మావోలూ లొంగిపోండి.. మల్లోజుల పిలుపు

ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం (నవంబర్ 19) విడుదల చేసిన ఓ వీడియోలో.. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయనీ, దేశం కూడా ముందుకు సాగుతోందనీ పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మేలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా పేర్కొంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.  

దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు...బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు

  హైదరాబాద్ నగరంలోని కీలక జలాశయమైన దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దుర్గం చెరువు పరిధిలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై **BNS సెక్షన్లు 329(3), 3(5)**తో పాటు PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద అభియోగాలు మోపారు. చెరువు భూమిని మట్టి, రాళ్లతో నింపి సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ఆక్రమిత భూమిని STS ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన బస్సుల పార్కింగ్ స్థలంగా వినియోగిస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దుర్గం చెరువుకు సంబంధించి 2014లోనే హెచ్‌ఎండీఎ ద్వారా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, దానిని లెక్కచేయకుండా చెరువు పరిధిలోకి చొరబడి భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ అక్రమ చర్యల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వరదల నియంత్రణ, భూగర్భ జలాల సంరక్షణలో దుర్గం చెరువు కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి జలాశయాన్ని ఆక్రమించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ, రెవెన్యూ, హెచ్‌ఎండీఎ, మున్సిపల్ శాఖల రికార్డులను సేకరిస్తున్నారు. ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు, అక్రమంగా సంపాదించిన ఆదాయంపై కూడా విచారణ సాగుతోంది. అవసరమైతే నిందితులకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మరోసారి చర్చ మొదలైంది. జలాశయాల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందన ఈ కేసుపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, తర్వాత అది చెల్లదంటూ టీడీఆర్ ఇచ్చారని తెలిపారు. దుర్గం చెరువు అభివృద్ధి తర్వాత తనకు అక్కడ ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయని, ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేసినందుకే తనపై అనవసరంగా కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. రోడ్డు పక్కన, చెట్ల కింద వాహనాలు పార్క్ చేసినందుకే కేసు పెట్టారని ఆరోపించారు. ఫిర్యాదులో వ్యక్తిగతంగా ఎవరూ లేరని, హైడ్రా పేరే కనిపిస్తోందని పేర్కొన్నారు. కేసుపై న్యాయపోరాటం చేస్తానని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించిన ప్రాంతాల ముందు ధర్నా చేస్తానని కూడా హెచ్చరించారు.

కోనసీమ జిల్లా కలెక్టర్ కు తృటితో తప్పిన ప్రమాదం

కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పులిదిండిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పడవ పోటీలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  నిర్వహించిన ట్రయల్ రన్ ను కలెక్టర్ ప్రారంభించారు.  ఆ సందర్భంగా ఆయన పొరపాటున కాలువలో పడిపోయారు.  కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే స్పందించి కలెక్టర్‌ను రక్షించారు. ఆయనను సురక్షితంగా వేరే పడవలోకి ఎక్కించారు.   జీపుతో సహా సముద్రంలోకి.. యువకుడి మృతి అదలా ఉంటే కోనసీమ జిల్లాలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అపశ్రుతి చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరు యువకులు మద్యం సేవించి జీపులో  సముద్రంలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు సముద్రంలో  గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి అంతర్వేది బీచ్ కు గురువారం ముగ్గరు యువకులు వచ్చారు. అంతర్వేదిలోని ఓ రిసార్ట్ లో రూమ్ తీసుకుని పార్టీ   చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో వారిలో ఇద్దరు యువకులు తమ వాహనంలో బీచ్ రోడ్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి, అన్నాచెల్లెలు గట్టు వద్ద మలుపును గమనించకుండా సముద్రంలోకి వెళ్లిపోయారు. చివరి నిముషంలో జీపులో ఉన్న ఇద్దరిలో ఒకరు బయటకు దూకేసి సురక్షితంగా బయటపడగా, మరో యువకుడు జీపుతో సహా సముద్రంలో గల్లంతయ్యాడు. తరువాత  అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని శ్రీధర్ గా గుర్తించారు. 

శ్రీశైలంలో చిరుత కలకలం

శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని  ఓ ఇంటి ముందు భాగంగా గురువారం (జనవరి 1) అర్ధరాత్రి చిరుత పులి సంచారం సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యింది. అంతే కాకుండా ఆ ఇంటి యజమాని కూడా చిరుత సంచారాన్ని స్వయంగా చూశారు. విషయం వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు   ఆ ప్రాంతంలో లో ఉండే స్థానికులు,భక్తులను అప్రమత్తం చేశారు.  అలాగే అటవీ అధికారులకు సమాచారం అందించారు. శ్రీశైలం పాతళగంగ మెట్ల మార్గం ద్వరానే వెళ్లిరోజు తెల్లవారుజామున పాతాళ గంగలో స్నాన మాచరిస్తారు.  నిత్యం వేలాది మంది  రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే  స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.   మైకుల ద్వారా చిరుత పులి సంచారాన్ని తెలియజేస్తు అందరినీ అప్రమత్తం చేసిన ఆలయ అధికారులు.. అటవీ శాఖ సిబ్బంది సాయంతో చిరుతను గుర్తించి బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

అసెంబ్లీలో చర్చ లేకుండానే 5 బిల్లులు ఆమోదం

  తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మోటార్ వైహిల్ ట్యాక్సేషన్ చట్టాల సవరణలను సంబంధించి 5 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండా శాసన సభలో ఈ బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఇందులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన 3 కీలక బిల్లులున్నాయి. సీఎం, ట్రాన్స్‌ఫోర్టు మినిస్టర్ల తరపున ఈ బిల్లులను సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు.  మూజువాణి ఓటుతో సభ వీటికి ఆమోదం తెలిపింది. మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి గడ్డం ప్రసాద్‌ పక్షపాతి వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల బహిష్కరించనున్నట్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం తమకు సభలో మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత కాలినడకన ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోకి వెళ్లి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

చిన్నారులకు సోషల్ మీడియా యాక్సిస్ బంద్.. ఫ్రాన్స్ కీలక నిర్ణయం

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను  రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ యుగంలో చిన్నారులు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక సవాళ్లను అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలో  15 ఏళ్లలోపు వయస్సు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయించారు. నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పిల్లలను, కౌమార దశలో ఉన్నవారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటామని ఎనౌన్స్ చేశారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా  పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది.  ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును  డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో చర్చ జరగనుంది.  2026 సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు.   గతంలో సోర్బోన్ యూనివర్సిటీలో మేక్రాన్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరైనా తమ ఐదేళ్ల లేదా పదేళ్ల పిల్లలను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారా? సోషల్ మీడియా కూడా అలాంటిదే. ఇది క్రమబద్ధీకరించబడని అడవి లాంటిది. అక్కడ పిల్లలు సైబర్ బుల్లియింగ్, అశ్లీలత, వేధింపులకు గురవుతున్నారని ఆయన అప్పటి ప్రసంగంలోనే హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం.. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల్లో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో ఫోన్లపై ఉన్న నిషేధాన్ని హైస్కూళ్లకు కూడా విస్తరించనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి రాత్రివేళల్లో 'డిజిటల్ కర్ఫ్యూ' విధించే ఆలోచనలో కూడా ఫ్రాన్స్ సర్కార్ యోచిస్తున్నది.   దీనిని ఫ్రాన్స్‌లోని సుమారు 79 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా మలేషియా, డెన్మార్క్, స్పెయిన్, రొమేనియా వంటి దేశాలు కూడా సోషల్ మీడియా నియంత్రణలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి. భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పనిసరి అని  సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. ఫ్రాన్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉంది.

1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా బుధవారం (డిసెంబర్ 31) రాత్రి నుంచి గురువారం (జవవరి 1) తెల్లవారు జాము వరకూ నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విశ్వనగరం హైదరాబాద్ లో కూడా నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పలు ఈవెంట్లు జరిగాయి.   న్యూ ఇయర్ వేడుకలలో నగర యువత యువత ఆటపాటలతో సందడి చేశారు. సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్  చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది. మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నగర వ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాలలోనూ డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అడ్డుకున్నారు. భారీగా జరిమానాలు విధించారు.  గురువారం డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్క  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే   1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

రికార్డు టైంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు..దటీజ్ బాబు!

ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావాలంటే దశాబ్దాలు పడుతుంది. ఇటీవలే ముంబైలో రెండవ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ విమానాశ్రయం ప్రతిపాదన దశ, నిర్మాణాలను పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావడానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయంలోనే పరిస్థితి ఇది. ఇక గత దశాబ్ద కాలంగా  బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.  అది ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు నిర్మాణం మొదలౌతుంది? ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎప్పటి నుంచి కార్యకలాపాలు ఆరంబమౌతాయి అన్న విషయం దేవుడికే తెలిలయాలి.  అయితే అందుకు భిన్నంగా  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ఈ నెల మొదటి వారంలోనే ట్రయల్ రన్ జరగనుంది.  మరో ఆరు నెల్లలో కమర్షియల్‌ ఆపరేషన్స్  ఆరంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో   దశాబ్దాలు పట్టిన పని ఏపీలో మాత్రం రెండేళ్ల లోపే పూర్తయ్యింది. అదీ చంద్రబాబు పాలనలో ఫాస్టెస్ట్ గవర్నెన్స్. అదీ చంద్రబాబు దక్షత, సమర్ధత.  అనుకున్న పనులను పరుగులు పెట్టించే కార్యాచరణ.   రాష్ట్ర‌ విభజన తర్వాత   న‌వ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2016లో  ప‌థ‌క ర‌చ‌న‌ చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి.. భూసేకరణ పూర్తి చేసి.. 2019లో విమానాశ్రయం పనులు ప్రారంభించారు. అయితే 2019 లో అధికార బాధ్యతలు చేపట్టిన వైసీపీ సర్కార్.. ఎయిర్ పోర్టు పనులు పడకేసేలా వ్యవహరించింది.  అపప్టికే పనులు ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2023లో  అప్పటి జగన్ మరో మారు శంకుస్థాపన చేయడం వినా సాధించిందేమీ లేదు.  ఇక 2024లో చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి తిరిగి వచ్చింది. వచ్చీ రావడంతోనే  భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల వేగం పెంచి.. కేవలం ఏడాదిన్నరలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే.  ఉమ్మడి రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో శంషాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు ప్లాన్ చేసింది కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడే. అప్పట్లో ఇంత భారీ ఎయిర్‌పోర్టు ఎందుకని ఎంద‌రు ఎన్ని విమర్శలు చేసినా ఆయన లెక్క చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అనుమతులు తీసుకొచ్చి.. నిధులు సాధించి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినా.. బాబు ప్లాన్‌ ప్రకారమే విమానాశ్రయం నిర్మాణం జరిగింది. ఇది జరిగి పాతికేళ్లు అయ్యింది. ఇప్పుడు దేశంలోనే అత్యంత బిజీ ట్రాఫిక్ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాద్ విమానాశ్రయం కచ్చతంగా ముందు వరుసలో ఉంటుంది. ఎంత ట్రాఫిక్ పెరిగినా.. హైదరాబాద్ కు మరో విమానాశ్రయం అవసరం పడలేదు. అదీ చంద్రబాబు మార్క్ విజన్ అంటే.    ఇక ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. రికార్డు టైంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యక లాపాల ప్రారంభానికి ముస్తాబవ్వడమే అద్భుతం అనుకుంటే.. ఇందుకు మ‌రో అద్భుతం కూడా తోడ‌వుతోంది. అదే ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం.  ఇప్ప‌టికే ఈ ఎడ్యుసిటీ కి కావ‌ల్సిన 135 ఎక‌రాల‌ను మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ అశోక గ‌జ‌ప‌తి రాజు  విరాళంగా ఇచ్చారు. దీంతో ఇక్క‌డి నుంచే వ‌చ్చే రోజుల్లో పైల‌ట్ ట్రైనింగ్ సెంటర్ ఆరంభం కానుంది. ఆపై ఇక్క‌డికి ఏవియేష‌న్ రీసెర్చ్ సెంట‌ర్ కూడా రానుంది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్టు వైభోగం  రెట్టింపు కానుంది. దీంతో విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల ద‌శ‌ దిశ తిరిగిపోనుంది. దీంతో సీఎం చంద్ర‌బాబుకు ఈ ప్రాంత వాసులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.

దట్టమైన పొగమంచు.. విమానరాకపోకలకు అంతరాయం

హైదరాబాద్ లో శుక్రవారం (జనవరి 2) ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  విజిబిలిటీ బాగా తగ్గిపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరిన్ని ఫ్లైట్ లో ఆలస్యంగా నడుస్తున్నాయి.   దట్టమైన పొగమంచు కారణంగా డిల్లీ నుంచి శంషాబాద్‌కు రావా ల్సిన, అలాగే శంషాబాద్ నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.   ముందస్తు సమాచారం  లేకుండా ఈ విమానాలు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే  శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానాలు పొగ మంచు కారణంగా ఆల స్యమయ్యయి. పరిస్థితి మెరుగు పడిన తర్వాతే విమానాలను అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.  అదలా ఉండగా..  హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ బాగా తగ్గిపోయింది. రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో విజిబులిటీ కేవలం పది అడుగుల మేరకే ఉండటంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  ఫాగ్ లైట్స్ వేసుకున్నప్పటికీ రహదారి స్పష్టంగా కనిపించని పరిస్ధితి నెలకొంది.   ఒకవైపు రవాణా, విమాన సర్వీసులకు ఇబ్బందులు ఎదురైనా, మరోవైపు చల్లని వాతావరణంతో మార్నింగ్ వాకర్లు పొగమంచుతో కూడిన ఆహ్లాదకర వాతా వరణాన్ని ఆస్వాదించారు. పార్కులు, రహదారుల వెంట ఉదయపు నడకకు వచ్చిన వారు ప్రకృతి అందాన్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. .వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే మూడు రోజులూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది.  

టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు!

ఆన్‌లైన్ సినిమా పైరసీ కేసులో అరెస్టయిన  ఐ బొమ్మ రవి విచారణలో ఒక్కొక్కటిగా సంచలన వాస్తవాలు వెల్లడౌతున్నాయి. పోలీసుల  విచారణలో.. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకొని అనేక సంవత్స రాలుగా  వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేలింది. ముఖ్యంగా బొమ్మ రవి టెలిగ్రామ్ యాప్‌ను వేదికగా చేసుకొని సినిమాలను అక్రమంగా  కొనుగోలు చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం ద్వారా కోట్లలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.  ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు   రవి టెలిగ్రామ్ యాప్‌ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమా లకు ఒక్కో సినిమాకు సగటున 2 డాలర్లు చెల్లించగా, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు వరకూ చెల్లించినట్లు నిర్ధారించారు. చిన్న బడ్జెట్ సినిమాల కోసం 100 నుంచి 200 డాలర్ల మధ్య చెల్లింపులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ముందుగానే సినిమాలను సేకరించి, విడుద లైన వెంటనే అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐ బొమ్మ రవి నేర జీవితం తాజాగా ప్రారంభమైనది కాదని, 2007 నుంచే ఈ అక్రమ కార్యకలాపాలను మొదలెట్టాడనీ పోలీసులు తమ విచారణలో తేలినట్లు చెప్పారు.  విద్యార్థిగా ఉన్న దశలోనే విలాసవం తమైన జీవితం గడపాలనే ఆశతో చిన్నచిన్న నేరాలకు అలవాటు పడిన రవి.. ఆ తరువాత సైబర్ నేరాల వైపు అడు గులు వేసినట్లు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన  రవి, ఆ పరిజ్ఞా నాన్ని చట్టవిరుద్ధ కార్యకలా పాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఐబొమ్మ ద్వారా సంపాదించిన అక్రమ ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రవి అనేక మార్గాలను ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు వేర్వేరు పేమెంట్ గేట్‌వేల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపి నట్లు తేలింది. అంతేకా కుండా.. అనేక బ్యాంకు ఖాతా లను తెరిచి, వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించిన రవి, కొన్ని ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు కూడా మర్చిపోయినట్లు విచారణలో చెప్పడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశం ద్వారా రవి ఎంత విస్తృతం గా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో అర్థమవు తోందని పోలీసులు అంటున్నారు.రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో రవి మూడు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలు వాస్తవ వ్యాపార లావాదేవీ లకు కాకుండా, అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించేందుకు మాత్రమే ఉపయోగించిన షెల్ కంపెనీలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కంపెనీల పేరుతో టాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికినట్లు, నకిలీ ఖాతాలు, తప్పుడు లెక్కలు చూపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.   ఈ కేసులో ఐ బొమ్మ రవికి సహకరించిన వ్యక్తులు, కంటెంట్ సరఫరా చేసిన వర్గాలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణను మరింత విస్తృతం చేస్తున్నారు. రవి కార్యకలాపాలతో సినిమా పరిశ్రమకు జరిగిన నష్టంపై కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

మాఫియాడాన్ ఇందర్జీత్ నివాసంపై ఈడీ దాడులు.. భారీగా నగదు, బంగారం సీజ్

అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో లెక్కలలో చూపని   5 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.  అలాగే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారం, 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందర్జీత్, అతడి అనుచరుల నివాసాలపై జరిపిన సోదాలలో మొత్తం   48 కోట్ల రూపాయల  విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలు సోమవారం (డిసెంబర్ 29)న ఆరంభమై, బుధవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి దాటే వరకూ కొనసాగాయి. ఇందర్జీత్ నివాసంలో స్వాధీనం చేసుకున్న కరెన్సీని లెక్కించేందుకు బ్యాంకు అధికారులను నోట్ల లెక్కింపు యంత్రంతో సహా పిలిపించారు.  రాజకీయ అండతో ఇందర్జీత్ సింగ్ యాదవ్ బెదరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇందర్జీత్ యాదవ్ ప్రస్తుతం పరారీలో  ఉన్నాడు.  హరియాణాకు చెందిన ఇందర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతడు యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇందర్జీత్ యాదవ్,  అతడి అనుచరులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో 15కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆయుధాల చట్టం, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి, ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. ఈ యాదవ్ అక్రమ సంపాదన వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది.