రాహుల్ దెబ్బకి ఆర్డినెన్స్ వెనక్కి
posted on Oct 2, 2013 @ 4:12PM
నేరచరితులయిన ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించడంతో ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చాలా అవమానకరమే అయినప్పటికీ, దానిని కొనసాగించడం వలన కూడా ప్రతిపక్షాల చేతిలో మరింత పరాభవం తప్పదనే సంగతి గ్రహించిన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్ రద్దుచేయవచ్చును.
అందువల్ల ఇక నుంచి సుప్రీంకోర్టు జూన్ 10న ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది గనుక, రెండేళ్ళు జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఇకపై ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇప్పటికే మెడికల్ సీట్ల కుంభకోణంలో శిక్షపడిన కాంగ్రెస్ యంపీపై అనర్హత వేటుపడనుండగా, పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడిన బీహార్ మాజి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కి రాంచీలో సీబీఐ కోర్టు రేపు జైలు శిక్ష ఖరారు చేస్తే అతను అనర్హత వేటు పడ్డ రెండవ వ్యక్తవుతారు.
రాష్ట్రంలో తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ ఇంతలు ఇదే అంశం ప్రస్తావిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రేపు కోర్టు జైలు శిక్ష విదిస్తే అతనిపై కూడా అనర్హత వేటు పడక తప్పదని జోస్యం చెపుతున్నారు.