అధికార పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు?? కర్ణాటక రాజకీయాల బాటలో మహారాష్ట్ర

  మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందిన బీజేపీకే సీఎం కుర్చీ దక్కుతుందా లేదంటే కమలనాథులతో విభేదిస్తున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. 50-50 ఫార్ములాపై బీజేపీ మాట తప్పడంతో శివసేన తన దారి తాను చూసుకుంటోంది. వాస్తవానికి అక్టోబర్ 24 న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 సీట్లు వచ్చాయి. తమ కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నరేళ్లపాటు సీఎం సీటును పంచుకుందామని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ శివసేన మధ్య ఇప్పుడు చీలికలొచ్చాయి. 5 ఏళ్ళ పాటు సీఎం సీటు తనదే అంటూ ఫడ్నవీస్ ప్రకటించడంతో శివసేన తమ దారి తమదేనంటూ కాంగ్రెస్ ఎన్సీపీతో చేతులు కలుపుతోంది.  బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని అంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేస్తున్నారు. శరద్ పవార్ ను ఆయన నివాసంలో కలిసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని తెలిపారు. మెజారిటీ లేని వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. మా పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యాపారులు కారంటూ చతుర్లు విసిరారు. ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది అని బీజేపీకి చురకలంటించారు. నిన్నటి శాసనసభపక్ష సమావేశంలో ఏక్ నాథ్ ఖాడ్సేను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. మహారాష్ట్రలో 50-50 ఫార్ములాపై మాట తప్పిన బీజేపీకి శివసేన చుక్కలు చూపిస్తుందా సీఎం సీటు చెరి రెండున్నరేళ్లు పెంచుకోవాలంటున్న శివసేన అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందా చుడాలి. ఇందుకు ఎన్సీపీ కాంగ్రెస్ కలిసొస్తాయి అంటే అవునని అంటున్నారు.  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న సామెతను ఋజువు చేస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ ను కలిశారు శివసేన ఎమ్మెల్యేలు. అయితే గవర్నర్ ఎవరికి అనుమతిస్తారు ఎప్పుడు అవకాశం కల్పిస్తారన్న ఉత్కంఠ ఇపుడు దేశ రాజకీయాలలో కొనసాగుతుంది.ఇరు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పోలింగ్ కు ముందు ఎలక్షన్ కు వివరాలు సమర్పించాయి.అయితే ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య సీఎం సీటు విషయంలో పంచాయతీ నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటు కు ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీకే అవకాశం ఉంది. మిగతా పార్టీలకు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కమలం పార్టీ చెబుతుంది. ముందే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తర్వాత బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బలనిరూపణకు ఎన్ని రోజుల సమయం ఉంటుందనేది కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇలాంటి అనిశ్చితి మధ్య శివసేనతో దోస్తీ ఉందని చెబుతున్న బిజెపి ఆ పార్టీకి డిప్యూటీ సీఎం సహా 13 మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేస్తోంది.

పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నాయకులు

  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు వలస వచ్చి గులాబీ గూటికి చేరారు. వీరందరూ తమకు ఏదో ఒక రూపంలో అవకాశం వస్తుందన్న విశ్వాసంతో టీఆర్ఎస్ లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన గజ్వేల్ నియోజక వర్గ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మళ్లీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ఒక వైపు పలు కార్పొరేషన్ చైర్మన్ ల పదవీ కాలం కూడా ముగియడంతో ఆశావహులు తమకు వీటిలో ఏదో ఒకటి దక్కకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, మంత్రి పదవులు ఆశించి దక్కని వారు కూడా తమకు ఏదో ఒక అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. సెప్టెంబరులో మంత్రి వర్గ విస్తరణ సమయంలో సీనియర్ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించారు కేసీఆర్ . ఆ ఎఫెక్ట్ తో దసరాకు పదవుల పంపకం ఉంటుందని ఆశించారు ఆశావహులు. హుజూర్ నగర్ భై ఎలక్షన్స్ రావటంతో టీఆర్ఎస్ పెద్దలంతా వాటిపై దృష్టి పెట్టారు. దీనితో పదవుల పంపకం జరగలేదు.  ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ తిరిగి కొంత ఆలస్యం అవుతుందేమోనన్న అనుమానాలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసిన ఒకరిద్దరు చైర్మన్ లకు మరోసారి అవకాశం దక్కింది.ఇప్పటికే కార్పొరేషన్ చైర్మెన్ లుగా ఉండి పదవీ కాలం పూర్తయిన వారు కూడా తమకు ఇంకోసారి అవకాశం ఉంటుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా టిఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులు రాని వారు, పదవులు వచ్చి కాల పరిమితి ముగిసిన వారు తమ భవిష్యత్తు ఏంటా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల తరువాత పదవుల పంపకం ఉంటుందా లేక వాటితో సంబంధం లేకుండా పదవుల భర్తీ చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది.  

పోలవరం ప్రాజెక్టు మళ్లీ మొదలు.. భూమి పూజ చేసిన మేఘా

  మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరంలో భూమి పూజ చేసింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హై కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది.స్పిల్ వే బ్లాక్ నెంబర్ 18 వద్ద భూమి పూజ నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని వనరులు ఉపయోగించి నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది మేఘా సంస్థ. కాళేశ్వరం లాంటి క్లిష్టమైన ప్రాజెక్టు నిర్మించిన అనుభవంతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  ఇన్ని రోజులు పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హై కోర్టు ఎత్తేయడంతో పనులు తిరిగి మొదలుపెట్టటానికి మార్గం సుగుమమైంది. పాత కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రివర్స్ టెండర్ కు వెళ్లి పోలవరం హెడ్ వర్క్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రాలకు కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. హై కోర్టు ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. గతంలో ఈ పనులు చేపట్టిన సంస్థలకంటే తక్కువ మొత్తానికి పనులు పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628 కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి 4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజినీరింగ్ ఒక్కటే 4,358 కోట్లు మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటానికి వడివడిగా అడుగులు వేస్తోంది.  పోలవరం ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైడల్ పవర్ ప్రాజెక్టుతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజి ఎగువ కృష్ణా నదికి తరలిస్తారు. 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం తాగు నీటి అవసరాల కోసం వినియోగిస్తారు. పోలవరం కాలువలు ఆనుకొని ఉన్నటువంటి 540 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు.

ఆర్టీసీ సమ్మెపై రేపు తుది నిర్ణయంతీసుకోనున్న కేసీఆర్

  ఆర్టీసీ కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చెయ్యనున్నారు. ఛలో కరీంనగర్ పిలుపుతో తమ డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం దిగొచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సమ్మె, ఆర్టీసి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఈరోజు హై కోర్టు విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పును బట్టి రేపటి మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీతో పాటు మరి కొందరు అధికారులు విచారణకు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి కోర్టు తీర్పుకు అనుగుణం గానే రేపు మధ్యాహ్నం జరిగే మంత్రి వర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ దీనిపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది.  సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు పదేపదే సమ్మెకు వెళ్లకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లో ఏవి తీర్చగలిగినవి..ఏవి తీర్చలేనివి.. సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తదితర అంశాల పై రేపు మంత్రి వర్గం చర్చించనుంది. ఆర్టీసి భవితవ్యంపై నిపుణులతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు కేంద్రం అమలు చేస్తున్న రవాణా చట్టంపైనా సీఎం సమగ్ర అధ్యయనం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిని క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం.  

పాలమూరుకు కొత్త పరిశ్రమలు.. 480 ఎకరాల్లో ఐటీ హబ్

  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా ప్రతిష్టాత్మక పాలమూరులో ఐటి మరియు మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు తొలి అడుగు పడనుంది. దివిటిపల్లి సమీపంలో సేకరించిన 480 ఎకరాల భూమిలో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ టవర్ పనులకు తొలి అడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా 25 కోట్ల నిధులు విడుదల చేయడంతో టీఎస్ ఐఐసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పూర్తిగా 5 అంతస్థుల్లో నిర్మించే ఈ టవర్ లో ప్రస్తుతానికి జీ ప్లస్ టు నిర్మాణాన్ని చేపడతారు. అందులో దాదాపు 50,000 అడుగుల విస్తీర్ణంలో స్పేస్ ను కంపెనీలకు అప్పగిస్తారు. ఆ స్పేస్ లో కంపెనీలు.. ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. తదనంతరం అవే కంపెనీలకు వారు అడిగినంత మేరకు స్థలాన్ని కేటాయించి కంపెనీల నిర్మాణాన్ని రెండో దశలో చేపడతారు. ముఖ్యంగా ఈ కారిడార్ లో సాఫ్ట్ వేర్ ఆధారిత కంపెనీలతో పాటుగా ఐటి, కంప్యూటర్ హార్డ్ వేర్, కాలుష్య, రసాయన రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేసి సుమారు నలభై కంపెనీల కార్యాలయాలను నెలకొల్పేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి దశలో కేవలం సాగు నీటి కల్పనకు పెద్ద పీఠ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు పారిశ్రామికాభివృద్ధికి నడుం బిగించింది. పాలమూరులో ఇప్పటికే జడ్చర్ల వద్ద ఉన్న సెజ్ ద్వారా కొంత పారిశ్రామిక ఉపాధి కలుగుతుంది. కానీ అక్కడ చాలా మంది ఇతరప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉండటంతో స్థానికంగా ఎక్కువ ఉపాధి పొందలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది.అందువల్ల పాలమూరులోని మరో ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా దివిటిపల్లి శివారులో చాలా భూమి ఉందని దాన్ని దాదాపు 30 ఏళ్ల క్రితం పలువురు రైతులకు అసైన్డ్ చేసిన కూడా ఎలాంటి వ్యవసాయం జరగలేదని గుర్తించారు. నిబంధనల ప్రకారమైతే సదరు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే తిరిగి తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపు 30 ఏళ్లుగా ఇదే భూమిలో ఏనాటికైనా నీటి వసతి కలుగుతుందని ఎదురు చూస్తున్న రైతులున్నారు. వారిని ఉన్నపళంగా పంపించటంపై ప్రభుత్వం పునరాలోచించి..వారికి సాధారణంగా భూ సేకరణలో ఎంతైతే పరిహారం వస్తుందో అంతే పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.ఒక్కో ఎకరానికి 12లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడంతో రైతులు కూడా స్వచ్ఛందంగానే వారి భూములను ప్రభుత్వానికి అప్పగించారు. సేకరించిన భూమిలో గత ఏడాది మార్చి 14 న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి అంచున నిలుపుతామని ప్రకటించారు. కానీ ఎన్నికల కారణాల వల్ల జాప్యం జరిగింది. సుదీర్ఘ జాప్యం తర్వాత తొలి అడుగుకు అంతా సిద్ధం చేశారు. ఐటీ కారిడార్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న ప్రతిభావంతులైన యువతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఐటీ టవర్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సాఫ్ట్ వేర్ మరియు పారిశ్రామికంగా అభివృద్ధి జరగటం జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. గతంలో ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి లేక వలసలు పోయే వారని కానీ ఇప్పుడు ఇంతటి పరిశ్రమలు స్థానికంగా వస్తుండటంతో తమ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

శివసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు: సంజయ్ రౌత్

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. మిత్రపక్షాలు బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. 50-50 ఫార్ములా విషయంలో వెనక్కి తగ్గేది లేదంటుంది సేన. అహంకారం తగ్గించుకుని మెట్టు దిగాలని మిత్ర పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరో కీలక ప్రకటన చేశారు, సేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వ్యాఖ్యానించారు. బీజేపీ, శివసేన కూటమికి మరాఠా ప్రజలు పట్టం కట్టారని, అది జరగని పక్షంలో టు థర్డ్ మెజార్టీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని స్పష్టం చేశారు. నిన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు సంజయ్ రౌత్. తెల్లారే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన మొండిపట్టు పట్టడంతో బీజేపీ కూడా ప్రత్యామ్నాయాల కోసం తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే స్వతంత్రులు చిన్న పార్టీలకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించారు. మొత్తం ఇరవై ఏడు మందిలో పదిహేను మందికి పైగా బిజెపిని సపోర్ట్ చేస్తూ లేఖలు కూడా ఇచ్చారు. మరోవైపు శివసేన ఎన్సీపీ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఎవరెవరుతో కలుస్తారు, మోదీ, షా ఎలా చక్రం తిప్పుతారు, ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు జరుగుతుంది అనే అంశాలపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది.  

సమస్యను పరిష్కరించే వరకు బాబు అంత్యక్రియలు చేయం: ఆర్టీసీ జేఏసీ

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధాన ఎజెండాగా కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా ఇవాళ కార్మిక జేఏసీ ఛలో కరీంనగర్ కు పిలుపునిచ్చింది. మరోవైపు పొలిటికల్ జేఏసీ జిల్లా బంద్ చేపట్టాలని కోరడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు బందుకు మద్దతు తెలిపాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున కరీంనగర్ కు రావడంతో జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలో గుండె పోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలు కూడా నిలిపివేశారు కుటుంబ సభ్యులు. వేలాది కార్మికులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపిన తర్వాతే అంతిమయాత్ర మొదలు పెడతామని జేఏసి రాజకీయ పక్షాలు తేల్చి చెప్పడంతో జిల్లాలో పరిస్థితి ఆందోళనగా మారింది.  బాబు మృతదేహాన్ని ఆరేపల్లి లోని అతని ఇంటి దగ్గరే ఉంచారు. జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు స్థానిక ఎంపీ సంజయ్ సంపూర్ణ మద్దతు తెలిపి.. బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.పెద్ద సంఖ్యలో అఖిల పక్షం నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఆరెపెల్లికి చేరుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ నగర బంద్ కూడా కొనసాగుతుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.సుమారుగా 40 గంటల పాటు కూడా బాబు మృతదేహం ఆరేపలల్లిలోనే ఉంది. తమ సమస్య పరిష్కారమయ్యేంతవరకు అంత్యక్రియలు చేయమని ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఎంపీ సంజయ్ కూడా తేల్చి చెప్పేశారు.

మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలు తీసిన డెంగ్యూ

  తల్లి పొత్తిళ్ళలోకి చేరక ముందే ఆ బిడ్డ కన్నతల్లిని కోల్పోయాడు.శిశువు లోకం చూడకముందే నవమాసాలు మోసిన తల్లి లోకం విడిచింది.పుట్టిన బిడ్డను చూసుకునే అదృష్టాన్ని తల్లి నోచుకోలేదు. ఇలా ఒక్కరా ఇద్దరా ఇదే కుటుంబంలో మొత్తం నలుగురి ప్రాణాలను మింగేసింది డెంగ్యూ మహమ్మారి. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తోంది.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయాయి. వైద్యారోగ్యశాఖ అధికారుల నిద్ర మత్తు జనాల ప్రాణాలను తోడేస్తుంది. పల్లె.. పట్నం.. అని తేడా లేకుండా పారిశుధ్య లోపం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. దాంతో దోమలు విజృంభించి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. డెంగ్యూ జ్వరం కారణంగా గుడిమెల్ల రాజ గట్టు కుటుంబం బలైపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.  ఆ పసిగుడ్డు నిండా కళ్లు కూడా తెరవలేదు. పుట్టి రెండు రోజులైనా తమ్ముడు ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు.ఇదిలా ఉంటే ఏమీ తెలియని పసి వయసులో ఇంకోక బాలుడు తల్లికి తల కొరివి పెట్టాడు. డెంగ్యూ బారిన పడి అంతులేని విషాదం నిండిన ఆ కుటుంబాన్ని చూసి ప్రతి హృదయం తల్లడిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలో రాజ గట్టుతో పాటు తాత లింగయ్య, కూతురు శ్రీవర్షిణి తాజాగా ఆయన భార్య సోనా సైతం ప్రాణాలు కోల్పోయారు. తల్లిపాల కోసం తల్లడిల్లే తమ్ముడు.. అమ్మా నాన్న కోసం ఎదురు చూసే అన్న.. ఇద్దరూ తల్లితండ్రులు లేని అనాథలయ్యారు. విషజ్వరాల బారిన పడి వేల సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.రెండు రోజుల క్రితం లోకంలోకి అడుగు పెట్టిన బాలుడు సైతం ప్రాణాపాయ స్థితిలో ఉండటం కలవరపెడుతోంది.  కుటుంబాలకు కుటుంబాలే మింగేస్తున్న డెంగ్యూ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఒక్కో బెడ్ పై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారంటే విషజ్వరాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు జిల్లాలు, నలుగురు కలెక్టర్లు, డీఎంహెచ్ఒలు ఉన్న మునిసిపాలిటీలో పారిశుద్ధ్య లోపం పట్టి పీడిస్తోంది. చెత్త సేకరణ, డ్రెయినేజ్ పరిశుభ్రత లేకపోవడం, నీటి నిల్వతో జనావాసాల్లో దోమల దండయాత్ర పెరిగింది. దీంతో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది.  రిమ్స్ లో గత నెల కంటే ఈ సారి డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగాయి. ఒక్క నెలలోనే మూడు వందలకి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొమురం భీం జిల్లాలో 36, నిర్మల్ లో 34 ,మంచిర్యాల జిల్లాలో 37 వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 4 గురు 20 రోజుల వ్యవధిలో ప్రాణాలు విడవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. డెంగ్యూ తీవ్రత పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇంతమంది చనిపోయి ఉండే వారు కాదని స్థానికులు మండి పడుతున్నారు. నిద్ర మత్తు వీడి డెంగ్యూ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నవంబర్ 4న నోటిఫికేషన్, 19న ఎలెక్షన్.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు

  హుజూర్ నగర్ బై ఎలెక్షన్ గెలుపుతో మున్సిపల్ ఎన్నికల నిర్వాహణకు ప్లాన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అధికారులు రిజర్వేషన్ ల ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.రెండు విడతల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేని 53 మున్సిపాలిటీలు కార్పోరేషన్లకు ఈ నెల 4 న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. వీటికి సంబంధించిన రిజర్వేషన్ లను మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అర్బన్ డెవలప్ మెంట్ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రేపు ( నవంబర్ 2న ) ఈసీకి రిజర్వేషన్ ల వివరాలు ఇస్తారని 4 న నోటిఫికేషన్ వస్తుందని అధికార వర్గాల సమాచారం.  జవహర్ నగర్, బడంగ్ పేట్, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు 50 మునిసిపాలిటీల్లో ఈ నెల 19 న పోలింగ్ నిర్వహించే వీలుంది. ఒకటి రెండు రోజులు నోటిఫికేషన్ ఆలస్యమైతే 21 వ తేదీ లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్ ,రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్లతోపాటు 77 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ మునిసిపాలిటీల్లో ఎన్నికలపై హై కోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. పిటిషన్లపై నిన్న హైకోర్టులో విచారణ జరగ్గా వాటిని డివిజన్ బెంచ్ కు బదలీ చేస్తామని సింగిల్ జడ్జి చెప్పారు. ఒకవేళ కోర్టులో ప్రక్రియ లేటైతే న్యాయపరంగా ఇబ్బందుల్లేని మునిసిపాలిటీలు కార్పొరేషన్ లలో ముందుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖను ఆదేశించినట్టు సమాచారం. కోర్టు చిక్కులున్న మునిసిపాలిటీలు కార్పొరేషన్ లలో డిసెంబర్ 3వ వారంలో పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.  మరోవైపు రాష్ట్రంలో 77 మునిసిపాలిటీలపై ఉన్న స్టేలను ఎత్తివేయ్యాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన కేసుల్లోని అంశాలు సింగిల్ జడ్జి ఇచ్చిన కేసుల్లోని విషయాలు ఒకే తరహాలో ఉన్నాయని చెప్పింది. దీన్ని పిటిషనర్ల తరఫు లాయర్ లు వ్యతిరేకించారు. స్టే ఇచ్చినప్పుడు ప్రభుత్వం కౌంటర్ వేయాలే కానీ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికలకు వీలుగా స్టే ఎత్తేయాలని కోరడం చట్ట విరుద్ధమన్నారు. దీంతో తాము ఏ నిర్ణయం తీసుకోవడం లేదని జస్టిస్ చల్లా కోదండరాం చెప్పారు. రెండు పక్షాలు ఒక నిర్ణయానికి వస్తే ఉత్తర్వులు ఇవ్వగలమని లేదంటే డివిజన్ బెంచ్ తీర్పు చూసి నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు. స్టేలు ఉన్న కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తే విడివిడిగా అన్ని కేసులనూ విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.

సోమశిల జలాశయంలో రికార్డు స్థాయికి చేరిన నీటి మట్టం

  రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు అన్ని నిండిపొయాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నీరు చేరింది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి పూర్తిగా నిండి పోవడంతో జలకళ సంతరించుకుంది.దీంతో 9 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగునీటి వరప్రదాయినిగా భావించే సోమశిల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని కండలేరు రిజర్వాయర్ కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 77.750 టీఎంసీలు ఉండగా ఇన్ ఫ్లో 29.915 క్యూసెక్ లు, ఔట్ ఫ్లో 36.764 క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల గేట్లు ఎత్తివేయడంతో కడప జిల్లాలో పెన్న, పేరూరు తప్పిటవారిపల్లె, గంగపేరూరు తదితర గ్రామాలు నీట మునిగాయి. నీరు దిగువకు వదలడంతో ముంపు గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.వందల ఎకరాల్లో పంట నీట మునిగినట్టుగా అధికారులు గుర్తించారు. సోమశిల ప్రాజెక్టు నిండి పోవడంతో జిల్లాలో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రాజెక్టు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిస్తున్నారు.మొత్తం ఈ డ్యాం కెపాసిటీ 78 టీఎంసీలతో తొలిసారిగా నిండి చరిత్రలో ఇప్పటి వరకు కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయం అంటే మొత్తం 78 కెపాసిటీల నీటి సామర్థ్యం అనేది తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో సోమశిల నుంచి అధికారులు గేట్లన్నీ కూడా ఎత్తి వేశారు.ఇక్కడి నుండి పెన్నా డెల్టాకు కూడా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.  

మాజీ న్యాయమూర్తిపై సెక్షన్ 354 కేసు నమోదు

  సింధూ శర్మ సంబంధించిన కేసులో ఒక కొత్త పరిణామం చోటుచేసుకుంది. మాజీ న్యాయమూర్తి  జస్టిస్ నూతి రామ్మోహన్ రావు తన కోడలిని దారుణంగా హింసించిన సంగతి తెలిసిందే.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా అతనిపై ఐపిసి 354 సెక్షన్ ను జత చేయాలని సీసీఎస్ అధికారులు కోర్టును అభ్యర్దించారు. ఈ క్రమంలో కోర్టు కూడా జత చేయడానికి అనుమతించడం జరిగింది. ఇప్పటికే సింధుశర్మ ఫిర్యాదు మీద  ఐపీసీ సెక్షన్ 493,323 మరియు డౌరీ అండ్ ప్రోహ్బిషన్ యాక్ట్ 406సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మహిళలతో ఆయన ప్రవర్తించిన విధానాన్ని అభ్యంతరకర విధానాల మీద ఈ 354 సెక్షన్ ని తీసుకోవటం జరిగింది. సింధుశర్మ తన అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడూ ఆమెని ఏ విధంగా చిత్రీహింసలకు గురిచేశారు..రాత్రి పూట ఆమెను బయటకు నెట్టివేసిన పరిస్థితి కానీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలను అన్నింటిని సాక్ష్యాధారాల కింద కోర్టుకు అందించారు. అదే విధంగా సీసీఎస్ అధికారులు కూడా సింధుశర్మ ఇచ్చిన తాజా లేఖను కోర్టుకి అందచేయడంతో  మొత్తానికీ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై మరో కేసు కూడా నమోదు అయ్యింది.  

విశాఖ భూ ఆక్రమణలపై సిట్ విచారణ...

  విశాఖ భూ ఆక్రమణలపై సిట్ విచారణ జరపనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్ అరీనా వద్ద అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మాజీ ఐ.ఏ.ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు వరకు సిట్ ఫిర్యాదులు స్వీకరించనుంది. ఆన్ లైన్ లోనూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ భూ కుంభకోణాలు మీద సిట్ విచారణ ప్రారంభించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణ అనేది కేవలం అధికార పార్టీని రక్షించే విధంగా ఉండటంతోటి ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రొఫార్మాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలోని పదమూడు మండలాలలో భారీ ఎత్తున గత కొన్నేళ్లుగా భూ అక్రమాలు, భూ కుంభకోణాలు జరిగాయని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం సిటీలో దాదాపుగా పదమూడు మండలాలకు సంబంధించిన ఫిర్యాదులను సిట్ స్వీకరించబోతుంది. నలభై మంది రెవిన్యూ అధికారులు ఈ సిట్ అధికారులకు సహాయకంగా పని చేయబోతున్నారు. ఇందులో భాగంగా రెండేసి మండలాలకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో మొట్టమొదటగా ఎవరైనా బయటి నుంచి ఫిర్యాదు చేయటానికి వచ్చే వారి కోసం ఎక్కడికి వెళ్లాలి, ఏ మండలానికి ఏ టేబుళ్లను ఏర్పాటు చేయటం జరిగింది అని తెలియ చెప్పటం కోసం ప్రత్యేకంగా ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7 వ తారీఖు వరకు సిట్ ఫిర్యాదులను స్వీకరించనుంది.  

పేరు గొప్ప, ఊరు దిబ్బ.. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత

  'సర్కార్ దవాఖానాకు రాను బిడ్డో నేను రాను బిడ్డో' అంటూ సినిమా పాట ఇది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొంది. మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. గోలి బిల్ల లేక పేదవాడి గుండె ఆగిపోతుంది. చివరకు అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనే స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలువ లేక పేదవాడి జేబుకు చిల్లులు పడుతున్నాయి.  వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోంది కాని నిర్వహణలో అన్ని లొపాలే.. అధికారులకు శాఖలకు మధ్య సమన్వయ లోపం రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఇంత పెద్ద ఆస్పత్రిలో మందులు లేవు. కనీసం ప్రతి రోజూ అత్యవసరంగా ఉపయోగించే మందులు కూడా దొరకడం లేదు.దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పాము కాటు, తేలు కాటు ,కుక్కకాటు, పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించే అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం రెండు వేల మంది వరకు జ్వరాలతో ఎంజియం ఆసుపత్రికి వస్తుంటారు వారికి ప్యారాసిటమాల్, యాంటీ బయటిక్ ట్యాబ్లెట్స్ కూడా లేవంటే ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.ఇక విధిలేని పరిస్థితుల్లో వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు పేద రోగులు. ఈ దుస్థితి చూసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయలాంటిది.వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్ ,మహారాష్ట్ర నుండి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు ప్రజలు. కానీ ఇక్కడ మందుల కొరత ఉండటంతో పేద రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద వాడి ప్రాణాలంటే గాల్లో పెట్టిన దీపంలా మారింది.

ఆర్టీసీని మీరే కాపాడాలి.. గవర్నర్ కు వినతి పత్రం అందించిన అఖిలపక్షం

  ఆర్టీసీ సమ్మె ఎన్ని రోజులైనా ఒక కొలిక్కి రావడం లేదు. ఒక పక్క తమకు ఏది పట్టనట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తొంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరారు అఖిల పక్ష నేతలు. సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై  ఫిర్యాదు చేసారు. గవర్నర్ జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షం వినతి పై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు నేతలు. కార్మికులు చేస్తున్న సమ్మె ఇరవై ఏడు రోజులు దాటినా సర్కారు పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు సూచనలు, కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్ కు వివరించారు.  ఆర్టీసీలో కేంద్ర భాగస్వామ్యం కూడా ఉందని సమ్మె విషయంలో కేంద్రం కూడా స్పందించాలని కోరారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆర్టీసీ ఆదాయం రూ.3900 కోట్ల నుంచి రూ.4900 కోట్లకు ఎగబాకిందని తెలియజేశారు. కార్మికులు ఎవ్వరూ కూడా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీతభత్యాల కోసం సమ్మె చేయడం లేదని.. ఆర్టీసీని కాపాడమనే వారు కొరుతున్నారని తెలిపారు. వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్మికుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీ విలీనంతో అక్కడి కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారని తెలంగాణలో మాత్రం జీతాలు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు నేతలు. కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు అంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. గవర్నర్ పవర్స్ ఉపయోగించి కార్మికులను కాపాడాలని కోరారు. అప్పులున్నాయని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం చేసిన అప్పులకు ఏం చేయాలని ప్రశ్నించారు టిడిపి నేత రావుల.  ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మ గౌరవంతో ఆర్టీసీ రక్షణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు ఓయూ విద్యార్థులు. ఆర్టీసీ అమరులకు నివాళులర్పిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి కొవ్వత్తుల ర్యాలీ చేశారు విద్యార్థులు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం సమస్య లు పరిష్కరిం చే వరకు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు ఓయూ విద్యార్థి సంఘాలు. అందరూ ఒక్కదాటిపై ఉన్నా కూడా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాడని సామన్య ప్రజలు వాపోతున్నారు.

108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు...

  వైద్య ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన 108, 104 వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఆయా వాహనాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం వరం అందించనుంది. పాదయాత్రల్లో వారి కష్టాలను తెలుసుకున్న వైయస్ జగన్ వాటిని పూర్తిగా రూపుమాపేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యవసర సమయాల్లో అపర సంజీవనిగా నిలిచిన 108 వాహనాల నిర్వహణ ఉద్యోగుల కష్టాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటికి ఇంధనం కూడా లేక మూలన పడేస్తున్న సందర్భాలూ అనేకం. మరోవైపు రిపేర్ లు వస్తే ఇక షెడ్డుకే, అవసరానికి తగ్గట్టు వాహనాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పిలిచిన అరగంటకు కూడా వాహనాలు రాని పరిస్థితి, ఈ దుస్థితిని ఉద్యోగులు పలుమార్లు పాద యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వివరించారు. రాజన్న స్వప్నంగా నిలిచిన ఈ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ వాహనాల్లో పని చేసే టెక్నిషియన్ కు 30,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వాహన పైలెట్ కు కూడా 28,000 జీతాన్ని ప్రకటించారు. కావలిసినన్ని వాహనాలతో పాటు వాటి నిర్వహణలో లోటు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు 104 వాహనాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరిన్ని వాహనాలను కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో జీతభత్యాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో పని చేసే ఏ.ఎన్.ఎం, ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడికల్ సిబ్బందికి 28,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యుల సర్వీసు రాబోయే వైద్యుల నియామకంలో వెయిటేజ్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీ.ఎం వై.యస్ జగన్ పూనుకోవడం హర్షణీయమని ఉద్యోగులంటున్నారు. మొత్తం మీద అత్యవసర సేవలకు సంజీవ వనాలనిచ్చిన 108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు చెప్పారు.

రైతు భరోసా సొమ్ములు స్వాహా చేసిన వైసీపీ నాయకులు

రైతే రాజు అని మాటలకే సరిపెడుతుంది అధికార పక్షం. అధికారం చేతిలొ ఉందటంతో తాము ఆడిందే ఆట పాడిందే పాట అనే ధోరణి వైసిపి నేతల్లో రోజు రోజుకూ ఎక్కువవుతోంది. కౌలు రైతుల పేరుతో రైతు భరోసా సొమ్మును స్వాహా చేశారు. ఫిర్యాదుపై ఈ  విచారణ జరిపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు తహసీల్దారు. దీనిపై వైసీపీ స్థానిక నేతలు మండిపడుతున్నారు. కూడేరు మండలంలో భూ యజమానులకు తెలియకుండా కౌలు రైతుల పేరుతో జాబితా తయారు చేసి.. రైతు భరోసా పథకం లబ్ధి పొందారు. కౌలు రైతుల జాబితాలో పేర్లు ఉన్న వారికి పదిహేను వందల రూపాయలు చేతులో పెట్టారు. మిగిలిన పది వేల రూపాయలను మండలానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు కాజేశారు. తమ భూముల పేరుతో ఇతరులు కౌలు రైతులుగా రైతు భరోసా లబ్ధి పొందిన విషయం తెలుసుకున్న బాధిత రైతులు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.కౌలు రైతులుగా జాబితాలో ఉన్నవారు కూడా పదిహేను వందలు ఇచ్చి మిగిలిన సొమ్ము గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు దిగమింగారు అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బాధితులకు హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన అంశాలను సమగ్రంగా విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక పంపుతామని గ్రామస్తులు కౌలు రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత  అధికారులపై చర్యలు తీసుకుంటానని బాధితులకు తెలిపారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పదుల సంఖ్యలో తహసీల్దారు చాంబర్ లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేశారు. తమ వారి పేర్లు ఎందుకు బయటకు వెల్లడించారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో తహసీల్దారుపై దాడి చేస్తారేమోనన్న అంతా వాతావరణం చాంబర్ లో ఏర్పడింది. దీంతో ఆందోళనకు గురైన తహసీల్దార్ తెల్లకాగితంపై తాను వివరాలు వెల్లడించలేదంటూ రాసిచ్చారు.  

పోలవరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ :- రివర్స్ టెండరింగ్ పై స్టే ఎత్తివేత

  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో హై కోర్టు స్టే ఎత్తివేసింది. రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతిపక్షానికి ఎదురు దెబ్బ తగిలిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరంలో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్నా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టేను హై కోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత రిట్ పిటిషన్ కు విలువ ఉండదని అడ్వకేట్ జనరల్ వాదనతో హై కోర్టు ఏకీభవించదని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. బ్యాంక్ గ్యారెంటీలను ఎన్ క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ను కూడా హై కోర్టు పక్కన పెట్టింది. హై కోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి అనిల్ కుమార్ గోదావరిలో వరద తగ్గు ముఖం పట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నామన్నారు. హై కోర్టు తీర్పు ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ అని ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణం పై విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు గత ఐదు నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతునే ఉంది. ఇప్పుడు కూడా మరో రెండు నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇలా చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఏ సమావేశంలో జరగాల్సిన పనులకు రివర్స్ టెండర్ లలో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాతే మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మిషనరీ అవసరం ఉంటుంది.కాబట్టి వాటిని తెప్పించటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. అయితే న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు తొలగినట్టుగా భావించొచ్చు. నవంబర్ లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.  

విజయవాడలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు...

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నేడు అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు ప్రత్యేక నివాళి, మూడు రోజుల పాటు అలరించనున్న కార్యక్రమాలు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల వారుసులకు సన్మానాలూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు చేసిన మహానీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మా నించనున్నారు. రాష్ర్టానికి చెందిన స్వర్గీయ పింగళి వెంకయ్య పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు బంధువులను రాష్ట్రావతరణ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్ తో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ధి చెందిన పంటకాలను ప్రజలకందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్ల ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు, డ్రస్ మెటీరియల్స్, రుద్రాక్షలు, పూజ సామగ్రితో కూడిన స్టాల్స్ సందర్శకులను కనువిందు చేయనున్నాయి. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలిత కళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పుర ప్రముఖులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.  

కరీంనగర్ లో ఉద్రిక్తత, గుండె పోటుతో ఆర్.టి.సి కార్మికుడు మృతి...

  కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది, గుండె పోటుతో మృతి చెందిన ఆర్.టి.సి కార్మికుడు నంగునూరి బాబు మృతదేహంతో అరబపల్లిలో కార్మికులు చేపట్టిన సమ్మెతో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తేనే డ్రైవరు బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని లేకుంటే ఇక్కడ నుంచి శవాన్ని కదిలించేది లేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. సమ్మెకు పరిష్కారం డ్రైవరు బాబుదే చివరి మరణం కావాలంటూ అంత్యక్రియలు చేపట్టకుండా నిలిపేశారు. ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీలతో పాటుగా ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనకు నిరసనగా కరీంనగర్ టౌన్ బందుకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఆర్టీసి కార్మికులంతా కరీంనగర్ చేరుకోవాలంటూ జెఎసి నేత అశ్వత్థామరెడ్డి పిలిపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుడు గుండెపొటు మరణం తరువాత కరీంనగర్ లో ఉద్రిక్తత నెలకొంది, దీనికి తోడుగా ఆర్టీసీ కార్మికులు రాజకీయ నేతల చలో కరీంనగర్ పిలుపు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని అదే విధంగా చనిపోయిన ఆర్టీసీ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలి అని, వాళ్ల కుటుంబాలకు యాభై లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వాళ్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు . డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇది ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసన తెలిపారు అయితే  తాజా సమ్మె దాన్ని అధిగమించింది. మరోవైపు కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వం మొండిపట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.