తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ చెక్.. బహుముఖ వ్యూహాలతో బన్సల్ రెడీ

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకుండా నియంత్రించడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా రాష్ట్రంలో కమలం పార్టీ అధికార పగ్గాలు అందుకోవాల్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న బీజేపీ అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా వ్యూహరచన చేస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ పకడ్బందీ వ్యూహాన్ని రచించారని పార్టీ శ్రేణులు అంటున్నారు. రాష్ట్ర పార్టీలో అక్కడక్కడా వెలుగులోనికి వస్తున్న విభేదాలను పరిష్కరించి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.  పార్టీలోనే ఉంటూ పెద్దగా క్రియాశీలంగా లేని నాయకులను మళ్లీ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంపై ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.  ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందుబాటులోకి రాకుండా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బీజేపీ నేతల జాబితాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రెడీ చేశారని అంటున్నారు. వారందరినీ తిరిగి క్రియాశీలంగా మార్చడమే టాస్క్ గా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు.  ఒక వైపు పార్టీ శ్రేణులను నిరంతరం క్రియాశీలంగా ఉంచుతూ.. వరుస కార్యక్రమాలతో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఆయనకు తోడుగా పార్టీ సీనియర్లందరినీ ఏకతాటిపై నడిపించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.  ఇప్పటికే ప్రజా గోస- బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు చేపపట్టిన బీజేపీ.. పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరిట కేంద్ర మంత్రుల పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నది. అదే సమయంలో పార్టీ శ్రేణులకు ప్రజలతో మమేకం కావడంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.  తాజాగా కార్నర్ మీట్ లతో ప్రజలకు చేరువ అవుతోంది.  ప్రస్తతం తెలంగాణ పర్యటనలో ఉన్న సునీల్ బన్సల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నాయకులతో వరుస భేటీలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎన్టీఆర్ బొమ్మతో విడుదైన వందరూపాయల నాణెం ఇదే!

నందమూరి తారకరామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ఈ రోజు విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం. సినీ, రాజకీయ రంగాలలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన శకపురుషుడు ఆయన. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి.   ఎన్టీఆర్  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.  రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు.  కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ  తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన అప్పటి  ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించి విజయం సాధించారు.  సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం  ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. 

హింసాకాండే జగన్ పార్టీ రాజకీయ వ్యూహమా?

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వ్యూహాలు శాంతిభద్రతల విఘాతమే లక్ష్యంగా సాగుతున్నాయా? హింసాకాండనే అధికార పార్టీ తన వ్యూహంగా అమలు చేస్తోందా? ప్రజలలో భయాందోళనలను సృష్టించి.. వారు ఓటింగ్ కు, విపక్షాల సభలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంచే వ్యూహాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోందా? అంటే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే ఔననే సమాధానమే వస్తుందని అనిపించక మానదు.  ఏపీలో  ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజకీయ హింసాకాండను గమనిస్తే.. అధికార పార్టీ  వ్యూహాత్మకంగానే ఈ దిశగా పరిణామాలు చోటు చేసుకునే విధంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు అడుగుడుగునా అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి, ఆ నెపంతో విపక్షాల మెబిలిటీని పరిమితం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మీడియా ముఖంగానే పలువురు విపక్ష నేత చంద్రబాబు పేరెత్తితేనే కొడుతున్నారంటూ వ్యక్తం చేస్తున్న ఆవేదనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.   మొత్తం మీద విపక్షాలను ఏదో విధంగా రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టించడమే ధ్యేయంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న భావన వ్యాప్తి చెందకుండా ఉండే వ్యూహంతోనే జనంలో భయాందోళనలను కలిగించే స్థాయిలో హింసాకాండ చెలరేగే వ్యూహంతో జగన్ పార్టీ అడుగులు వేస్తున్నదని  అంటున్నారు. అధికార పార్టీ వ్యూహంలో పోలీసులు సమిధలుగా మారుతున్నారని కూడా వారు విశ్లేషిస్తున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి కారణంగా వారు సైతం విపక్షాల విమర్శలకు కేంద్ర బిందువులుగా మారారని చెబుతున్నారు.  రాజకీయ ప్రత్యర్థులను హింసాకాండ ద్వారా నియంత్రించాలని భావించడం ఏ విధంగా చూసినా సరైనది కాదనీ, ఇది ప్రమాదకరమనీ రాజకీయ పండితులు అంటున్నారు.  

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పై చర్యలు.. డీజీపీకి సీఎస్ ఆదేశం!

నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఏపీ సీఐడీ మాజీ చీఫ్ అనీల్ కుమార్ విషయంలో అక్షరాలా జరిగింది. పదవిలో ఉన్నంత కాలం కన్నూమిన్నూ కానకుండా.. ప్రభుత్వ వ్యతిరేకులన్న ముద్ర వేసి ఇష్టారీతిగా కేసులు బనాయించి, వేధించిన ఫలితంగా ఇప్పుడు ఆయనే స్వయంగా చర్యలు ఎదుర్కొనవలసిన పరిస్థితికి వచ్చారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలకు రంగం సిద్ధమైందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీక రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఏపీ సీఐడీ చీఫ్ హయాంలో రాష్ట్రంలో సామాన్యులపై అక్రమ కేసులు బనాయించి, వారిని కస్టడీలోకి తీసుకుని వేధించడమే కాకుండా.. చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ హై కోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు చేసిన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదపై స్పందించిన కేంద్ర హోం శాఖ  ఈ నెల 3న ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాసి తగు చర్యలు తీసుకోవాలసిందిగా ఆదేశించింది. దీంతో  ఏపీ సీఎస్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని నిబంధనల మేరకు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. కాగా ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న కాలంలో సునీల్ కుమార్ తీరు అత్యంత వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే.   విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన సీఐడీ చీఫ్ గా ఉన్నంత కాలం  ఏపీ సీఐడీ అంటే సునీల్ కుమార్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది.  జగన్ సర్కార్ కొలువుతీరినప్పటి నుంచీ.. ఇటీవల బదలీ అయ్యేంత వరకూ   సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ యాదవ్  తన హయాంలో ఏపీ సీఐడీ ని ప్రభుత్వానికి ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఈ దర్యాప్తు సంస్థ ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తోందన్న విమర్శలను ఎదుర్కొంది. అంతే కాకుండా స్వయంగా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా కూడా జగన్ సర్కార్ ఆయనకు డీజీగా పదోన్నతి కల్పించింది. అయితే పదోన్నతి ఇచ్చిన నెల వ్యవధిలోనే ఆయనపై బదలీ వేటు వేసింది. డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ సునీల్ కుమార్  హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదంగానే మారాయి. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం సునీల్ కుమార్ పై ఉన్నాయి.   అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని పరిశీలకులు సైతం అప్పట్లో  విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ ను ప్రభుత్వం హఠాత్తుగా సీఐడీ చీఫ్ గా తప్పించడం.. ఆ తరువాత ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  ప్రకాశం జిల్లాలోని ఒక రెస్టారెంట్, విశాఖ జిల్లాలో ఓ 50 ఎకరాల భూమి విషయంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించడంతోనే ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసిందన్న ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది.  అది ఎంత వరకూ నిజమన్నది పక్కన పెడితే.. ప్రభుత్వం ఆయనపై వేటు వేయడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని మాత్రం అందరూ అప్పట్లో భావించారు. మొత్తం మీద ప్రభుత్వానికి సానుకూలంగా.. పరిధి దాటి మరీ వ్యవహరించిన సునీల్ కుమార్ పై ఇప్పుడు అదే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం మాత్రం సంచలనంగా మారింది. 

ఖడ్గమృగాలతో ఆటలా.. సరదా తీర్చేశాయ్!

వన్యప్రాణులతో జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రశాంతతకు భంగం కలిగిస్తే చుక్కలు చేపిస్తాయి. పర్యాటకులు వన్యప్రాణులను చూసేందుకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహం ఎంత మాత్రం పనికిరాదు. అలా అత్యుత్సాహాహానికి పాల్పడితే ఏం జరుగుతుంతో పశ్చిమ బెంగాల్ లోని జలదాపరా నేషనల్ పార్కులో జరగిన సంఘటన రుజువు చేసింది. ఆహ్లాదంగా వన్యప్రాణులను చూస్తూ ఎంజాయ్ చేద్దామని వెళ్లిన పర్యాటకులు చివరకు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అని బయటపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే కొందరు పర్యాటకులు రెండు వాహనాలలో జలదాపరా నేషనల్ పార్కుకు వెళ్లారు. కేరింతలు కొడుతూ.. విహారం చేస్తుండగా ఖడ్గమృగాలు కనిపించాయి.   వెంటనే వాటిని వీడియోలు తీయడం ప్రారంభించారు. అయితే వారి అరుపులు, కేకలు ఖడ్గమృగాల ప్రశాంతతకు భంగం కలిగించాయి. వెంటనే పొదలలో నుంచి రెండు ఖడ్గమృగాలు వారి వాహనాల వైపుకు వేగంగా దూసుకువచ్చాయి. వెంటనే రెండు వాహనాలలోని పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. వాహనాలను రివర్స్ లో వేగంగా నడుపుతూ బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో ఓ వాహనం బోల్తా పడింది. అదృష్ఠ వశాత్తూ ఖడ్గమృగాలు వాహనం బోల్తాపడిన తరువాత వారిపై దాడి చేయలేదు. అయితే వాహనం బోల్తాపడటంతో అందులోని వారు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నేషనల్ పార్కులను సందర్శించే పర్యాటకులు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత

గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆదివారం (ఫిబ్రవరి 26) కన్నుమూసింది. సీనియర్ల ర్యాగింగ్‌ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచింది.   సీనియర్ స్టూడెంట్ సైఫ్ గత కొన్నాళ్లుగా ప్రీతిని వేధిస్తున్నాడనీ, వాట్సాప్ గ్రూపుల్లో అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మేసేజ్‌లు పెట్టవద్దని వేడుకున్నా వినకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వరంగల్ పోలీసులు  సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేసినట్లు గుర్తించామని పోలీసులు ధృవీకరించారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. కాగా ప్రీతి మృతితో ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రీతి మృతితో నిమ్స్ ఆస్పత్రి వద్ద వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆందోళనలు చేపపట్టారు. మంత్రీ కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని ఇక్కడ్నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రి వర్గాలు, అధికారులు చర్యలు చేపట్టారు. ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.  మరో వైపు ప్రీతి  మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. తమ కుమార్తెకు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతున్న రోజున అసలేం జరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు చేసిన సైఫ్ తో పాటు, వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానిస్తూ పోస్టులు పెట్టిన వారందరిపై కూడా చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇన్ చార్జికి ముఖం చాటేసిన సోము వీర్రాజు? ఆయన సీన్ అయిపోయిందా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధిష్ఠానం ఆయనపై ఆగ్రహంగా ఉందా? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడానికి సోము వీర్రాజు తీరే కారణమని భావిస్తోందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని తెలియడం వల్లనే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ రాజమహేంద్ర వరం వచ్చినా ఆయనను కలవకుండా మొహం చాటేశారని అంటున్నారు.   ఏపీ బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో మెజారిటీ నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుని సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్రానికి వచ్చారు.  నేరుగా రాజమహేంద్రవరం వెళ్లారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆయనకు ఎదురుపడలేదు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాష్ట్ర పర్యటనకు వస్తే పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఎదురు వెళ్లి ఆహ్వానించడం అన్నది ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా సోము వీర్రాజు అసలు మురళీధరన్ కు ఎదురు పడలేదు. ఆయన రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సమయంలో సోము వీర్రాజు కడప పర్యటనకు వెళ్లారు.  ఏపీ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారు. అందుకే ఆయన మురళీధరన్ కు మొహం చాటేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల ఏపీ నుంచి పలువురు నేతలు హస్తిన వెళ్లి మరీ అధిష్ఠానానికి సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. వారు అలా ఫిర్యాదు చేసి వచ్చారో లేదో.. ఇలా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు.  పోతే సోము వీర్రాజు ముఖం చాటేసినా మురళీధరన్ మాత్రం రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా పలు ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి సోముకు వ్యతిరేకంగా గళమెత్తినట్లు చెబుతున్నారు.   ఏపీ బీజేపీలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభానికీ, నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తికీ సోము వీర్రాజే కారణమని మురళీధరన్ కు పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదని ఆ తరువాతి పరిణామాలు స్పష్టం చేయడంతో బీజేపీ హైకమాండ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.   సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణలా మధ్యలో వచ్చి చేరిన వారే కాకుండా బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచీ పార్టీలో పని చేస్తున్న వారు కూడా సోము వీర్రాజు కారణంగా పార్టీ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు రాజమహేంద్రవరం సమావేశంలో పలువురు మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు.   సోము వీర్రాజునే పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని పలువురు ఈ సమావేశంలో స్పష్టం చేశారంటున్నారు.   

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్టు.. తరువాత కవితేనా?

ముందు నుంచీ అనుకున్నట్లుగానే  లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. సీబీఐ ఆదివారం (ఫిబ్రవరి 26) ఆయనను విచారించి ఆ తరువాత అరెస్టు చేసింది. ఉదయం నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.  ఇక్కడ తప్పని  సరిగా ప్రస్తావించాల్సిన అవసరమేమిటంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ సర్కార్ ను వ్యతిరేకించే పార్టీలూ, నాయకుల లక్ష్యంగానే పని చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణను కేవలం ఆప్ మాత్రమే చేయడంలేదు. బీజేపీయేతర పార్టీలన్నీ చేస్తున్నాయి. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వాటి ప్రతిష్టకు వన్నె తేచ్చేదిగా ఎంత మాత్రం లేదని సామాన్య జనం కూడా అభిప్రాయపడే విధంగా ఉందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అదలా ఉంచితో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతో ఇక తరువాతి వంతు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన కవిత, రామచంద్ర పిళ్లై మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు.   దీంతో తదుపరి అరెస్ట్ కవితనే కావొచ్చని అంటున్నారు. ఇప్పటికే కవితను సీబీఐ ఒక సారి విచారించింది. మరో సారి విచారణకు నోటీసులు జారీ చేసినా.. విచారణకు ఎప్పుడు హాజరు కావాలన్నది స్పష్టం చేయలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా అరెస్టుతో రోజుల వ్యవధిలోనే కవితనూ విచారించే అవకాశం ఉందని అంటున్నారు.   

జోడో .. హస్తానికి జీవన్ టోన్ టానిక్ అవుతుందా?

కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఏమి చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేది పక్కన పెడితే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పాతికేళ్ళకు పైబడిన తమ రాజకీయ జీవితంలో తొలి సారిగా చేపట్టిన భారత్ జోడో యాత్ర... చుట్టూనే ప్లీనరీ చర్చలు సాగిన వైనం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి, అసలు అందు కోసమే ప్లీనరీ సమావేశాలు నిర్వహించారా అన్న విధంగా పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలు,  ప్రస్తుత అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే వరకు, వేదిక ఎక్కిన ప్రతి నాయకుడు, నాయకురాలు జోడో యాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని అభినందిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 145 రోజుల పాటు సాగిన రాహుల్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం  రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలు కాదని  రాహుల్ గాంధీని దగ్గరుండి నడిపించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, వంటి నాయకులు యాత్ర పొడుగునా చెప్పినా, ఇప్పడు ప్లీనరీలో మాత్రం  జోడో యాత్రే కాంగ్రెస్ పార్టీకి  బలాన్నించే,   జీవన్ టోన్  టానిక్ అనే విధంగా ప్రసంగాలు సాగాయి.  నిజమే, దేశంలో మహాత్మా గాంధీ మొదలు చంద్ర శేఖర్ (మాజీ ప్రధాన మంత్రి) వరకు, వైఎస్సార్ మొదలు చంద్రబాబు, జగన్ వరకూ చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు. నిజానికి, నడుస్తున్న పవర్ పాలిటిక్స్ చరిత్రలో పాదయాత్ర రాజకీయ పాఠ్యాంశంగా మారిపోయింది. అలాగే, అధికారానికి దగ్గరిదారి  (షార్ట్ కట్) పాదయాత్ర అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అయితే పాదయాత్ర చేసిన వారంతా పవర్ లోకి వస్తారా , అంటే అయితే అది వేరే విషయం. వేరే చర్చ. అదలా ఉంచి మళ్ళీ,  ప్లీనరీ ప్రసంగాలలోకి వస్తే, ఆ ప్రసంగాలను గమనిస్తే, సోనియా గాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు జోడో యాత్ర సక్సెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారనే విషయం అర్థమవుతుంది. అలాగే  జోడో యాత్ర సక్సెస్ (?) విషయంగా అందరికంటే సోనియా గాంధీనే ఎక్కువ ఆనందించారు. నిజమే, కొడుకు ప్రయోజకుడు అయితే, ఏ తల్లి  మాత్రం సంతోషించదు. అందులోనూ సోనియాజీ, రాహుల్ గాంధీని ప్రయోజకుడిగా చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు  చూస్తున్నారు.  సో .. రాహుల్ జోడో యాత్ర సక్సెస్ విషయంగా సోనియాజీ అంతలా ఆనందపడి పోయారని అనుకోవచ్చును. అందుకే ఆమె  జోడోకు ముడివేసి క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై  చెప్పారు. ఇకపై పదవులకు దూరంగా ఉంటానని చెప్పు కొచ్చారు. అలాగే   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ జోడో ..జీవన్ టోన్ టానిక్  అందించిన శక్తితో రేపటి ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే విశ్వాసాన్నిసోనియాజీ వ్యక్తం చేశారు.   అలాగే, రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రతో తాను ప్రజలకు మరింత దగ్గరయ్యానని అన్నారు. జోడో యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. జోడో యాత్ర నేర్పిన పాఠాలతో కాంగ్రెస్‭ పార్టీకి పూర్వవైభవం రానుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అయితే నిజంగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఆశిస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ స్థితిని తీసుకు వస్తుందా? కనీసం  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశిస్తున్న విధంగా, 2024 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ, సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? అంటే  అది ఇప్పుడే చెప్పలేమని, 2024కు ముందు 2023 పరీక్షను  ముఖ్యంగా, కర్ణాటక   ఫలితాలను బట్టే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నిజానికి, అంత వరకు కూడా ఆగవలసిన అవసరం లేదు..   వచ్చే నెల మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోడోయాత్ర హిట్టా ..ఫట్టా అనేది తెలిపోతుందని పరిశీలకులు అంటున్నారు.

నితీష్ తో బీజేపీ పర్మనెంట్ కటీఫ్ నిజమేనా?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి  అంటారు.  ఇదో  నానుడి. అయితే ఈ నానుడి అన్ని సందర్భాలలో నిజం అవుతుందా అంటే  లేదు. అందుకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి, అంటున్నారు, అది కూడా మరెవరో కాదు,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.  అవును  బీజేపీతో తెగతెంపులు చేసుకుని  కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టిన, బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్  తో మరోమారు చేతులు కలిపే ప్రశ్నే లేదని అమిత్ షా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నితీష్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోయాయని విస్పష్టంగా తేల్చేశారు. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  లో బీజేపీ, టీడీపీ ఎన్ని సార్లు పొత్తు  పెట్టుకున్నాయో అన్నిసార్లూ విడిపోయాయి. అయినా మళ్ళీ  మళ్ళీ కలుస్తూనే ఉన్నాయి. అలాగే  ఇతర పార్టీలు కూడా, ‘చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ’  టైపులో పొత్తులు పెట్టుకోవడం, విడి పోవడం మళ్ళీ కలవడం .. మళ్ళీ విడాకులు .. మళ్ళీ .. ఇలా రాజకీయ చక్రం తిరుగుతూనే వుంది.  అయితే, ఎన్నికల వ్యూహకర్త అవతారం చాలించి, ప్రత్యక్ష రాజకీయాల్లో పాదం మోపేందుకు బీహార్ లో పాదయాత్ర వేస్తున్న ప్రశాంత్ కిశోరే, నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించిన నేపథ్యంలో అమిత్ షా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో  ఆ తర్వాత ఏడాదికే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, నితీష్ పార్టీ జేడీ(యు), పాశ్వాన్ పార్టీ, ఎల్జీపీతో కలిసి ఎన్డీఎ కూటమిగా పోటీ చేసి విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలలో జేడీయు కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా, ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదిలివేసింది. అయితే  గత ఆగష్టులో నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని  ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు.   ఈ నేపథ్యంలో బీహార్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని నిలుపు కునేందుకు నితీష్ కుమార్ మీద ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 40 లోక్ సభ స్థానాలకు గానూ ఎన్డీఎ 39 (బీజేపీ 17, జేడీయు 16, ఎల్జీపీ 6 సీట్లు ) గెలుచుకుంది. ఈనేపథ్యంలోనే వెస్ట్ చంపరాన్ జిల్లాలోని లారియాలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. నితీష్ కుమార్ , బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి కావాలనే కోరికతో బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ తో బీహార్ సీఎం నితీష్ చేతులు కలిపారని అన్నారు. జేడీయూ, ఆర్జేడీలది అపవిత్ర కూటమిగా అభివర్ణించారు.నితీష్ కుమార్‌కు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసిందని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా చేసేందుకు జేడీయూ సుప్రీం అంగీకరించారని, ఆయనే ఆటవిక పాలనగా ముద్ర వేసిన లాలు పాలన మళ్ళీ తెచ్చేందుకు నితీష్ కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.  ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే నితీష్‌తో భాగస్వామ్యంపై విసుగెత్తిపోయామని, ఇక ఎప్పటికీ ఆయనకి బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. ''జయప్రకాష్ హయాం నుంచి నితీష్ కాంగ్రెస్, జంగిల్ రాజ్‌పై పోరాడారు. ఇప్పుడు లాలూ ఆర్జేడీ, సోనియా గాంధీ కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. ప్రధాన మంత్రి పదవి కావాలనే ఆశతో అభివృద్ధి వాది నుంచి అవసరవాదిగా మారారు'' అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బీహార్ పరిస్థితి బాగోలేదని, శాంతిభద్రతలు లేవని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను చంపుతున్నారని, నితీష్ మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి నిషేధించారని గుర్తుచేశారు. బీహార్‌లో ఆటవిక పాలనకు చరమగీతం పాడాలంటే ఒకే మార్గం ఉందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో  నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిని చేయాలని అన్నారు. బీహర్‌లో ప్రతి రోజూ ఏదో ఒక హత్య, అత్యాచారం వార్తలు వెలుగుచూస్తున్నాయని, నితీష్ కుమార్‌కు, ఆయన ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.  గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, అయినప్పటికీ ప్రధానమంత్రి ఇచ్చిన మాట కోసం మరోసారి నితీష్‌ను ముఖ్యమంత్రిని చేశారని అమిత్‌షా అన్నారు. బీహార్‌ వెనుకబాటుతనాన్ని నితీష్, లాలూ ఎప్పటికీ పోగొట్టలేరని, రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. ఇందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగంలో సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులు, 370 అధికరణ రద్దు, ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపైప నిషేధం వంటి అంశాలను అమిత్‌షా ప్రస్తావించారు.అయితే బీజేపీ నిజంగానే, నితీష్ కుమార్ తో శాశ్వత తెగతెంపులు చేసుకుందా? అంటే  అది ఇప్పుడే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే  జెడీయులోని ఆర్జేడీ వ్యతిరేక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని, జేడీయులో చీలిక తెచ్చే ఉద్దేశంతో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు.

కొత్త గవర్నర్ ఎదుట పాత డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్  రెండురోజుల కిందట (ఫిబ్రవరి 24) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు తిరగక ముందే ఆయన ఢిల్లీ వెళ్లారు. రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరి కొందరు కేంద్ర మంత్రులతో సమావేశ మయ్యారు. నిజానికి  ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ ఢిల్లీ వెళ్ళడం వెనక  ఏదో ఉందని అనుకోవలసిన అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత కేంద్ర పెద్దలను కలిసి కృతఙ్ఞతలు చెప్పడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే, గవర్నర్  సయ్యద్ నియామకం జరిగిన క్షణం నుంచి  అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ సయ్యద్ ఢిల్లీ పర్యటనకు కొంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నా ఉండవచ్చును. అందుకే గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాలలో అసక్తి రేకెత్తిస్తోంది.   అదలా ఉంటే  గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే, సిబిఐ మాజీ జేడీ  వీవీ లక్ష్మీనారాయణ రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం సమర్పించాలని  గవర్నర్ ను కోరారు. ఈ మేరకు ఆయన, ట్విట్టర్ ద్వారా నేరుగా గవర్నర్ కు వినతి పత్రం పోస్ట్ చేశారు. అంతేకాదు, గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సేతారామన్ ను ట్యాగ్ చేశారు. నిజానికి  కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనతో ఇంచు మించుగా 40 నిముషాలకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా, శాంతి భద్రతల పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించినట్లు సమాచారం.  అదలా ఉంటే   రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని  తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు  మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే  జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష డిమాండ్ ను ఇంతవరకు పట్టించుకోలేదు. అందుకే  జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితిని  నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అలాగే  మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని  ఆ విధంగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మీనారాయణ గవర్నర్ ను కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడుతోన్ననేపథ్యంలో ప్రజల్లో గందరగోళం నెలకొందని లక్ష్మినారాయణ వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని తెలుసుకునే అధికారం ప్రజా ప్రతినిథులకే కాకుండా ప్రజలకు కూడా ఉంటుందని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యకలపాలలలో పారదర్శకత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని  బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో వుంది. ఆయన ఎలా స్పందిస్తారనేది చూడవలసి ఉందని అంటున్నారు.

విపక్షాల పై కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్  మనసులో ఏముందో  ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో  ఉహించడం కష్టం. అందుకే  అయన ఏమి చేసినా  ఏమి చేయక పోయినా ఏం మాట్లాడినా, ఏదీ మాట్లాడక పోయినా మీడియా ఫోకస్ మాత్రం ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. ఈ మధ్య కొంత కాలంగా ఆయన  మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. కానీ  గత మూడు నాలుగు రోజులుగా ఆయన  బీఆర్ఎస్ ముఖ్యనేతలు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టి  కేద్రీకరించి నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.  రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మునుగోడు ఉప ఏన్నిక తర్వాత అంతర్గత కలహాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మరో మారు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు రెండూ ఎవరి దారిన వారు, తమ పని తాము చేసుకు పోతున్నారు. ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంచార్జి, మాణిక్‌రావు ఠాక్రే ఎక్కువ తక్కువలు లేకుండా, అందరికీ బాధ్యతలు అప్పగించారు. ఎవరికీ వారు హాత్ సే హాత్ జోడో  యాత్రలలో బిజీ అయిపోయారు.  కొట్లాటలు సర్దు మణిగాయి. కార్యకర్తలలో మళ్ళీ జోష్ పెరిగింది. మరో వంక బీజేపీలో అంతర్గత తగవులు తెరపై కొచ్చాయి. మరో వంక బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఎందుకనో ఏమో కానీ, ముందులా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద చూపడం లేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలు వరసగా వాయిదా పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పొగడ్తలతో ముంచెత్తి, రాజేసిన సెగలు, పొగలు  బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సో ఇదే అదనుగా ముందస్తుకు వెళితే, బీజేపీని కట్టడి చేయడం మరింత సులువవుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓ పది సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టుకొచ్చుకోవడం ఈజీ అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి మళ్ళీ మరో మారు ముందస్తు ఎన్నికలపై మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.  అయితే ముందస్తు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా, నవంబర్ , డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికలకు, ఆరు నెలలు ముందుగా అంటే, ఏప్రిల్, మే నాటికి అభ్యర్ధులను ఖరారు చేసందుకు వీలుగా ముఖ్యమంత్రి ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి సిట్టింగులు అందరికీ సీట్లు ఖాయం అని ప్రకటించారు. అయితే ఇప్పడు, కొంత మందికి మొండి చేయి చూపించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.  వామ పక్ష పార్టీలతో ప్రత్యక్ష పొత్తులు, కాంగ్రెస్ లోని ఒక వర్గంతో లోపాయికారి ఒప్పందాలు, తదితర తాజా పరిణామాలను బేరీజు వేసుకుని కొత్త జాబితా సిద్దం చేస్తునట్లు చెపుతున్నారు. సర్వే నివేదికలు సాకుగా చూపి కొందరు సిట్టిగులకు మొండి చేయి చూపించే అవకాశం ఉందని అంటున్నారు.  అందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ విస్తరణ చేయాలంటే.. మూడో సారి గెలిచి తీరాలి. మూడోసారి గెలవాలంటే ముందస్తుకు పోవడంతో పాటుగా, సిట్టింగులలో కొందరు త్యాగాలకు సిద్దం కావలసి ఉంటుంది. ముందస్తుకు వెళ్ళేలా ఉంటే, ఏప్రిల్ మే లలో  గే కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా నడుస్తోంది. గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల్నిప్రకటించారు. ఈ సారి కూడా అలా జరిగే అవకాశం ఉందని, అంటున్నారు. ముందస్తుకు వెళ్ళేలా ఉంటె వారం పది రోజుల్లో అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని లేదంటే, ఏప్రిల్ మే నెలలలో అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

రాజకీయాలకు సోనియా గుడ్ బై?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారా?  చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‭పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం రెండో రోజున  శనివారం (ఫిబ్రవరి 25)  పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆమె చేసిన  ఆసక్తికర వ్యాఖ్యలు, ఈ ప్రశ్నను తెరపైకి తెచ్చాయి.  నిజానికి సోనియా గాంధీ తన ప్రసంగంలో రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నానని స్పస్తమైన ప్రకటన ఏదీ చేయలేదు. కానీ  రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర  విషయాన్నిప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో తన  ఇన్నింగ్స్  పూర్తి కానుండటం సంతోషంగా ఉందని అన్నారు. దీంతో  ఆమె రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని  ఆమె భారాత్ జోడో యాత్ర నేపధ్యంగా తానూ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పు కున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించారని, అలాగే మరో మరు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వేకరించనని మాత్రమే చెప్పారని పార్టీ స్పష్టం చేసింది.  సహజంగా, రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదు. అయితే వయసు మీద పడిన తర్వాత లేదా అనారోగ్య సమస్యల కారణంగా కొందరు రాజకీయ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అయితే, ఇంచు మించుగా రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సోనియా గాంధీ మాత్రం  కారణాలు ఏవైనా చాలా కాలంగా రాజకీయ ఒత్తిళ్ళ నుంచి విశ్రాంతి కోరుకుంటున్నారు. నిజానికి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే 2018లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కుమారుడు  రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా  చేయడంతో, గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె  మరో మారు  పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయినా, ఎంత కాలమైనా రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలు తీసుకోకపోవడంతో గత సంవత్సరం అక్టోబర్ లో   మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  అదలా ఉంటే భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అన్న ఆమె ఆ యాత్ర కోసం రాహుల్ గాంధీ పట్టుదలతో పనిచేశారన్నారు.  ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలను పునరుద్దరించేందుకు రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు. రాహుల్ గాంధీకి అండగా నిలిచి జోడో యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలు ఖర్గే నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు దేశానికి ఇది ఎంతో కీలక సమయమని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. బీజేపీ,  ఆర్ఎస్ఎస్ పాలనలో కనికరం అనేది లేకుండా పోయిందని, ప్రతి సంస్థను అణచివేసి, స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.  మోడీ నిర్ణయాలన్నీ కొద్ది మంది వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయని సోనియా మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో.. బీజేపీని ఓడించాలని కార్యకర్తలకు సోనియా పిలుపునిచ్చారు.  అదలా ఉంటే సోనియా గాంధీ తమ ప్రసంగంలో రాజకీయ జీవితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని సోనియా తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు జరిగిన ప్లీనరీలో, పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌నకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ ప్లీనరీలో చర్చించారు.

తెలంగాణ ఆర్టీఐ ఖాళీ.. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ

తెలంగాణ ఆర్టీఐ ఖాళీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ లో ఐదుగురు కమిషనర్లు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమిర్ హుస్సేన్, గుగులోతు శంకర్ నాయక్ లు శుక్రవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఇప్పుడు సమాచార హక్కు కమిషన్ లో కేవలం సిబ్బంది మాత్రమే మిగిలారు. రాష్ట్రప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 2017లో బుద్దా మురళిని సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ గా  ఎంపిక చేసింది. ఆ తరువాత సీనియర్ జర్లలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్గా, సయ్యద్ అమిర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి శంకర్ నాయక్ లను కమిషనర్లుగా ఎంపిక చేసింది. వీరి నియామకానికి అప్పటి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో అందరూ ఓకే సారి ప్రమాణ స్వీకారం చేశారు. గడువు ముగియడంతో అందరూ ఒకేసారి పదవీ విరమణ చేశారు. ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి అయితే ఈ ఏడాది జనవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచీ ప్రధాన కమిషనర్ నియామకం జరగలేదు. ఇప్పుడు కమిషనర్లు కూడా పదవీ విరమణ చేయడంతో ఆర్టీఐ ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం కమిషనర్ల నియామక ప్రక్రియ ఇంకా ఆరంభించలేదు. ఎప్పడు ఆరంభిస్తుందన్న క్లారిటీ కూడా లేదు. దీంతో ఆర్టీఐ నామమాత్రంగా మిగిలిపోయినట్లు అయ్యింది. సమాచార హక్కు చట్టం లక్ష్యం నీరుగారుతున్న పరిస్థితి ఏర్పడింది. 

కన్నా దారిలో ఇంకొందరు.. తెలుగుదేశంలోకి వలసల జోరు!

ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం వేడెక్కుతుంది. అది సహజమే. రాజకీయ పార్టీలలో గెలుపు గుర్రాల వేట మొదలవుతుంది. అదీ సహజమే. రాజకీయ నాయకుల్లో టికెట్ల ఆరాటం ఆరంభమవుతుంది. రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగైపోయిన నేపధ్యంలో అటు పార్టీలు, ఇటు నాయకులు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతారు. అది కూడా సహజమే. కానీ ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే గడువు ఉంది.  కానీ అప్పుడే పార్టీల్లో.. నాయకుల్లో ఎన్నికల హడావుడి పెరిగిపోయింది. గెలుపు గుర్రాల వేట కూడా ఆరంభమైపోయింది.  ఇటు పార్టీలు అటు నాయకులు ఎన్నికల మూడ్  లోకి వెళ్లి పోయారు. ఓ వంక వడపోతలు మరోవంక గోడ దూకుడులు  అప్పుడే జోరందుకున్నాయి.  ముఖ్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించడంతో పోటీకి సిద్దమవుతున్ననేతలు, ఆశావహులు, స్థానిక సమీకరణాలు, పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలు బేరీజు వేసుకుని, ఉన్న పార్టీలో ఉండడమా,   గోడ దూకడమా అన్న లెక్కల్లో బిజీ అయిపోయారు. మాజీ మంత్రి,  రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో..  ఇప్పడు రాజకీయ వర్గాల్లో  నెక్స్ట్ ఎవరు?  అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా  బీజేపీ నుంచి బయటపడేది ఎవరన్న చర్చ స్పీడప్ అయ్యింది. నిజానికి కన్నా వెంట ఆయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలోనే తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  కేవలం అనుచరులు మాత్రమే కాదు, సహచరులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనే  ప్రచారం సాగుతోంది.  రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు చాలా మంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఇతర పార్టీల లోకి సర్దుకున్నారు. ఇప్పడు బీజేపీ విషయంలోనూ బీజేపీ నాయకులు అదే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  నిజానికి అప్పట్లో  టీడీపీ  వైసేపీలలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఏదో విధమైన రాజకీయ ఫలాలను ఎంతో కొంత మేర అందుకున్నారు. కొందరు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలలో మంత్రులయ్యారు. మరి కొందరు ఇతర అధికార పదవులు  అందుకున్నారు. రాజకీయంగా నిలదొక్కుకున్నారు. కానీ  కమలం గూటికి చేరిన కీలక నేతలు ఎవరికీ కూడా ఎలాంటి పదవువులూ దక్కలేదు. రాష్ట్రంలో ఆ అవకాశమే లేదు. కేంద్రంలో అవకాశం ఉన్నా  బీజేపీ నాయకత్వం బయటి వారిని బయటనే ఉంచేసింది. దీంతో సహజంగానే, బీజేపీలోని మాజీ కాంగ్రెస్ నాయకులు  ఏదో ఆశించిన బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు తీవ్రమైన ఉక్క పోతకు గురి అవుతున్నారు. ఇప్పుడు అలాంటి వారంతా, కన్నా ..  బాటలో కొత్త దారులు వెతుక్కుక్కుంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీలో చేరిన వెంటనే పని  ప్రారంభించిన కన్నా లక్ష్మినారాయణ చాలా మంది మాజీ మిత్రులు, బీజేపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారని చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా  ఎవరి పేర్లూ చెప్పక పోయినా కొందరు బీజేపీ సీనియర్లు తనతో టచ్‌లో ఉన్నారన్నారని.. వారంతా త్వరలోనే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని.. ఇప్పటికే అనుచరులతో మాట్లాడుతున్నారని.. అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అయితే, కన్నా తనతో టచ్ లో ఉన్నవారిలో,  దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారని వస్తున్న వార్తల్లో  నిజం లేదని స్పష్టం చేశారు. అయితే, నిజానికి కన్నా టీడీపీలో చేరతారనే ప్రచారానికి ముందు నుంచే, టీడీపీలో చేరే వారిలో పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. సుదీర్ఘ కాలం తరువాత ఇటీవల  దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పటి నుంచి, ఈ ప్రచారం జరుగుతూనే వుంది.  అయితే పురందేశ్వరి ప్రస్తుతం తనతో పాటు టీడీపీలో చేరడం లేదని చెప్పిన కన్నా,  ఆమె భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉందని అన్నారు, అంటే  ఆమె కూడా  తెలుగు దేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని అనుకోవచ్చుననే సంకేతం కన్నాలక్ష్మీనారాయణ ఇచ్చారు. పురందేశ్వరి విషయం ఎలా ఉన్నా  కన్నా... మాజీ కాంగ్రెస్, బీజేపీ   మిత్రులకు టీడీపీ ఎంట్రీకి రోడ్డు మ్యాప్ క్లియర్ చేసినట్లేనని, ఇప్పటికిప్పుడు కాకపోయినా, ముందుముందు టీడీపీలోకి వలసలు జోరందుకుంటాయని   అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే ముందు ముందు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తధ్యమని అంటున్నారు.

నూతన సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఏపీల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తన జన్మదినం అయిన ఫిబ్రవరి 7 ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  అడ్డు రావడంతో ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా  ఏప్రిల్ 14న అంబేడ్కర్ రోజున సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించాలనీ, అదే రోజున  సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ  సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒకే వేదికపై నలుగురైదుగురు ముఖ్యమంత్రులు కూర్చుంటే.. బీఆర్ఎస్ సభపై దేశ వ్యాప్త చర్చ జరుగుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సభకు పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా ఆహ్వానించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

మరో మెడికో ఆత్మహత్య

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్మయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆస్పత్రిలో ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉంది. అంతలోనే మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి  బలవన్మరణానికి పాల్పడ్డాడు.  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళా. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) తన హాస్టల్ గదిలో శుక్రవారం ( ఫిబ్రవరి 24) రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసరి హర్ష ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం డిన్నర్ చేసేంత వరకూ తోటి విద్యార్థులతో కలివిడిగా తిరిగిన హర్ష ఆ తరువాత తన గదిలోకి వెళ్లిపోయాడనీ, ఉదయం చూసే సరికి ఉరి వేసుకుని మరణించాడని సహ విద్యార్థులు చెబుతున్నారు.   దాసరి హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా చింతగూడ.   

రాజకీయాలలో దార్శనికుడి తొలి అడుగుకు నేటితో నాలుగున్నర దశాబ్దాలు

రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా ఆయన దార్శనికతను వేనోళ్ల పొగుడుతారు. అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా, ఎవరితోనూ రాజీపడరు. ఆయనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హైదరాబాద్ బిజినెస్ స్కూల్, హైటెక్ సిటీ, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రగతి దారిలోనూ తొలి అడుగు ఆయనదే. అటువంటి దార్శనికుడు రాజకీయ ప్రస్థానం నేటికి నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఔను సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 25, 1978) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు తొలిసారి నామినేషన్ వేశారు.  అప్పటి నుంచీ చంద్రబాబుది ఒకే దీక్ష, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగానే సాగింది. అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ చంద్రబాబు రాజీపడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న సమయంలోనూ.. లేని సమయంలోనూ కూడా ఆయన రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసమే తపించారు. సంపద సృష్టి జరగాలి.. ఆ పెరిగిన సంపద ఫలాలు పేదవాడికి చేరాలి. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఆలోచన, తపన, కృషి ఇందుకే. అడుగులూ ఆ లక్ష్య సాధనకే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సారిగా ఎన్నికల బరిలో అడుగుపెట్టి  నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో సంక్షోభాలను అధిగమించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అపనిందలు మోశారు. అన్నిటినీ ప్రజా జీవితంలో ప్రజల కోసం అడుగులు వేయడానికి లభించిన అవకాశాలుగానే భావించి ముందుకు సాగారు. దార్శనికత ఉన్న నేతగా.. దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు విపక్ష నేతగా క్రీయాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లుగా విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు.  ప్రజాక్షేత్రంలో ఇంతగా  సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నేత వర్తమాన రాజకీయాలలో మరోకరు కనిపించరు. అతి పిన్న వయస్సులోనే చట్టసభకు ఎన్నికైన నాయకుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు.   తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా  రాజకీయ కుట్ర జరిగి నెల రాజు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి నడిపించారు.  1985 ఎన్నికల్లో తెలుగుదేశం విజయంలో కీలక భూమిక పోషించారు.    1995 సెప్టెంబర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆయన హయాంలోనే ఇప్పుటి ఐటీ హబ్ సైబరాబాద్ నిర్మాణమైంది. సాహసోపేతంగా  ఆర్థిక సంస్కరణలను  అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి దారిలో పరుగులు పెట్టించారు. అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చారన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ సారధ్యంలో బీజేపీ, కమ్యూనిస్టులు సహా దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.   నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ  ఏర్పాటు వెనుక క్రియాశీలంగా వ్యవహరించిందీ చంద్రబాబే.   దేశ ప్రధాన మంత్రుల నియామకంలోనూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్నే మిగిలిన పార్టీలన్నీ శిరోధార్యంగా భావించాయి. ఇక రాష్టప్రతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్ ఎంపికలో కీలక భూమిక పోషించింది కూడా చంద్రబాబునాయుడే అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.   విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం 208 రోజులు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజనతో  అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్నిటా అగ్రస్థానంలో నిలబడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నమ్మారు. అందుకే  మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగల నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొట్టమొదట గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడు కనుకనే   2014 ఎన్నికలలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సరే ఆ తరువాత 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అభ్యర్థనకు తోడు వివేకా హత్య, కోడి కత్తి కేసుల కారణంగా వచ్చిన సానుభూతి పవనాలతో వైసీపీ విజయం సాధించింది. కానీ విజయం సాధించిన స్వల్ప కాలంలోనే జనంలో ఆ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల భ్రమలు తొలగిపోయాయి. వివేకా హత్య వెనుక ఉన్నదెవరు? కోడికత్తి సంఘటన డ్రామా ఎవరి వ్యూహం అన్నవి జనానికి అర్ధమౌతున్నాయి. దానికి తోడు రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు.. అప్పులే తప్ప అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ జనం చంద్రబాబు వైపు చూస్తున్నారు.  తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ప్రజల పక్షానే నిలిచారనడానికి ఇప్పుడు ఆయన సభలకు జనం బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  వైయస్ జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్ అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు దూరం పెట్టారు? ఎందుకంటే.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేస్తున్న పాదయాత్రలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. అలా వచ్చిన రైతులను.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఔను జగన్ ఆయనను దూరం పెట్టడానికి అదే ఏకైక కారణం. ఈ సంగతి స్వయంగా   ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సరే ఆ తరువాత జరిగిన పరిణామాలతో  కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు కోటం రెడ్డికి వచ్చిన పరిస్థితే వైసీపీ కీలక నేత విజయసాయికి వచ్చింది. విజయసాయినీ జగన్ దూరం పెట్టారని పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయనను జగన్ ఎందుకు దూరం పెట్టారు అన్న ప్రశ్నకు  ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విజయసాయి అక్కడకు వెళ్లి పరామర్శించడం,  ఆయన మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల వరకు నందమూరి, నారా ఫ్యామిలీలు ఎలా అయితే అంత్యక్రియల ఏర్పట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారో..  విజయసాయిరెడ్డి కూడా చేశారు. ఎందుకంటే.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డి భార్యకు సొంత చెల్లెలి కుమార్తె కావడంతో ఆ బంధుత్వంతో విజయసాయి కూడా అక్కడే ఉండి అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకున్నారు.   బెంగళూరు నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకు వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డి అక్కడే ఉండి.. తారకరత్నకు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను   విజయసాయిరెడ్డి పలకరించి.. వారి పక్కనే కూర్చొని కొద్ది సేపు   ముచ్చటించారు.  అయితే ఈ వ్యవహారాన్ని ఎవరూ పొలిటికల్ గా చూడలేదు. ఒక విషాద సమయంలో బంధువు కుటుంబానికి విజయసాయి అండగా నిలుచున్నారనే భావించారు. అయితే  విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని అధికార వైసీపీ అధినేత జగన్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తనను ధిక్కరించడంగానే భావించారు.   ఎందుకంటే.. వైసీపీ  అధిష్టానం  రాజకీయ ప్రత్యర్ధులు అంటే వ్యక్తిగత శత్రువులుగానే భావిస్తుంది.  ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తార్కానమే.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్.. అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు  వైసీపీ నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది. అందులో యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, ట్రేడ్ యూనియన్, వాణిజ్యం, సాంస్కృతిక, పబ్లిసిటీ, నేత కార్మికులు, వైద్యులు, ఐటీ, వికలాంగులు, సేవాదళ్,  గ్రీవెన్స్ సెల్‌తోపాటు వివిధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఇలా అన్ని జిల్లా స్థాయి పార్టీ అనుబంధ విభాగాల నియామకంపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్తగా పేర్కొంది. అది ఇప్పుడు అసలు సిసలు చర్చకు.. అదే వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెట్టారన్న చర్చకు తెరలేపింది.  ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. అదీకాక విజయసాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు.  అటువంటి విజయసాయిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించేసింది. విజయసాయికి కో ఇన్ చార్జ్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆ స్థానంలో నియమించారు.    విజయసాయిరెడ్డి వ్యవహారశైలి గత కొన్ని రోజులుగా మారింది ఈ విషయాన్ని  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజే కనిపెట్టారంటే..  పార్టీ అధిష్టానం కనిపెట్టలేదా? ఇంతకీ ఆ మార్పు ఏమిటంటే  విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో హీట్ ను పూర్తిగా తగ్గించేశారు. సంసారపక్షంగా, హుందాగా ఆయన ట్వీట్లు ఇటీవలి కాలంలో ఉంటున్నాయి. అదే గతంలో అయితే విజయసాయి  చంద్రబాబు, లోకేష్ పై.. ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడే వారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దలతోనే కాదు.. అక్కడి అధికార కేంద్రాలతో సైతం ఆయన చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటారు. అందుకే ఆయనకు రాజ్యసభకు ప్యానెల్ ఛైర్మన్ పదవి  దక్కింది.. అలాగే తాజాగా సంసద్ రత్న అవార్డు కూడా వచ్చింది. దీంతోనే వైసీపీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని చెబుతున్నారు.  ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. విజయసాయిరెడ్డిని జగన్ ఇక పక్కన పెట్టేసినట్లేనని అంటున్నారు.  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయనకు ఉద్వాసన పలికినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.