డిడిసిఎ పై కమిటీ రద్దు..అరుణ్ జైట్లీ కోసం..?

డిడిసిఎ వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. డిడిసిఎ కుంభకోణంలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ హస్తం ఉందని ఆప్ నేతలు అంటున్నారు. కానీ అరుణ్ జైట్లీ మాత్రం వాటిని ఖండించి.. పరువు నష్టం కేసు కూడా వేశారు. మరోవైపు డిడిసిఎలో అవక తవకలపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం కమిటీ వేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిని రద్దు చేసింది. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఢిల్లీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కేంద్రానికి ఆ అధికారం లేదని.. విచారణ ఎప్పటిలానే కొనసాగుతుందని అన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టి.. ఆప్‌ ప్రభుత్వం నియమించిన కమిటీ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రం, రాష్ట్రాలు మాత్రమే ఇటువంటి విచారణా కమిషన్లు నియమించడానికి అధికారం వుందని, ఢిల్లీ ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర.. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ని రద్దు చేయడంతో అరుణ్ జైట్లీ కోసమే కమిటీని రద్దు చేశారని అంటున్నారు.

సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అసెంబ్లీ.. పార్లమెంట్లలో నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అండర్‌-19 జాతీయ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ.. పార్లమెంట్ లో సభ్యులు అసభ్యకర పదజాలం వాడుతున్నారని.. సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. ప్రజా ప్రతినిధులు గౌరవప్రదమైన బాష మాట్లాడాలని.. సూచించారు. ప్రజలు బజారు సరుకును అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపుతున్నారని.. మంచి బాష మాట్లాడే వారిని ఎన్నుకొని వారిని సభలకు పంపిచాలని అన్నారు. అంతేకాదు సభల నుండి వాక్ అవుట్ చేస్తే మంచిది.. బ్రేక్ అవుట్ చేస్తే దేశానికే మంచిది కాదని అన్నారు.

జగన్, దాసరి భేటీపై సీపీఐ నారాయణ కామెంట్..

వైసీపీ అధినేత జగన్..దాసరి నారాయణరావు భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి భేటీపై సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణరావు జగన్ పై విమర్శలు చేశారు. పార్టీ సమావేశాల్లో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడుతూ జగన్ దాసరి కలవడమంటే జైలు పక్షులన్నీ ఒకే గూటికి చేరడమేనని ఆయన విమర్శించారు. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. చంద్రబాబు చేస్తున్న తప్పులకు జగన్‌ ఊపిరి పోస్తున్నాడన్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ మంత్రి కేటీఆర్ తమ పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుతానని.. ఒకవేళ ఆంధ్ర నుండి పోటీ చేస్తే భీమవరం నుండి పోటీ చేస్తానని చెప్పిన సంగతి విదితమే.. దీని గురించి కూడా నారాయణ మాట్లాడుతూ కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌.. భీమవరం నుంచి పోటీ చేయడం వంటివి జరిగితే తన చెవి కోసుకుంటానని అన్నారు.

వైసీపీకి 5ఎమ్మెల్యేలు షాక్.. ఫోన్ చేసిన జగన్..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆపార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూల్ నుండి 14 అసెంబ్లీ స్ధానాలకు గాను వైసీపీ 11 స్థానాలు కైవసం చేసుకోగా.. టీడీపీ మాత్రం 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలలో అయిదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్టు వినికిడి. దీంతో పార్టీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారంట. పార్టీ మారే యోచనలో ఎవరున్నారో తెలుసుకొని వాళ్లకు ఫోన్ చేసి మరీ పార్టీ మారొద్దని సూచిస్తున్నారంట. అంతేకాదు పార్టీలో వారికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. మరికొందరు ఎమ్మెల్యేలకు చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ వెళ్లవద్దని సూచించారట. మరి జగన్ మాటను ఎమ్మెల్యేలు విని పార్టీ మారే యోచనను మానుకుంటారో లేక.. జగన్ మాటను పట్టించుకోకుండా పార్టీ మారతారో చూడాలి.

పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఎస్పీ సిల్వీందర్ సింగ్..?

పంజాబ్ పఠాన్ కోట్ కేసులో ఎస్పీ సిల్విందర్ సింగ్ ను ఎన్ఐఏ విచారిస్తూనే ఉంది. ఇప్పటికే సల్విందర్ చెప్పిన సమాధానాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష చేయాలని నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నిర్ణయించింది. సల్వీందర్‌ సింగ్‌ ను ఢిల్లికి కాని, బెంగళూరుకు కాని తీసుకుని వెళ్లి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేయించాలని నిర్ణయించినట్లు ఎన్‌ఐఎ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు సల్వీందర్‌ ఉపయోగించిన ప్రయివేటు వాహనంపై నీలి రంగు దీపం అమర్చారు. దీనిపై కూడా ఎన్‌ఐఎ విచారణ జరుపుతోంది. ఈ కారును ఉపయోగించిన ఉగ్రవాదులు కారుపై అమర్చిన నీలి దీపం కారణంగానే పోలీస్‌ చెక్‌పోస్టుల వద్దనుంచి సులభంగా తప్పించుకుని ముందుకు వెళ్లగలిగారని తెలుపుతున్నారు. అయితే పాలిగ్రాఫ్‌ పరీక్షకు సల్వీందర్‌ అంగీకరించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

షారుక్, ఆమీర్ కు సెక్యూరిటీ కుదింపు.. అసహనమే కారణమా..?

ముంబై పోలీసులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లలో భారీ భద్రత కలిగి ఉన్న కొంత మందికి సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలా భద్రత తగ్గించిన వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్.. అమీర్ ఖాన్ లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా.. రాజ్ కుమార్ హిరానీ.. ఫరాఖాన్.. కరీం మొరాని తదితరులు ఉన్నారు. అయితే కొంత మందికి మాత్రం అలానే భద్రత సిబ్బందిని కొనసాగిస్తున్నారు. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్.. దిలీప్ కుమార్.. లతామంగేష్కర్ ఉన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మాట్లాడుతూ ప్రముఖులకు పెద్ద ఎత్తున భద్రతను కల్పించటం కారణంగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే అంతా బానే ఉన్నా షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ భద్రతను తగ్గించడంపైనే పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసహనం పై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం.. దానికి షారుక్ ఖాన్ మద్దతు పలకడం వల్లే సూపర్ స్టార్లు అయిన వీరిద్దరి భద్రతను తగ్గించారని అనుకుంటున్నారు. మరి ఏది నిజమో వాళ్లకే తెలియాలి.

గవర్నర్ ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు.. టీ సర్కార్ పై ఫిర్యాదు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ మొత్తం గులాబీ మయం అయిపోయింది. అధికారపార్టీ నగరమంతా పెద్ద హోర్డింగులతో నింపేసింది. దీనికి గాను ప్రతిపక్షాలు అధికార పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారి తొక్కుతోందని.. ప్రభుత్వం 2000 హోర్డింగులు ఏర్పాటు చేసిందని, ఇందుకోసం రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతున్నారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్‌ తదితరులు ఉన్నారు.

భీమవరం నుండి పోటీ చేస్తా..కేటీఆర్

టీఆర్ఎస్ తరుపున గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్న సంగతి తెలసిందే. అయితే ఈ గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కారణంగా వారిని ఆకర్షించేందుకు కేటీఆర్ తన వాక్చాతుర్యాన్ని బాగానే వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి.. ఏపీలో అయితే టీడీపీకి మద్దతివ్వండి అంటూ సీమాంధ్రులను ఆకర్షించే విధంగా మాట్లాడారు. ఈ మాటలకే ఏపీ నేతలు షాకవుతుంటే మళ్లీ ఇప్పుడు ఓ సంచలన వ్యాఖ్య చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని త్వరలో తెలుగు రాష్ట్రాల సమితి పార్టీగా మార్చేస్తామని.. తాను పోటీ చేస్తే భీమవరం నుంచి పోటీ చేస్తానని అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్.. అక్కడ మాట్లాడినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ స్పందన వచ్చిందని.. మా సీఎంకు ఏపీలో వచ్చిన ఆదరణ చూశాక అక్కడా పోటీ చేయాలనుకుంటున్నామని అన్నారంట. అంతేకాదు తాను ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే భీమవరం నుండి పోటీ చేస్తానని.. అక్కడైతేనే నేను ఈజీగా గెలుస్తానని చెప్పుకొచ్చారట. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను గెలుస్తానని అంత ధీమాగా ఎలా చెపుతున్నారని అడిగితే ఏముంది అక్కడ కోడిపందేలు లీగలైజ్ చేస్తానని చెప్పారంట. దీంతో కేటీఆర్ మాటలకు అక్కడ ఉన్న వారందరూ నవ్వులు కురిపించారు. అయితే దీనికి రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. కేటీఆర్ చెప్పె మాటలు అంతా ఊరికే అని.. గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలను ఆకట్టుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారని.. అంతకు మించి ఏం లేదని అంటున్నారు.

కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్ట్

కల్తీ మద్యం కేసు ఏ9 నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల నుండి సిట్ అధికారులు మల్లాది విష్ణువును విచారిస్తున్న సంగతి తెలిసిందే. మల్లాది విష్ణువు తో పాటు ఇంకా స్వర్ణ బార్ లైసెన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుంరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కెఎ లక్ష్మిని కూడా పిలిపించిన సిట్ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలినవారిని ఎదరెదురుగా కూర్చోబెట్టి విచారించారు. కానీ మల్లాది విష్ణువు చెప్పిన సమాధానాలకు.. వాళ్లు చెప్పిన సమాధానాలకు పొంతన కుదరకపోవడంతో సిట్ అధికారులు విష్ణువును అరెస్ట్ చేశారు.  విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగామల్లాది సోదరుల అరెస్ట్ తో విజయవాడలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఈరోజు మధ్యాహ్నం లోపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు పెంపు..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు జీహెచ్ఎంసీ ఎన్నికలు 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్న జీవో నిలుపుదల చేస్తూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు పెంచింది. దీనికి శనివారం లోగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు 31 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్న ఈసీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రక్రియపై శశిథర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా కుట్ర పన్నిందని విమర్శించారు. చివరి వరకూ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదని..రిజర్వేషన్లు ఇచ్చాక 45 రోజులు గడువు కోరాం.. మేం కోరిన గడువు హైకోర్టు ఇచ్చిందని అన్నారు.

ఐఎస్ఐ హనీ ట్రాప్ లో సల్వీందర్ సింగ్.!

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్వీందర్ సింగ్ పై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో సల్వీందర్ సింగ్ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు సల్వీందర్ సింగ్ గతంలో లేడి కానిస్టేబుళ్లను కూడా లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్ఐఏ అధికారుల విచారణలో ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని సల్వీందర్ సింగ్ అధికారులకు చెప్పాడు. అలా దర్గాకు వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్గా అధిపతి సోమ్ మాత్రం తాను ఎప్పుడూ సల్వీందర్ సింగ్ ను చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిల్విందర్ సింగ్ పై అనుమానాలు మరింత పెరిగాయి.

రైల్వే జీఎంపై జేసీ ఫైర్.. టీడీపీ ఎంపీల బాయ్ కట్..

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు టీడీపీ ఎంపీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో రవీంద్ర గుప్తా.. టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుప్తా  రైల్వేకు సంబంధించి పలు సూచనలు చేయాలంటూ కోరారు. అయితే ఈ సమావేశానికి హాజరైన జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా రవీంద్ర గుప్తాపై ఫైర్ అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లకు నిధులు కేటాయించలేనప్పుడు, కొత్త రైళ్లను కేటాయించనప్పుడు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేనప్పుడు ఈ సమావేశాలెందుకని ప్రశ్నించారు.  దీంతో జేసీ, రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో వాగ్వాదానికి దిగారు. ఎంపీలు అక్కడి నుండి వాకౌట్ చేశారు. మరోవైపు ఈ విషయంపై ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రైల్వే అధికారుల సమావేశాన్ని టీడీపీ అధికారులు బహిష్కరించలేదని అన్నారు. పైరవీలు చేస్తే తప్ప రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రావని.. వరదలు, తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకు.. రాజధాని, గుంటూరు ప్రాంతాల్లో రైల్వే జోనులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు.

రెండో రోజు విచారణలో మల్లాది.. పొంతన లేని సమాధానాలు..

కల్తీ మద్య కేసులో మల్లాది విష్ణు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన నేపథ్యంలో ఎప్పుడైనా పోలీసులు విష్ణుని అరెస్ట్ చేయోచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న విచారణలో పాల్గొన్న మల్లాది తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.  డీఐజీ మహే్‌షచంద్ర లడ్హా దాదాపు 25 నుండి 30 ప్రశ్నల వరకూ మల్లాదిని అడుగగా దేనికి సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని సిట్ తెలిసింది. అంతేకాదు ఈకేసుకి సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితులు విచారణలో బయటపెట్టిన అంశాలకు, విష్ణు చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిసింది. దీంతో సిట్ అధికారులు గురువారం కూడా విచారిస్తున్నారు. మద్యంలో తెల్లటి ద్రావకం లాంటి పదార్ధం ఎలా కలిసిందని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రశ్నకు గాను ఎవరో కావాలనే ఆ ద్రావకాన్ని కలిపి ఉంటారని విష్ణు చెప్పినట్లుగా తెలిసింది.