజున నిందితుడు కత్తితో దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్‌ను అరెస్ట్ చేశారు.  విచారణలో అతడు సంచలన విషయాలను బయటపెట్టాడంట. నిందితుడు సకారియా పోలీసుల విచారణలో సీఎంపై దాడికి గల కారణాన్ని వెల్లడించాడంట. తమ ప్రదేశంలో వీధి కుక్కల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ.. సరైన స్పందన లేకపోవడంతో అసహనం కలిగి దాడి చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. ఘటన రోజు కత్తితో పొడిచి చంపాలని ప్లాన్ చేసుకుని బయల్దేరాడు.  కానీ, నిందితుడు సీఎం అధికారిక నివాసానికి చేరుకోక ముందు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లాడు. అక్కడ భారీ భద్రతా వ్యవస్థను గమనించి తన దాడి ప్రణాళికను విరమించుకున్నానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సీఎంపై దాడి కేసుకు సంబంధించి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని రెండవ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రధాన నిందితుడు సకారియాకు స్నేహితుడు. ఘటన జరిగిన రోజు తహసీన్ ప్రధాన నిందితుడితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.  అంతేకాదు.. ఆర్థికంగా సహాయం చేసినట్లు సమాచారం. తహసీన్ మొబైల్ ఫోన్ నంబర్ కాల్ వివరాలు, ఐపీడీఆ, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల ఆధారంగా పోలీసులు నిందితుడి పాత్రను కనుగొన్నారు. ఆగస్టు 20న సివిల్‌ లైన్స్‌లోని సీఎం కార్యాలయం వద్ద సీఎం రేఖా గుప్తా ‘జన్‌ సున్వాయ్‌’’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముసుగులో వచ్చిన ఓ దుండగుడు హఠాత్తుగా సీఎంపై దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా పత్రాలను చేతికందిస్తూ.. కేకలు వేస్తూ ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కట్టాడు. రెప్పపాటులోనే ఆమెను వెనక్కు తోసి జుట్టు గట్టిగా పట్టుకుని లాగాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  ఈ దాడిలో సీఎం తల, చెయ్యి, భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఇటీవలే జడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా ఆ భద్రతను ఉపసంహరించింది. మునుపటి తరహాలో ఢిల్లీ పోలీసులే సీఎం భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి కల్పించిన జెడ్ కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇకపై ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత కల్పించనున్నారు.  

ఏపీ, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది.  విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్షసూచన చేసింది. రేపు (బుధవారం) విశాఖపట్నంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది విశాఖలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ విభాగం పేర్కొంది.  శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుండటంతో చాపరాయి సందర్శనను నిలిపివేశారు.  ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నాది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

యూరియా కొరతపై రైతులకు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

  రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రైతాంగానికి బహిరంగ లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లేఖలో తుమ్మల ఆరోపణలు చేసారు. మరోవైపు యూరియాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేనందుకు నిర్ణయం తీసుకుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇష్యూ చేసింది. బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేసింది. తద్వారా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం లభించనుంది. యూరియా కోసం రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఎరువుల కేంద్రం వద్ద  రైతులు పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశాస్తున్నారు. 

జ‌గ‌న్ సార్ జ‌గ‌న్ అంతే!

  క‌నీసం కులాభిమానం కూడా లేదా? జ‌గ‌న‌న్నా.. నువ్వా కులపోడివే కావా? అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.. అజాత శ‌తృవు సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిపై జ‌గ‌న్ కి ఎనిమిదేళ్ల నాటి ప‌గ ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. అందువ‌ల్లే జ‌గ‌న్ తానెంతో ఖాళీగా బెంగ‌ళూరు ఎల‌హంక ప్యాలెస్ లో ప‌డి ఉన్నా నివాళి అర్పించ‌డానికి రాలేద‌ని అంటున్నారు. త‌నపై కాంగ్రెస్ అక్ర‌మ కేసులు పెట్టింద‌ని, త‌న పార్టీ నుంచి టీడీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశార‌ని మ‌ద్ద‌తు అడ‌గ‌టానికి ఢిల్లీలో సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిని క‌ల‌వ‌డానికి పార్టీ నాయ‌కుల‌తో స‌హా వెళ్లారు జ‌గ‌న్.. సుర‌వ‌రం మ‌ద్ద‌తు ఇచ్చారా లేదా? అటుంచితే ఆయ‌న జ‌గ‌న్ తో త‌ప్ప అంద‌రికీ క‌ర‌చాల‌నం చేశారు. ఈ ఘ‌ట‌న అత్యంత దారుణ‌మైన అవ‌మానక‌ర‌మైన‌ ఘ‌ట‌న‌గా త‌న‌మైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు జ‌గ‌న్. ఆ త‌ర్వాత ఎప్పుడూ సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిని క‌ల‌వ‌లేదు జ‌గ‌న్. రాజ‌కీయంగా ఎంతో సైద్ధాంతిక వైరుధ్యం గ‌ల బీజేపీకి చెందిన వారెంద‌రో సుర‌వ‌రంకి నివాళి అర్పించ‌డానికి వ‌చ్చారు. చివ‌రికి వెంక‌య్య‌నాయుడు వంటి బీజేపీ కురువృద్ధులు కూడా వ‌చ్చి తెలుగు క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, రెండు సార్లు ఎంపీ, సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి అయిన సుర‌వ‌రం కి నివాళులు అర్పించ‌డానికి వ‌చ్చారు. కానీ జ‌గ‌న్ మాత్రం రాలేదు. అప్ప‌టికీ జ‌గ‌న్ కి ఈ విష‌యం తెలియ చేసినా తాను రాన‌ని తెగేసి చెప్పారట‌ జ‌గ‌న్. అయినా చ‌నిపోయిన వాళ్ల‌తో కూడా శ‌తృత్వం ఏంటి జ‌గ‌న‌న్నా! అంటూ వారు లోలోప‌ల బాధ ప‌డ్డా ఆయ‌నైతే ఖ‌రాకండిగా రాన‌ని చెప్పేశార‌ట‌. దీంతో పార్టీ త‌ర‌ఫున‌..  అయోధ్య రామిరెడ్డి, మేకపాటి రాజమనోహర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రం హాజరయ్యారు. అదే సమయంలో ఈ విషయాలేవీ తెలియని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్, జగన్ పేరిట మొక్కుబ‌డిగా ఒక సానుభూతి ప్రకటన రిలీజ్ చేయ‌డంతో స‌రిపెట్టారు.  తాను సీఎంగా ఉండ‌గా మ‌ర‌ణించిన మాజీ సీఎం రోశ‌య్య మీద కూడా స‌రిగ్గా ఇలాగే కోపం చ‌ల్లార‌ని జ‌గ‌న్  భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించడానికి  ససేమిరా అన్నారు. క‌డ‌సారి చూపున‌కూ రాకుండా మొహం చాటేశారు జ‌గ‌న్.జ‌గ‌న్ అంతే.. ఆయ‌న‌కు క‌నీస రాజ‌కీయ విచక్ష‌ణా జ్ఞానం కానీ, హుందా త‌నంగానీ, ఒక రాజ‌కీయ అవ‌గాహ‌న కానీ లేవ‌ని అంటారు..

డ్రగ్స్‌ పార్టీ..డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్

    డ్రగ్స్‌ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన పుట్టిన రోజులు వేడుకల్లో యువకులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఈగల్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టరంట్‌ డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. వారి నుంచి 20 గ్రాములు కోకైన్, నాలుగు గ్రాములు ఎండీఎంఎ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో డిప్యూటీ తహసీల్దార్‌ ఉండటం చర్చనీయాంశమైంది.  

ఏపీ ఉప సభాపతి రఘురామకు భారీ ఊరట

  ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి  రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లోక్ సభ సభ్యుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ బాషాపై దాడి చేశారంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ ఆయన కుమారుడు భరత్‌, కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది.  అయితే ఆ కేసును ఇకపై కొనసాగించుకోదల్చుకోలేదని కానిస్టేబుల్‌ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ జేకే మహేశ్వరి ధర్మాసనం.. రఘురామ, ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2022లో రఘురామరాజు ఇంటి వద్ద కానిస్టేబుల్‌ బాషాపై దాడి జరిగిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.  

ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్‌

  తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా వర్సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ, ఉస్మానియా, తెలంగాణ  అవిభక్త కవలలు అని సీఎం పేర్కొన్నారు. ఓయూలో  రూ.90 కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  దుందుభి, బీమా హాస్టల్ భవనలను ప్రారంభించి డిజిటల్‌ లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. పీవీ నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కారస్వరం వినిపించారు. మర్రి చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దరన్నను అందించిన నేల ఇది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందని సీఎం రేవంత్ తెలిపారు.  ఈ ఉస్మానియా వర్సిటీకీ గొప్ప చరిత్ర ఉంది. వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. ఓయూలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం ఉంది. దేశానికి అతిపెద్ద సంపద యువతే అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయినా.. ఎందుకు అంత శునకానందం మీకు అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం మండి పడ్డారు. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి. డిసెంబర్‌లో ఆర్ట్స్‌ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసును కూడా క్యాంపస్‌లో ఉంచొద్దని ముఖ్యమంత్రి అన్నారు.  ఒక వేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా. ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్‌ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, వేం నరేందర్‌రెడ్డి, కోదండరామ్‌, ఓయూ వీసీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. .

ఈ విజ‌య‌ ద‌శ‌మికి మందు ముక్కా లేవుగా ఎందుకంటే!?

  మొన్న ఆగ‌స్ట్ 15, 16, 17 మూడు రోజుల సెల‌వులు మూకుమ్మ‌డిగా రావ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక పోయింది మ‌న బాల స‌మాజం. కార‌ణం ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఆగ‌స్ట్ 16 సెకండ్ శాట‌ర్ డే, ఆపై ఆగ‌స్ట్ 17 సండే. ఈ మూడు సెల‌వుల‌తో ఇటు పేరెంట్స్ కి పిల్ల‌ల ప‌రేషాన్- అటు పిల్ల‌లు చూస్తే దిల్ ఖుష్ అయిపోయారు. ఈ ఆనందం ఆవిరి చేయ‌డానికా అన్న‌ట్టు ఈ సారి వ‌చ్చే ద‌స‌రా అక్టోబ‌ర్ 2న వ‌చ్చింది. దీంతో రెండు సెల‌వులు కాస్తా ఒక సెల‌వుగా మారింది. మాములుగా అయితే మ‌నకు అధికారికంగా విజ‌య‌ద‌శ‌మి, గాంధీ జ‌యంతి రెండు వేర్వేరు సెల‌వులు. చిత్ర‌మైన విష‌య‌మేంటంటే.. ఈ రెండూ ఒకే రోజు రావ‌డంతో ఒక సెల‌వు కాస్తా ఎగిరిపోయింది. సెల‌వు సంగ‌తి అలా ఉంచితే కొంద‌రు విజ‌య‌ద‌శ‌మికి క‌క్కా ముక్కా భారీ ఎత్తున ప్లాన్ చేస్తారు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ క‌ల్చ‌ర్‌లో  దావ‌త్‌లు  పెద్ద ఎత్తున న‌డుస్తాయ్. మందు విందు పొంగిపొర్లుతాయి. ఆ రోజు గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో పాపం.. ఈ మందుబాబుల‌కు చ‌చ్చేంత ప‌నొచ్చింది.  బేసిగ్గా ఈ విజ‌య‌ద‌శ‌మి- గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఆ రోజు ముక్క ముట్ట‌క పోవ‌డ‌మే మంచిద‌ని భావిస్తారు. ఎందుకంటే గ‌తంలో సీపీఐ నారాయ‌ణ స‌రిగ్గా ఇలాగే.. గాంధీ జ‌యంతి రోజున చికెన్ తిని అడ్డంగా బుక్ అయిపోయారు. దీంతో పండ‌గ సంద‌డి కాస్తా ఆవిరైంద‌న్న ఆలోచ‌న ఫీలింగ్ లో  ఇటు చిన్నా పెద్ద ప‌డిపోవ‌డం క‌నిపిస్తోంది.

వేణు స్వామిని కామాఖ్య టెంపుల్‌లో బ‌య‌ట‌కు తోసింది నిజ‌మేనా?

  ఈ మ‌ధ్య కాలంలో మ‌నం అరుణాచ‌లానికి ఎక్కువ‌గా తెలుగు వారు వెళ్తున్న దృశ్యం చూసే ఉంటాం. ఇందుకు కార‌ణం చాగంటి ప్ర‌వ‌చ‌నాలు. ప్ర‌స్తుతం ఏ యూట్యూబ్‌లో చూసినా, ఏఎఫ్ఎం రేడియో విన్నా.. ఏ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ప‌రిశీలించినా ఎక్కువ‌గా క‌నిపించేది చాగంటి ప్ర‌వ‌చ‌నాలే.  చాగంటి త‌న ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాల్లో భాగంగా అరుణాచ‌లం గురించి చెప్పిన ఒకానొక విధం తెలుగు వారికి బాగా అనిపించి.. ఈ మ‌ధ్య చిన్నా పెద్ద‌ అనే తేడాల్లేకుండా అంద‌రూ క‌ల‌సి.. భారీ ఎత్తున అరుణాచ‌లం వైపు వెళ్తున్నారు. చాలా చాలా విచిత్ర‌మేంటంటే.. యువ‌త ఎక్కువ‌గా అరుణాచ‌లం వ‌చ్చి ఇక్క‌డి గిరి ప్ర‌ద‌క్షిణం ఎలా చేయాలో తెలుసుకుని మ‌రీ చేస్తున్నారు. ఇక్క‌డి ర‌మ‌ణ మ‌హ‌ర్షి వంటి ఆశ్ర‌మాల‌తో స‌హా ఎన్నో వింత‌లూ విశేషాల‌ను ద‌ర్శించి త‌మ బిజీ లైఫ్ లోంచి కాస్త ఉప‌శ‌మ‌నం వెతుక్కుంటున్నారు. కానీ వేణుస్వామి లాంటి వారు కొంద‌రుంటారు. ఇలాంటి వారి వ‌ల్ల లాభాల‌క‌న్నా న‌ష్టాలే ఎక్కువ‌ని అంటారు. రీసెంట్‌గా  ఆయ‌న నిధి అగ‌ర్వాల్ కి కూడా ఏదో తాంత్రిక పూజ చేశారు. ఆమె కెరీర్ మూడు హిట్లు- ఆరు ఆఫ‌ర్లు కావాల‌ని. ఎప్పుడైతే ఆమె అలా పూజ చేసుకుందో లేదో వెంట‌నే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పోయింది. స‌రే, పోతే పోయింద‌ని భావించే లోపు.. అధికారిక వాహ‌నం వివాదం ఒక‌టి రాజుకుంది. చివ‌రికి దానిపై తానే స్వ‌యంగా క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్ గా రాజాసాహెబ్ ఉందిలే అన్న ఆశ‌తో ప్ర‌స్తుతం నిమ్మ‌ళంగా ఉంది. ఇక వేణుస్వామి కార‌ణంగా పోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌నే మ‌ళ్లీ గెలుస్తాడ‌ని ఇత‌డు చెప్పిన జోశ్యం నిజ‌మ‌ని న‌మ్మిన కొంద‌రు.. చివ‌రికి బెట్టింగులకు పాల్ప‌డ్డారు. భారీ ఎత్తున డ‌బ్బు పెట్ట‌డంతో అవి కాస్తా పోయాయి. దీంతో కొంద‌రు కోట్ల రూపాయ‌ల న‌ష్టాల పాలై.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప‌రిస్థితి. ఇక రీసెంట్ గా వేణు స్వామి కామాఖ్య వెళ్తే అక్క‌డి పూజారులు ఇత‌డ్ని గుర్తించి మ‌రీ బ‌య‌ట‌కు గెంటేశారన్న వీడియోలు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై తెగ ట్రోల‌వుతున్నాయి. కార‌ణం వేణు స్వామి కామాఖ్య ఆల‌యం గురించి చెప్పిన విదం అలాంటిదని అంటారు. ఒక వీడియోలో అయితే ఆయ‌న అంబానీ ఫ్యామిలీ వంద మేక‌లు, పావురాళ్ల‌ను బ‌లిచ్చార‌ని చెప్ప‌డంతో.. ఇదొక సంచ‌ల‌నంగా మారింది.  దీంతో కొంద‌రు కామాఖ్య ఒక తాంత్రిక శ‌క్తిపీటంగా భావించి ఇక్క‌డికి వ‌చ్చి బ‌లులు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.  నిషేధ‌మైన బ‌లుల సంప్ర‌దాయాన్ని వేణుస్వామిలాంటి కొంద‌రు తాంత్రిక స్వాములు తిరిగి రెచ్చ‌గొడుతున్నార‌ని తెలుస్తోంది. కామాఖ్య పూజారులు ఈ విష‌యం గుర్తించి ఇటీవ‌ల ఆ ఆల‌యానికి వెళ్లిన వేణు స్వామిని వారు లోప‌లికి రానివ్వ‌లేద‌ని తెలుస్తోంది.

హస్తం నేతల నోట... ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం

    బీజేపీ మాతృ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఆర్ఎస్ఎస్’ పై ఆయన కారాలు మిర్యాలు కాదు ఏకంగా నిప్పులే చెరుగుతారు. అంతే కాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్’ లపై బహిరంగంగా యుద్దాన్నే ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంతమొందించే వరకు, తమ సైధాంతిక పోరాటం కొనసాగుతుందని కూడా రాహుల్ గాంధీ, పదే పదే చెపుతూవస్తున్నారు.  ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సంధ్రభంగానూ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు,ఇది గెలుపు ఓటముల సంగ్రామం కాదు సైద్ధాంతిక పోరాటం’ గా పేర్కొంటున్నారు.  నిజానికి, రాహుల్ గాంధీమ ఒకటి రెండుసార్లు కాదు, వందల సార్లు ‘ఐ హేట్ ఆర్ఎస్ఎస్’,అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా, రాహుల్ గాంధీ తమ వ్యతిరేకతను, ద్వేషాన్ని ఏ కొంచెం దాచుకోలేదు.  నిజానికి, రాహుల్ గాంధీని మీరు బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్’ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా, ఆయన నోటి నుంచి ఆర్ఎస్ఎస్’ అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన, బీజేపీ, ఆర్ఎస్ఎస్’లతో పాటుగా దేశం పైన, సనాతన ధర్మపై  కూడా  ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా,రాహుల్ గాంధీ భగ్గుమంటారు, వంద ఓటములకు అయినా సిద్ధమే కానీ,ఆర్ఎస్ఎస్’ భావజాలంపై యుద్ధం మాత్రం ఆగదని అంటారు.  కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్’ (ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు)తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు, ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్’ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును..‘మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే,,మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్’ సరదాగా అడిగిన ప్రశ్నను రాహుల్ గాంధీ చాలా సీరియస్’గా  తీసుకున్నారు. తాను (రాహుల్) అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు.  మా ముత్తాత నెహ్రూ కలలో కనిపిస్తే.. ‘నేను జీవితంలో ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని’సమాధానం ఇచ్చారు .అంతే కాదు, ఆవెంటనే, తన ప్రశ్నకు నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ,’, ఆర్ఎస్ఎస్’తో ఎప్పుడు రాజీ పడద్దు’ అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనక జన్మజన్మల వైరం ఏదో ఉందని పిస్తుంది. అలాగే,ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో, ఆ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా, అర్థం అవుతుంది. అంతే కాదు, కొంతకాలం క్రితం గుజరాత్’ లో పర్యటించిన సందర్భంగాను రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లోని ఒక వర్గం, బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో కుమ్ముక్కైందని, అలాంటి వారిని ఏరి వేస్తామని  హెచ్చరించారు.  అంటే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్’ ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో వేరే చెప్పనక్కర లేదు. అయినా, కొన్ని నెలల క్రితం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ కార్యకర్తలు,ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అడుగుజాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు.  అదలా ఉంటే ఇప్పుడు, పొరుగు రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్’లోని ఒక వర్గం ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల ఆకర్షితులు అవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏకంగా అసెంబ్లీలో, ఆర్ఎస్ఎస్’ ప్రార్ధన గీతం ( నమస్తే సదా వత్సలే మాతృ  భూమే..)  ఆలపించారు.అంతే కాకుండా, ఆర్ఎస్ఎస్ పనితీరును అధ్యయనం చేస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నడుపుతున్న పాఠశాలలు బాగున్నాయని, మెచ్చుకున్నారు. అదలా ఉంటే తాజగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్’డి రంగనాథన్’  తమ సొంత నియోజక వర్గం తునుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో,డీకే అడుగుజాడల్లో ఆర్ఎస్ఎస్, ప్రార్థన గీతాన్ని అలపించడమే కాకుండా, అర్థ తాత్పర్యాయాలను, విడమరిచి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రార్ధనా గీతంలో తనకు తప్పేమీ కనిపించలేదని, జన్మ భూమికి వందనం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇక ఆర్ఎస్ఎస్’ బడిలో, టీడీపీ కాలేజీలో, చదువుకుని, కాంగ్రెస్ పార్టీలో కొలువు చేస్తున్నాని స్వయంగా  చెప్పుకున్న రేవంత్ రెడ్డి గురించి వేరే చెప్పనక్కర లేదు.   అయితే,ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా  మీనాక్షి నటరాజాన్ మొదలు,డీకే శివకుమార్ వరకు, డీకే మొదలు,కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథన్’వరకు కాంగ్రెస్’ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా  ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు మొగ్గు చూపడం లేదా లేదా కొంత సానుకూలంగా స్పందించడం దేనికి సంకేతం ? అన్నిటిని మించి ఈ ఇంటి మీద వాలిన కాకి ఆ ఇంటి మీద వాలరాదన్నట్లుగా ఆర్ఎస్ఎస్’ ద్వేషించే కాంగ్రెస్ సుప్రీం బాస్ రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు, అనేది మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో లేడీ కిలాడీ అరెస్టు

  డ్రగ్స్ సరఫరా చేసే స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అన్వే షించి... డ్రగ్స్ రవాణా చేసే విధా నాన్ని చూసి కస్టమ్స్  అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయినా కూడా అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరా చేసే వారినిపట్టుకుని కటకటాల వెనక్కి పంపించే వరకు ఊరుకోవడం లేదు... వారు వేసిన  ఎత్తులకు కస్టమ్స్ అధికారులు పై ఎత్తులు వేసి వారి ప్లాన్లను చిత్తు చేసి... శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు  ఢిల్లీలో దిగిన ఓ లేడీ లాడి తన లగేజీని తీసుకొని జోరుగా, హుషారు గా వెళ్తున్న సమ యంలో... ఎందుకో కానీ కస్టమ్స్ అధికారులకు ఆ లేడీ కిలాడి మీద అనుమానం వచ్చింది... వెంటనే ఆమెను అదుపు లోకి తీసుకొని ఆమె లగేజ్ను చెక్ చేశారు. లగేజ్ లో ఉన్న చాక్లెట్లను చూసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దోహా నుండి ఢిల్లీకి వచ్చే ఓ లేడీ కిలాడీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా ఎంతో జాగ్రత్తగా గోల్డ్ కలర్ చాక్లెట్స్ 8 Ferrero Rocher చాక్లెట్ బాక్స్ లో కొకైన్ నింపి.. బ్యాగులో పెట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగింది.  చూస్తే అచ్చం చాక్లెట్ గా కనిపించే కొకైన్ నింపి ఉన్న వాటిని చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. అనంతరం వెంటనే కిలాడి లేడిని అదుపు లోకి తీసుకొని ఆమె వద్ద ఉన్న 82 కోట్ల విలువ చేసే 5.5 కేజీల కొకైన్ స్వాధీనం చేసు కున్నారు. అసలు ఈ లేడీ ఎవరికోసం డ్రగ్స్ తీసుకొచ్చింది ఎక్కడినుండి తీసుకువచ్చింది అనే కోణంలో ఎండిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

లోన్ కోసం సిబిల్ అవసరం లేదు : కేంద్ర ప్రభుత్వం

  లోన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.  మీరు తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే, మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా బ్యాంకులు మీ అప్లికేషన్ను రిఫ్యూ చేయలేవు. దీన్ని బట్టి చూస్తే, మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోర్ లేకపోయినా భయపడాల్సిన పని లేదు..!! కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఇటీవల లోక్‌సభలో జరిగిన మాన్సూన్ సెషన్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటిసారిగా లోన్ కోరే వారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్‌ను తిరస్కరించకూడదని  ఆర్‌బీఐ తమ మార్గదర్శకాలలో తెలిపింది. సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి లోన్ తీసుకునే అర్హతను సూచిస్తుంది. ఈ స్కోర్‌ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అందిస్తుంది. సాధారణంగా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే, మొదటిసారి రుణం తీసుకునేవారికి ఈ స్కోర్ లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

భద్రతా వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ

  నేడు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి  పర్యటించనున్నారు. క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు – ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతోపాటు నిరుద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  యూనివర్సిటీ మొత్తం ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు  సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకు? అని మండిపడ్డారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకని, విద్యార్థులేమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు.  ఓయూ  మెయిన్ గేట్ నుండి 3 కిలోమీటర్లు కాలి నడకన పలు సెక్యూరిటీ తనిఖీలు దాటుకొని వచ్చిన మీడియా ప్రతినిధులను ఠాకూర్ ఆడిటోరియం వద్ద పోలీస్ అధికారులు  నిలిపివేశారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కేవలం తమ అనుకూల మీడియాకు మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని ఆపేస్తున్నారని జర్నలిస్టులు వాపోయారు. ఈ మాత్రం దానికి ఎంట్రీ పాసులు ఎందుకు ఇచ్చారంటూ మీడియా ప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.