రష్యాలో ఉల్క భీభత్సం: 1000మందికి గాయాలు
posted on Feb 16, 2013 @ 10:00AM
అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఓ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయి రష్యాలో బీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 3 వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. సుమారు 1000మందికి పైగా గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో 200మంది చిన్నారులున్నారు.
"జనావాసాలపై భారీ శిలలు పడనందుకు దేవుడికి కృతజ్ఞతలు'' అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశారు. దాదాపు 20వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి.
బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు. ఇక ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.