‘యువగళం’తో జగన్ కు ఉక్కపోత!
posted on Jan 21, 2023 @ 10:59AM
లోకేష్ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు. తండ్రి బాటలోనే పాదయాత్ర చేయాలని సంకల్పించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి విదితమే. 208 రోజుల పాటు సాగిన ఆ యాత్రలో చంద్రబాబు 2, 817 కిలోమీటర్లు నడిచారు. హిందు పురం నుంచి ఇచ్ఛాపురం దాకా వస్తున్నా మీకోసం అంటే ఆయన అడుగులు వేస్తుంటే యావదాంధ్రదేశం ఆయన వెంట కదిలిందా అనేలా అద్బుత స్పందన వచ్చింద. ఇప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తండ్రి బాట పట్టారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర తన తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ సర్వం సిద్ధంగా ఉంది. ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. అయితే.. నారా లోకేష్ పాదయాత్ర పేరు వినగానే జగన్ సర్కార్ ఎందుకో వణికి పోతోంది.
అందుకే యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా శనివారం (జనవరి 21) వరకూ ఎటువంటి స్పందనా ప్రభుత్వం నుంచి లేదు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతే అవసరం లేదని.. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ప్రకటనలను వారు ఇప్పుడు బయటకు తీస్తున్నారు.
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ పాదయాత్ర తేదీ ప్రకటించారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో తొలి అడుగులు వేసిన లోకేష్.. మొదటి నుంచీ మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందారు. తెలుగుదేశం విధాన నిర్ణయాలలో వెనుక ఉండి కీలకంగా వ్యవహరించిన లోకేష్.. ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా వారితో మమేకం అయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమౌతో ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారు. ఇదంతా ఆయన చంద్రబాబు తనయుడు కావడం వల్లనే జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టే యత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారు.
అన్నిటికీ మించి లోకేష్ పార్టీ కార్యకర్తలతో పూర్తిగా మమేకమై మెలుగుతారు. సాధారణంగా నాయకుడికి కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, వారి వారి పుట్టిన రోజున లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తారు. ప్రధాని సంతకంతో శుభాకాంక్షలు అందడం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలకు అయితే కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు ఇంకా ఉన్నారు.
ఆ కోవలోకే వస్తారు.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు లోకేష్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అదే సమయంలో యువగళంలో యువతను ఆకట్టుకునేలా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకుంటున్నారు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇష్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ బ్రెయిన్ చైల్డ్ . కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అందరితో దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు.
అందుకే లోకేష్ పాదయాత్ర అంటేనే వైసీపీలో వణుకు పుడుతోంది. అనుమతులు ఇవ్వకుండా కుట్రలకు తెరలేపుతోంది. పార్టీ నేతలూ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తోంది. పార్టీ నేతలను విచారణల పేరుతో పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తోంది. ఎలాగైనా సరే పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు లోకేష్ పాదయాత్రపై జనంలో మరింత క్రేజ్ ను పెంచుతున్నాయి. లోకేష్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ ను పాదయాత్ర ప్రారంభమయ్యే జనవరి 27వ తేదీన విచారణకు రావాలని సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే లోకేష్ కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ వీటన్నిటినీ ఖాతరు చేయడం లేదు. పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు గతంలో రికార్డెడ్ గా అందించిన దరఖాస్తులపై పోలీసుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా లేదు. పాదయాత్రకు అనుమతి ఉందని కానీ, లేదని కానీ తేల్చి చెప్పలేదు. అనుమతి లేదని చెబితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏ విషయం చెప్పకుడా నాన్చుతూ చివరి నిముషంగా యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య డీజీపీకి మరో లేఖ రాశారు. యాత్రకు అనుమతి రాకపోతే చట్ట పరంగా ఏం చేయాలన్న విషయంపై కూడా తెలుగుదేశం కసరత్తు చేస్తున్నది. అలాగే విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎలాంటి అనుమతులూ తీసుకోకున్నా.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రను అడ్డుకోలేదు. పటిష్టమైన భద్రత కల్పించి మరీ యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందించింది. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకు వస్తున్న తెలుగుదేశం లోకేష్ పాదయాత్ర విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని జనంలో ఎండగడుతోంది.