విచారణకు సహకరించకుంటే అరెస్టే!?
posted on Mar 9, 2023 6:09AM
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న భావనను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల, ముఖ్యంగా శుక్రవారం (మార్చి 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనాల్సి ఉంది కనుక తాను శుక్రవారం (మార్చి 9) విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపారు.
అయితే ఆమె విజ్ణప్తిపై ఈడీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. హోలీ కారణంగా ఈడీ అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె పంపిన సమాచారానికి బదులు రాలేదన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, ఆమె హస్తినకు బయలుదేరి వెళ్లారు. మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చ 10)ధర్నా చేయడం కోసమే ఆమె హఃస్తిన వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. ఫర్ సపోజ్ ఆమె వినతి పై ఈడీ నుంచి ఎటువంటి స్పందనా గురువారం ఉదయానికి కూడా రాకపోతే కవిత అనివార్యంగా ఈడీ విచారణకు హాజరై తీరాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అందుకోసమే.. ఎటుపోయి ఎటువచ్చినా ఈడీకి అందుబాటులో ఉండేందుకే ఆమె బుధవారమే హస్తిన బయలు దేరి వెళ్లారని అంటున్నారు. అయితే ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ నోటీసులు జారీ అయ్యాయని... విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని తెలిపారు.