శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువయ్యేలా చేస్తున్న టిటిడి...

  తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువుదీరిన పవిత్ర పుణ్య క్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుని దర్శనానికి తిరుమలకు వస్తూ ఉంటారు. వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని స్వామి వారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది టిటిడి. సిఫార్సు లేఖలపై మాత్రమే ఇచ్చే పెద్దలడ్డు, వడలను సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. నిత్య కల్యాణం, పచ్చతోరణం తిరుమల తిరుపతిలో ఇలా ప్రతి రోజూ జనసందోహమే. ఇక ప్రత్యేక పర్వదినాల్లో కొండకు వచ్చే భక్తుల సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెంకన్నను దర్శించుకోవటం ఒకెత్తయితే స్వామి వారి ప్రసాదాలను దక్కించుకోవడం మరో ఎత్తు. సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంతో పాటు ఇంకా తెలియని ఎన్నో రకాల ప్రసాదాలను శ్రీవారికి రోజు వారీగా సేవలను బట్టి నివేదిస్తారు అర్చకులు. రోజూ రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు, తర్వాత వాటిలో కొన్నింటిని మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. పూర్వం కేవలం మట్టి కుండలలో మాత్రమే శ్రీనివాసుడి ప్రసాదాలు వండేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో ఇత్తడి గంగాళాలు వచ్చాయి, తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామి వారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణలో స్వామి వారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయ మూలకు శాస్త్రోక్తంగా మూడడుగుల రాతి అధిష్టానంపై అరవై ఒక్క అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పుతో విశాలమైన ఎత్తైన రాతి స్తంభాలతో వంటశాలను నిర్మించారు. అత్యంత ప్రాచీనకాలం నుంచి ఇదొక్కటే వంటశాల, శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు, పిండి వంటకాలు ఇలా అన్నీ ఈ వంటశాలలోనే తయారు చేసేవారు. భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో విమాన ప్రదక్షిణంలోని ప్రాచీన వంటశాలను ప్రస్తుతం ప్రధానంగా ఉన్న ప్రసాదాలకు కూడా వాడుతున్నారు. ఇక పిండి వంటలైన లడ్డూ, వడ, అప్పం, దోసె, పోలి, సుఖియా, మురుకు, జిలేబి తదితర వాటి తయారీకి వెండి వాకిలి బయట సంపంగి ప్రదక్షిణంలో ఉత్తరం వైపు ఉన్న మండపాలను వంటశాలగా మార్చి వాడుతున్నారు. శ్రీవారి ప్రసాదాలు ప్రధానంగా చెప్పుకునేది లడ్డు ఇందులో రెండు రకాల లడ్డూలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డూ ఒకటి కాగా మరొకటి కల్యాణం లడ్డు ఇది వీఐపీలకు మాత్రమే ఇస్తారు. ఇక ఈ పెద్ద లడ్డూ ధర ఒకటే రెండు వందలు, వడ వంద రూపాయలు శ్రీ వారి సేవలలో దర్శించుకునే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి మాత్రమే వీటిని ఇస్తుంది టీటీడీ. అయితే ఈ పద్ధతిలో మార్పులు చేయాలని నిర్ణయించింది టీటీడీ. పెద్ద లడ్డూ, వడలు ఉత్పత్తి పెంచి సామాన్య భక్తులకు కూడా వీటిని అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆలయం లోపల తూర్పు వైపున ఉన్న భగపడి అరలో పెద్దలడ్డూ, వడలు ఇస్తుంటారు. త్వరలో ఆలయం బయట పెద్దలడ్డూ వడలు విక్రయించాలని భావిస్తోంది టీటీడీ. భక్తుల రద్దీని బట్టి కల్యాణం లడ్డూలు వడలను తయారు చేయిస్తామంటున్నారు అధికారులు. లడ్డూల ఉత్పత్తి పెంచటానికి బోర్డును విస్తరించనుంది టీటీడీ. ఇప్పుడున్న ప్రాంతాన్ని మరింత పెంచుతాం అంటున్నారు అధికారులు.

ప్రభుత్వంపై సమర శంఖం పూరించనున్న ఆర్టీసి కార్మికులు...

  ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాల్టి సకల జనుల సమరభేరి సభతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికను రూపొందించింది, ప్రభుత్వంపై తమ పోరును ప్రత్యక్షంగా చాటుకోవాలని సర్కార్ తో అమీ తుమీకి సిద్ధమైంది ఆర్టీసీ జేఏసీ. ఇందు కోసం పోలీసులు సభకు అనుమతి లేదంటూ అడ్డంకులు సూచించినప్పటికీ కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుంది. కార్మిక జేఏసీ తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పక్షాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిన్నటి వరకూ డిమాండ్ల పరిష్కారం కోసం వేర్వేరు తరహాలో నిరసన చేపట్టిన కార్మికులు ఇవాళ బహిరంగ సభ ద్వారా తమ స్వరాన్ని పెంచి ప్రభుత్వ ధోరణిని ప్రజలకు తెలియజెప్పాలని భావించారు. అయితే అనుకున్నట్లుగానే ఈ సభను సరూర్ నగర్ మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు జేఏసి నాయకులు. సభకు ఉద్యోగ విద్యార్థి జేఏసీతో పాటు లక్షలాది మందితో భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేస్తున్నారు, సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో సభ ద్వారానే తమ సత్తా చాటాలని అనుకున్నారు. కానీ హై కోర్టు సూచనలతో ప్లాన్ అంతా తారు మారైంది. సభావేదిక సరూర్ నగర్ మైదానం నుంచి ఇండోర్ స్టేడియానికి మారింది, దీంతో ఆర్టీసీ జేఏసీ అప్పటి వరకూ వేసుకున్న అంఛనాలు పూర్తిగా మారిపోయాయి. కేవలం ఐదు వేల మంది పట్టే సామర్థ్యం కలిగిన స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోమనడంతో అంతర్మధనంలో పడ్డారు జేఏసీ నేతలు. అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలో సభ నిర్వహించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. ఆర్టీసీ బకాయిలపై హై కోర్టు వ్యాఖ్యలు కార్మికుల ఉత్సాహం పెంచినప్పటికీ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు కుదరకపోవడంతో ఒకింత నైరాశ్యానికి లోనైనట్లుగా తెలుస్తోంది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చూస్తోంది. ఈ సభకు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారు, ఈ సభ నుంచే తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు ఆర్టీసీ కార్మికులు. సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ.. వైఎస్ కూడా ఇలా చేయలేదంటూ రేవంత్ పై ఫైర్!!

  తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. హుజూర్ నగర్ లో పార్టీ ఓటమిపై చర్చకు జరగగా  ఓటమికి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఇక పార్టీలో రేవంత్ దూకుడుపై సీనియర్ నేత వీహెచ్ ఇండైరెక్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కట్టు దాటిన వారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చేందుకు కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం గాంధీ భవనలో జరిగింది. కోర్ కమిటీ ఎజెండా అంశాలు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మున్సిపల్ ఎన్నికలు అయినప్పటికీ మరి కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సమావేశం ప్రారంభమవ్వగానే హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో కోర్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కు అండగా నిలిచినట్లు సమాచారం. నేతలెవ్వరూ ప్రకటించకుండానే ఓటమికి బాధ్యత తనదే అని ఉత్తమ్ తెలివిగా ప్రకటించారని మరో నేతకు నిలదీసే అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పార్టీలో క్రమశిక్షణపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారట. ప్రగతి భవన్ ముట్టడి విషయంలో ముగ్గురు నేతలే నిర్ణయం తీసుకున్నారని గతంలోనే బాహాటం గానే విమర్శించిన వీహెచ్ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా క్రమశిక్షణ పేరుతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. వైయస్ కూడా ఎప్పుడూ సీఎం కాకముందు తన కార్యకర్తలతో సీఎం అనిపించలేదని కానీ పార్టీలో ఒక నేత సభలు సమావేశాల సమయంలో సీఎం అని తన కార్యకర్తలతో అనిపించుకుంటారని ఇది మంచి పద్ధతి కాదని నేత పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శించారని సమాచారం. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారట. కుంతియా సైతం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. ఇక కోర్ కమిటీ ఎజెండా ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్ ఏం చేయాలనే దానిపై నేతలు చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే మైనారిటీలకు, బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతలను నియోజక వర్గ ఇన్ చార్జిలకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇక నియోజక వర్గ ఇన్ చార్జిలు లేని చోట వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తూ వారి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మోదీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోందంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరు వల్లభ్ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కేంద్ర వైఫల్యాలపై పోరు బాట పట్టాలని తీర్మానించారు. అందులో భాగంగా నవంబర్ ఐదున అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నవంబర్ పదిహేను న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాద యాత్ర నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన సభకు కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని కోర్ కమిటీ పిలుపు నిచ్చింది. సభకు పార్టీ పక్షాన నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. మొత్తంగా కోర్ కమిటీ సమావేశం వాడి వేడిగానే జరిగినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఈయూ ఎంపీల బృందం

  జమ్ము కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. స్థానికులు అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఈయూ ప్రతి నిధి బృందం సభ్యులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బుధవారం కూడా కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటన కొనసాగనుంది. శ్రీనగర్ లోని చారిత్రక దాల్ లేక్ ను యూరోపియన్ల బృందం సందర్శించింది. దాల్ సరస్సు అందాలను చూసి ముగ్ధులయ్యారు యూరోపియన్లు. బోట్లలో కూడా వాళ్లు విహరించారు, స్థానిక వ్యాపారులతో కూడా బృందం పలు అంశాల పై చర్చించింది. శ్రీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్న అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు ఈయూ బృందం పర్యటనకు అనుమతి నిచ్చినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. ఆర్మీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడా ఈయూ బృందం భేటీ అయ్యింది. కశ్మీర్ లో పాకిస్థాన్ చొరబాట్లను ఎలా ప్రోత్సహిస్తుందో, కుట్రలు చేస్తుందో కళ్ళకు కట్టినట్లు ఈయూ బృందానికి వివరించారు ఆర్మీ అధికారులు. అయితే ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తో సహా విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్ష ఎంపీలు శ్రీనగర్ లో అడుగు పెట్టగానే అరెస్టు చేసిన కేంద్రం ఈయూ ఎంపీ బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కశ్మీర్ లో విదేశీ ఎంపీలకు అనుమతులు ఇచ్చి తమను అడ్డుకోవడంపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి. రైట్ వింగ్ ఎంపీలకు ఎలా అనుమతిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈయూ బృందం ఇప్పటికే ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఈయూ బృందానికి కేంద్రం వివరించింది. అంత వరకూ కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ల కోసం టీఆర్ఎస్ నేతల వేట...

  గులాబీ పార్టీ లో జోరు పెరిగి టిక్కెట్ల వేట మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు వారి నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్డ్ మెంబర్ నుంచి మేయర్ కుర్చీ దాకా ఎవరి లాబీయింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బంపర్ మెజార్టీ రావడంతో మునిసిపాలిటీల్లో కూడా గులాబీ జెండాదే హవా అనే అంచనా అందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం ముంచుకొచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ తో నవంబరు నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో గులాబిదళంలో టిక్కెట్ల కోసం వేట మొదలైంది.  మున్సిపాటీలో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొదలు మేయర్ కుర్చీ కోసం ఎదురు చూస్తున్న వారంతా వారి సీనియర్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు షురూ చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు మొదలైంది. దీంతో మున్సిపాల్టీల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో పార్టీ టికెట్ దొరికితే చాలు పదవి వచ్చినట్లే అని భావిస్తున్న నేతలంతా పైరవీలు మొదలు పెట్టారు. ఒక్కో వార్డ్ నుంఛి దాదాపు డజను మందికి పైగా టీఆర్ఎస్ స్థానిక నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆశావహులంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల అనుచరులే కావటంతో వచ్చిన దరఖాస్తులనూ ఫిల్టర్ చేస్తున్నారు. అయితే నూతన మున్సిపల్ యాక్టుపై అవగాహన ఉండి ప్రజల కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ లతో సహా అన్నింటికీ అన్నీ టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసముంది. చాలా ఉత్సాహం తో ప్రజలందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు కూడా ఎదురు చుస్తునారు.  ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాయకుల నియోజక వర్గాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ పాత నేతలు కొత్త నేతల మధ్య టికెట్ ల కోసం పోటీ పెరిగిపోయింది. టికెట్ దొరికితే చాలు గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. దీంతో తమ నాయకులపై ఒత్తిడి పెంచి ఎలాగైనా టికెట్లనూ దక్కించుకోవాలని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే టికెట్లు దక్కుతాయి అని చెబుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కొత్తవి పాతవి కలుపుకొని వందకు పైగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కొత్త మున్సిపల్ చట్టం పై అవగాహన ఉన్నవాళ్లు పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్లు దక్కుతాయని అధిష్టానం సంకేతాలిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరికి టికెట్లు దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో  'మొబైల్ టైలరింగ్'... పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్

  ఫోన్ లోనే అన్ని పనులూ అయిపోతున్నాయి. ఇలాంటి కాలంలో టైలర్ వద్దకు వెళ్లి బట్టలు కుట్టించుకొనే వాళ్ల సంఖ్య తక్కువే. అయితే టైలరింగ్ నే నమ్ముకున్న వాళ్లు మాత్రం అందులోనే జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. కొత్త బట్టలు కుట్టించుకోవాలంటే ఒకప్పుడు టైలర్ వద్దకే క్యూ కట్టేవారు. ఆ తర్వాత రెడిమేడ్ దుస్తుల హవా మొదలైంది. దీంతో షాపులకు నేరుగా వెళ్లి కొనుక్కునేందుకు అలవాటు పడ్డారు. ఇప్పుడేమో ఆన్ లైన్ జమానా నడుస్తోంది. మొబైల్ ఫోన్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు. దీంతో టైలరింగ్ వృత్తిని నమ్ముకున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. షాపుల్లోనే బట్టలు కుడదామంటే రోజు గడిచేలా లేదు. దీంతో టైలరింగ్ ను నమ్ముకున్న వాళ్లు రోడ్డెక్కుతున్నారు. బతుకు బండిని నడిపించేందుకు కష్టపడుతున్నారు. కొంత మంది రోడ్డు మీదనే కుట్టుమిషన్ పెట్టేశారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తామూ మారక తప్పలేదని బతుకు జీవనం సాగిస్తున్నారు.  టైలరింగ్ వృత్తిని బతికించుకోవడమే కాదు పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్ చేసేస్తున్నారు. పొద్దున లేవగానే వాళ్ళు కుట్టు మిషన్ ను తీసుకొని రోడ్డు మీదకు వస్తారు. ఎక్కడైనా బట్టలు కుట్టేలా ఏర్పాట్లు చేసుకున్నారు. చౌరస్తాలో చెట్ల కింద బండిని ఆపుతారు. టైలరింగ్ సేవలని అందిస్తారు. అంటే ఇంటి వద్దకే టైలరింగ్ అన్నమాట. వీధిలలో టైలరింగ్ చేస్తున్న వారిలో శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఎక్కువగా కనిపిస్తారు. అనాదిగా వీళ్ళది టైలరింగే ప్రధాన వృత్తి. దీంతో టైలరింగ్ ను వదులుకోలేకపోతున్నారు. పోటీ ప్రపంచంలో బతికేందుకు ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖలో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొబైల్ టైలరింగ్ చేసే కుటుంబాలు వైజాగ్ లో చాలా వరకు ఉన్నాయి. ఎదొరకంగా ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నారు దర్జీలు. మారుతున్న కాలచక్రంలో మనం కూడా మారాలంటారు. అందుకే ఆదరణ కోల్పోతున్న ఈ టైలరింగ్ వ్యవస్థని బతికించుకోవడం కోసం వాళ్ళ బతుకు బండి లాగించడం కోసం ఈ మొబైల్ టైలరింగ్ విధానాన్ని కొత్తగా తీసుకువచ్చారు టైలరింగ్ వృత్తి దారులు.

తెలంగాణలో  భూ పంపిణీ పథకం కనుమరుగు అవ్వబోతోందా?

  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.

ఉత్తమ్ కి సోనియా గాంధీ ఇచ్చిన సూచనలు ఏమిటి?

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఢిల్లీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది ఏం జరగబోతోంది అన్న దానిపై పార్టీ క్యాడర్ కూడా కొంత ఆసక్తి తోనే చూస్తోంది. ఢిల్లీ టూర్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశంపై చర్చించారు. ఓటమికి గల కారణాలు సోనియా గాంధీకి వివరించారు ఉత్తమ్. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా అని మేడమ్ కు చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధీ వద్ద రాజీనామాపై చర్చ జరిగిన సందర్భంగా తొందరపడకుండా ఎదురు చూద్దాం, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని సోనియా గాంధీ చెప్పినట్లు సమాచారం. రాజీనామా అనే అంశంను  వాయిదా వేసుకోమని, ఇప్పుడెందుకు తర్వాత చూద్దాంలే అని సోనియా సూచించారట. ఆమె ఎంత చెప్పినా పార్టీకి కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అది ఇప్పటికిప్పుడు కాదనేది పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల ఫలితాలపై కొంత ఒత్తిడితో ఉన్నారు ఉత్తమ్. ఓ పది రోజుల పాటు బయటకు వెళ్లే ఆలోచనతో ఇదే అంశంపై సోనియా గాంధీ అనుమతి కూడా తీసుకున్నారట. చికిత్స కోసం పది రోజుల పాటు బెంగళూరు వెళుతున్నారని సమాచారం.ఇక ఉత్తమ్ తన తరవాత అడుగులు ఏం వేయాబోతున్నారు అనేది ఆశక్తికరంగా  మారిన అంశం.

వైసీపీ వ్యూహం నెరవేరబోతోందా..  చంద్రబాబుకి తిప్పలు తప్పవా?

  పోలీసులపై చంద్రబాబు బెదిరింపుల ధోరణి తో మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనీ.. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసిపి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏమయిందో ఏమో అప్పటికప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు హడావిడిగా అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా సంతకాలతో ఫిర్యాదు చేసి పోలీసులకు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఏం చేయాలి అనే అంశంపై అటు పోలీసులు ఇటు వైసిపి నేతలు తర్జన భర్జన అవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి అందిన ఫిర్యాదు కావటంతో ఇదంతా రాష్ట్ర స్థాయి వ్యవహారమంటూ ఫిర్యాదు అందుకున్న అరండల్ పేట పోలీసులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కాపీని పంపి ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు.  పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, విడదల రజినీ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్న అంశంపై వైసీపీ నేతలు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు అటు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు తీసుకునే చర్యలు ఒకెత్తైతే రాజకీయంగా చంద్రబాబు పై ఇచ్చిన ఫిర్యాదు అంశం ఆ పార్టీ పెద్దల వద్ద చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని ముందుండి ఎలా నడిపించాలి అనే విషయాన్ని కూడా వైసీపీ నేతలు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫాకు పూర్తి బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.మరో వైపున హోంమంత్రి కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాలను కూడా పోలీసులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం పోలీసులు చట్ట పరంగా ఉన్న వ్యవహారాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ కు సంబంధించి రికార్డులను కూడా పూర్తి ఆధారాలతో సేకరించి వాటిని సాంకేతికంగా నిర్థారణ చేసిన తరువాతే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. అటు రాజకీయంగా కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తమదే పైచేయని చాటుకోవాలని చూస్తోంది అధికార పక్షం. మరోవైపు టిడిపి శ్రేణులు కూడా చంద్రబాబుపై పెట్టిన కేసు వ్యవహారంలో అధికార పక్షం కదలికలతో పాటుగా పోలీసుల చర్యలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. వైసీపీతో పాటు పోలీసు చర్యలను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల మార్గాలను కూడా టిడిపి అన్వేషిస్తోంది. మొత్తం మీద చంద్రబాబుపై అధికార పక్షం చేసిన ఫిర్యాదు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ రెండు పార్టీలతో పాటుగా పోలీసు శాఖలో కూడా కనపడుతోంది.ఇక ఈ అంశం ముందు ముందు ఎలాంటి చర్యలకు తావునిస్తుందో వేచి చూడాలి.

అసలైన నాయకుడిగా మన్నలను పొందుతున్న హరీశ్ రావు...

  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాటలు విని అందరు నివ్వెరపోతున్నారు. సిద్ధిపేట అంటే హరీశ్ రావు, హరీశ్ రావు అంటే సిద్దిపేట. అంతగా ఆయన పేరు పక్కన ఈ ఊరు చేరింది. ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు అలవాటు. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా ఆయన దృష్టంతా తన నియోజక వర్గ ప్రజలు పైనే ఉంటుంది. అయితే ఆయనను కలిసేందుకు భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్యా ఎక్కువ గానే ఉంటుంది. ఈ విషయంలోనే హరీశ్ రావు కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చు పెట్టుకొని తనను కలవడానికి రావద్దని ఆదివారం తనను కలిసిన కార్యకర్తలకు సూచించారు హరీష్. ఏదైనా సమస్య ఉంటే సిద్ధిపేట్ లోనే తనను కలవాలని వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. పొద్దున్నే ఐదు గంటలకి లేచి ఏదో ఒక బండి పట్టుకొచ్చి పని కాకపోతే చాలా వరకు నష్టపోతారు.దీంతో పైసలు వేస్ట్ పని కాకపోతే టైం వేస్ట్ మనసు నొచ్చుకుంటారు. మీరు బాధపడితే నేను బాధపడతా ఎందుకు ఇవన్నీ అంటూ కార్యకర్తలకు హరీశ్ రావు సముదాయించి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోపై నెటిజన్ లు పెద్దయెత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. హరీశ్ రావు వైఖరికి అందరు అసలైన నాయకుడని ప్రశంశిస్తున్నారు.  

వైసీపీ నేతలకు కృష్ణా జలాల టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో

  రాష్ట్రంలో వానలు సరిగా లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఒక వైపు ఎగువన కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఇప్పటివరకు ఏడుసార్లు గేట్లు తెరిచి నీరు విడుదల చేస్తున్నా.. ఆ ప్రాజెక్టు ఆధారంగా చేపట్టిన హంద్రీ నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఈ విషయం జిల్లా అధికార పార్టీ నేతల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఏడు సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తి భారీగా నీరు సముద్రం పాలవుతున్న నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే  సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉందా అనిపిస్తోంది. అక్టోబరు రెండో తేదీ నాటికి పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వద్ద జరిగిన సమీక్ష సందర్భంగా నిర్ణయించారు. అయినా అది ఇప్పటివరకు అమలు కాకపోవటంతో చిత్తూరు జిల్లా రైతాంగంలో ఆందోళన మొదలైంది. దానిపై ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి అమరనాథరెడ్డి సైతం అధికార పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నీళ్లు లేని సమయంలో నీళ్లు అందించామని నీళ్లు పుష్కలంగా ఉన్న ఇవ్వటానికి చేతకాలేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ విమర్శలు పక్కనబెడితే జిల్లాలోని పడమటి మండలాల రైతులు నీళ్లు విడుదలలో జాప్యం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లోన్ని రైతులు స్థానిక ఎమ్మెల్యే నేతల వద్దకు వెళ్లి పలుమార్లు నీటి విడుదల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఆ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలపై కృష్ణా జలాల ఎఫెక్ట్ బాగానే ఉన్నట్టుగా చెబుతున్నారు స్ధానికులు. ఎక్కడ కనిపించినా ఉన్న సమస్యలతో పాటు హంద్రీ నీవా నీటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావటాన్ని ఎమ్మెల్యేలు ఇబ్బందికరంగా ఫీలవుతున్నారనే టాక్ నడుస్తోంది. దాంతో కొందరు నేతలు నీటి విషయాన్ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. ఈ నేపధ్యంలో దాదాపు వారం క్రితం జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ సమక్షంలో అనంతపురం చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రెండు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ భరత్ గుప్తా పాల్గొని చిత్తూరుకు నవంబర్ పదిహేనున అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కాలువకు నీటిని వదలాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో నవంబరు పదిహేను నుంచి హంద్రీ నీవా జలాలు విడుదలకు రంగం సిద్ధం చేస్తామని చెబుతున్నా ఇప్పటికే పలుమార్లు నీటి విడుదల తేదీని మార్చడంతో ఈ సారైనా నీళ్లు వస్తాయా లేదా అన్న సందేహాలు జిల్లా రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఎలాగైనా ఈ సారి చిత్తూరు జిల్లాకు అందాల్సిన పన్నెండు టీఎంసీల వాటాను విడుదల చేస్తామని ధీమాగా ఉన్నారు అధికార పార్టీ నేతలు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం టైం దొరికినప్పుడల్లా హంద్రీ నీవా నీటి ఆలస్యంపై విమర్శల వర్షం కురిపిస్తోంది.

దర్శిలో మొదలైన కొత్త తరహ పాలన...

  సాధారణంగా నియోజకవర్గాల్లో పెత్తనమంతా ఎమ్మెల్యేలు చేస్తుంటారు. మండల స్థాయిలో అయితే స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు హడావుడి చేస్తుంటారు. వీరితో పాటు అధికార పార్టీ మండల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ పని భారం మనకెందుకులే అనుకున్నారో ఏమో మండలానికొక ఇన్ చార్జిగా తన అనుచరులను నియమించుకున్నారట. దర్శి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా నేరుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ని కలవాల్సిన అవసరం లేదు. మండలాలకు నియమించిన ఐదుగురు ఇన్ చార్జ్ లను ఆయా మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రజలు కలిసి తమ పని చేయించుకోవచ్చని ఎమ్మెల్యే చెబుతున్నారట. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ప్రవేశ పెట్టిన ఈ కొత్త సాంప్రదాయానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అవాక్కవుతున్నారట. ఆ విధంగా మండలాలకు ఇన్ చార్జిల నియామకం నియోజకవర్గంలో చర్చనియాంశమైంది. దీనికి తోడు మండలాలకు ఇంచార్జిలుగా నియమించిన వాళ్లు దర్శి నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు కావడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్నారు.  2019 ఎన్నికల సమయంలో మద్దిశెట్టి వేణు గోపాల్ వైసీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కొద్ది రోజులు నియోజకవర్గంలో పర్యటించిన వేణుగోపాల్ మండలానికొకరిని ఇన్ ఛార్జిలుగా నియమించారట. ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా ఎవరికి కావాలన్నా మండల ఇన్ చార్జిలు ముందుగా ఆమోద ముద్ర వేయాలి. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి పార్టీలో ఉంటున్న తమను కాదని బయట నియోజక వర్గాలకు చెందిన వారిని బండలకు ఇన్ చార్జులుగా నియమించడంతో పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో గెలిపించిన తమను కాదని ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా పెట్టి పెత్తనం చేయిస్తున్నారంటూ కొంత మంది నాయకులు నేరుగా వైసిపి ముఖ్యనేతలకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులను పక్కన బెట్టి పక్క నియోజకవర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా నియమించడం స్థానికంగా వివాదాస్పదమవుతోంది. మండల ఇన్ ఛార్జిల పెత్తనం వివాదం నియోజక వర్గ వైసిపిలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.  

కోర్ కమిటీ భేటీలోనూ రేవంతే టార్గెట్... వైఫల్యాన్ని ముందే ఒప్పుకున్న ఉత్తమ్

హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఘోర పరాజయం తర్వాత తొలిసారి జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. సీనియర్ల హాట్ కామెంట్స్ తో సమావేశం ఫుల్ హీటెక్కింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైనా... నేతలు మాత్రం తమ మనసులోని మాటను కుండబద్ధలుకొట్టినట్టు బయటిపెట్టారు. ప్రధానంగా పార్టీలో లోపిస్తున్న క్రమశిక్షణపై వీహెచ్ తదితరులు ఘాటుగా రియాక్టయ్యారు. పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని వీహెచ్ మండిపడ్డారు. ముఖ్యంగా రేవంత్ టార్గెట్ గానే వీహెచ్ కామెంట్స్ సాగాయి. ప్రగతిభవన్ ముట్టడి పిలుపును ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. గతంలో సీనియర్లు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాకముందే.... కార్యకర్తల చేత సీఎం అని అనిపించుకోలేదంటూ రేవంత్ ను నేరుగా టార్గెట్ చేశారు. సభలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాకముందే... కార్యకర్తల చేత సీఎం అని పిలుపించుకోలేదని వీహెచ్ గుర్తుచేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలన్న వీహెచ్.... రేవంత్ ను మరోసారి టార్గెట్ చేశారు. ఇదిలాఉంటే, హుజూర్ నగర్ లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సమావేశం ప్రారంభమైన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. దాంతో మిగతా నేతలంతా విస్మయానికి గురయ్యారు. అయితే, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వొద్దనే ఉత్తమ్ ముందుగానే ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇక, మున్సిపల్ వ్యూహంపై చర్చించిన కోర్ కమిటీ లీడర్లు... ముఖ్యనేతలకు మున్సిపాలిటీల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా మరింత గట్టిగా పోరాటం చేయాలని, ప్రభుత్వ తప్పుడు లెక్కలను, నియంతృత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు.

బీజేపీ-శివసేన మధ్య పెరుగుతోన్న దూరం... మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ‎ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి కొనసాగుతోంది.  అధికారం చెరిసగమంటోన్న శివసేన... తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతోంది. బీజేపీతో అమీతుమీకి సిద్ధమైన శివసేన.... 50-50 ఫార్ములాపై వెనక్కి తగ్గేది లేదంటోంది. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, మాటను నిలబెట్టుకోవాల్సిందేనని తన వాదనలకు మరింత పదునుపెట్టింది. అయితే, మరోసారి సీఎం పీఠాన్ని పంచుకునే ప్రసక్తే లేదంటోన్న బీజేపీ నేతలు... శివసేనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. 50-50 ఫార్ములాకు అసలు ఒప్పందమే జరగలేదంటోన్న బీజేపీ.... శివసేనపై ఎదురుదాడి చేస్తోంది. అంతేకాదు తమతో 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు కలకలం రేపారు. అయితే, బీజేపీ నేతల కామెంట్స్‌కు అంతే ఘాటుగా రియాక్టయిన శివసేన....  ఇతర పార్టీలతో కలిసేలా తమతో పాపం చేయించొద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. ఏదిఏమైనాసరే బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. 50-50 ఫార్ములాకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్న ఫడ్నవిస్.... బీజేపీకి 10మంది ఇండిపెండెంట్స్ తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపికి అనుకూలంగానే ప్రజా తీర్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అయినా, ఎక్కువ సీట్లు సాధించే పార్టీకే సీఎం పదవి దక్కుతుందన్న ఫడ్నవిస్‌.... వచ్చే ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానంటా వ్యాఖ్యానించారు. ఇక. శివసేన సామ్నా పత్రికలో బీజేపీ వ్యతిరేక కథనాలు రాస్తున్నారని మండిపడ్డ ఫడ్నవిస్.... కాంగ్రెస్, ఎన్సీపీపై కూడా అలా రాయగలరా? ప్రశ్నించారు. ఫడ్నవిస్, ఇతర బీజేపీ నేతల కామెంట్స్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. 50-50 ఫార్ములాకు ఎన్నికలకు ముందే బీజేపీ ఒప్పుకుందని, దాన్ని అమలుచేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతేకాదు హర్యానా తరహా మోడల్ మహారాష్ట్రలో కుదరదని, ఇక్కడెవరూ దుష్యంత్‌లు లేరని శివసేన ఘాటు వ్యా‌ఖ్యలు చేశారు. 50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుందని, ఆ మాట నిలుపుకోవాల్సిందేనని శివసేన అంటుంటే... అసలు తాము అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదంటూ బీజేపీ చెబుతోంది. దాంతో బీజేపీ, శివసేన మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. అయితే, రెండూ పార్టీలూ ఇండిపెండెంట్లకు గాలమేస్తూ బలం పెంచుకునేందుకు పావులు కుదుపుతున్నాయి. ఇక, బీజేపీతో మైత్రికే శివసేన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను మాత్రం తోసిపుచ్చడం లేదు. దాంతో, మహారాష్ట్రలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలను శివసేన పంపుతోంది. అదే సమయంలో, 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు బాంబు పేల్చారు. దాంతో, మహారాష్ట్ర సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్-ఎన్సీపీ... అవసరమైతే శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నాయి.

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు చీవాట్లు... గుక్కతిప్పుకోనివ్వకుండా వరుస పంచ్‌లు

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. గుక్కతిప్పుకోనివ్వకుండా మాటల తూటాలు పేల్చింది. వరుస పంచ్ డైలాగులతో ప్రభుత్వాన్ని దాదాపు షేక్ చేసింది. సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేమన్న హైకోర్టు.... బ్యూరోక్రాట్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కార్మికుల డిమాండ్లలో కనీసం నాలుగింటిని పరిష్కరించి 47కోట్లు ఇస్తారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే, 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువిస్తే ప్రయత్నిస్తామన్న ప్రభుత్వ సమాధానంతో... హూజుర్ నగర్ కి వంద కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లవుతున్నా, ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు పూర్తి కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్టీసీ తొమ్మితో షెడ్యూల్ లో ఉండటం కారణంగా సాధ్యంకాలేదని ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఇక, తెలంగాణలో మొత్తం ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయో.... ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, 75శాతం బస్సులు తిరుగుతున్నాయంటూ ప్రభుత్వం సమాధానం చెప్పడంతో... అలాగైతే ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ మూడో వంతు బస్సులు తిరగడం లేదని, అందుకే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదన్న హైకోర్టు... ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ఆదేశించింది. ఇప్పటికే ఆర్టీసీకి 4వేల 253కోట్ల ఇచ్చామని ప్రభుత్వం చెప్పడంతో.... అయితే, మిగతా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. అలాగే, ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా కేటగిరైజ్ చేశారన్న హైకోర్టు..... బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధులకు డీఫాల్టర్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు 335 కోట్లు చెల్లించారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పూర్తి వివరాలతో శుక్రవారం మరోసారి రావాలని ఆదేశించింది. ఇప్పటికే 15మది ఆర్టీసీ కార్మికులు మరణించారని, సమ్మె వల్ల ప్రజలు మాత్రమే కాకుండా 50వేల మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది.

ఇసుక కొరత ఉందని ఒప్పుకున్న జగన్... పళ్లున్న చెట్టుకే రాళ్లంటూ విపక్షాలకు కౌంటర్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఫస్ట్‌ టైమ్‌ ఇసుక కొరతపై స్పందించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న నిజాన్ని ఒప్పుకున్నారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని జగన్... ఇటీవల చోటు చేసుకున్న ఆత్మహత్యలు, సెల్ఫీ వీడియోలతో నిజం ఒప్పుకోక తప్పలేదు. రాష్ట్రంలో ఇసుక కొరతపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... పళ్లున్న చెట్టు మీదే రాళ్లేస్తారంటూ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. వరదల కారణంగా, ఇసుక తవ్వకాలు నిలిచిపోతే, విపక్షాలు మాత్రం రాబందుల మాదిరిగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుకను దోచేశారన్న జగన్మోహన్ రెడ్డి.... ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోనే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు విపక్ష నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని జగన్‌ ఫైరయ్యారు. టీడీపీ హయాంలో అవినీతిమయంగా మారిన వ్యవస్థను పూర్తిగా రిపేర్ చేస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి....ఇసుక తవ్వకాల్లో అవినీతిని అరికట్టగలిగామని గర్వంగా చెప్పగలనంటూ వ్యాఖ్యానించారు. అయితే, విస్తారంగా కురిసిన వర్షాలతో నదులు, కాలువన్నీ ఇప్పటికీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో... ఇసుకను ఆశించిన స్థాయిలో తీయలేని పరిస్థితి నెలకొందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో 267 ఇసుక రీచ్‌లు ఉంటే, వరదల కారణంగా కేవలం 69 చోట్ల మాత్రమే తవ్వకాలు జరపగలుగుతున్నామని, కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వంపై విపక్షాలు రాళ్లు వేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎంత బాగా పనిచేస్తున్నా... విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయన్న జగన్‌... భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక సరఫరా జరుగుతూ పేదలకు న్యాయం జరుగుతుంటే... పని దొరకడం లేదనడంలో అర్ధం లేదన్నారు. పనులు దొరకని కార్మికులు.... ఇసుక రీచ్‌ల్లో పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో వరదలు తగ్గుముఖంపట్టి, పరిస్థితి మెరుగవుతుందని, ఇసుక అందుబాటులోకి వస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం దాటి ఇసుక వెళ్లకూడదని కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా స్వయంగా డీజీపీయే బాధ్యత తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన జగన్.... వారంరోజులపాటు ఇసుక మీదే పనిచేయాలని కలెక్లర్లు, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో కనీసం 70 చోట్ల ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.... సరూర్ నగర్ లో సమరభేరికి అనుమతి...

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే సభ తలపెట్టినట్లు న్యాయస్థానానికి విన్నవించింది. సభను జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు... సభకు ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం సరైన వివరాలు అందించకపోవడంతో... ఆర్టీసీ కార్మికులు ముందుగా నిర్ణయించుకున్న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సభా నిర్వాహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను చూసి ప్రభుత్వం భయపడుతోందన్న జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... కార్మికుల పట్ల కేసీఆర్ అనుసరిస్తోన్న కఠిన వైఖరిని సభలో ఎండగడతామని హెచ్చరించారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దన్న అశ్వద్ధామరెడ్డి... తమకు అన్నివర్గాలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తాడేపల్లికి చేరిన దగ్గుబాటి - పర్చూరు పంచాయతీ... గొట్టిపాటికి ఇవ్వాలంటూ కార్యకర్తల డిమాండ్

పురంధేశ్వరిని వైసీపీలోకి రప్పించాలని, లేదంటే మీరు దారి మీదేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారని, దాంతో ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే అది నిజమనించడం లేదు. ఎందుకంటే పర్చూరు నుంచి పెద్దఎత్తున తాడేపల్లికి చేరుకున్న దగ్గుబాటి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను రావి రాంనాథానికి ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ జెండాలను, వైఎస్ బొమ్మలను తగలబెట్టిన ద్రోహి రావి రాంనాథం అంటూ నిప్పులు చెరిగారు. రావి రాంనాథానికి పర్చూరు బాధ్యతలు అప్పగిస్తే నియోజకవర్గంలో వైసీపీ పతనమైనట్టేనని హెచ్చరించారు. రాంనాథానికి కాకుండా... ఇంకెవరికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని కార్యకర్తలు తేల్చిచెప్పారు. దగ్గుబాటినే పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కొనసాగించాలని లేదంటే గొట్టిపాటి రవికుమార్ కి ఇవ్వాలంటూ విచిత్రమైన డిమాండ్ ను వైసీపీ అధిష్టానం ముందుంచారు. అయితే, పర్చూరు వివాదాన్ని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి అధిష్టానం అప్పగించింది. దాంతో పర్చూరు నుంచి వందలాదిగా వచ్చిన వైసీపీ శ్రేణులతో... వైవీ అండ్ సజ్జల చర్చలు జరిపారు. పర్చూరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వైవీ అండ్ సజ్జల.... కార్యకర్తల అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు పర్చూరు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, 2014లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి... అప్పుడున్న ఒత్తిళ్లతో తెలుగుదేశంలో చేరి, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి గెలిచారు. అయితే, ఇప్పటికీ జగన్ తో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. దాంతో గొట్టిపాటి త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంకా వైసీపీలో చేరకుండానే, కార్యకర్తలు అప్పుడే పర్చూరు బాధ్యతలు గొట్టిపాటికి ఇవ్వాలని డిమాండ్ చేయడమే ఇంట్రస్టింగ్ గా మారింది.

నవంబర్ 1నే ఏపీ ఆవిర్భావ దినోత్సవం... ఇవాళ నిర్ణయం తీసుకోనున్న ఏపీ కేబినెట్

ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంకానున్న కేబినెట్‌... మొత్తం 30 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా నవంబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని భావిస్తోన్న సీఎం జగన్... దానిపై కేబినెట్‌ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి.... అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2ని, అలాగే తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఏపీ నవంబర్ 1ని కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడిన జగన్ సర్కారు... చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదం కేవలం లాంఛనమే. అయితే, చంద్రబాబు హయాంలో విభజన గాయాలను గుర్తుచేస్తూ జూన్ రెండున నవ నిర్మాణ దీక్షలు చేపడుతూ, రాష్ట్ర ఆవిర్భాత దినోత్సవ సంబరాలను పక్కనబెట్టారు. దాంతో ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నవంబర్ ఒకటిన ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జగన్ సర్కారు ఏర్పాటు చేస్తోంది.