అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులల సందడి.. చూద్దాం రారండి!
posted on Jan 21, 2023 6:07AM
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులులు సందడి చేస్తున్నాయి. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రస్తుతం 26 పులులు ఉన్నాయి. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా మన్ననూర్ లోని వనమాలికలో నూతనంగా నిర్మించిన 6 కాటేజీలు, 8 సఫారీ వాహనాలను ప్రారంభించింది.
ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణహిత టూరిజం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేయడానికి కార్యాచరణ రూపొందించింది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ. 1.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభమయ్యాయి. సహజమైన అటవీ వాతావరణంలోనే పులులను వీక్షించే అవకాశం, వెసులుబాటు కల్పించింది. ఇంకెందుకు ఆలస్యం చూసొచ్చేద్దాం రండి. అన్నట్లు ఇక్కడ ఆన్ లైన్ కాటేజీలు బుక్ చేసుకోవడానికి వెసులు బాటు ఉంది.