దుబ్బాకలో కారుకు టెన్షన్.. ట్రబుల్ షూటర్ పైనే భారం! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో కారు పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. ఉద్యమ సమయంలో పలు సార్లు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయితే ఎక్కువ సార్లు వారు మంచి మెజార్టీతోనే గెలిచారు. అధికారంలోకి వచ్చాక గత ఆరేండ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అకాల మరణాలతో జరిగిన నారాయణ్ ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ ను అధిగమించి మరీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయితే దుబ్బాక ఎన్నిక మాత్రం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్టున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీగా ఉన్నా, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉన్నా.. ఏదో కొంత టెన్షన్ ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.    దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి మంచి స్పందన వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న సీనియర్ నేత  రఘునందన్ రావుపై వరుసగా ఓడిపోయారన్న సానుభూతి కూడా ప్రజల్లో వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న రఘునందన్ రావును ఓసారి అసెంబ్లీకి పంపించాలనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను పూర్తిగా తమవైపు మలుచుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంపై జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్న బీజేపీ నేతలు.. అది కూడా తమకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా ఉప ఎన్నికలో కీలకం కానుంది. శ్రీనివాస్ రెడ్డి వర్గం మద్దతు కోసం బీజేపీ లోపాయకారిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.   దుబ్బాకలో పరిస్థితిని గమనించే సీఎం కేసీఆర్.. గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఏ ఎన్నికను అప్పగించినా విజయంతో తిరిగొచ్చారు హరీష్ రావు. ఇప్పుడు దుబ్బాకలో కూడా గెలుస్తామని హరీష్ అనుచరులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కారు పార్టీకి పరిస్థితులు అంతా అనుకూలంగా లేవని తెలుస్తోంది. అందుకే హరీష్ రావు దుబ్బాకలోనే మకాం వేసినట్లు చెబుతున్నారు. చిన్నచిన్న గ్రామాలకు కూడా వెళుతూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మంత్రి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారు హరీష్ రావు. టీఆర్ఎస్ లోని అన్నివర్గాలు కలిసి పనిచేసేలా చూస్తున్నారు. దీంతో హరీష్ కు దుబ్బాక సవాల్ గా మారిందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. బైపోల్ లో టీఆర్ఎస్ విజయం హరీష్ రావు పైనే ఆధారపడి ఉందని ఓపెన్ గానే చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.   మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాకపై స్పెషల్ ఫోకస్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం గాలిస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతిని బరిలోకి దింపాలని చూసినా.. రాములమ్మ నో చెప్పడంతో మరో అభ్యర్థి కోసం గాలిస్తోంది. దుబ్బాకలో గట్టి పోటీ ఇవ్వాలని, గెలవకపోయినా రెండో స్థానంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి తమ కంటే ఎక్కువ ఓట్లు వస్తే.. రాష్ట్రంలో పార్టీకి నష్టమంటున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని, బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకే బలమైన వ్యక్తిని పోటీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో గెలవకపోయినా కనీసం సెకండ్ ప్లేస్ అయినా వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

సీఎం జగన్ కు డిక్లరేషన్ తలనొప్పి.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేసథ్యంలో సీఎం జగన్ ఈరోజు తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబులను పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనుషా రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరో పక్క బీజేపీ నాయకులు, హిందూ సంఘాల కార్యకర్తలు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.   ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తాము సీఎం జగన ను రాజీనామా చేయమని అడగడంలేదని.. బ్రిటిష్ కాలం నుండి వస్తున్న ఆచారాన్ని కాపాడమని కోరుతున్నామని అన్నారు. జగన్ జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా వెళతారని, అదే హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మాత్రం ఒక్కరే వస్తారని.. దీనికి కారణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మాత్రమే తాము కోరుతున్నామని, ఇదే సమయంలో హిందూమతంపై దాడిని ఆపాలని కోరుతున్నామని ఆ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ పోలీసుల తీరుతో ప్రజలంతా ఎంతో తృప్తిగా ఉన్నారు.. హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీలో పోలీసుల తీరుతో హైకోర్టు మెట్లెక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసు నుండి మొదలు పెట్టి న్యాయం కోసం పలువురు హైకోర్టు తలుపు తడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌కుమార్‌(25) ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మృతిచెందాడని, అధికార పార్టీ నేతలు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ జి.హర్షకుమార్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు "అవును.. ఈ రాష్ట్రంలో పోలీసుల బెదిరింపులతో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. కోర్టు కూడా ఆ విషయాన్ని గుర్తించింది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పోలీసులు ముందుగా ఐపీసీ సెక్షన్‌ 324 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బాధితుడు మృతిచెందాక సెక్షన్‌ 302గా ఎందుకు మార్చలేదని విచారణ సందర్భంగా నిలదీసింది. ఈ కేసులో పోలీసులు చట్ట నిబంధనలు పాటించకపోవడం దురదృష్టకరమని, ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న ఇలాంటి కేసులు తమవద్దకు తరచూ వస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.   అయితే ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పిల్‌ రాజకీయ కారణాలతో మాజీ ఎంపీ వేశారని తెలిపారు. దీనిపై ఇప్పటికే బాధితుని కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ వేశారని, తరువాత పోలీసుల దర్యాప్తు పట్ల సంతృప్తి చెంది, ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. ఈ కేసుపై పూర్తి వివరాలు సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని అభ్యర్థించగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీరియస్ కామెంట్స్ చేసింది. ఐతే పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదిస్తూ జూలై 18న బాధితుని తండ్రి ఫిర్యాదుతో మొదట ఐపీసీ సెక్షన్‌ 324 కింద దాడి చేసిన ఎస్సైపై కేసు పెట్టిన పోలీసులు.. తరువాత ఆయన్ను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారని తెలిపారు. అయితే ఆ యువకుడు మృతి చెందాక జూలై 22న సీఆర్‌పీసీ సెక్షన్‌ 176 కింద మళ్లీ కేసు నమోదు చేశారని, కానీ మేజిస్ట్రేట్‌ సమక్షంలో పోస్టుమార్టం చేపట్టలేదని పేర్కొన్నారు.   దీనిపై స్పందించిన ధర్మాసనం "పోలీసులు చట్ట నిబంధనల మేరకు నడచుకోకపోవడం దురదృష్టకరం. ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న ఇలాంటి కేసులెన్నో మా వద్దకు వస్తున్నాయి’’ అని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించి ఈ క్షణమే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేవారమని, కానీ ప్రభుత్వ న్యాయవాది కౌంటర్‌కు గడువు కోరుతున్నందున అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు తగినదని కూడా వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌, సీబీఐ విశాఖ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది.

జగన్ కు ఢిల్లీ పెద్దల క్లాస్! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏపీలో కాక రేపుతోంది. వైసీపీ చెబుతున్నట్లు ఏపీకి కేంద్ర సాయం అడగడానికి జగన్ వెళ్లలేదని సమాచారం. కేంద్ర పెద్దలను కలవడానికి జగన్ అపాయింట్ మెంట్ అడగలేదని.. కేంద్ర పెద్దలే జగన్ ను ఢిల్లీకి పిలిపించారని సమాచారం. అందుకే  జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి  గుర్రుగా ఉన్నారని, దానిపై మాట్లాడేందుకే జగన్ ను పిలిపించినట్లు చెబుతున్నారు. తనను కలిసిన జగన్ కు అమిత్ షా క్లాస్ పీకినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయని, మీరేం చేస్తున్నారని జగన్ ను అమిత్ షా ప్రశ్నించినట్లు సమాచారం.    ఏపీ సీఎం జగన్ తో ఢిల్లీకి వెళ్లిన వారిలో ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం,  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు భూషన్, ఏపీ సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు. లీగల్ శాఖకు చెందిన వారే జగన్ వెంట ఉన్నారు కాబట్టి... న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపైనే జగన్ తో కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నట్లు నిర్దారణ అవుతోంది. కొన్ని రోజులుగా ఏపీలో న్యాయ వ్యవస్థపై వైసీపీ మూకుమ్మడి దాడి చేస్తున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. హైకోర్టు జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలపైనా కొందరు వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వివిధ రూపాల్లో జడ్జీలపై ఆరోపణలు, ప్రకటనలు చేశారు. జడ్జీలను వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. జగన్  కేబినెట్ లోని కొందరు మంత్రులు కూడా కులం పేరుతో న్యాయమూర్తులను కించపరిచేలా కామెంట్లు చేశారు. పార్లమెంట్ లోనూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు వైసీపీ ఎంపీలు. లోక్ సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఏపీ హైకోర్టు జడ్జీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేంద్రం ఆగమేఘాల మీద జగన్ ను పిలిపించినట్లు తెలుస్తోంది.    లీగల్ అంశానికే సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. అవినీతి కేసుల సత్వర విచారణకు జగన్ భయపడుతున్నారని, ఆ కేసులపైనే కేంద్రంతో మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్లారని కూడా చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఇటీవలే సీరియస్ గా స్పందించింది. క్రిమినల్ కేసులున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేదం విధించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. దీంతో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే లోపే.. తమపై ఉన్న కేసులను కొలిక్కి తెచ్చుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని అందులో భాగంగానే బీజేపీని మరింత మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.              ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై దాడులు పెరిగాయి. అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ రథోత్సవం తగలబడటం కలకలం రేపింది. బెజవాడ దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. రోజుకో చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఆలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపైనా జగన్ ను బీజేపీ పెద్దలు ప్రశ్నించినట్లు సమాచారం.

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనడం నీచ రాజకీయం.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

తిరుమలను సందర్శించే అన్యమతస్థుల నుండి డిక్లరేషన్ తీసుకునే విధానాన్ని ఎత్తి వేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడిగా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్ ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా తిరుమలకు వెళుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని.. సీఎం జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని అయన అన్నారు. అసలు సీఎం జగన్ ‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలంటున్న వారిది నీచ రాజకీయమని కొడాలి నాని మండిపడ్డారు. అంతేకాకుండా సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ఏపీలో అణు విద్యుత్ కేంద్రం.. కేంద్రం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని.. దీనికోసం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు గా కేంద్రం పేర్కొంది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని రకాల అధ్యయనాల తర్వాతనే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు కేంద్రం చెప్పింది.   కాగా, అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 2,700 ఎకరాలను సేకరించారు. మొత్తంగా 61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు. ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగితే వచ్చే ఐదేళ్లలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయి.

బీజేపీ దూకుడు.. కాంగ్రెస్ లో వర్గపోరు! వాళ్లు మారరంతే..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత భారీగా పెరిగిందని భావిస్తున్న విపక్షాలు.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై పోరాటంలో బీజేపీ దూకుడుగా వెళుతుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం నేతల మధ్య వర్గపోరుతో వెనకబడినట్లు కనిపిస్తోంది. నేతలు ఉమ్మడిగా కాకుండా ఎవరికి వారే పోరాటాలు చేస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అనుకున్నంత ఉత్సాహం నింపలేకపోతున్నారనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు వస్తున్న మంచి అవకాశాలు నేతల తీరుతో జారిపోతున్నాయని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    కేటీఆర్ ఫాంహౌజ్, పాత సచివాలయం కూల్చివేత, కొత్త సెక్రటేరియేట్ నిర్మాణాలపై ఎంపీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారు. కాని ఈ విషయంలో ఆయనకు పార్టీ నేతల నుంచి సరైన సహకారం అందడం లేదని చెబుతున్నారు. ఎన్జీటీలో కూడా ఆయన పిటిషన్ వేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతి కోసం.. ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఇటీవల కేంద్ర పర్యావరణ బృందం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లి ఫిర్యాదు చేశారు. మిగితా నేతలెవరు పట్టించుకోలేదు. కేటీఆర్ ఫౌంహౌజ్ విషయాన్ని రేవంత్ వ్యక్తిగత గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఇక శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాని ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలెవరు మాట్లాడలేదు. దీంతో సర్కార్ పై ఒత్తిడి పెంచలేకపోయింది కాంగ్రెస్.    వరదలు, పంట నష్టం అంశాల్లోనూ కాంగ్రెస్ నేతలు కలిసి పోరాడలేకపోయారు. వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం అందించలేదు. అయినా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హస్తం నేతలు విఫలమయ్యారనే చర్చ సీనియర్లలో జరుగుతోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రుల సందర్శన యాత్ర చేశారు. అయితే ఆయనకు రేవంత్ రెడ్డి వర్గం సహకరించలేదని తెలుస్తోంది. భట్టి యాత్రలో పార్టీ సీనియర్ నేతలెవరు పాల్గొనలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై అసెంబ్లీలో భట్టి చేసిన సవాల్ ను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుందనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది. మంత్రి తలసానితో కలిసి భట్టి ఇండ్లను పరిశీలించకుండా.. పార్టీ నేతలతో కలిసి వెళితే ప్రభుత్వం ఇరుకున పడేదని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉచ్చులో భట్టి చిక్కారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే మంచి అవకాశం పోయిందని రేవంత్ టీమ్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారని సమాచారం.    హైదరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలోనే వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు. నాలాలో పడి బాలిక, వరదలో గల్లంతై మరో వ్యక్తి చనిపోయారు. రాజధానిలో ఇంత పెద్ద ఘటనలు జరిగినా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సరిగా స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం గ్రేటర్ సమస్యలపై సర్కార్ ను ప్రశ్నించడంలో ఫేయిల్ అయిందని సిటీ ప్రజల నుంచే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. కాంగ్రెస్ ఈ విషయంలో ఉద్యమించడంలో వెనకబడింది.    మరోవైపు బీజేపీ మాత్రం కేసీఆర్ సర్కార్ పై పోరాటంలో కలిసి వస్తున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతున్న ఎల్ఆర్ఎస్ స్కీంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. lrs జీవోను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించింది, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేశారు కమలం కార్యకర్తలు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో ఇబ్బంది కల్గిన ప్రాంతాల్లోనూ బీజేపీ నేతలు పర్యటించి బాధితులకు బాసటగా నిలిచారు. మొత్తంగా ప్రభుత్వంపై పోరాటంలో ప్రధాన ప్రతిపక్షం వెనకబడుతుండగా.. బీజేపీ మాత్రం దూకుడుగా ఉందనే చర్చ తెలంగాణ ప్రజల్లో జరుగుతోందని రాజకీయ అనలిస్టుల అభిప్రాయం.

పోలీసుల పేరిట నకిలీ ఖాతాలు

స్వాతి లక్రా ఐపిఎస్ పేరుతో ఖాతా.. డబ్బులు పంపమని రిక్వెస్టులు   దేశంలోని ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తూ సమాచారాన్ని తస్కరిస్తున్నారు. మరోవైపు నకిలీ ఖాతాలు సృష్టించి రిక్వెస్ట్ లు పంపిస్తూ క్యాష్ డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర పోలీస్ వరకు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ లో దాదాపు 50మంది పేరుతో నకినీ ఖాతాలు ఫేస్ బుక్ లో తెరిచినట్లు సమాచారం. రెండురోజుల కింద ఐపిఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా ఓపెన్ చేసి ఆమె స్నేహితులకు, బంధువులకు డబ్బులు పంపించమని రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఈ విషయాన్ని ఆమె దృష్టికి కొందరు తీసుకువెళ్లగా ఇది నకిలీఖాతాగా గుర్తించారు. తాను ఎవరిని నుంచి డబ్బులు అడగలేదని, ఎవరూ స్పందించవద్దని స్వాతి లక్రా తన అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దానితో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే నకిలీఖాతా క్లోజ్ చేశారు సైబర్ దొంగలు.   అయితే పోలీసుల విచారణలో ఇప్పటివరకు దాదాపు 50మంది అధికారుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు. ఒడిషా, రాజస్థాన్ నుంచి ఈ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఆ ముఠాగుట్టురట్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. డబ్బులు పంపమని ఎవరి నుంచి రిక్వెస్ట్ లు వచ్చినా నమ్మవద్దని , జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయ బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా? నష్టమా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై దుమారం రేగుతోంది. విపక్షాలతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసలు ఆ బిల్లుల్లో ఏముంది? ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.   వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం మూడు బిల్లులను తీసుకొచ్చింది. 'నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు-2020', 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు-2020', 'ధరల హామీ, పంట సేవల ఒప్పంద బిల్లు-2020'. ఈ మూడు బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి.   నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు  ఈ బిల్లు ప్రకారం నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి అధికారం ఉంటుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనె వంటి ఆహారవస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం. ఏదైనా నిత్యవసర వస్తువును ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. తద్వారా వీటిని భారీ మొత్తంలో నిల్వ చేసి.. ఆ తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది.   రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు ఈ బిల్లు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. రైతులు మార్కెట్ యార్డుల్లో కాకుండా ఏ ప్రైవేట్ వ్యాపారికైనా తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా వేర్వేరు రాష్ట్రాల మధ్య,  వేర్వేరు జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వసూలు చేయడానికి వీల్లేదు.   ధరల హామీ, పంట సేవల ఒప్పంద బిల్లు ఈ బిల్లు ప్రకారం..  ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించయినా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారుతో(ప్రైవేట్ కంపెనీలతో) ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు. ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి.    అయితే, ఈ చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వ్యాపారులు, బడా కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాలు సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని అంటున్నారు. ప్రైవేట్ కంపెనీలు నిర్ణయించే ధరలకు పంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. అదే జరిగితే కనీస మద్దతు ధర కూడా దక్కదని వాపోతున్నారు. దేశంలో ఎక్కువమంది చదువుకోని రైతులే ఉన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం వారికి కష్టమవుతుందని.. వారు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని వాదిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థ బలపడితే వ్యవసాయ సంక్షేమ, అభివృద్ది గురించి ప్రభుత్వం మునుపటిలా పట్టించుకుంటుందా?. కష్ట కాలంలో రైతులకు రుణాలిచ్చి ఆదుకుంటుందా?. రాష్ట్రాల పరిధిలో ఇప్పుడు అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు కొనసాగుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. దీని పై పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ నెల 27 న అధికారికంగా పార్టీ అధినేత ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి నేపథ్యంలో పార్ట్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు, లోకేష్ లు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో పార్టీలోని అన్ని విభాగాలలో కూడా మార్పులు చేసి యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్న జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని.. ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నందుకే కేసులు బనాయించారని టీడీపీ చెపుతున్న విషయం తెలిసిందే.

యాదాద్రి స్టేషన్ గా రాయిగిరి స్టేషన్ పేరు మార్పు

ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణమధ్య రైల్వే   తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద దివ్వక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. విశాలమైన బస్ట్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. దేశంలోని ఎక్కడి నుంచైనా భక్తులు వచ్చేలా ప్రయాణ మార్గాలను ఆధునీకరిస్తున్నారు. యాదాద్రికి అతిసమీపంలో ఉన్న రాయిగిరి స్టేషన్ ను యాదాద్రి స్టేషన్ గా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లో ఇప్పటికే మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు స్టేషన్ పేరు మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్ గా పిలుస్తారు. ఈ స్టేషన్ ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు చాలావరకు ఈ స్టేషన్ మీదుగా వెళ్తాయి. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ఘట్ కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ ను రాయిగిరి వరకు పొడిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాయిగిరి నుంచి యాదాద్రి గుట్టపైకి ప్రత్యేక బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణకే తలమానికంలా యాదాద్రిని వందల కోట్ల రూపాయలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని నెలల్లో యాదాద్రి భక్తులతో అత్యంత రద్దీగా మారే అవకాశం ఉంది.

వివాదాస్పద వ్యవసాయ బిల్లు పై పార్లమెంట్ లో ప్రతిపక్షాల సంచలన నిర్ణయం..

కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదింపచేసుకున్న తీరుపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. అంతేకాకుండా రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్ష పార్టీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుని, ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేశాయి. ముందుగా కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, వామపక్షాలు వాకౌట్ చేయగా... ఆ తరువాత కొద్ది సేపటికే టీఆర్ఎస్, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఆర్జేడీ ఎంపీలు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే సభ నుండి వాకౌట్ చేయవద్దనీ.. చర్చలో పాల్గొనాలంటూ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. వాకౌట్ కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు బహిష్కరిస్తాయని స్పష్టం చేశారు.   ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలన్నీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన నేపథ్యంలో సభ నుండి సస్పెండ్ ఐన ఎంపీలు కొద్దిసేపటి క్రితం ధర్నా విరమించారు. తాము కేవలం సస్పెన్షన్ ఎత్తివేయాలని మాత్రమే కోరడం లేదనీ... అసలు ఎలాంటి ఓటింగ్ లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవాల్సిందేనని ఎంపీలు కోరుతున్నారు.  

4 వేల కోట్ల కోసం కక్కుర్తిపడి.. రైతుల మెడకు జగన్ మీటర్ల ఉచ్చు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ లకు మేలు చేస్తూ.. దేశంలో నయా జమీందారీ వ్యవస్థకు శ్రీకారం చుడుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయ బావులకు, బోర్లకు కరెంటు మీటర్లు పెట్టి రైతులను నిండా ముంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జ‌గ‌న్‌పై హరీశ్‌ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. విద్యుత్ మీట‌ర్ల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని తప్పుబడుతూ.. 4వేల కోట్లకు ఆశపడిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని హ‌రీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో కూడా వ్య‌వ‌సాయ విద్యుత్‌కు మీట‌ర్లు పెడితే.. రూ.2500 కోట్లు ఇస్తామ‌ని కేంద్రం ఆఫ‌ర్ చేసింద‌ని.. అయితే కేసీఆర్ ఈ ఆఫర్ ను తిర‌స్క‌రించారని పేర్కొన్నారు.   ఇప్ప‌టికే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలన్న ఎపి సీఎం జ‌గన్ నిర్ణ‌యంపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపికి దోస్త్ ఐన టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి ఇటువంటి వ్యాఖ్యలు రావడం చ‌ర్చ‌నీయాశంగా మా‌రాయి. అంతేకాకుండా ఇప్ప‌టికే కేంద్రానికి మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ లో వ్య‌వ‌సాయ బిల్లుల‌ను టీఆర్ఎస్ వ్య‌తిరేకిస్తే.. వైసీపీ సపోర్ట్ చేసింది. మంత్రి హ‌రీష్‌రావు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సస్పెండై నిరసన తెలుపుతున్న ఎంపీలకు టీ అఫర్ చేసిన డిప్యూటీ చైర్మన్

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో పోడియంలోకి దూసుకెళ్లి, నిసరన తెలియజేసి సభ నుండి సస్పెండ్ అయిన 8 మంది వివిధ పార్టీల ఎంపీలు, నిన్న రాత్రంతా పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద తమ ఆందోళనను కొనసాగించారు. తాము రైతుల హక్కుల కోసం పోరాడుతున్నామని, మరో పక్క పార్లమెంట్ ను చంపేశారని రాసున్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. అయితే ఈరోజు ఉదయం జరిగే సమావేశాల కోసం పార్లమెంట్ కు వచ్చిన డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నిరసనలో ఉన్న ఎంపీలకు టీ అఫర్ చేసి షాక్ ఇచ్చారు. ‌పరోక్షంగా ఆ ఎంపీల స‌స్పెన్ష‌న్‌కు తానే కార‌ణ‌మైన‌ప్ప‌టికీ.. అవేవీ ప‌ట్టించుకోకుండా నిర‌స‌న‌లో కూర్చున్న ఎంపీల‌ను స్వ‌యంగా వెళ్లి క‌లిశారు. అంతేకాకుండా వారికి తానే గ్లాసులో టీ నింపి ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ఆ ఎంపీలు మాత్రం హరివంశ్ ఇచ్చిన టీ తాగేందుకు నిరాకరిస్తూ, ఆయనను రైతు వ్యతిరేకిగా పేర్కొన్నారు.

యుద్ధనౌకలో మహిళా అధికారులు

కొత్త చరిత్రకు భారతీయ మహిళల శ్రీకారం   ప్రపంచయుద్ధాల్లో పాల్గొన్న మహిళల సంఖ్య తక్కువేమీ లేదు. కానీ, వారి సేవలు ప్రపంచం ముందుకు రాలేదు. ప్రస్తుతం మనదేశంలో త్రిదళాల్లో పనిచేస్తున్న మహిళల జాబితాలోకి మరో ఇద్దరు యువతులు చేరారు. నౌకాదళంలోని యుద్ధ హెలికాప్టర్లను నడిపే సామర్ధ్యం ఉన్న ఇద్దరు సబ్ లెఫ్టినెంట్లను నౌవీలోకి తీసుకుంటూ ఇండియాన్ నేవీ ప్రకటన చేసింది. లింగవివక్షను రూపుమాపుతూ ఇండియన్ నేవీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతీయ మహిళలంతా అభినందిస్తున్నారు. నేవీలో చాలామంది మహిళలు పనిచేస్తున్న యుద్ధనౌకల్లో మొదటిసారి ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించారు.   నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న కుముదిని త్యాగి, రీతి సింగ్ లకు యుద్ధ హెలికాప్టర్లు నిర్వాహణలో శిక్షణ ఇచ్చారు. సోమవారం కొచ్చిలో జరిగిన ఐఎన్ఎస్ గరుడలో జరిగిన కార్యక్రమంలో వారిద్దరికి బాధ్యతలు ఇస్తూ ఎంహెచ్ 60 ఆర్ హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని  ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక హెలికాప్టర్లుగా పేరుగాంచిన ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్లు శత్రుదేశాల నౌకలను, సబ్ మెరెన్స్ లను గుర్తిస్తాయి. అంతేకాదు వీటికి మిస్పైల్స్ టార్పెడోస్ ను కూడా ఫిక్స్ చేయవచ్చు.   కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వీరిద్దరూ 2018 లో నేవీలో చేరారు. కుముదిని త్యాగి, రీతి సింగ్ హెలికాప్టర్ నడపడంలోనూ, ఇంటలిజెన్స్,  సెన్సార్లు ఆపరేటింగ్ విభాగంలోనూ శిక్షణ పూర్తి చేశారు.  రీతి సింగ్  హైదరాబాద్‌కు చెందిన యువతి. సైనిక కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాత ఆర్మీలో,  తండ్రి  నావికాదళంలో పనిచేశారు. నేవీలో అధికారిగా బాధ్యతలు నిర్వహించాలన్నది తన జీవితాశయం అన్నారు. ఘజియాబాద్‌కు చెందిన సబ్ లెఫ్టినెంట్ త్యాగి మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అవకాశం ఇస్తే సత్తా చూపిస్తామన్నారు.  చైనా, భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తలు నేలకొన్న తరుణంలో యుద్ధనౌకల్లో పనిచేసే అవకాశం అందుకొని వారిద్దరూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

మీకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. రఘురామరాజుకు ఎంపీ నందిగం సురేష్ వార్నింగ్

వైసీపీకి.. ఆ పార్టీ ముఖ్య నేతలకు కొరకరాని కొయ్యగా తయారై ప్రతి నిత్యం ఇటు సొంత పార్టీ పైన.. అటు ముఖ్య నాయకుల పైన రఘురామకృష్ణం రాజు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రఘురామ రాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు సాయంత్రం పార్లమెంట్ సమావేశాల తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన రఘురాజు చేసిన ప్రతి విమర్శకు కౌంటరిచ్చారు.   నందిగం సురేష్ మీడియాతో మాట్లాడిన విషయాలు అయన మాటల్లోనే.. "దళిత ఎంపీగా ఉన్న నన్ను ఉద్దేశించి, నా కుల వృత్తిని ఉద్దేశించి వైసీపీ ఎంపీగా గెలిచి, పార్టీ పైన నిత్యా విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ రాజు అవహేళన చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులైన రాములుకు ఫిర్యాదు చేశాను. దళితులైన చర్మ కార్మికుల పట్ల ఉన్న ద్వేషంతో, అసూయతో, ఆహంకారంతో మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా కోరాను. దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 17న రఘురామ రాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఉద్దేశించి దళిత జాతిని అవమానించే విధంగా చెప్పులు కుట్టుకునే వాడు అని.. మా జాతి పశువుల చర్మాలు వలుస్తుందని, తోళ్ళు వలిచే వృత్తి అంటూ దళిత జాతిపై ద్వేషం, పగతో రగిలేలా అహంకారంతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు రోజూ పెట్టే ప్రెస్ మీట్లలోనూ ఇదే అహంకారంతో, దళితులపై ద్వేషంతో మాట్లాడుతున్నాడు. దళితులపై రఘురామకృష్ణరాజు కక్ష కట్టినట్టుగా, వ్యంగంగా, హేళనగా, గుండెల నిండా పగ పెంచుకున్నట్టుగా మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయనకు దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుంది. నేను ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం లో దళితులు ఓట్లేస్తేనే రఘురామ రాజు ఎంపీ అయ్యాడు. ఈయనేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు" అని రెబల్ ఎంపీ రఘురామ రాజు వ్యాఖ్యలకు బాపట్ల ఎంపీ సురేష్ కౌంటరిచ్చారు.   "తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తాను, కాల్పిస్తాను అని రఘురామకృష్ణరాజు దళితులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు. దళితులను కాల్చడానికి, దళితుల చర్మం వలవడానికి మీకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని సమకూర్చలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మీకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. దళితుల పట్ల పగతో రగిలిపోతూ, సెక్యూరిటీని అడ్డుపెట్టుకుని దళితులను బెదిరించేందుకు సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్న రఘురామ రాజుపై లోక్ సభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. ఆయనకు కేటాయించిన సెక్యూరిటీని కూడా తొలగించమని కోరబోతున్నాను" అని సురేష్ మీడియా ముఖంగా తెలిపారు.   "మా దళిత కులాలు, దళిత జాతి అంటే చిన్నచూపు చూస్తూ, ఏహ్యభావంతో మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు మాటలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న దళిత ప్రజలు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దళితులంతా చూశారు. రఘురామ రాజుకు తగిన బుద్ధి చెప్పటానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆయన దళిత జాతికి క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాసి, ఆ తర్వాతే పార్లమెంట్‌లో అడుగు పెట్టాలి. రఘురామ రాజు పార్లమెంట్‌లో అడుగు పెట్టేముందు ఒకసారి నర్సాపురం నియోజకవర్గం వెళ్ళి వస్తే దళితుల సత్తా అంటే ఏమిటో తెలిసేది. ఉట్టికి ఎగరిలేనమ్మ అన్నట్టు.. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యంలేని రఘురామ రాజు పులివెందులలో పది వేల మందితో మీటింగ్ పెడతానని అయన ప్రగల్భాలు పలుకుతున్నారు. అడవిలో మొరగడానికి, వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుందన్న విషయం అయన గుర్తుంచుకుంటే మంచిది" అని ఎంపీ సురేష్, రఘురామ రాజును ఎద్దేవా చేసారు.   "అంతేకాకుండా రఘురామ రాజు భవిష్యత్తు ఏంటో త్వరలోనే తెలుస్తుంది. ఆయన ఎవరితో ఆడుకోకూడదో వారితోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆట ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ రూపంలో తెలుస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. త్వరలో కచ్చితంగా తన ఒరిజనల్ స్టేజికి.. ఇటు పదవి విషయంలోగానీ, అటు విగ్గు విషయంలోగానీ రఘురామ రాజు వస్తారు. ఢిల్లీలో ఉండి రోజూ చెట్టు కింద ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, సీఎం జగన్ గారిపై విమర్శలు చేస్తూ చివరికి జోహార్ సీఎం అంటూ బుద్ధి లేకుండా మాట్లాడిన ఆయన రాజకీయ విలువలు పాటించడంలో పాతాళానికి దిగజారాడు. అసలు రఘురామ రాజుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఏ బ్యాంకులను లూటీ చేశాడో.. ఇవన్నీ బయటకు రావాలి. కేవలం వీటన్నింటినీ సర్దుకోవడానికే ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అయన ఢిల్లీ వీధులో తిరుగుతున్నారు" అని రఘురామరాజు పై సురేష్ విరుచుకు పడ్డారు.

అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకు జగన్ సర్కార్..

ఏపీలో అమరావతి భూములకు సంబంచించి స్కామ్ జరిగిందని పేర్కొంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ను తొలి నిందితుడిగా చేరుస్తూ 13 మంది నిందితులుగా పేర్కొంటూ ఎసిబి కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. అయితే దీనికి వ్యతిరేకంగా అయన ఎపి హైకోర్టును ఆశ్రయించగా ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని.. దీని పై విచారణ చేపట్టకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఒకట్రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీలో విజయసాయి రచ్చ.. కేసుల కోసమేనా! 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతిస్తూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పచ్చి దళారీలా వ్యవహరిస్తుందన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం బిల్లుకు సపోర్ట్ చేసే క్రమంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, ప్రధాని నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసే ఉద్దేశం మంచిదే అయినా.. విజయసాయి రెడ్డి కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయసాయి ప్రకటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందిగా మారబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.    ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధనే తమ లక్ష్యమని వైసీపీ చెబుతోంది. సీఎం ఎక్కడిక్కెల్లినా.. ఏ సభలో మాట్లాడిన వైఎస్సార్ పేరు ఎత్తకుండా ఉండరు. జగన్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికి వైఎస్సారే పేరు పెట్టారు. అయితే వైఎస్సార్ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే గడిచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటప్పుడు వైఎస్సార్ ఆశయాలతో నడుస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీ నేత.. కాంగ్రెస్ పార్టీని దళారీతో పోల్చడం చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీ దళారీలా ఉంటే.. వైఎస్సార్ కూడా దళారీ పార్టీ నుంచే సీఎం అయ్యారా అన్న ప్రశ్నను కొందరు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో నేతల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసినవారే. వైఎస్ తో కలిసి కాంగ్రెస్ లో కీలక పదవులు నిర్వహించిన వారే. కాంగ్రెస్ లో ఎదిగిన నేతలంతా ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని సమాచారం. బహిరంగంగా తమ అభిప్రాయం చెప్పకపోయినా.. సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.    కేంద్రం ప్రభుత్వానికి అన్ని అంశాల్లోనూ వైసీపీ మద్దతు ఇస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశారు వైసీపీ ఎంపీలు. కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తున్న విద్యుత్ బిల్లును కూడా జగన్ పార్టీ సమర్ధించింది. ఇప్పుడు వ్యవసాయ బిల్లులకు సపోర్ట్ చేసింది. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు ఉండటంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకే వైసీపీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఇటీవలే సీరియస్ గా స్పందించింది. త్వరలోనే ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో అంతలోపే తమపై ఉన్న కేసులను కొలిక్కి తెచ్చుకోవాలని సీఎం జగన్, విజయసాయి భావిస్తున్నారని, అందులో భాగంగానే బీజేపీని మరింత మచ్చిక చేసుకునేందుకు విజయసాయి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దల ప్రసన్నం కోసమే విజయసాయి రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను దళారీ అంటున్న వైసీపీ నేతలు.. కాంగ్రెస్ నుంచి సీఎంగా ఎదిగిన వైఎస్సార్ పేరు వాడుకోవడం మానాలని, ధమ్ముంటే వైఎస్సార్ ఫోటో లేకుండా జనంలోకి వెళ్లాలని డిమాండ్  చేస్తున్నారు.    వ్యవసాయ బిల్లుల విషయంలో అధికార బీజేపీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తోన్న వైసీపీ.. లోక్ సభ మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లులకు మద్దతు తెలిపింది. అంతటితో ఊరుకోకుండా.. బీజేపీకి వత్తాసు పలుకుతూ విపక్షాలపై వైసీపీ ఎదురుదాడి చేసింది. వ్యవసాయ బిల్లులను అడ్డుకుంటోన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలను ఉద్దేశించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని.. బిల్లుల్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సరైన కారణమే లేదు. అది పచ్చిగా దళారీలాగా వ్యవహరిస్తున్నదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి వ్యాఖ్యలను రాజ్యసభలోనే కాంగ్రెస్ ఖండించింది.