తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

      తెలంగాణ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కనుగొనేందుకు మంత్రుల బృందం ఏర్పాటు అవుతుందని చెప్పారు. నీటి సమస్య, ఆదాయాలు,అప్పులు, ఇతర సమస్యలపై మంత్రుల కమీటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని షిండే తెలిపారు. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ నోట్ ఇప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళుతుంది. ఆయన దానిని శాసనసభ ఆమోదానికి పంపిస్తారు. కాని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపించే ఆదేశాలలో కేవలం అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటారు గాని అసెంబ్లీ ఆమోదానికి ఎదురుచూడరని తెలుస్తున్నది.

కేబినెట్ ముందు తెలంగాణ నోట్

        తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. కేంద్ర కేబినెట్ భేటీ గురువారం సాయంత్రం 5-30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 14 మంది మంత్రులు, 37 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, పల్లం రాజులు హాజరయ్యారు. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ మాతృ వియోగంతో సమావేశానికి గైర్హాజరయ్యారు.     అయితే కేబినెట్‌లో నోట్‌ను వ్యతిరేకిస్తామని కావూరి సాంబశివరావు తెలిపారు. మిగిలిన మంత్రుల అభిప్రాయాలు వింటామని అన్నారు.  ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నోట్ పై షిండే సంతకం పెట్టారు

      తెలంగాణ నోట్ మధ్యాహ్నం కొంత గందరగోళంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి షిండే సాయంత్రానికి నోట్ పై సంతకం చేశారు. హోంశాఖ నోట్ కు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కేబినెట్ నోట్ మీద సంతకం చేశారు. అనంతరం తెలంగాణ నోట్ లను కేంద్రమంత్రులకు పంపించారని తెలుస్తోంది. దీంతో ఉదయం నుండి తెలంగాణ నోట్ మీద నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయినట్లే. కాగా సీమాంద్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు క్యాబినెట్ నోట్ పై ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ తన తల్లి మరణం కారణంగా ఆయన డిల్లీలో లేరు. ఈ ఇద్దరు మంత్రులు వ్యతిరేకమైనా, పెద్ద ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ నెల ఇరవై లోపు శాసనసభకు ఈ తీర్మానం రావచ్చని అంటున్నారు.

దాణా స్కాం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష

      దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ళు శిక్షపడింది. ఆయనకు పాతిక లక్షల జరిమానా కూడా విదించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు: దిగ్విజయ్

      తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు వెలుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని...తెలంగాణకు కట్టుబడి వున్నామని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని తెలంగాణ,సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారని, అందరిని సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేబినెట్ నోట్ కు, ఆంటోనీ కమిటీకి సంబంధం లేదన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు కేబినెట్ నోట్ ఆగుతుందని తాము చెప్పలేదన్నారు. విభజన అనంతరం సీమాంద్రలో తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి కమిటీ రాష్ట్రానికి వచ్చే వరకు వేచిచూడాలన్నారు.

తెలంగాణ నోట్ లోని విశేషాల స్పెషల్..!

      తెలంగాణకు సంబంధించి ఇప్పుడే రాదని అనకున్న తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణపై కేబినెట్ నోట్ ను సిద్ధం చేశారు. సోనియా గాంధీ సూచనల్ని అనుసరించి హోంమంత్రిత్వ శాఖ 22 పేజీల నోట్ ను తయారు చేసింది. నోట్ లో కొన్ని ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించారు. ఆర్టికల్-3 ప్రకారం విభజన జరుగుతుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియ పూర్తవుతుంది.   తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్ సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. అందులో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్ సభ స్థానాల్లో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు. నదీజలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి.

బాబు, మోడీల అంతర్గత చర్చలు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుల మధ్య అనుబంధం పూర్తిగా బలపడినట్లు కనిపిస్తోంది. బుధవారం సదస్సులో వీరిద్దరూ వేదికపైకి కలసికట్టుగా వచ్చి కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో అభివృద్ధి గురించి, కాంగ్రెస్ పార్టీ దోపిడీ గురించి తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు మోడీ ఆసక్తిగా విన్నారు. అంతేకాదు.. వీరిద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలూ దేశ రాజకీయ పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకోవడమే కాక, ఎన్నికల పొత్తులపై కూడా నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే భావసారూప్యం గల పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా ఉదయం సభాస్థలిలో ప్రవేశించినప్పటి నుంచీ ఇద్దరు నేతలూ దాదాపు కలిసే గడిపారు. విద్యార్థులతో మంతనాలు జరిపారు. ఇంచుమించు 8 గంటలపాటు ఇద్దరూ అలా కలిసే గడపడం, పక్కపక్కనే కూర్చోవడం, ఒకర్నొకరు ప్రశంసించుకోవడంతో వారిమధ్య స్నేహం బలోపేతమైందనడానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.

క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్..!

      రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి నోట్ ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కే రాబోతోందని పెద్ద ఎత్తున కధనాలు వస్తున్నాయి. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి మొదలైనవాటిని కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని జాతీయ వార్తా చానెళ్లలో కధనాలు వస్తున్నాయి.

కాంగ్రెస్, వైకాపాల వ్యూహం

  జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమైక్యసభకి సిద్దం అవుతున్నారు. తద్వారా ఆయన ఉద్యోగులలో చీలికలు కూడా తేగలిగారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మె విరమించుకోగానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడేమి చేస్తాడు? అని ఆలోచిస్తే కేసీఆర్ ని అతని కుటుంబ సభ్యులని, తెరాస పార్టీని ఈ సందర్భంగా ఒకసారి తలుచుకోక తప్పదు. తెలంగాణాలో కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ మాటలతో అగ్గి రాజేస్తూ ఇంతకాలంగా తెలంగాణా సెంటిమెంటు తగ్గిపోకుండా కాపాడుకొంటూ ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందగలిగారో, అదేవిధంగా ఇక ముందు సీమంద్రాపై పూర్తి ఆధిపత్యం పొందేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల వరకు సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగించవచ్చును.   ఒకసారి రాష్ట్ర విభజన జరుపుకోవడానికి మార్గం సుగమమం అయిపోయిన తరువాత, వైకాపా సమైక్య ఉద్యమాలు చేసుకోవడాన్నికాంగ్రెస్ కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పైగా అతనిని పరోక్షంగా ప్రోత్సహించవచ్చును. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎలాగు వీలుకాదు కనుక అటువంటప్పుడు కేంద్రంలో తమకు మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాను ప్రోత్సహిస్తే, తద్వారా తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చుకూడా.   ఈలోగా మరికొన్ని డమ్మీ సమైక్య పార్టీలను సృష్టించగలిగితే, వాటి ద్వారా ఓట్లు చీల్చి ఎన్నికల తరువాత ఆ డమ్మీపార్టీలు సాధించిన సీట్లను బట్టి వీలయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో, అక్కడ కేసీఆర్ తో అధికారం పంచుకోగలదు. బహుశః ఈ వ్యూహంతోనే ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లున్నాయి.

సమైక్యం పేరిట విభజన

  జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసుల అనుమతి దొరుకుతుందో లేదో, దొరికినా సభని తెలంగాణావాదులు జరుగనిస్తారో లేదో తెలియదు. కానీ, అతను పన్నిన ఈ వ్యూహంతో ఏపీఎన్జీవోల మధ్య ఊహించినట్లే చీలికలు సృష్టించగలిగాడు. ఇంతవరకు రాజకీయ పార్టీలను దూరంగా ఉంచుతూ ఎంతో ఐకమత్యంగా సమైక్యఉద్యమం చేస్తున్నఎన్జీవోలు, కొందరు అతని సభలో పాల్గోనాలని, మరి కొందరు దూరంగా ఉండాలని నిశ్చయించుకావడంతో చీలికలు మొదలయ్యాయి. హైదరాబాద్ సచివాలయ సీమంధ్ర ఉద్యోగులు, అదేవిధంగా సీమంధ్ర ప్రాంతం నుండి మరి కొంత మంది ఉద్యోగులు ఈ సభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.   గత రెండు నెలలుగా కేవలం ఏపీయన్జీవోలు చేస్తున్న సమ్మె కారణంగానే రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయలేకపోతున్న కేంద్రం, ఇప్పుడు జగన్ వలన వారిలో చీలికలు ఏర్పడితే ఇక త్వరలో తన పని మొదలుపెడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో టీ-బిల్లు క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టి తీరుతామని బల్ల గుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఏపీఎన్జీవోలు తమ సమ్మెను అక్టోబర్ 15వరకు పొడిగిస్తున్నామని ప్రకటించగానే, టీ-బిల్లుని కూడా సరిగ్గా రెండు వారాలకి వాయిదా వేసుకోవడం గమనిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగులు వెనక్కి తగ్గగానే రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు అర్ధం అవుతోంది.   జగన్ సమైక్యాంధ్ర సభ అంటూనే ముందుగాఉద్యోగుల సమైక్యఉద్యమాన్ని దెబ్బతీయడం గమనిస్తే, అతను రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరో వైపు వారికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించేందుకు, ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బొత్స, ఆనం, చిరంజీవి వంటి కొందరు సీమంధ్ర కాంగ్రెస్ నేతలతో పావులు కదుపుతోంది.   అందుకే కుంటి సాకులు చెప్పి టీ-బిల్లుని రెండు వారాలకి వాయిదా వేసుకొంది. బహుశః ఈ రెండు పనులు రాగల 10-15రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. జగన్ హైదరాబాదులో తలపెట్టిన సమైక్య సభ తేదీ (అక్టోబర్ 19)యే ఇందుకు ముహూర్తమేమో?

బామ్మ వేషంలో టిడిపి ఎంపీ

      ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారమెత్తాడు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ముసలి వితంతువు వేషం వేశాడు. విలేకరుల ముందుకొచ్చి తనదైన శైలిలో సమైక్యాంధ్రకకు మద్దతుగా తన వాణి వినిపించాడు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. గాంధీ తాత ఎక్కడ చూసినా కర్ర పట్టుకుని నిలుచుని ఉంటాడని.. ఐతే ఆయన ఆ కర్ర పట్టుకుని వచ్చి సోనియా గాంధీ నెత్తిన ఒక దెబ్బ.. కేసీఆర్ ముఖం మీద మూడు దెబ్బలు కొట్టాలని.. అప్పుడైనా వాళ్ల బుద్ధి మారుతుందని అన్నారు. డీకే అరుణ కూతురిని నెల్లూరు వాసికిచ్చి పెళ్లి చేసిందని, గీతా రెడ్డి భర్తది కర్నూలని, సబితా ఇంద్రారెడ్డి కోడల్ని తూర్పు గోదావరి నుంచి తెచ్చుకుందని, మల్లు రవి.. కోనేరు రంగారావు కూతుర్ని చేసుకున్నాడని.. కేసీఆర్ ది విజయనగరమని.. కేటీఆర్ భార్య కాకినాడ అమ్మాయి అని చెప్పారు. ఇప్పుడు వీళ్లంతా విడిపోతారా.. సీమాంధ్రతో సంబంధాలు తెంచుకుంటారా అని ప్రశ్నించారు.

కేవలం ఐదారుగురు మంత్రులే సమైక్యం కోరుకొంటున్నారు: డొక్కా

  మొన్నముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా ముఠాకట్టిన తొమ్మిది మంది సీమంధ్ర మంత్రులలో ఒకరయిన మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మీడియాతో మాట్లాడుతూ " సీమంధ్ర మంత్రులలో కేవలం కేవలం ఐదారుగురు మంత్రులు మాత్రమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నారని, మిగిలినవారు గందరగోళంలో ఉన్నారని" బాంబు పేల్చారు.   మొన్న మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై యుద్ద భేరి మ్రోగించగా నేడు మంత్రి డొక్కా ఆయనపై నేరుగా యుద్దమే మొదలుపెట్టేసారు. ముఖ్యమంత్రి అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని ఎదిరించడం, తప్పుబట్టడం చాలా తప్పని అన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ కొంత మంది చెక్కభజన చేస్తున్నారని, వారి కారణంగానే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని డొక్కా ఆరోపించారు. ఆయన కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించకపోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రిగా ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకపోగా వారి మధ్య విద్వేషాలు మరింత రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాము కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించమని ఆయన స్పష్టం చేసారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానాన్ని కోరుతామని ఆయన తెలిపారు.   ఇంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేవలం తెలంగాణా మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కానీ బహుశః రేపటి నుండి మిగిలిన సీమంద్రా మంత్రులు కూడా ఆయనకు వ్యతిరేఖంగా తమ గొంతులు సవరించుకొని విమర్శలు గుప్పిస్తారేమో. దీనివలన ఇప్పటికే దెబ్బ తిన్న కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయం. అది సమైక్యవాదం చేస్తున్న వైకాపాకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అదే విధంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం ద్వారా, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన సదరు నేతలు సమైక్యవాదుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.

రాహుల్ దెబ్బకి ఆర్డినెన్స్ వెనక్కి

  నేరచరితులయిన ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించడంతో ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చాలా అవమానకరమే అయినప్పటికీ, దానిని కొనసాగించడం వలన కూడా ప్రతిపక్షాల చేతిలో మరింత పరాభవం తప్పదనే సంగతి గ్రహించిన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్ రద్దుచేయవచ్చును.   అందువల్ల ఇక నుంచి సుప్రీంకోర్టు జూన్ 10న ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది గనుక, రెండేళ్ళు జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఇకపై ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇప్పటికే మెడికల్ సీట్ల కుంభకోణంలో శిక్షపడిన కాంగ్రెస్ యంపీపై అనర్హత వేటుపడనుండగా, పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడిన బీహార్ మాజి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కి రాంచీలో సీబీఐ కోర్టు రేపు జైలు శిక్ష ఖరారు చేస్తే అతను అనర్హత వేటు పడ్డ రెండవ వ్యక్తవుతారు.   రాష్ట్రంలో తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ ఇంతలు ఇదే అంశం ప్రస్తావిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రేపు కోర్టు జైలు శిక్ష విదిస్తే అతనిపై కూడా అనర్హత వేటు పడక తప్పదని జోస్యం చెపుతున్నారు.

మోడీ ప్రభంజనంతో దిక్కుతోచని కాంగ్రెస్ పార్టీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశాన్నిచుట్టేస్తూ మోడీ చేస్తున్న ప్రసంగాలతో దేశప్రజలు, ముఖ్యంగా యువత చాలా ప్రభావితులవుతున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి ఎంత ఆదరణ ఉండేదో, నేడు మళ్ళీ బీజేపీలో మోడీకి అంత ఆదరణ కనబడుతుండటంతో 2014ఎన్నికల తరువాత మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ అగ్ర నేతలలో కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడుతోంది. అందువలన ఇంతవరకు పార్టీలో ఆయనపట్ల ఉన్న వ్యతిరేఖ భావనలు కూడా క్రమంగా సమసిపోతున్నాయి.    భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశ్యించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ స్పందించకపోయినా, మోడీ “మా దేశ ప్రధానిని ఏమయినా అంటే కబడ్దార్” అంటూ వెంటనే తీవ్రంగా హెచ్చరించడంతో మోడీపట్ల ప్రజలలో మరింత అభిమానం పెరిగింది. తమ పార్టీకి చెందిన ప్రధానిని మోడీ వెనకేసుకు వస్తూనే, మరోపక్క అయన అసమర్దుడని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ మోడీని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతోంది. పైగా మోడీ వాక్చాతుర్యం, ఆయన మాటలలో ప్రజ్వలించే దేశభక్తి కాంగ్రెస్ నేతలెవరిలో లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి దిగులు పుట్టిస్తోంది.   అయితే ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాక, తను నిర్దేశించుకొన్న సమున్నత లక్ష్యాల గురించి కూడా వివరిస్తూ, అందులో తాము కూడా భాగస్వాములమేననే భావన ప్రజలలో కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసుకుపోతున్నారు. మానవ వనరులకు కొదవలేని మన దేశంలో దానిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చునో ఆయన చెపుతుంటే యువత ఆయనకి జేజేలు పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, ప్రజలు ఎంత మాత్రం నమ్మని ఆహార భద్రత, భూసేకరణ చట్టం, నగదు బదిలీ పధకం వంటివి వల్లెవేస్తూ ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకొంటోంది. ఇటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ ఆయనను గుజరాత్ అల్లర్లతో, నఖిలీ ఎన్కౌంటర్ కేసులతో గట్టిగా ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.   దానిపై కూడా మోడీ తనదయిన శైలిలో స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న సీబీఐ, రా, ఈడీ, ఆధాయశాఖ మరి దేనిని తనమీద ప్రయోగించినా తానూ బయపడేది లేదు, లొంగేదీ లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళకి ముందే బంధం వేసారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ వీటిలో ఏ ఒక్క శాఖను ఉసిగొల్పినా, ప్రజలకు అయన కాంగ్రెస్-సీబీఐ బంధం గురించి చెప్పినవన్నీ నిజమని మరింత నమ్మకం కలుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగి ప్రమాదం ఉంది.   బహుశః ఈ సారికి కాంగ్రెస్ పార్టీ కూడా ‘నమో నమో’ అనుకొంటూ పక్కకు తొలగి ఆయనకు దారీయక తప్పదేమో?

మోడితో భేటి అవ్వనున్న బాబు

  రాష్ట్రంతో పాటు, కేంద్రంలోనూ ఎన్నికల వేడి మొదలవుతుండటంతో చంద్రబాబు కేంద్ర రాజకీయలమీద దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పలువరు జాతీయ నాయకులతో చర్చించిన చంద్రబాబు బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపికే విజయావకాశాలు ఎక్కవేని అన్ని సర్వేలు చెపుతుండటంతో బాబు కూడా బిజెపితో పొత్తు దిశగా పావులు కదుపుతున్నారు. అందులో బాగంగానే బుధవారం డిల్లీకి వెళుతున్న ఆయన బిజెపి ప్రదాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో సమావేశం అవుతారన్న వార్త బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర పరిస్థితులు తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలను ఆయనతో చర్చించనున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌, బిజెపియేతర పార్టీలతో మూడో ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా బలంగా ప్రయత్నించిన బాబు, ఆ ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఇప్పుడు బిజెపితో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు అత్యధిక ప్రాదాన్యత

  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర మాత్రం విభజన దిశగానే అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాష్ట్రవిభజన తమ తొలి ఎజెండా అని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మన్మోహన్ ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లగానే హోం మంత్రి సుశీల్‌కుమార్‌ తో సమావేశమై, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మనసులో తెలంగాణ ఏర్పాటు అత్యదిక ప్రదాన్యత కలిగిన అంశం అని ఆయన పిటిఐ తో తెలిపారు. దీనితో పాటు దోషులుగా రుజువన వారు చట్టసభల్లో ప్రవేశించవచ్చు అంటూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్‌ ఏ పరిస్ధితుల్లో ఆ వ్యాఖ్యలు చేశారో అడిగి తెలుసుకుంటామన్నారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న ప్రధాని, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

లాలూ తరువాత జగన్

      ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. లాలూ మాదిరిగా జగన్ దోషిగా రుజువు కావడం తథ్యమని అన్నారు. రూ.950 కోట్ల దాణ కుంభకోణం కేసులో లాలూ దోషిగా తేలినట్టే లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్ కూడా దోషిగా తేలుతాడని తెలిపారు. తాను పదహారు నెలలు జైళ్లో ఉన్నానని ప్రచారం చేసుకుంటూ జగన్ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని, సహకరిస్తానని జగన్ సోనియాకు మాట ఇచ్చి అసెంబ్లీ ఏర్పాటు ద్వారా అందుకు సహకరించాలని చూస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్ నీతి వ్యాఖ్యలు వల్లించడం సెక్యులరీజం గురించి జగన్ మాట్లాడ్డాం విడ్డూరంగా ఉందని, సైతాన్ బైబిల్ చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుంభకోణం కేసులో నిందితునికి గవర్నర్ ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని యనమల ప్రశ్నించారు.

విజయమ్మ చిలుకపలుకులు

      పరకాల ఉప ఎన్నికల సమయంలో విజయలక్ష్మి చిలుకపలుకులు పలికారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పై మాట మార్చినవారాని ద్రోహులుగానే పరిగణిస్తామని అన్నారు. ఓయూ విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు అది మీకు సంస్కారమనిపించిందా అని అడిగారు. సీమాంధ్ర నేతలు రాక్షసులని అనలేదని, తానేమీ మాట్లాడినా తప్పు అనడం దత్తాత్రేయ, నారాయణకు అలవాటైపోయిందని మండిపడ్డారు.     తెలంగాణ రాష్ట్రం కోసం రెండు నెలలుగా సహనంతో ఉన్నామని, తమ సహనాన్ని అలుసుగా భావించవద్దని హెచ్చరించారు. అశోక్‌బాబు కోట్లాటకు రమ్మని ఉసుగొల్పడం సంస్కారమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైకాపా ఇక్కడ సభ ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ పెడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర నాయకులు అవాకులు చవాకులు మానుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.