బీసీ రిజర్వేషన్లు.. కోల్డ్ స్టోరేజీలోకేనా?

తెలంగాణలో ఇటీవలి కాలంలో రాజకీయంగా ఎంత చర్చనీయాంశమైందో.. అంతకు మించి వివాదాస్పదమైన బీసీ రిజర్వేషన్ల అంశం ఇక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయినట్లేనా?  తెలంగాణ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తేసిందా?  ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్లిన రేవంత్ సర్కార్ చివరికి ఇది జరిగేది లే.. అని ఉసూరు మందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైన తరువాత కూడా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకే సాగుతామని సంకేతాలిచ్చింది. ఈ విషయంపై గురువారం (అక్టోబర్ 23)న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. అయితే గురువారం (అక్టోబర్ 23) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీసం చర్చ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని కోల్ట్ స్టోరేజీలో పెట్టేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంటే కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశ కూడా వదిలేసుకుని.. రిజర్వేషన్ల ఊసెత్తకుండానే ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అవగతమౌతోంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం చర్చించకుండా.. స్థానిక ఎన్నికలలో పోటీకి ఇంత కాలం ఉన్న ఇద్దరు పిల్లలు అన్న నిబంధనను రద్దుపై చర్చింది, ఆమోదం తెలిపింది.   ఇందు కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో స్థానికి ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తుతానికి అటకెక్కించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబుకు మేలు.. జగన్ తీరు!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతే కాకుండా గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కువిమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికీ, తప్పదోవపట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి మేలు చేయవు సరికదా, ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తాయి. ప్రత్యర్థి పార్టీగా వైసీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల రాజకీయంగా ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ వ్యవహరిస్తున్న తీరు.. అధికార కూటమికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎనలేని మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.    తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ విమర్శల వల్ల ఆయనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరనీ, ఎవరో చేసిన మంచి పనుల క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసేసుకుని, అంతా తానే చేశాన్న బిల్డప్ ఇచ్చుకుంటారనీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు నెటిజనులు క్షణం ఆలస్యం చేయకుండా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.  కియా, విశాఖకు ఏఐ వంటి అంశాలలో తొలుత విమర్శలకు దిగిన జగన్ తీరా వాటికి ప్రజల నుంచి వచ్చిన అమోఘమైన సానుకూలతను గమనించి అవి తమ ఘనత వల్లే వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజనులు ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. అనంతపురానికి కియా రాక తన తండ్రి వైఎస్ దేననీ, అదానీతో తాను గతంలో జరిపిన చర్చల వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ వచ్చాయనీ జగన్ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు ఎన్నడూ వేరొకరి క్రిడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అప్పుడూ, ఇప్పుడూ కూడా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరునే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.  ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని చంద్రబాబు కొనసాగించారనీ, అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదనీ గుర్తు చేస్తున్నారు నెటిజనులు. ఇక హైదరబాద్ కు అదనంగా సైబరాబాద్ ఆవిర్భావం చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాలలో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పారు. నెటిజనులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ అసత్యాలను ప్రచారం చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ మైలేజ్ రావడం సంగతి అటుంచి ఉన్న ప్రతిష్ఠ కూడా మసకబారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

వీడిన ఉత్కంఠ.. మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు కొలిక్కి!

బీహార్ రాజకీయాలలో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. మహాఘట్ బంధన్ లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు  ఒక కొలిక్కి వచ్చింది. దీంతో మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది.  ఈ మేరకు పట్నాలోని మౌర్య హోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాఘట్ బంధన్ కూటమి నేతలు తేజస్వియాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సహానీ పేరు ప్రకటించారు. కాగా కాంగ్రెస్ నుంచి పరిశీలకుడిగా వచ్చిన గెహ్లాట్ తేజస్వి యాదవ్ పేరును కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా యువనేత తేజస్వియాదవ్ పై పొగడ్తల వర్షం కురింపిచారు. తేజస్వికి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉందన్న గెహ్లాట్, ఆయన నాయకత్వంలోనే మహాకూటమి పోటీ చేస్తున్నదని స్పష్టం చేశారు.  ఇక పోతే సీట్ల పంపకాల విషయంలో కూడా మహాఘట్ బంధన్ లో తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో పీటముడి పడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈ సారి 70 స్థానాల కోసం పట్టుబట్టింది. అయితే అన్ని సీట్లను ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అనడంతో విభేదాలు మొదలయ్యాయి.  అయితే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి సమస్య పరిష్కరించి, ప్రతిష్ఠంభనకు తెరదించే బాధ్యతను సీనియర్ నాయకుడు గెహ్లాట్ కు అప్పగించింది.  దీంతో బుధవారం (అక్టోబర్ 22) పట్నా చేరుకున్న గెహ్లాట్.. ఆర్జీడీ ముఖ్య నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించడంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది.   దీంతో ఇక కూటమి ఐక్యంగా ప్రచార పర్వంలోకి దిగుతుందని అంటున్నారు. 

మరో సారి వివాదంలోకి కొలికపూడి.. ఈ సారి కేశినేని చిన్ని టార్గెట్ గా ఆరోపించారు

తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో సారి సంచలన వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. సొంత పార్టీ ఎంపీపైనే తీవ్ర ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్యా విభేదాలు మరోసారి రచ్చకెక్కియి. కాగా కొలికపూడి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.  ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి  తీవ్ర ఆరోపణలు చేశారు . కేశినేని చిన్ని పార్టీ పదవులను అమ్ముకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.  విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అవినీతి దందాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెడతానని కొలికపూడి అంటున్నారు. ఇంతకీ ఆయన ఆరోపణ ఏమిటంటే.. 2024 ఎన్నికలలో తిరువురూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాను మూడు దఫాలుగా 60లక్షల రూపాయల చొప్పున చిన్నికి సొమ్ములు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి 50లక్షల రూపాయలు తీసుకువెళ్లినట్లు  పేర్కొంటూ నిజమే గెలవాలి అంటూ కొలికపూడి ఆ పోస్టులో  పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.  దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ కోసం, ప్రజల కోసం తన జేబులో డబ్బులు ఖర్చు చేశానే తప్ప ఎన్నడూ ఎవరి వద్దనుంచీ పైసా తీసుకోలేదని పేర్కొన్నారు.  ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని అన్నారు. తాను ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసునన్న చిన్నికొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇలా ఉండగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కూడా కొలికపూడి వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు  హైకమాండ్ ఆయనను మందలించిందనీ, హెచ్చరించిందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నాయి.  

మాగంటి సునీత‌కు స‌వ‌తి పోరు!?

మొన్న‌టి వ‌ర‌కూ అందరూ సునీత మాత్ర‌మే మాగంటి గోపీనాథ భార్య‌. ఆమె పిల్ల‌లు మాత్రమే ఆయ‌న‌కు వార‌సులు. ఇదొక చిన్న కుటుంబం చింత‌లేని కుటుంబం.  అనుకుంటున్నారంతా. ఇంత‌లో స‌డెన్ ఎంట్రీ ఇచ్చాడు తార‌క్ ప్ర‌ద్యుమ్న‌. తానే అస‌లైన వార‌సుడిననీ, తనకు చ‌ట్ట‌రీత్యా రావ‌ల్సిన ఈ హ‌క్కు తన తండ్రితో  లివిన్ రిలేష‌న్లో ఉన్న సునీత‌కు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయ‌డంతో ఇంటి గుట్టు- రాజ‌కీయం ర‌ట్టుగా మారింది. సునీత‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు ప‌డ‌తాయ‌ని. ఇపుడీ మొద‌టి భార్య కొడుకు కార‌ణంగా బీఆర్ఎస్ ఆశ‌ల‌పై భారీగా నీళ్లు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చ‌నిపోయిన‌పుడు త‌ల‌కొరివి పెట్ట‌డానికి కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న నివాళి స‌భ‌లకు కానీ రాని  తార‌క్ ప్ర‌ద్యుమ్న స‌డెన్ గా తాను గోపీనాథ్ మొద‌టి భార్య మాలినీదేవి కొడుకును,  ఆయ‌న అస‌లు సిసలు రాజ‌కీయ వార‌సుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి ప‌డ్డారు. సునీత త‌ప్పుడు ఫ్యామిలీ స‌ర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్య‌గా నిరూపించే య‌త్నం చేశారు. అక్టోబ‌ర్ 11న ఆ స‌ర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా ర‌ద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇత‌డిచ్చిన కంప్ల‌యింట్ పై సునీత ఈసీకి వివ‌ర‌ణ ఇస్తారు. అంతా బావుంది. మ‌రి ఇప్పుడే ఇత‌డెందుకిలా బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు? ఇత‌డి వెన‌క ఎవ‌రున్న‌ట్టు? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. అయితే ఇత‌డు మాగంటి ఇంటి పేరును కూడా త‌న పేరు చివ‌ర వాడ‌టం లేద‌నీ.. కొస‌రాజు తార‌క్ ప్ర‌ద్యుమ్న అనే పేరుతో చెలామ‌ణీ అవుతున్నాడ‌నీ.. తండ్రి చివ‌రి సారి చూపుల‌కు కూడా రాని ఇత‌డు.. ఇప్పుడే స‌డెన్ గా ఊడి ప‌డ్డం వెన‌క కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయ కుట్ర కోణం ఉంద‌నీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడ‌ర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్  భార్య అవునా కాదా?  లివిన్ లో మాత్ర‌మే ఉన్న జీవిత భాగ‌స్వామా? వంటివి పెద్ద‌గా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశ‌గా చ‌ట్టాలు మారి చాలా కాల‌మే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ ని బ‌ట్టిచూస్తే ఆడ, మ‌గ తేడా లేకుండా ఎవ‌రు ఎవ‌రితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. స‌హ‌జీవ‌న భాగ‌స్వామ్యం కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే సునీత త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రాలే అస‌లు స‌మ‌స్య‌. ఇప్ప‌టికే సునీత నామినేష‌న్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణ‌యం తీస్కుంటారన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది.

జూబ్లీ బైపోల్.. 130 మంది నామినేషన్లు రిజెక్ట్.. బరిలో మిగిలింది 81 మంది!

జూబ్లీ బైపోల్ బరిలో 81 మంది మిగిలారు. ఈ ఉప ఎన్నికలో పోటీకి భారీ సంఖ్యలో  నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం (అక్టోబర్ 22) నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్ల   స్క్రూటినీ ప్రక్రియ దాదాపు 17 గంటల పాటు సాగింది.  వివిధ కారణాలతో 130 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో  130 మంది అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లు  తిరస్కరణకు గురయ్యాయి. దీంతో స్క్రూటినీ అనంతరం జూబ్లీ బరిలో 81 మంది మిగిలారు.  ఇక నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో బరిలో మిగిలిన వారిలో ఎందరు తమ నామినేషన్లను ఉపసంహరిం చుకుం టారన్నది చూడాల్సి ఉంది.  ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి.  

బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ రద్దు చేయండి : ప్రద్యుమ్న

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై  మొదటి భార్య కొడుకు  తారక్ ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి మాలనీదేవికి మాగంటి గోపినాథ్ విడాకులు ఇవ్వలేదని ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్, సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఆమె సునీత నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. మాగంటి గోపీనాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక వారసుడిని నేనే అని చెప్పారు.  పెళ్లి చేసుకోకుండా అఫిడవిట్‌లో తన భర్త అంటూ గోపీనాథ్ పేరును సునీత ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని ఆయన ఆరోపించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని పేర్కొన్నారు. సునీతకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అక్టోబర్ 11న ఆర్డీవో రద్దు చేశారని తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, రెండో సెట్ నామినేషన్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  

దటీజ్ కొండా సురేఖ!

ఎంతైనా మంత్రి కొండా సురేఖ ఘ‌టికురాలే. ఇంటిపేరుకు త‌గ్గ‌ట్టే కొండ‌ల్ని ఢీ కొట్టి మ‌రీ నిల‌బ‌బడుతున్నారామె. ఇంత వివాదం చెల‌రేగితే.. సింపుల్ గా సీఎం రేవంత్ కి  పండ‌గ శుభాకాంక్ష‌లు చెప్పి.. ఆల్ ఈజ్ వెల్. బేఫిక‌ర్.. మైహూనా! అన్న క‌ల‌రింగ్ ఇవ్వ‌గ‌లుగుతున్నారు. నాగార్జున విష‌యంలోనే కొండా వికెట్ డౌన్ అనుకున్నారంతా. ఎలాగోలా ఆ తుఫాన్ త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగారు. అప్పుడు కూడా ఆమె పై తీవ్ర వివాదం చెల‌రేగింది. ఆమె కాబ‌ట్టి ఈ మాత్రం తాకిడి త‌ట్టుకుని నిల‌బ‌డ‌గలిగారు. మ‌రొక‌రై ఉంటే  భూస్థాపితం అయిపోయేవారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట. పొన్నం చూడండి.. అడ్లూరిని ఒక మాట అని ఎంత ఆగమ‌య్యారో.. అదే  కొండా సురేఖ‌.. నాగార్జున ద్వారా కేటీఆర్ ని టార్గెట్ చేస్తే.. అది లోక‌మంతా కూడా కోడై కూసింది. అయినా స‌రే ఆమె బేషరతు సారీలు చెప్ప‌లేదు.. కాకుంటే ఇటీవ‌ల తాను ఒక‌టి అంటే, మీడియా వ‌క్రీక‌ర‌ణ మ‌రొక‌టిగా మారింద‌ని.. చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. స‌రే, కేటీఆర్ ని ఆటాడించ‌డానికి.. దీని వెన‌క స్టోరీ- స్క్రీన్ ప్లే- ఎవ‌రిదీ ఏంట‌న్న‌ది అప్ర‌స్తుతం.  ఇదిలా ఉంటే తాజాగా మ‌రో కొండా మార్క్ వివాదం.. అదే మేడారం జాత‌ర కాంట్రాక్టు, ఓఎస్డీ సుజిత్ వ్య‌వ‌హారం. ఈ విష‌యంలో స్వ‌యంగా తాను రంగంలోకి దిగ‌కుండా.. త‌న కుమార్తె సుస్మిత‌ను దించారు.  మీరుగానీ మా అమ్మ‌ను ట‌చ్ చేస్తే మీ డెక్కెన్ సిమెంటు బాగోతాల‌న్ని బ‌య‌ట పెడ‌తా. ఇత‌ర‌త్రా గుట్టు మ‌ట్ల‌న్నీ విప్పి చెప్పేస్తానంటూ చిన్న ఫీల‌ర్ వ‌ద‌ల‌డంతో అక్క‌డ పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో పీసీసీ మ‌హేష్ కుమార్ గౌడ్, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ వంటి వారంతా రెడ్డి.. అలెర్ట్ ఎస్ మీరు చ‌దివింది క‌రెక్టే.. అది రెడ్డి అలెర్టే.. అయ్యి.. దీని ద్వారా యాంటీ- బీసీ వాయిస్ జ‌నాల్లోకి వెళ్తుంద‌ని ఎక్క‌డిక‌క్క‌డ గ‌ప్ చుప్ అనేలా చేశారు. ఇక్క‌డ కూడా కొండా కొండాయే అన్న  కామెంట్లు వినిపించాయి. అక్క‌డ బ‌య‌ట నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న రెడ్ల‌పై అన్నేసి అనుచిత వ్యాఖ్య‌లు చేసి ఏకంగా పార్టీ నుంచి స‌స్పెండ్ కి గురైతే,   సురేఖ సింపుల్ గా రెడ్లు ఒక బీసీ మ‌హిళ అయిన త‌న‌ను తొక్కాల‌ని చూస్తున్నారంటూ కామెంట్లు చేసి కూడా.. ఇంత హ్యాపీగా త‌న మంత్రి పదవి కాపాడుకుంటున్నారు.  ఎంతైనా కొండా కొండాయే అన్న టాక్ వైల్డ్ గా కాదు కాదు,  వైల్డ్ కే వైల్డ్-  మ్యాక్స్ ప్రో స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ‌ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో. మ‌రి చూడాలి కొండా నెక్స్ ఆప‌రేష‌న్ ఎలా ఉండ‌బోతుందో ?

ఎన్నాళ్ల కెన్నాళ్లకు?.. జగన్ కోసం వచ్చిన కొడాలి

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని.. తన సొంత పేరుతో కంటే.. బూతుల నానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.  ఆ తరువాత గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆయన కనిపించి, వినిపించి చాలా చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి నాని ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు.  అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ణాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.  ఇంతకీ కొడాలి నాని కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటనను ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్నినాని సహా పలువురు ఆయన స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు.   ఇటీవలి కాలంలో కొడాలి నాని ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి నాని తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్లుగా ఇంత కాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో ప్రారంభమైంది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్థి పథకాల ప్రారంభం, అమలు కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి జగన్ తన వంతు ప్రయత్నంగా గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా చెలామణి అయ్యి.. ఇప్పుడు కేసుల భయంతో ముఖం చాటేస్తున్న వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కొడాలి నాని తన రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చినట్లేనా?  ఇక ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తు వేగం పుంచుకుంటుందా? అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది. 

జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ ప్రచార సారథి కేసీఆర్!?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ అజ్ణాతాన్ని వీడి క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశిస్తున్నారా?  బీఆర్ఎస్ కు చావో రేవోగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రచార సారథ్యం వహించనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీ బై పోల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బైపోల్ కు బీఆర్ఎస్  అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీతను రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది.    ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గలిపించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహించాలన్న తలపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచార కర్తగా, ప్రచార సారథిగా ఉంటారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చంది. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్ లు తమ ప్రచారం ప్రారంభించేశారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా జూబ్లీ బైపోల్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు.   

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య

  ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో కె.రామకృష్ణ స్ధానంలో  కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తొలుత విశాఖకు చెందిన జేవీవీ సత్యనారాయణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించిన తరువాత అధిష్టానం నిర్ణయం విరమించుకుంది.  వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ విభాగంలో క్రియాశీలకంగా పని చేశారు. కడప జిల్లాలో కార్మికులు, రైతుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, నిర్వహించిన ఆందోళనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  క్షేత్రస్థాయిలో ఆయనకున్న అనుభవం, క్రియాశీలత ఈ పదవికి ఎంపికవడంలో కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈశ్వరయ్య నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామని సీపీఐ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య ఎన్నో‌ పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. అని జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తెలిపారు.

కార్యకర్తలతో కోటంరెడ్డి వన్ టు వన్ కార్యక్రమం

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యకర్తల కష్టాలు, సమస్యలు వింటూ  ఒక్కొక్క కార్యకర్తతో 15 నిమిషాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే 57 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే  సమావేశం అయ్యారు. పార్టీలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, కార్యకర్తల కష్టాలు స్వయంగా  శ్రీధర్ రెడ్డి  తెలుసుకుంటున్నారు.  ఇప్పటివరకు 700 మంది కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం పూర్తి అయింది.  నియోజకవర్గం మొత్తం కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు.  ఓపికగా ఒక్కొక్క కార్యకర్త సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారం చూపారు శ్రీధర్ రెడ్డి.  నెల్లూరు రూరల్  నియోజకవర్గ వ్యాప్తంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వన్ టు వన్ కార్యక్రమం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీడీపీ నాయకులు తెలిపారు.

జూబ్లీ ఉప ఎన్నిక..నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి లంకల

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ నేతలతో కలిసి వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు.  చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్‌ను అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు బీఆర్‌ఎస్ నుండి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది.    

జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధాని

  జపాన్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనా తకాయిచి  ఎన్నికై చరిత్ర సృష్టించారు. నిన్న జరిగిన పార్లమెంట్ లోయర్ హోస్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనా తకాయిచికి 237 ఓట్లు లభించాయి. దీంతో ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారు. ఎగువ సభ ఆమోదం కూడా పొందిన తర్వాత, ఈ సాయంత్రం ఆమె జపాన్ 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  చక్రవర్తిని కలిసిన అనంతరం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపడతారు. కాగా ఐరన్ లేడి ఆఫ్ జపాన్‌గా గుర్తింపు పొందారు. గత నెలలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మాజీ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగాల్సి వచ్చింది.చైనా విధానాలపై తీవ్ర విమర్శలు చేసే వ్యక్తిగా పేరుగాంచిన తకాయిచి, గతంలో ఒక హెవీ మెటల్ డ్రమ్మర్‌గా కూడా పనిచేశారు. అక్టోబర్ 4న అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు.  అయితే, ఆమె కన్జర్వేటివ్ భావాలు, పార్టీలోని నిధుల కుంభకోణం కారణంగా పాత మిత్రపక్షం కొమెయిటో పార్టీ సంకీర్ణం నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో ఎల్‌డీపీ కొత్త పొత్తు కోసం ప్రయత్నించి, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ)తో సోమవారం సాయంత్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తకాయిచి మాట్లాడుతూ "జపాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాను. భావితరాలకు బాధ్యత వహించే దేశంగా జపాన్‌ను తీర్చిదిద్దుతా" అని హామీ ఇచ్చారు.

కొన‌సాగింపు గాంధీ వ‌చ్చేశాడోచ్!

  ప్రియాంక గాంధీ వాద్రా.. త‌న కొడుకు పేరు.. రెహాన్ రాబ‌ర్ట్ వాద్రా నుంచి రెహాన్ రాజీవ్ గాంధీ అనే కొత్త పేరుకు మార్పించారు. అది కూడా కోర్టు ద్వారా పూర్తి చ‌ట్ట‌బ‌ద్ధంగా. దీంతో రాహుల్ గాంధీతో అంత‌మై పోనున్న గాంధీస్ డైనాస్టీ కాస్తా.. కొన‌సాగనుంది. దీంతో రెహాన్ రాజీవ్ గాంధీ ఇలా పేరు మార్చుకున్నారో లేదో అలా కొన‌సాగింపు గాంధీగా పిలుస్తున్నారంద‌రూ. బేసిగ్గానే ఒరిజిన‌ల్ గాంధీ కుటుంబం నుంచి దేశ రాజ‌కీయాల్లో ఎవ్వ‌రూ లేరు. గాంధీ కొడుకులున్నా వారంతా కూడా ర‌క‌ర‌కాల రంగాల్లో ఉండ‌టం వ‌ల్ల మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ కంటూ ఒక రాజ‌కీయ వార‌సుడు లేకుండా పోయారు. ప్ర‌స్తుతం గాంధీజీ మ‌న‌వళ్లుగా..  రాజ్‌మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ, అరుణ్ మణిలాల్ గాంధీ, తుషార్ గాంధీ వంటివారున్నారు. గాంధీకి నలుగురు కొడుకులు - హరిలాల్, మణిలాల్, రాందాస్, దేవదాస్. వీరి వార‌సులే వారంతా.  నిజ‌మైన గాంధీలు ఇంత మంది ఉండ‌గా.. వీరంతా కూడా రాజ‌కీయాల్లో లేక పోవ‌డంతో.. రాహుల్ గాంధీయే చివ‌రి రాజ‌కీయ‌ గాంధీగా ఉన్నారు. నిజానికి ఈ రాహుల్ గాంధీ కూడా ద ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఇందిర నెహ్రూ- ఫిరోజ్ గాంధీని పెళ్లాడ్డం వ‌ల్ల ఆమె ఇందిరా గాంధీగా మారారు అప్ప‌ట్లో. అలాగ‌ని ఫిరోజ్ గాంధీ సైతం ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఆయ‌న్ను గాంధీజీ ద‌త్త‌త తీస్కోవ‌డం వ‌ల్ల‌.. ఆయ‌న‌కా ఇంటి పేరు వ‌చ్చింది.  ఒక వేళ గాంధీ అన్న పేరే అంత గొప్ప రాజ‌కీయ నామం అయితే.. ఇక రాజ‌కీయాల్లో రాణించానుకున్న వారంతా.. గాంధీ అని పేరు పెట్టేసుకుంటే స‌రిపోతుంది క‌దా!? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఉన్న ఒరిజిన‌ల్ గాంధీల‌ను ప‌క్క‌న పెట్టి ఎక్క‌డో ఉన్న వాద్రాని గాంధీ చేయ‌డం వ‌ల్ల‌.. ఎలాంటి సందేశం ఇవ్వ‌నున్నారీ ప్రియాంక గాంధీ వాద్రా అన్న‌ది ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఇందులో వాద్ర అనేది కూడా ఒక కుటుంబ‌మే. మ‌రలాంట‌పుడు ఆ కుటుంబానికున్న ఆత్మ‌గౌర‌వం త‌గ్గించుకోవ‌డం కాదా ఇదీ? ఆపై గాంధీగా త‌న కొడుక్కి పేరు మార్చ‌డం వ‌ల్ల ప్రియాంక అంత విలువ లేని కుటంబానికి కోడ‌లిగా వెళ్లిన‌ట్టా? మ‌రి అత్తింటి కుటుంబ గౌర‌వాన్ని ఇది త‌గ్గించ‌డం కాదా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  గాంధీ అన్న పేరు పెట్ట‌గానే గొప్ప వాళ్ల‌యిపోతే.. మ‌రి గాంధీజీకి పుట్టిన న‌లుగురు కొడుకులు వారికి పుట్టిన పిల్ల‌లు ఆ పిల్ల‌ల‌కు పిల్ల‌లూ.. రాజ‌కీయంగా ఎంతో ఎత్తుల‌కు ఎదిగి పోవాలి క‌దా!? మ‌రి వారు ఎందుక‌ని అంత‌టి రాజ‌కీయ అనామ‌కులుగా మిగిలిపోయారు??? అన్న చ‌ర్చ‌కు తెర‌లేస్తోందీ ప్రియాంక గాంధీ వాద్రా చ‌ర్య‌ల వ‌ల్ల అంటున్నారు కొంద‌రు.  

ఏఎస్ఐ పై దాడికి పాల్పడ్డ గంజాయి బ్యాచ్

  నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.  మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు..  పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు  పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం : సీఎం రేవంత్

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు. సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.” ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్‌ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్‌ తెలిపారు.

పిఠాపురం వర్మ.. మంత్రి నారాయణ వివాదానికి ఎండ్ కార్డ్

మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని   క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే  విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.   అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదమేం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.  ఈ సందర్భంగా వర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ,  అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు.   కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అభ్యర్థికే మా మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. . నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.