కల్లు తాగితే 5వేలు జరిమానా... 25 చెప్పు దెబ్బలు...

తెలంగాణలో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇఫ్పుడు సంచలనంగా మారింది. తమకు చెప్పకుండా తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచేశారన్న అక్కసుతో, ఆ గ్రామ పెద్దలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం తెలంగాణ అంతటా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నమొన్నటివరకు ఐదు రూపాయలకు అమ్మే కల్లు సీసాను... గౌడ వ్యాపారులు పది రూపాయలకు పెంచారు. ఒక్క బొల్లారం గ్రామంలోనే కాకుండా నాగిరెడ్డిపేట మండలం అంతటా ఇది అమల్లోకి వచ్చింది. అయితే, తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచారన్న ఆగ్రహంతో.... గ్రామంలో ఎవరైనా కల్లు తాగితే 25 చెప్పు దెబ్బలు... 5వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ పెద్దలు తీర్మానం చేశారు. అంతేకాదు ఊరంతా చాటింపు వేయించారు. అలాగే, కల్లు డిపోల దగ్గర చెప్పుల దండలు కట్టి అమానుషంగా వ్యవహరించారు. అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, కల్లు డిపోల దగ్గర చెప్పుల దండలను తీయించారు. అయితే, గ్రామ పెద్దల తీరుపై గౌడ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని ధరలు పెరగడంతోనే స్వల్పంగా రేట్లు పెంచామని, కానీ గ్రామంలో ఎవరూ కల్లు తాగొద్దంటూ ఆంక్షలు విధించారని, ఎవరైనా కల్లు తాగితే చెప్పు దెబ్బలు, జరిమానా విధిస్తామని హెచ్చరించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. కల్లు డిపోలను తాము దేవాలయాలుగా భావిస్తామని, కానీ గ్రామస్తులు చెప్పుల దండలు కట్టి తమను అవమానించారని వాపోతున్నారు. కల్లు డిపోలకు చెప్పుల దండ కట్టడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బొల్లారం గ్రామస్తుల నిర్వాకం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.... సమగ్ర విచారణకు ఆదేశించింది. దాంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కల్లు వివాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో... అరెస్టులు చేస్తారేమోనని బొల్లారం గ్రామస్తులు వణికిపోతున్నారు.

కంటి వెలుగు అవుతానంటోన్న జగన్... రేపే అనంత నుంచి శ్రీకారం

సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్‌ స్కీమ్‌ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ పథకాన్ని... అనంతపురం నుంచి జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ పథకం అమలు కానుంది.

ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో... ఈఎస్ఐ ఉద్యోగుల్లో భయంభయం

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పది మందిని రిమాండ్ కి తరలించిన ఏసీబీ అధికారులు.... తాజా మరో ముగ్గురు కీలక నిందితును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన నిందితుల సంఖ్య 13కి చేరింది. మరోవైపు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో... ఎవరు ఎప్పుడు అరెస్టు అవుతారోనన్న భయం ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉద్యోగుల్లో నెలకొంది. అయితే, తాజాగా వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితోపాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలిసి అరవింద్ రెడ్డి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ ఎక్విప్ మెంట్ సరఫరా చేయకుండానే... చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి....  సర్కారు సొమ్మును స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ఇక, ఈఎస్ఐతో అనుసంధానంగా పనిచేసిన హెల్త్ కేర్ సెంటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫార్మాసిస్టులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఒకరి తర్వాత మరొకరిని అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణవ్యాప్తంగా ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. సోదాలు దొరికిన ఆధారాల ఆధారంగా అరెస్టుల చేస్తున్నారు.

దేవరగట్టులో కర్రల యుద్ధం... 70మందికి పగిలిన తలలు... ఏడుగురికి సీరియస్

తలలు పగిలాయి... రక్తం చిందింది... ఎంతమంది పోలీసులను మోహరించినా... ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా... కర్నూలు జిల్లా దేవరగట్టు బన్సీ ఉత్సవాల కర్రల సమరంలో రక్తపాతాన్ని నివారించలేకపోయారు. దేవరగట్టు కర్రల యుద్ధంలో ఎప్పటిలాగే రక్తం చిందింది. మాలమల్లేశ్వరస్వామి కోసం భీకర పోరు జరిగింది. వేలాది మంది భక్తులు.... చిమ్మ చీకటిలో... దివిటీల వెలుగులో... కర్రలతో హోరాహోరీగా తలపడ్డారు. తలలు బద్దలు కొట్టుకుంటూ మాలమల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ పోరాటంలో 70మంది తలలు పగిలాయి. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఇక, గాయపడ్డవారిలో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి ఎలాగైనా రక్తపాతాన్ని ఆపాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అందుకోసం ముందుగానే 10 గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బన్నీ ఉత్సవాల్లో ఇనుప చువ్వలు, రింగ్‌లు వినియోగించకుండా నిషేధం విధించారు. ఎవరైనా హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అయినా ఎప్పటిలాగానే కర్రల సమరంలో రక్తం చిందింది. పలువురి తలలు పగిలాయి. కర్రకు ఇనుప రింగులు తొడిగి, కాగడాల వెలుగులో మాలమల్లేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అయితే ఇలా కర్రలతో కొట్టుకోవడం హింస కాదని... ఇది అనాదిగా వస్తున్న తమ ఆచారమంటున్నారు భక్తులు. 11వ శతాబ్దం నుంచి ఈ బన్నీ ఉత్సవం జరుగుతోందని చెబుతున్నారు. అయితే బన్నీ ఉత్సవంలో ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కొన్నేళ్లుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజం ఉండట్లేదు. ప్రతి ఏటా రక్తపాతం జరుగుతూనే ఉంది... తలలు పగులుతూనే ఉన్నాయి. మరోవైపు, ఈ బన్నీ ఉత్సవాన్ని, కర్రల సమరాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో దేవరగట్టు జనసంద్రంగా మారింది. అయితే, కర్రల సమరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1200మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ఎవరికైనా గాయాలైతే అత్యవసర చికిత్స అందించడానికి సుమారు వంద మంది మెడికల్ సిబ్బందిని వినియోగించారు.

రెబల్ స్టార్ కి దుర్గ గుడిలో ఘోర అవమానం

  బీజేపీ నేత , కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు.. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అవమానం జరిగింది. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనేందుకు.. ముందుగా సమాచారం ఇచ్చి మరీ కుటుంబంతో సహా కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే ఒక్క అధికారి కూడా ఆయనను పట్టించుకోలేదు. మాజీ కేంద్రమంత్రి అనే ప్రోటోకాల్ కూడా మర్చిపోయి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. దీనితో ఆయన సాధారణ భక్తుల మాదిరి ఆరు అంతస్తులు ఎక్కారు. ఆయనకున్న వయస్సు రీత్యా పలుమార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు. చివరికి అతి కష్టం మీద కుంకుమార్చన వద్దకు చేరుకున్నారు.  కృష్ణంరాజును ఆలయ అధికారులు అంతగా ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సాధారణ వైసీపీ నేత వస్తే.. సకల మర్యాదలు చేస్తున్న ఆలయ అధికారులు ఇతరులు వస్తే మాత్రం కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను ఆలయానికి వస్తున్నట్లుగా కృష్ణంరాజు ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలపై పాలక వర్గాలకు ఉన్న కోపంతో.. తాము కృష్ణంరాజుకు మర్యాదలు చేస్తే.. పై అధికారులకు ఎక్కడ కోపం వస్తుందోనన్న ఉద్దేశంతో.. దుర్గ గుడి అధికారులు కావాలనే పట్టించుకోలేదని చెబుతున్నారు. క్యూ లైన్ లో కృష్ణంరాజు ఇబ్బందులు చూసి సామాన్య భక్తులే అయ్యో అనుకున్నారు. కృష్ణంరాజుని బీజేపీ నేతగా, మాజీ కేంద్రమంత్రిగా కాకపోయినా.. ఆయన వృద్ధాప్యం, ఆనారోగ్యం దృష్ట్యా అయినా.. ఆయనకు ఇబ్బందిలేకుండా అమ్మవారి దర్శనం చేయించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ కి పవన్ సూచన... కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు

  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని పవన్ సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేసే ఆందోళనలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు. సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని పవన్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదు

  ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడే ప్రసక్తే లేదని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేసారు. తమ సమ్మె న్యాయసమ్మతమే అని తెలిపారు. తాము ఈ విషయంపై న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని సలహా చెప్పారని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చెప్పారు. సీఎం ప్రకటనలకు భయపడేది లేదని, సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదని అన్నారు. జీతాలివ్వకపోతే దిగొస్తారనుకోవడం ప్రభుత్వ అమాయకత్వమే అవుతుందన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అందరికీ తెలుసన్న ఆయన.. ప్రజలకు కోపం సర్కారు మీదే కానీ తమ మీద కాదన్నారు.  ఉద్యమాలతో సీఎం అయ్యి, ఉద్యమాలను అణచివేసే సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తీసివేయడానికి ఆయన ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదన్నారు. తమకు 50 వేల జీతమంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీని ఇతర రాష్ట్రాల రవాణా వ్యవస్థతో పోల్చడం కాదు... ఏపీఎస్‌ఆర్టీసీతో పోల్చాలని సూచించారు. తమ భవిష్యత్ కార్యాచరణ బుధవారం ప్రకటిస్తామని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు.

కటకటాలలో దసరాను గడపబోతున్న రవిప్రకాష్..

  నిధుల దుర్వినియోగం వ్యవహారంలో అరెస్ట్ అయిన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ దసరా తరువాత జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పండగ మూడు రోజులూ ఆయన జైలులో గడపక తప్పని పరిస్థితి నెలకొంది. కంపెనీ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన నిధులని సొంత అవసరాలకు వాడుకున్నారు. అది కూడా వెయ్యి, రెండు వేలు కాదు, ఏకంగా పధ్ధెనిమిది కోట్ల రూపాయలు అడ్డగోలుగా డ్రా చేశారన్నది టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఆరోపణ. నిధులు దుర్వినియోగం చేయడమేకాక రికార్డుల్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ తో పాటు మరో ఉద్యోగి అయిన ఎంకెబిఎన్ మూర్తిని అరెస్టు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.  టీవీ 9 కు మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీసీఎల్ కు గతంలో రవిప్రకాశ్, ఎంకెబిఎన్ మూర్తి హోల్ టైమ్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో సంస్థ రోజువారీ అవసరాలకు మాత్రమే బ్యాంకు ఖాతాల నుంచి నిధులను ఉపయోగించే అధికారం రవిప్రకాశ్, ఎంకెబిఎన్ మూర్తీలకు ఎబిసిఎల్ ఇచ్చింది. అయితే వాళ్ళిద్దరూ చెక్ పవర్ ను దుర్వినియోగం చేశారని, అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన తర్వాత కంపెనీ లావాదేవీలను ఆడిటింగ్ చేయించటంతో రవిప్రకాశ్, మూర్తి చేసిన అక్రమాలు బయటపడ్డాయి అంటోంది అలందా మీడియా. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ తో పాటు ఎంకెబిఎన్ మూర్తి పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని గత నెల ఇరవై నాలుగున జరిగిన బోర్డు మీటింగ్ లో అలందా మీడియా నిర్ణయించింది. దీనిలో భాగంగానే సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫెరీరా కూడా కంపెనీ నిధులను గోల్ మాల్ చేసినట్లు పోలీసులకు అలందా మీడియా తెలిపింది. ఆ డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది.  కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి లేకుండానే రవిప్రకాష్ బృందం మొత్తం పధ్ధెనిమిది కోట్ల రూపాయలు డ్రా చేసింది. ఇందులో రవిప్రకాశ్ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు విత్ డ్రా చేయగా, ఎంకెబిఎన్ మూర్తి క్లిఫర్డ్ పెరీరా చెరో ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల దారిమళ్లించినట్టు ఆడిటింగ్ లో బయటపడింది. అయితే ఈ మొత్తాన్ని కంపెనీ ఖాతాలో బోనస్ ఎక్స్ గ్రేషియాగా చూపించింది రవిప్రకాష్ బృందం. ఈ క్రమంలో రవిప్రకాష్ ను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. తర్వాత వైద్య పరీక్షలు చేయించి సీతాఫల్ మండిలోని నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు రవిప్రకాశ్ బెయిల్ కు దసరా పండుగ అయ్యే వరకూ బెయిల్ దొరికే సూచనలు కనిపించటం లేదు. అతని బెయిల్ పిటిషన్ పై ఈ నెల తొమ్మిదిన విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పండుగ మూడు రోజులు ఆయన జైలులోనే గడపనున్నారు.

కేసీఆర్ కు ఆ అధికారం లేదు.. గతంలో జయలలితకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!!

  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.

ఫ్లైట్ లో వచ్చి దోపీడి చేస్తున్న హైటెక్ దొంగలు...

  ఏటీఎం వద్ద ఎన్నొ రాకాల మోసాలు జరుగుతుండటం మనం సహజంగా చూస్తుంటాం.ఏటీఎం వద్ద ఓ వృద్ధుడిని మోసం చేసి డబ్బు కాజేశారు అగాంతకులు. ఈ ఫిర్యాదుని నెల్లూరు జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. చిన్న కేసులో తీగ లాగితే డొంకలు కదిలాయ్ మారుమూల కుగ్రామం నుంచి హరియాణ వరకు సాగుతున్న బాగోతాలు వెలుగు చూశాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలోని పదహారు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డ హర్యానా ఘరానా దొంగల ముఠాను పట్టు కున్నారు.హర్యానా రాష్ట్రం భవాని జిల్లా భవానీకేడ తాలూకా బార్సి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, మంజిత్, జగ్జీత్ లు ముఠాగా ఏర్పడ్డారు వీరంతా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండేళ్ల వయసు ఉండేవారు. ముందుగా ఓ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటారు విమానాల్లో అక్కడికి చేరుకుని విలాసవంతమైన హోటల్లో దిగుతారు. డ్రైవర్ లేని కారు అద్దెకు తీసుకొని మరి వేటకి బయలుదేరుతారు. ఏటీఎంల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధులు, చిన్నపిల్లలే వీరిని టార్గెట్ గా చూసుకుంటారు. వారికి సహాయం చేసినట్టు నటిస్తూ ఏటీఎం పిన్ గమనిస్తారు. మాయ మాటలు చెబుతూ ఏటీఎం తీసుకుని వారికి నకిలీ ఏటీఎం కార్డు ఇస్తారు. అనంతరం తమ వద్ద ఉండే స్వైప్ మిషన్ తో స్వైపింగ్ చేస్తారు. ఏటీఎంలో ఉన్న సమయంలోనే బ్లూటూత్ ద్వారా మొబైల్ కు కనెక్ట్ చేసి వారి ఫోన్ లో డేటా ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. ఏటీఎం కార్డు డేటాని స్కిమ్మింగ్ మిషన్ ద్వారా క్లోనింగ్ చేస్తారు. వేరే ఏటీఎం కార్డుకి డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకుని ముందుగా గుర్తించిన పిన్ నెంబర్ సహాయంతో బాధితుల అకౌంట్ లో డబ్బులు మొత్తం కొల్లగొడతారు. ఇలా ఇప్పటి వరకూ ఈ ఘరానా దొంగల ముఠా మన దేశంలోని అస్సాం, బీహార్ ,ఢిల్లీ ,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒరిస్సా ,పంజాబ్ ,రాజస్థాన్, తమిళనాడు ,ఉత్తర ప్రదేశ్, హర్యానా ,ఏపి, తెలంగాణ ఇలా పదహారు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్ప డింది.  అయిదు వేల రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల చొప్పున కోట్లల్లో దోచేసింది. ఐదు వేలు, పది వేలు పోగొట్టుకున్న బాధితులు చాలా మంది పోలీసు స్టేషన్ ల వరకు రారనే నమ్మకం వీరిది. వాస్తవంగా కూడా చాలా మంది బాధితులు పోతే పోనీలే ఆ డబ్బు కోసం ఎక్కడ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతామని మిన్నకుండిపోయారు. బాధితుల్లో ముప్పై శాతం మంది మాత్రమే పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. హర్యానా నుంచి ఓసారి చెన్నైకి విమానంలో వచ్చారు ఆపై డ్రైవర్ లేని కారు అద్దెకు తీసుకొని వేటకు బయలుదేరారు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నుంచి కలిగిరికి చేరుకున్నారు. మొదట అక్కడే మోసానికి పాల్పడ్డారు. వింజమూరులోని ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేశారు కలికిరి నుంచి నెల్లూరు జిల్లా పోలీసులు ఆరా మొదలుపెట్టారు .టాస్క్ ఫోర్స్, సిసిఎస్, దర్గామిట్ట, చిన్నబజారు పోలీసు టీంలు తొమ్మిది నెలల పాటు ఈ ముఠాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, సూళ్లూరుపేట, కలిగిరి, వింజమూరులతో పాటు కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు. హర్యాణ నుంచి ముఠా బయలుదేరి వైజాగ్ వచ్చిన సమయంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించి ఓసారి విఫలమయ్యారు. మరోమారు వారి కదలికలు గమనిస్తూ నెల్లూరులోనే అరెస్టు చేశారు.వీరి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పదహారు కేసులు శ్రీకాకుళం, వైజాగ్, అనంతపురం ,గుంటూరు, కర్నూలు ,ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ ప్రాంతాల్లోని పలు కేసులకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు, స్కిమ్మింగ్ మిషన్, ఏటీఎంకార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా పెద్ద ఎత్తున డబ్బు దోచేందుకు ఇలాంటి ముఠాలు తయారయ్యాయి .బహుమతులు ఇచ్చాయని లాటరీలు తగిలాయంటూ లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకోవటం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఏటీఎం కార్డు నెంబరు పిన్ నెంబరు చెప్పండి అంటూ మోసాలు చేయడం ఏటీఎంల వద్ద నుంచి వ్యక్తులూ అమాయకుల్లా నటిస్తూ నగదు కొల్లకొట్టటం రివాజుగా మారింది. ఏటీఎంకార్డు నెంబర్ లు పిన్ నెంబర్ లు ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని నగదు డ్రా చేయడం తెలియకుంటే ఇంట్లో వారిని వెంటబెట్టుకొని వెళ్లాలంటూ పెద్దఎత్తున ప్రచారం సాగిస్తున్న చాలా మంది ఇప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు ఫలితంగా కష్టపడి కూలీనాలీ పనులు చేసుకునే సంపాదించిన డబ్బుని ఇలాంటి మాయగాళ్లు నిలువునా కొల్లగొడుతున్నారు.ఇలాంటి హైటెక్ దొంగల వల్ల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.

సమ్మె పై ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు వెనక్కు తగ్గనున్నారా?

  క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నఆర్టీసీ సమ్మె టెన్షన్ వీడుతుంది అనుకున్నా అది మాత్రం కొనసాగుతోంది. సిక్స్ పిఎం సర్కారు డెడ్ లైన్ ముగిసింది. కానీ యాక్షన్ రియాక్షన్ పై మాత్రం టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సర్కారిచ్చిన సిక్స్ పిఎం డెడ్ లైన్ బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోబోతోంది అనేది పెద్ద చర్చనీయాశంగా మారింది. ఆర్టీసీ కార్మికులపై ఎటువంటి నిర్ణయం తీసుకోనుందని అనివారిని విధుల నుండి పూర్తిగా తప్పిస్తుందా అసెలేం జరగబోతోంది అనేది పెద్ద చర్చగా మారింది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై రేపు మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆధ్వర్యంలో రవాణ ఆర్టీసీ పోలీస్ అధికారులు భేటీ కానున్నారు. ఈ చర్చల్లో ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం తేల్చబోతున్నది. ఇప్పటి వరకు జరిగిన అప్ డేట్స్ చూస్తే ఇటు ప్రభుత్వం వెనక్కు తగ్గట్లేదు, అటు కార్మికులు కూడా వెనక్కి తగ్గేట్టు లేరు. కార్మికులైతే ఇంకా పట్టుదలతో ఉన్నారు. రేపు, ఎల్లుండి తమ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలో దాదాపు తొంభై రెండు డిపోలు ఉన్నాయి. తొంభై రెండు డిపోలలో కేవలం నూట అరవై ఐదు మంది ఉధ్యోగులు మాత్రమే విధులలో చేరారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అంతకు మించి ఉద్యోగులు విధుల్లో చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇక అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లేదా డిపోలల్లో పనిచేసేటటువంటి, వర్క్ షాపులో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగాలు మినహాయిస్తే దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు ఇప్పటి వరకు ఇక సమ్మెలో కొనసాగుతున్నట్లుగానే భావించాలి అని నిన్న కూడా  ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత రవాణశాఖామంత్రి అజయ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. ఈ రోజు కూడా ఒక ఫైనల్ వార్నింగ్ విడుదల చేసింది. అయినప్పటికి కూడా ఉద్యోగులెవ్వరూ కూడా వెనక్కు తగ్గట్లేదు. ప్రభుత్వం తమను బెదిరించాలని చూస్తుందంటూ అయినా తమ లక్షమే ముఖ్యమని వారు భావిస్తున్నారు.

భూమా కుటుంబానికి చిక్కులు తప్పేలా లేవు...

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయంగా మంచి పట్టు సాధించిన ఫామిలీ భూమా కుటుంబం. అయితే భూమా నాగిరెడ్డి దంపతుల మృతి తరువాత రాజకీయ వారసత్వం తీసుకున్న మాజీ మంత్రి భూమా అఖిల చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి, ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కొందరు దూరమవ్వడం, మరికొందరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటం, మరో వైపు ఆమె భర్తపై కేసులు నమోదు కావడం, ప్రత్యర్ధులు బలపడ్డం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భూమా కుటుంబానికి రాజకీయంగా చిక్కులు తప్పేటట్లు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్షన్ కోటలో రాజకీయం కత్తిమీద సాములా ఉంటుంది. నాయకుడు బలహీనపడ్డాడంటే అనుచరులు అభిమానులు వెంట నడవలేరు. ప్రత్యర్థులు బలపడుతుండటంతో గట్టిగా నిలబడేందుకు ఎత్తులు వేయాలి తప్ప ఉన్న బలం జారి పోయేలా నిర్ణయాలూ వ్యవహారం ఉంటే ఫ్యాక్షన్ ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఇలాంటి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల పరిస్థితి ఇలాగే ఉంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక భూమా అఖిల ప్రజలకు ప్రత్యేకించి సన్నిహితులకూ, అభిమానులకు, బంధువులకు దూరమయ్యారనే అభిప్రాయం ఆళ్లగడ్డలో ఉంది. తాజాగా భూమా అఖిల భర్త భార్గవ్ రామునిపై వ్యాపార భాగస్వామి అఖిలకు బంధువైన శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటికే భార్గవ రాముడిపై ఎన్నికల సమయంలో ఒక కేసుంది. దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డికి ఆళ్లగడ్డ శివారులో శ్రీ లక్ష్మి ఇండస్ర్టీస్ పేరుతో క్రషర్ పరిశ్రమ ఉంది. ఇందులో భూమా అఖిల ప్రియకు నలభై శాతం వాటా అయితే శివరామిరెడ్డికి అరవై శాతం వాటా ఉంది. సుమారు పదేళ్లుగా ఈ పరిశ్రమను నడిపిస్తున్నారు. అయితే వ్యాపారంలో లావాదేవీల వ్యవహారంలో తలెత్తిన విభేదాల ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాయి. ఆ క్రమంలో సదరు పరిశ్రమకు తాళం వేశారు. అయితే క్రషర్ పూర్తిగా తమకే అప్పజెప్పాలని గత నెల పద్నాలుగు వ తేదీన భార్గవరామ్ అనుచర వర్గంతో వెళ్ళి అక్కడ ఉన్న వారిని బెదిరించి పరిశ్రమ తలుపులకు వేరే తాళం వేశారని శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవరాముడు మరి కొంత మంది పై కేసు నమోదైంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల, భర్త భార్గవరాముడు తీరుతో విభేదించి ఇప్పటికే ఆమెకు సోదరుడయ్యే భూమా కిషోర్ రెడ్డి బిజెపిలో చేరారు. ఇప్పుడు ఫ్యాక్టరీ విషయంలో మరో బంధువు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. గతంలోనే భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాన్ని పక్కనబెడితే సన్నిహితులు దూరం కావడం అనేది తమ వర్గం బలహీనపడటానికి దారి తీస్తోందని భూమా కుటుంబాన్ని అభిమానించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమా కుటుంబంలో సొంత బలం తగ్గుతూ రావడం ప్రజల్లో తిరిగి అభిమానాన్ని సంపాదించటానికి వచ్చిన అవకాశాల్ని కూడా వినియోగించుకోలేకపోవటం ఆ వర్గీయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరదలలో ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి చాలా గ్రామాల్లో జనం బయటకు రాలేని పరిస్థితి, పంటలన్నీ నీట మునిగాయి. ఆ సమయంలో ప్రజలకు అండగా నిలబడి కాస్త సహాయ కార్యక్రమాలు చేపట్టి ఉంటే బాగుండేదని, గతంలో వరదలు వచ్చినప్పుడు భూమా నాగిరెడ్డి అన్నం నీళ్ల ప్యాకెట్లు సొంతంగా సరఫరా చేసి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఆళ్లగడ్డ వరదల్లో ప్రత్యర్థులు ఆలస్యంగా జనంలోకి వెళ్లారని భూమా అఖిల జనంలోకి వెళ్ళినా ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టి లేదంటున్నారు. జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయందిస్తే ఆదరిస్తారని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారని భూమా అభిమానులు వాపోతున్నారు. ఆ క్రమంలో అఖిల సొంత మనుషులు భూమా కుటుంబానికి జరుగుతున్న నష్టాన్ని వారి దృష్టికి తీసుకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే రాజకీయంగా భూమా కుటుంబం పట్టు కోల్పోయి మరింత చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది అంటున్నారు భూమా అభిమానులు.

పెట్టుబడిదారుల చేతుల్లోకి ఆర్టీసీ.! టీఎస్-ఆర్టీసీకి పొంచివున్న ప్రమాదం

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది. సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు డకపోవడంతో సమ్మె ‍యధావిధిగా జరుగుతోంది. సర్కార్ హెచ్చరికలను కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో మూడోరోజు కూడా బస్సులు రోడ్డెక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇక, ఇవాళ్టి నుంచి ఆందోళనలను ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరాహారదీక్షలకు యూనియన్ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే, ఇందిరాపార్క్ ధర్నా దగ్గర ఎలాంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అక్కడ ఎలాంటి ఆందోళనలు చేపట్టినా అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా కుటుంబాలతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టి తీరుతామని ఆర్టీసీ యూనియన్ నేతలు అంటున్నారు. అలాగే, అన్ని డిపోల ముందు కుటుంబాలతో కలిసి నిరసన తెలుపుతామని జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి తెలిపారు. అలాగే, అద్దె బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని... ప్రజారవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామన్న అశ్వద్ధామరెడ్డి అన్నారు.

విశాఖపట్నంలో జనసేనకు ఏమవుతోంది...

రాజకీయ ప్రభంజనం అనుకున్న జనసేనకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నిశబ్దంగా ఉంది. ఆ పార్టీకి కీలకంగా భావించిన విశాఖపట్నం జిల్లాలో నాయకులు క్యాడర్ అత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రశ్నించటమె లక్ష్యంగా ఎగసిన యువశక్తి స్తబ్దతగా మారిపోయింది. భవిష్యత్ పై క్లారిటీ లేకపోవడం, అధినాయకుడి అంతరంగం అర్థం కాకపోవడంతో నాయకత్వంలో అయోమయం నెలకొంది. రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఏర్పడినపుడు త్రిముఖ పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలహీనంగా ఉండటం, సామాజిక బలం, గట్టి పట్టు కలిగిన అభ్యర్ధులు బరిలో నిలవడంతో జిల్లాలో పీఆర్పీ నాల్గు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన పిఆర్పిని మించిన అంచనాలతో ఓటర్ల ముందుకొచ్చింది. ప్రయోగాలు కొలిక్ కి రాకుండానే ఎన్నికల బరిలో దిగి పొయింది. స్వయంగా జనసేన చీఫ్ గాజువాక నుంచి పోటీ చేశారు. సీబీఐ మాజీ అధికారి వివి లక్ష్మీ నారాయణ, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య వంటి వారు జనసేన తరపున రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎలక్షన్ నిర్వహణ వరకు జనసేన స్వీయ తప్పిదాలు ఒకటీ రెండు కాదు ఇంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఆ పార్టీ పలు స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లను కైవసం చేసుకుంది. యలమంచిలిలో టిడిపి, విశాఖ సౌత్ జోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి, విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా మెజార్టీ తగ్గటానికి జనసేనకు పోలైన ఓట్లే కారణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలిసారే జనసేన తరపున విశాఖ ఎంపిగా పోటి చేశారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికలలో జనసేనా ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు దక్కించుకుంది. గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఇమేజ్, కమ్యునిటి ఫ్యాక్టర్, టిడిపిలో అంతర్గత రాజకీయాలు వంటి ఎన్నో ఎన్నెన్నో అంశాలు అనుకూలించినా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలు పరిస్థితులూ అంతుపట్టకుండా అయిపోగా ఇపుడు పరిస్థితి మరి గందరగోళంగా తయారైంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సీనియర్లకు సైతం సముచిత స్థానం, భవిష్యత్ పై భరోసా లభించని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోక తప్పదు అనే అభిప్రాయం నాయకులలో వ్యక్తమవుతోంది. జనం ఆదరణ పొందినప్పటికీ పార్టీ కార్యాచరణ తమ భవిష్యత్ అర్థంకాకపో నాయకులు నలిగిపోతున్నారు. రాజకీయంగా సంధికాలం గడుపుతున్నవారు, తమ భవిష్యత్తును ఇతర పార్టీలో వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వివి లక్ష్మీ నారాయణ సామాజిక సేవకు పరిమితమయ్యారు. జెడి ఫౌండేషన్ తో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జెండా కింద ఎటువంటి యాక్టివిటీ చేయటంలేదు. అనకాపల్లి నుంచి పోటీ చేసి రచయితల పార్థసారథి బీజేపీలో చేరి పోయారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాలలో కీలకమైన పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి జిల్లా స్థాయిలో పార్టీని వీడిన తొలి నాయకుడయ్యారు. పార్థసారథి ఒక్కరే కాదు, సమీప భవిష్యత్తులో మరికొంతమంది జనసేనకు గుడ్ బై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలరాజుతో వైసిపి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపికి స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద సవాల్. విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకం ఈ నేపధ్యంలో సీనియర్ అవసరం కావాలి అంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే టిడిపిని కాలిచేయడం పనిగా భారీగా వలసలు స్వాగతిస్తుంది వైసిపి. ఈ తరుణంలో జనసెనలో మిగిలిన నేతలతో ఎలా డీల్ చేస్తుందో చూడాలి ఇక.

సగటున ప్రతి ఆర్టీసీ కార్మికుడికి 50వేల జీతం... ఇంకా పెంచమని ఎలా అడుగుతారు?

  మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీనే లేదని.... ఇక, బీహార్, ఒడిషా, జమ్మూకశ్మర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేవలం నామమాత్రంగా బస్సులను నడుపుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే కర్నాటక తర్వాత అత్యధిక బస్సులను నడుపుతున్నది తెలంగాణ మాత్రమేనన్నారు. దాదాపు 11వేల బస్సుల్లో ప్రతిరోజూ సుమారు కోటి మంది ప్రయాణిస్తున్నారని, ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే, కార్మికులు ఇలా సమ్మెకు దిగడం సరికాదన్నారు. ఏటా 12వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉన్నామని, పైగా హైదరాబాద్లో ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరిస్తోందని, అంతేకాకుండా సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు 50వేల రూపాయల జీతం అందుతుండగా, ఇంకా పెంచమని అడగడంలో అర్ధం లేదన్నారు కేసీఆర్. యూనియన్ల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదన్న కేసీఆర్.... ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనంచేసే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న విపక్షాల ప్రతిపాదనను కేసీఆర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు అసలు ఆర్టీసీ విలీనంపై మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అంటూ ప్రశ్నించారు.

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసలు ఏం జరుగుతోంది?

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పాటై రెండేళ్లు పైబడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. తరవాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ కార్పొరేషన్ లో మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వాన్ని కాదని ఎంత వరకూ పాలన సాగిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ కార్పొరేషన్ లో పార్టీల బలాబలాలను చూస్తే రెండు వేల పదిహెడులో జరిగిన ఎన్నికల్లో టిడిపి మెజార్టీ దక్కించుకుంది. మొత్తం నలభై తొమ్మిది డివిజన్లలో అప్పటి మిత్రపక్షమైన బీజేపీ రెబల్ అభ్యర్థులతో కలిపి ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. తర్వాత మిత్ర బంధం తెగి పోవడంతో బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీకి దూరమయ్యారు. దాంతో వారి సంఖ్య ముప్పై ఏడుకు పడిపోయింది. మేయర్ పదవి ఆశించి భంగపడిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మాకినేడి శేషుకుమారి జనసేన తీర్థం తీసుకోవడంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది. ఇక కార్పొరేషన్ లో ప్రతి పక్ష వైసీపీ బలం పది మంది సభ్యులైతే అందులో ఇద్దరు సభ్యులు పార్టీ అధిష్టానంతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అయితే ఇప్పుడు స్టేట్ లో వైసిపి పవర్ లోకొచ్చింది. దానిని ఉపయోగించుకొని వంద కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ లో తనదైన సత్తా చాటుకోవాలని వైసిపి ఉబలాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రూట్లో పావులు కదపటం మొదలు పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ యుద్దమే సాగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నేతలు తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సైలెంటైపోయారు. ఆ క్రమంలో మేయర్ స్థానం కైవసం చేసుకున్నప్పటికీ టిడిపి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పదిహెడు మంది వరకూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, లోపాయికారిగా వైసిపికి మద్దతు ప్రకటించారు. ఆ పరిస్థితికి కారణంగా కార్పొరేషన్ లో మెజార్టీ ఉన్నా పరిపాలనలో మైనార్టీగా ఉండాల్సిన పరిస్థితి టిడిపిది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిష్ఠాత్మకమైన స్మార్ట్ సిటీ పనులు కూడా జరుగుతుండడంతో అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై పాలక వర్గం మల్లగుల్లాలు పడుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు గెలిచిన తరువాత వారికి టీడీపీ కార్పొరేటర్ల మద్దతు పెరిగింది. కన్నబాబు మంత్రి కావడంతో కార్పొరేటర్లు కొంత మంది సన్నిహిత్యం లోకి వెళ్లారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు కూడా టీడీపీతో టచ్ మి నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. మొత్తమీద టిడిపిలో ప్రస్తుతమున్న ముప్పై ఆరు మంది కార్పొరేటర్లలో సగానికి పైగా కార్పొరేటర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి జగన్ నిరాకరించినట్లు తెలిసింది. వైసీపీలోకి వస్తే కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. దాంతో పదవులు వదులుకోవడానికి ఇష్టపడని టిడిపి కార్పొరేటర్లు కండువా మార్చకూండానే కార్పొరేషన్ లో వైసీపీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ పరిస్థితి అర్థం కాకుండా తయారైందంటున్నారు.

ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు. దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.

సైకిలెక్కుతుందా? కారులో సవారీ చేస్తుందా? హుజూర్ లో సీపీఎం దారెటు?

  హుజూర్‌నగర్‌ ఉప పోరులో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి. ఏలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కులాల వారీగా నేతలను రంగంలోకి దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే పోటీ నెలకొనగా... బీజేపీ, టీడీపీ‌ కూడా గెలుపు కోసం తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. ఇదిలాఉంటే, హుజూర్‌నగర్‌ ఉప పోరులో ప్రధాన పార్టీలకు ప్రజాసంఘాలు, ఆయా పార్టీల మద్దతు కీలకంగా మారింది. దాంతో, ఆయా పార్టీలు, వివిధ సంఘాల మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే, అధికార టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతుగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ.... జనసేన సపోర్ట్‌ కోరింది. అయితే, సీపీఎం అభ్యర్ధి నామినేషన్‌... స్ర్కూటినీలో తిరస్కరణకు గురవడంతో... సీపీఎం సైతం టీఆర్‌ఎస్‌‌కు మద్దతిస్తుందనే ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే సీపీఎం ఇప్పటివరకు ఎటూతేల్చకపోవడంతో, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. హుజూర్‌ నగర్‌ బరిలో తమ మద్దతివ్వాలంటూ సీపీఎంను టీడీపీ కోరింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సంప్రదించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ.... తెలుగుదేశానికి మద్దతివ్వాలని కోరారు.  అయితే, ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుగూ పోరాటాలు చేసిన సీపీఐ... చివరికి అదే అధికార పార్టీకి మద్దతు ప్రకటించి అభాసుపాలైందన్న విమర్శలు రావడంతో... ఆచితూచి అడుగేయాలని సీపీఎం భావిస్తోంది. మరోవైపు సీపీఎం నామినేషన్ తిరస్కరణపై న్యాయపోరాటం చేస్తోంది. అయితే, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొందని, మరే పార్టీకి మద్దతిచ్చినా ఉపయోగం లేదని సీపీఎం అంచనాకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ కు చేయి అందించడమో... లే కారులో సవారీ చేయడమో ఏదో ఒకటి జరగొచ్చని అంటున్నారు. ఈ రెండూ కాకపోతే, మద్దతు కోరిన టీడీపీ వైపు ఉండటం.... లేకపోతే ఏ ఇబ్బందీ లేకుండా తటస్థంగా ఉంటుందో చూడాలి.