పాపం సబ్బం...

  వైజాగ్ మాజీ మేయర్ సబ్బం హరి కాంగ్రెస్ యంపీగా కొనసాగుతున్నపటికీ ఇంతకాలంగా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అనేకమంది కాంగ్రెస్ నేతలు వైకాపాలో జేరినప్పటికీ, ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని చెపుతూ ఇంత కాలంగా తన రెండు పడవల ప్రయాణం సాఫీగా లాగించేస్తున్నారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యి బయటకి వచ్చేసారు గనుక ఇక నేడో రేపో వైకాపాలో జేరవచ్చునని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మళ్ళీ తన పాత పాటే పాడుతూ త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని తాజాగా మరోమారు ప్రకటించారు.   అయితే, ఈ లోగా అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీగానే కొనసాగుతున్నననే సంగతి మరిచిపోయి, తమ పార్టీ (వైకాపా) 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి మాత్రమే మద్దతు ఇస్తుందని ప్రకటించేశారు.   కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవడం వలనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా ఆరోపణలు చేస్తున్నఈ తరుణంలో సబ్బం హరి, ఇంకా వైకాపాలో చేరక ముందే వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటించడంతో వైకాపా కంగు తింది. గతంలో విజయమ్మ, భారతి, షర్మిల ముగ్గురూ కూడా 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అదే మాట సబ్బంహరి సమయం కాని సమయంలో ప్రకటించడంతో తెదేపా చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన ఋజువు చేసినట్లయింది. పైగా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటంతో అ రెండు పార్టీల మధ్య గట్టి బంధమే ఉన్నట్లు దృవీకరించినట్లయింది.   ఈ ప్రకటన చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని సబ్బం హరి ప్రకటించడం వైకాపాకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకే ఆ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సబ్బం హరి ఒక సీనియర్ రాజకీయనేత అని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాల గౌరవం ఉండేది. కానీ మొన్నఆయన మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధ పడ్డారు. సబ్బం హరి మాటలతో కానీ, ఆయనతో గానీ మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన మా పార్టీ సభ్యుడు కూడా కాదు. ఒకవేళ ఆయన వచ్చి పార్టీలో చేరుతామన్నా మేము చేర్చుకోదలచుకోలేదు,” అని తెలిపారు.   ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, జగన్ కి జై కొడుతూ, తన పార్టీ అధిష్టానాన్ని విమర్శించిన పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతనిని పట్టించుకొనేవారు లేరు. పాపం అత్యుత్సాహానికి పోయి నోరు జారినందుకు ఇప్పుడు వైకాపా తలుపులు మూసుకు పోయాయి. రెంటికీ చెడిన రేవడి అంటే ఇదేనేమో. సబ్బం సంగతి ఎలా ఉన్నపటికీ, కుమ్మక్కు ఆరోపణలను ఎదుర్కోలేక అవస్థలు పడుతున్న వైకాపాకి సబ్బం హరి, పార్టీలో చేరకపోయినా పార్టీ పరువు మాత్రం తీసిపోయాడు.  

రాష్ట్రంలో సమైక్య, విభజన సభలు

  ఈ రోజు రాష్ట్రం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని డిమాండ్ చేస్తూ 'సకల జన భేరి' సభ జరుగుతుంటే, మరో వైపు అదే సమయంలో, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య ప్రజాగర్జన సభ జరుగుతోంది. ఇరు సభలు వారి వారి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పై హక్కులపై ఇరు సభలు బలమయిన వాదనలు వినిపించాయి.   ఇక టీ-సభలో ప్రసంగించిన కేసీఆర్ ఒక ఆసక్తికరమయిన సంగతిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీకాలం మరో ఆరు రోజుల్లో(అక్టోబర్ 6) ముగియబోతోందని, అందుకు తనవద్ద ఖచ్చితమయిన సమాచారం ఉందని ప్రకటించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అద్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడవచ్చనే సంకేతమిస్తూ, ఒకవేళ యూపీయే ప్రభుత్వం ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోతే, తరువాత వచ్చే బీజేపీ రాష్ట్ర ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పడం మరో విశేషం.   ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంతో ఎన్నికల పొత్తుల ఆలోచనలు చేస్తూనే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం చూస్తే, ఆయన అవసరమయితే బీజేపీతో జతకట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం జేస్తోంది. మరి బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టే ఆలోచనలోఉందని తెలిసినప్పుడు, ఆయన ఈవిధంగా మాట్లాడటం విశేషమే. ఆయన ఈ సనదర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సభలో ప్రసంగించిన కే.కేశవ్ రావు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తగా, అంతకు ముందు ప్రసంగించిన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సుష్మ స్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సభలో ప్రసంగించిన వక్తలు అందరు సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనని వెంటనే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు.   ఇక సమైక్య సభలో మాట్లాడిన వక్తలందరూ హైదరాబాదుపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గట్టిగా వాదించారు. విద్యుత్, ఉపాద్యాయ, సాగునీరు,ఆర్టీసీ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘనేతలు రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి సమస్యలు వస్తాయో వివరించారు.   వారు రాజకీయ పార్టీలన్నిటికి మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయాలు పక్కనబెట్టి ఇప్పటికయినా స్పష్టమయిన సమైక్యవాదంతో ముందుకు రానట్లయితే రానున్న ఎన్నికలలో గట్టిగా బుద్ధిచెపుతామని హెచ్చరించారు.   రెండు సభలలో కొట్టవచ్చినట్లు కనబడిన తేడా ఏమిటంటే, టీ-సభలో తెరాస, బీజేపీ, ఇతర తెలంగాణా ఫోరం నేతలందరూ పాల్గొనగా, సమైక్య సభలో రాజకీయపార్టీలన్నీ దూరంగా ఉన్నాయి. పైగా నేతలకీ, వారి పార్టీలకు ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు చేసారు. అయితే ఉద్యోగులు రాజకీయ నేతలను, పార్టీలను దూరం ఉంచినప్పటికీ, అన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమ నేత అశోక్ బాబుకు విస్పష్టంగా తమ మద్దతు ప్రకటించడం ద్వారా పూర్తి ఐకమత్యం చూపుతూ, తమ పోరాటానికి రాజకీయ పార్టీల అండ అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసారు.

20 ఎంపీ సీట్లు గెలిపిస్తాం: రాయపాటి

    రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వెనుకడుగు వేయకపోయినా, కాంగ్రెస్‌ ఎంపిలు మాత్రం ఇంకా అధిష్టానం నిర్ణయం వెనక్కు తీసుకుంటుందన్న ఆశతోనే ఉన్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు మరోసారి అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన రాజీనామా ఆలోచనలో ఉన్న బొత్సా వైఖరి పై కూడా స్పందిచారు. అందరిని రాజీనామా చేయోద్దని వారించిన బొత్సా ఇప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారో అర్ధం కావటం లేదు అన్నారు. సీనియర్లను కాదని పార్టీ కూడా మొండిగా నిర్ణయాలు తీసుకోవటం తగదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని, తెలంగాణ ఇచ్చిన పేరుతో ఆంద్రాలో కూడా పార్టీ నష్టపోతుందని అన్నారు. కేవలం పైరవీలతొనే సీయం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు.

హైకోర్టులోనూ చుక్కెదురు

  డైరెక్టర్‌ జనరల్‌ ఆప్‌ పోలీస్‌ దినేష్‌ రెడ్డి చేసుకున్న అభ్యర్థనను హై కోర్టు తొసిపుచ్చింది. క్యాట్‌ తీర్పును సమర్ధించిన కోర్టు దినేష్‌ రెడ్డిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో రేపటితో పదవీ కాలం ముగియనున్న దినేష్‌  రెడ్డి ఇక విధుల నుంచి వైదొలగక తప్పని పరిస్థితి.   పదవీ విరమణ వయసుతో సంభందం లేకుండా పదవి చేపట్టినప్పటి నుండి రెండేళ్ల పాటు సేవ  చేయోచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని పొడిగించాలని దినేష్‌ రెడ్డి క్యాట్‌ను కోరారు. అయితే క్యాట్‌ ఆయన అభ్యర్ధనను తిరస్కరించడంతో దినేష్‌ రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించారు. అయితే హై కోర్టు కూడా క్యాట్‌ తీర్పునే సమర్ధించింది.

జగన్, కెసిఆర్ లు సోనియా వదలిన బాణాలు

      టిడిపి అడ్డు తొలగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణాలు వైఎస్ జగన్, కేసీఆర్ లు అని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మేము తట్టుకోగలం. మాది రామబాణం అని ఆయన అన్నారు. లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు కల్పించారని, జైలు నుంచి జగన్‌ను బయటకు తీసుకురావడం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కాదా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సిబిఐని ప్రయోగించి బెదిరిస్తున్నారని, ఆ తరువాత వారి పబ్బం గడుపుకుంటున్నారని, అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వశక్తులొడ్డి నీరుగార్చారంటూ అన్నా హజారే ఉద్యమం ఉదాహరణగా చూపారు. దేశంలోని అన్ని సమస్యలకు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లే కారణం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

దినేష్‌రెడ్ది పదవి పై తీర్పు వాయిదా

      డీజీపీ దినేష్‌రెడ్ది పదవి కాలాన్ని పొడిగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. తీర్పు ఆదివారం సాయంత్రం గానీ, లేదా సోమవారం ఉదయం గానీ వెల్లడిస్తామని జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ శేషాద్రి నాయుడు బెంచ్ పేర్కొంది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ దినేష్‌రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిసన్‌ను వేసిన విషయం తెలిసిందే. ఆదివారం జస్టిస్ అశుతోష్ నివాసంలో హౌస్ మోషన్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ మేరకు వాయిదా వేశారు

కిరణ్ కు రాయపాటికి అండ

      రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన సీనియర్లను కాదని విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తెలంగాణలో వచ్చే సీట్లకన్నా ఎక్కువే వస్తాయని ఆయన తెలిపారు.   మమ్మల్ని రాజీనామా చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేస్తున్నారో అర్థం కావడంలేదని రాయపాటి అన్నారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పైరవీతోనే కిరణ్‌కు సీఎం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు. ఢిల్లీకి ఆలస్యంగా రావడం వల్లే నిన్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవలేకపోయానని రాయపాటి వెల్లడించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిన్న స్పీకర్ను కలిశారు. వీరితో రాయపాటి వెళ్లలేదు. దీంతో రాయపాటి వివరణ ఇచ్చారు.

సభా సమయం

  ప్రస్థుతం దేశ వ్యాప్తంగా సభా సమయం నడుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ సకల జన భేరి సాగుతుండగా, అదే సమయంలో సీమాంద్ర జిల్లాల్లో నిరసనలతో పాటు కర్నూలులో లక్షగళ ఘోష జరుగుతుంది. వీటితో పాటు ఢిల్లీలో బిజిపి ఆధ్వర్యంలో నరేంద్రమోడి భారీ సభను నిర్వహిస్తున్నారు దీంతో అధిష్టానం ఈ సభలపై కేంద్ర ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రికరించింది. ఇటీవల హైదరాబాద్‌లో సీమాంద్రులు నిర్వహించిన సభకు మంచి స్పందన రావటంతో ఈ రోజు తెలంగాణ వాదులు తలపెట్టిన సభను ఘనవిజయంగా చూపాలని టిఆర్‌ఎస్ తో పాటు అన్ని వర్గాలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. గత 60 రోజులుగా ఉద్యమంలో ఉన్న సీమాంద్రులు కూడా లక్ష గళ ఘోషలతో హోరెత్తిస్తున్నారు. వీటికి తోడు ఢిల్లీలో బిజెపి ఎన్నికల సారథి నరేంద్ర మోడి తలపెట్టిన సభ కాంగ్రెస్‌ పెద్దల గుండెల్లో రైళ్లు పరెగెత్తిస్తుంది. తన పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి సోనియా టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సందిస్తున్న మోడి ఈ రో్జు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.

లతా మంగేష్కర్‌కు గుడి కట్టిన అభిమాని

  ఇన్నాళ్లు హీరో హీరోయిన్లకు మాత్రమే గుడులు కట్టిన అభిమానులు ఇప్పుడు ఓ గాయనికి కూగా గుడి కట్టారు. అయితే ఇన్నాళ్లు దక్షిణాదిలో మాత్రమే ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారనుకున్నారు అంతా ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ మధ్యప్రదేశ్‌ కు చెందిన వర్షా జాలని భారత గాన కోకిల లతామంగేష్కర్‌కు గుడకట్టించారు. ఇప్పుడిప్పుడే గాయనిగా నిలదొక్కుకుంటున్న గాయని వర్షా జాలని తన అభిమాన గాయని అయిన లతామంగేష్కర్‌పై తన అభిమానాన్ని గుడి కట్టి మరీ నిరూపించుకుంది. లతాను దేవతలా ఆరాధించే వర్ష తన ఇంట్లోనే ఆమె కోసం ఓ ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని లత ఫొటో ఉంచింది. వర్ష ఆ ఫొటో ముందు నిల్చునే పాటలు పాడటం సాధన చేసేదట. 'రెండు దశాబ్దాలుగా లతాజీ ప్రార్థన మందిరంలో సాధన చేస్తున్నాను. ఆమె ఫొటో చూడగానే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలుగుతాయి' అని వర్ష అంటోంది. మూడు రోజుల క్రితం లతా మంగేష్కర్‌ను కలిసిన వర్షా భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలనుకుంటుంది.

వైకాపాపై లగడపాటి విమర్శలు

  ఈ రోజు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోనేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను కలిసిన అనంతరం, విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ “మేము ముందు నుండి చెపుతున్నట్లే మా మాటకు కట్టుబడి ఈ రోజు మా రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి స్పీకర్ ను కలిశాము. కొంతమంది వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినా, మిగిన ముగ్గురం మాత్రం రాజినామాలకే కట్టుబడ్డామని స్పష్టం చేసాము. అయితే నిన్నటి వరకు మాతో ఉన్న ఒక యంపీ (యస్పీ.వై. రెడ్డి) అకస్మాత్తుగా వేరే పార్టీ(వైకాపా)లోకి మారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది."   "సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఆ పార్టీ, ఈ పరిస్థితుల్లో కూడా ఈవిధంగా ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తుండటం చూస్తే ఆ పార్టీ ఎటువంటి రాజకీయాలు చేస్తోందో అర్ధం అవుతుంది. తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు, పార్టీలకు అతీతంగా సీమాంద్రాకు చెందిన శాసన సభ్యులందరూ వ్యతిరేఖంగా ఓటేసి ఓడించాల్సిన తరుణంలో, ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామాలకు పూనుకోవడం, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నాలు చేయడం చూస్తే, ఆ పార్టీ అసలు రాష్ట్రం కలిసి ఉండాలని పోరాడుతోందా లేక విడిపోవాలని పోరాడుతోందో అర్ధం అవుతుంది."   "సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణావాదులు విమర్శించడం, ఆయనని తొలగించాలని కోరడం సహజమే అనుకొన్నా, వైకాపా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగయినా కూల్చివేసి రాష్ట్రపతి పాలన తీసుకువచ్చి, రాష్ట్ర విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేయాలనుకోవడం చూస్తే, ఆ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకయినా దిగజారుతుందని అర్ధం అవుతోంది. కానీ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డికి మేమందరమూ అండగా నిలబడి ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకొంటాము. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తాము,” అని తెలిపారు.

సీఎం కిరణ్ కు టిడిపి మద్దతు

      సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన తెలుగుదేశం సైతం ఈ విషయంలో ఆయనకు మద్దతు ప్రకటించింది. సమైక్య రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ వాస్తవాలే అని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరారు. సీఎం చెప్పిన వివరాలు, కష్టానష్టాలన్నింటినీ తెలుగుదేశం 2009 నుంచి చెబుతూనే ఉందని సోమిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ కిరణ్ సమైక్య వాదాన్ని వినిపించడం, చివరికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ మీద కూడా విమర్శలకు వెనుకాడకపోవడంపై సీమాంధ్ర ప్రాంతంలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు ఇంకాస్త గట్టిగా దిక్కార స్వరం వినిపించడం ద్వారా, ఇక రెండు నెలలుగా సాగుతున్నఈ విభజన సీరియల్ కి ఏదో ఒక ముగింపు తీసుకువచ్చే పరిస్థితి కల్పించారు. రాష్ట్ర విభజనపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని నేడు కూడా దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన నేపధ్యంలో, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమేనని అందరికీ తెలుసు. గనుక, సమైక్యాంధ్ర కోసం కాకపోయినా తమ రాజకీయ మనుగడ కోసమయినా వారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడక తప్పదు.   ఇప్పటికే యంపీ యస్పీవై రెడ్డి వైకాపాలోకి దూకేయగా, మంత్రి విశ్వరూప్ కూడా నేడో రేపోవైకాపాలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ధీర గంభీరంగా సమైక్యవాదం చేసినా, అంతిమంగా తన రాజకీయ భవిష్యత్ కూడా చూసుకోక తప్పదు. అందుకే ఆయన పదవి నుండి తప్పుకొని ఏదో ఓ రూపంలో ఉద్యమంలో పాల్గొనవచ్చును.   అయితే ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రజలతోనో, ఉద్యోగులతోనో కలిసి ఉద్యమాలు చేయడం ఇబ్బందికరం గనుక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి కొత్తపార్టీ స్థాపించి పోరాడవచ్చును. గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు విభజన జరిగితే కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తామని ప్రకటించారు. గనుక సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఓ కొత్త పార్టీ పెట్టుకోవచ్చును.   అయితే సీమంధ్ర నేతలు కొందరు కొత్త పార్టీలోకి, మరికొందరు వైకాపాలోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ మనుగడ ఎలా అంటే బొత్స సత్యనారాయణ, చిరంజీవి, శీలం, సుబ్బిరామి రెడ్డి, పురందేశ్వరి, పనబాక, కిల్లి కృపా రాణి, కావూరి వంటి సీనియర్లను ఉపయోగించుకొని కాంగ్రెస్ అధిష్టానం సీమంద్రాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. అయితే వారి వల్ల పార్టీ ఎన్నికలలో గెలుస్తుందని చెప్పలేకపోయినా అభ్యర్ధులను రంగంలో దింపేందుకు మాత్రం డోకా ఉండకపోవచ్చును. పార్టీలో సీనియర్లు తప్పుకొంటే పోటీ చేసేందుకు ఇప్పటికే అనేక మంది కొత్త అభ్యర్ధులు సిద్ధంగా ఉన్నారు.   రాష్ట్ర విభజన చేయడం వలన సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినా, పార్టీ తాత్కాలికంగా చీలినా, ఈ భావోద్రేకాలు ఎక్కువకాలం ఉండే అవకాశం లేదు. ఎన్నికలలోగా రెండు మూడు సమైక్యాంధ్ర పార్టీలు పుట్టుకు రావడం వలన ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరుస్తుందనే ధీమా కూడా కాంగ్రెస్ లో ఉంది. ఇప్పుడు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీ నుండి వేరయినా, ఎన్నికలు పూర్తయిన తరువాత అధికారం పంచుకోవడం కోసమయినా మళ్ళీ వెనక్కుతిరిగి రావచ్చుననే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం అంత దైర్యంగా రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేస్తోందని చెప్పవచ్చును. ఇక, జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ఎలాగు ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడమో లేక ఎన్నికలు పొత్తులు పెట్టుకొని అధికారం పంచుకోవడమో ఖాయం గనుక సీమంద్రాలో పార్టీ పరిస్థితి గురించి కాంగ్రెస్ అధిష్టానం బెంగాపెట్టుకోలేదు. .

రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నా౦: ఉండవల్లి

        లోక్‌సభ స్పీకర్‌మీరాకుమార్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఎంపీలు లగడపాటి, సాయిప్రతాప్, అనంత, ఉండవల్లి, ఎస్పీవైరెడ్డి స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీల అభిప్రాయాలను స్పీకర్ తెలుసుకున్నారు. మనస్పూర్తిగా రాజీనామా చేస్తున్నారా అని స్పీకర్ అడిగినట్లు తెలుస్తోంది. తమపై ఎవరి ఒత్తిడి లేదని స్పీకర్‌కు దీనిపై సీమాంధ్ర ఎంపీలు తెలిపినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన ఎంపీలకు హర్షకుమార్, సబ్బంహరి మద్దతు తెలిపారు.   లోక్‌సభ స్పీకర్‌మీరాకుమార్‌తో సమావేశం అనతరం ఉండవల్లి అరుణకుమార్ మీడియా తో మాట్లాడారు.ఏ రకమైన ఒత్తిడికి గురై ఇచ్చిన రాజీనామా లేఖ కాదని, కావాలని, పూర్తి మనఃపూర్వకంగా ఇచ్చిన రాజీనామా అని స్పష్టంగా చెప్పామని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. తమ రాజీనామాలను ఆమోదిస్తారని భావిస్తున్నామని అన్నారు. ఇంకేదైనా సందేహం ఉంటే స్పీకర్ ను అడగండని అన్నారు. 

బొత్స రాజీనామా..!!

      పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణతో మరో నలుగురు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నోట్ వచ్చే లోగా తాను రాజీనామా చేయడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొదట ప్రత్యేకవాదిగా ముద్ర వేసుకున్న బొత్స సమైక్య వినతిపత్రంపై సంతకం చేశారు. తాను రాజీనామా చేయబోతున్న విషయాన్ని బొత్స గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. బొత్స శుక్రవారం గవర్నర్‌ను కలవడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.

కాంగ్రెస్ మార్క్ పాలన...కాంగ్రెస్ మార్క్ కష్టాలు

  కాంగ్రెస్ మార్క్ పాలనలో కేవలం ప్రజలే కాక స్వయంగా ఆ పార్టీకి కూడా చాలా కష్టాలు, కన్నీళ్లు తప్పడంలేదు. రాష్ట్రవిభజనతో కొత్త సమస్యను సృష్టించుకొని అందులోంచి బయటపడలేక తిప్పలు పడుతున్నకాంగ్రెస్ అధిష్టానానికి, నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన సవాలుతో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.   ఆయన ఇంత బహిరంగంగా అధిష్టానానికి సవాలు విసురుతున్నపటికీ, వెంటనే ఆయనని పదవిలోంచి తొలగించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ తొలగిస్తే అది ప్రజలలో ఆయన ఇమాజ్ మరింత పెంచుతుంది. తెలుగు ప్రజలను రెండుగా చీల్చి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్ర ప్రజలను అది మరింత రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షిస్తే ప్రజలలో అధిష్టానం చులకన అవుతుంది. బహుశః జగన్మోహన్ రెడ్డి ద్వారా కిరణ్ ప్రభుత్వాన్నికూలద్రోయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించి ఈ గండం గట్టెక్కే ప్రయత్నం చేయవచ్చును.   ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా, అక్కడ డిల్లీలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వంత పార్టీపై, ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.   నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను రక్షించేందుకు తమ పార్టీ, ప్రభుత్వం కలిసి బిల్లు తీసుకురావడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపిస్తూ “ఆ బిల్లును చింపి చెత్త కుప్పమీద పడేయాలి. బీహార్ రాష్ట్రంలో మా పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే ఇటువంటి బిల్లుకి మా పార్టీ ఆమోదం తెలిపిందని భావిస్తున్నాను. ఈవిధంగా ప్రతీ విషయంలో రాజీపడుతూ పోతే, ఇక ఎప్పటికీ దేశం నుండి అవినీతిని పారద్రోలలేమనే సంగతిని మా పార్టీతో సహా అన్నిరాజకీయ పార్టీలు గమనించాలి,”అని అన్నారు.   ఆయన రాక మునుపు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నపార్టీ కార్యదర్శి అజయ్ మాకన్, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాలు ఈ బిల్లుపై చేస్తున్నఆరోపణలను, విమర్శలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, “వారిది అవగాహనా రాహిత్యమని బిల్లును సమర్దించుకొని వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ కూడా బిల్లుకు వ్యతిరేఖంగా మాట్లాడేసరికి, అజయ్ మాకన్ నోట మాట రాలేదు కాసేపు. చివరికి మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినదే మా పార్టీ సిద్ధాంతం,’ అని ప్రకటించి బయటపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడగా, బిల్లును వ్యతిరేకిస్తున్నబీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీకాంగ్రెస్ పార్టీని ఇదే అదునుగా దుయ్యపట్టసాగాయి.   ఇక నిన్నముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి ఒక ఆర్మీ కల్నల్ తో సహా 12మందిని చంపినప్పటికీ, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఈ రోజు సమావేశం అవుతానని ప్రకటించడంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.   ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని విమర్శిస్తుంటే, అక్కడ డిల్లీలో స్వయంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడే తమ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. ఇద్దరూ పార్టీలో, ప్రభుత్వంలో కూడా చాలా కీలకమయిన వ్యక్తులే కావడంతో వారి విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొన్న ప్రతీసారి ప్రజల, మీడియా దృష్టిని మళ్ళించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఉపాయం పన్నుతుంటుంది. బహుశః ఈసారి చేతిలో సిద్ధంగా ఉన్న తెలంగాణా సమస్యను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదిస్తుందేమో.

నేడు పాలమూరు ప్రజాగర్జన

  పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతు బిజెపి తలపెట్టిన ప్రజాగర్జనకు ఏర్పాటు పూర్తయ్యాయి. పాలమూరులో శనివారం జరుగుతున్న సభకు ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హాజరు కానున్నారు. ఇటీవల బిజెపి ఎల్‌బి స్టేడియంలో చేసిన మోడి నవభారత యువభేరి సభ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు ప్రజాగర్ఝనను కూడా అదే స్థాయిలో సక్సెస్‌ చేయాలనుకుంటున్నారు రాష్ట్ర నాయకులు. తెలంగాణ ఎంపి సీట్ల మీద గట్టి ఆశలు పెట్టుకున్న బిజెపి ఈ సభను ఎలాగైన సక్సెస్‌ చేయాలని భావిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణకు మద్దతు తెలపుతున్న పలు సంఘాలతో పాటు టిజెఏసి నేత కొదండరామ్‌ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజాగర్ఝనకు ముందు సుష్మా స్వరాజ్‌ పలువురు తెలంగాణ నేతలతో సమావేశమవుతారు.

స్పీకర్‌ను కలవనున్న సీమాంద్ర ఎంపిలు

  చాల రోజులుగా రాజీనామాలు చేస్తామంటూ చెపుతున్న సీమాంద్ర ఎంపిలు నేడు స్పీకర్‌ కలవనున్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర ఏ మాత్రం స్పందిచకపోవటంతొ ఎంపిలు రాజీనామలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో బాగంగానే స్పీకర్‌ను కలిసి తమ రాజీనామలు ఆమోదించాల్సిందిగా కోరనున్నారు. స్పీకర్‌ను కలవనున్న వారిలో లగడపాటి రాజగోపాల్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌, ఎస్‌పివై రెడ్డి ఉన్నారు. వీరంతా ఆగస్టు 2న ఇచ్చిన తమ రాజీనామలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరనున్నారు. మూడు రోజుల కిందటే స్పీకర్‌ ను కలవాల్సి ఉండగా, ఆమె బిజీ ఉండటంతో అపాయింట్‌మెంట్‌ను మూడు రోజులు పోస్ట్‌పోన్‌ చేశారు.