ఓ సామాన్యుడు... వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు... కల్కి కథలు
posted on Oct 21, 2019 @ 2:03PM
ఓ సామాన్య వ్యక్తి... భగవాన్‌గా అవతారమెత్తాడు. కల్కి అసలు పేరు విజయకుమార్. భక్తి ప్రవచనాలు చేసే విజయకుమార్ ఆధ్యాత్మిక గురువుగా మారాడు. శిష్యులను పెంచుకున్నాడు. దేశ విదేశాల్లో శిష్యులు కల్కి గురించి విస్తృత ప్రచారం చేశారు. కల్కి దర్శనంతో అంతా మంచి జరుగుతుందని, రోగాలు నయం అవుతాయని ప్రచారం చేశారు. ఇంకేముంది తండోపతండాలుగా ప్రజలు కల్కి ఆశ్రమానికి క్యూకట్టారు. దాంతో వందల ఎకరాల్లో ఆశ్రమాన్ని విస్తరించారు. పాల రాతితో అందమైన కట్టడాలు కట్టారు. పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక, ధ్యాన భవనాలు నిర్మించారు. క్యూకాంప్లెక్స్లు ఏర్పాటు చేశారు. క్యాష్ కౌంటర్లు నెలకొల్పారు. ఎంతలా అంటే ఆ భవనాన్ని ఒక్కసారైనా చూడాలనిపించేలా సర్వాంగ సుందరంగా నిర్మించారు.
ఇక, కల్కికి ఆదరణ పెరగడంతో విజయకుమార్ సతీమణి కూడా రంగంలోకి దిగింది. అమ్మ భగవాన్‌గా భక్తులకు పరిచయమైంది. ఇద్దరూ ఒకేచోట ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆశ్రమానికి వచ్చే విదేశీ భక్తుల నుంచి భారీగా విరాళాలు వసూలుచేసేవారు. దర్శనానికైతే కొంత... పాదాలు మొక్కితే ఇంత అంటూ రకరకాల సేవల పేరుతో డబ్బు వసూళ్లు చేపట్టేవారు. విదేశీ భక్తులైతే తమ ఆస్తుల మొత్తాన్ని ఆశ్రమానికి ఇచ్చేస్తారని తెలిసింది. అలా విదేశీ భక్తులు ఇచ్చిన విరాళాలే వందల వేల కోట్లకు చేరుకున్నాయి. దాంతో ట్రస్ట్ పేర్లు మారుస్తూ, కల్కి ఆశ్రమ ఆస్తులు, లెక్కలు ఉన్నట్లు తేలింది.