విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న దళిత యువకుడి మృతి..

విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న ఒక దళిత యువకుడి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గత నెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చేపలకు ఆహారంగా ఉపయోగించే ఫీడ్ మధ్య‌లో మద్యం సీసాలను పెట్టి గుప్తా అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వీటిని విజయవాడకు పార్సిల్ చేసినట్టు ఎస్ఈబీ పోలీసులు గుర్తించారు. దీనిపై విజయవాడ పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.   దీనికి సంబంధించి కృష్ణలంక పెద్దవారి వీధికి చెందిన కారు డ్రైవర్ అయిన డి.అజయ్ (26) మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. అజయ్‌ తల్లి నాగమల్లేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. తల్లి సమీపాన ఉన్న చర్చిలో వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్‌, మొగల్రాజపురానికి చెందిన అతడి స్నేహితుడు సాయికిరణ్‌లను నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వారిని ఎస్‌ఈబీ కార్యాలయం నుంచి  పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరి ఆడడం లేదని, ఒళ్లు చల్లబడుతోందని అజయ్ పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో అతడు చనిపోయాడని అజయ్ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అజయ్ మృతికి నిరసనగా దళిత సంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే ఇది లాక్‌పడెత్‌ కాదని, అనారోగ్య కారణాలతో అజయ్‌ చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. అతడిని ప్రశ్నిస్తుండగా చెమటలు పట్టి ఫిట్స్‌ వచ్చాయని, ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని చెబుతున్నారు. అజయ్‌ అనారోగ్యంతో చనిపోయాడని, ఒకవేళ పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. తనకు ఉన్న ఒక్క ఆధారమైన కొడుకు చనిపోవడంతో అజయ్‌ తల్లి తల్లడిల్లుతోంది.

దుబ్బాకలో టీజేఎస్.. మండలికి కాంగ్రెస్! కొత్త ఫార్మూలా? 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై పీసీసీ నేతలు తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేస్తుండటంతో అక్కడ ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు వస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉంది టీజేఎస్. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేశారు కోదండరామ్. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ సర్కార్ పై పోరాడుతున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కోదండరామ్.. తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు. దీంతో కోదండకు మద్దతుపై కాంగ్రెస్ లో క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది.    కోదండరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై పార్టీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులంతా ఆయనకు మద్దతు ఇవ్వకుండా సొంతంగా పోటీ చేయాలని టీపీసీసీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన తెలంగాణ జనసమితి కనీస ప్రభావాన్ని చూపలేకపోయిందనీ.. పోటీచేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారట. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. దుబ్బాక ఉపఎన్నికల్లో టీజేఎస్‌కు మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ సహాయం కోరాలని మరికొందరు ప్రతిపాదించినట్లు సమాచారం.  దీంతో కోదందరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై సబ్‌కమిటీని ఏర్పాటుచేసి ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.    మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌లో పోటీదారుల సంఖ్య భారీగా ఉంది.మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి 29 మంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి 25మంది అశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలవడంతో గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీకి నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యువత, ఉద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉండటంతో కష్టపడితే ఈజీ గెలవొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. సొంతంగానే పోటీచేయాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో పీసీసీ పెద్దలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.     మరోవైపు సబ్ కమిటీ పేరుతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌కు షాక్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమైతే కోదండరామ్‌నే కాంగ్రెస్ పక్షాన పోటీకి ఒప్పించాలని, అందుకు అంగీకరించని పక్షంలో స్వతహాగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఫైనల్‌ చేయాలని టీపీసీసీ పెద్దలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాబు..బహు జాగు బాసూ!

అధినేత సాగతీతే అసలు సమస్య   తెలంగాణలో మాయమవుతున్న తెలుగుదేశం   రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు   తొలగించకపోతే ఆఫీసులో ధర్నాకు సిద్ధం                  తెలంగాణ లో పుట్టిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మాయం కానుందా? అగ్రనేతలు నిష్క్రమించగా.. మిగిలిన నాయకులు, కార్యకర్తలను కూడా కాపాడుకునే సత్తా పార్టీ అధినేత చంద్రబాబులో పోయిందా? అధ్యక్షుడు రమణను మార్చాలని ఏళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండును పట్టించుకోని, బాబు సాగతీత- నాన్చుడు ధోరణే అసలు సమస్యనా? రమణను తొలగించకపోతే, తెలంగాణ తమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారా? ఆఫీసులోని అన్న విగ్రహం వద్దనే ధర్నాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి.   తత్వం బోధపడినా అనుభవం కాని చంద్రబాబు నాన్చుడు వైఖరి, ఇప్పటికే  తెలంగాణలో టీడీపీ కొంప ముంచగా.. అది మరింత ముదురిన ఫలితంగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో కొంపకొల్లేరయ్యే ప్రమాదం తలెత్తింది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అసమర్థ నాయకత్వానికి, దన్నుగా నిలిచిన చంద్రబాబు అందుకు త్వరలో మూల్యం చెల్లించుకోనున్నారు. రమణను మార్చాలని తెలంగాణ తమ్ముళ్లు ఎన్నిసార్లు కోరినా బాబు,  ‘చూద్దాం.. మాహాడతాం’ అనే పడికట్టు పదాలు తప్ప, అంతర్గత  సమస్యపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.   ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఇప్పటివరకూ రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీ బతికి బట్టకట్టింది లేదు. రమణ నియంతృత్వ వైఖరి వల్లే.. గతంలో గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిందన్న విమర్శలున్నాయి. రమణ ఒంటెత్తు పోకడల వల్ల.. అప్పట్లో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావు సహా, సీనియర్లంతా పార్టీని వీడారన్న ఆరోపణలూ లేకపోలేదు. గత గ్రేటర్ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా మూటకట్టుకున్నారు. ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్నా.. రమణను మార్చకపోవడం చంద్రబాబు లోపమేనని, ఆయన నిరాసక్తత- సాగతీతే పార్టీకి అసలు సమస్య అని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. రమణను ఎందుకు కొనసాగిస్తున్నారో, ఆయనపై బాబుకు ఎందుకంత అభిమానమో అర్ధం కావడం లేదంటున్నారు.   కాగా, ఈనెల 27న టీడీపీ ఏపీ-తెలంగాణ-జాతీయ కమిటీలు ప్రకటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి ముందే, తెలంగాణ రాష్ట్ర -జిల్లా నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రమణను మార్చాలని రాష్ట్ర కమిటీలో ముగ్గురు మినహా, మిగిలిన నేతలంతా బాబుకు లేఖాస్త్రం సంధించడం సంచలనం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులోనే భేటీ అయిన, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు..  రమణను మార్చాలని, ఆయన తమకు పోటీగా జిల్లాల్లో నేతలను ప్రోత్సహిస్తున్నారని, కోర్ కమిటీలో అనామకులకు స్థానం కల్పిస్తున్నారని బాబుకు లేఖ రాయాలని నిర్ణయించారు. తెలుగుమహిళా అధ్యక్షురాలు జోత్స్నను కోర్ కమిటీ మీటింగుకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.   అయితే, ఆ సమావేశం వివరాలు తెలుసుకున్న రమణ, హటాత్తుగా అక్కడికి వెళ్లారట. నా అనుమతి లేకుండా ఇక్కడ మీటింగు ఎలా పెడతారని గుడ్లు ఉరిమారట. ఇష్టం ఉన్న వాళ్లు ఉండండి. లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోండని గద్దించారట. ఆ తర్వాత మరోమారు భేటీ అయిన తమ్ముళ్లు, రమణను మార్చకపోతే పార్టీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. బాబుకు ఆరకంగా లేఖాస్త్రం సంధించిన వారిలో, 14 మంది జిల్లా పార్టీ అధ్యక్షులున్నట్లు సమాచారం. కాగా పార్టీ ఆఫీసులో ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.   కాగా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. సీపీఐ-సీపీఎం సహా ఇతర పార్టీలతో పొత్తు కోసం, రమణ చేస్తున్న ప్రయత్నాలపై హైదరాబాద్ నేతలు విరుచుకుపడతున్నారు. గతంలో కూడా రమణ అసమర్ధ నాయకత్వం వల్లనే హైదరాబాద్‌లో పార్టీ ఓడిందని, ఇప్పుడు మళ్లీ పొత్తుల పేరుతో ఆయన పార్టీని ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అసలు హైదరాబాద్ పార్టీ వ్యవహారాల్లో, రమణ జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.   ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించకుండా.. అది విపత్తుగా మారేంతవరకూ, నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు వైఫల్యమే, ఈ దుస్థితికి కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘రమణ స్థానంలో సారు దగ్గర ఉండే మాణిక్యాన్ని పెట్టినా బాగా నడుపుతారన్న’ వ్యంగ్యోక్తులు, పార్టీ ఆఫీసులో బహిరంగంగానే వినిపిస్తుంటాయి. పార్టీ నేతలకే తెలిసిన ఈ సత్యం, ఇప్పటిదాకా  బాబుకు తెలియకపోవడమే ఆశ్చర్యమంటున్నారు. పార్టీ అధినేతగా బాబు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారని, అందుకే అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారని ఓ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని విడిచిపెట్టారన్న చర్చకు, బాబు ఇప్పటివరకూ తన పనితీరు ద్వారా తెరదించలేకపోయారు. అయినప్పటికీ,  ఉన్నంతలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా.. బాబు చేస్తున్న జాగుకు విసిగి, పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేదు అనుభవాలెదురవుతున్నా, బాబు ఇంకా అదే నాన్చుడు ప్రపంచంలో జీవించడం ఏమిటో? -మార్తి సుబ్రహ్మణ్యం

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్.. నమ్మకం లేకపోతే కోర్టునే మూసేయండి

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హైకోర్టును అపకీర్తి పాలు చేసేలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభ్యంతరకర పోస్టులపై తాజాగా జగన్ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యం నిన్న విచారణకు రాగా ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు కుట్రలో భాగంగానే హైకోర్టుపై సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా ఎవరూ న్యాయమూర్తులను దూషించరని... దీని వెనుక ఉన్న కుట్రను తప్పకుండా తేల్చుతామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.   న్యాయవ్యవస్థపై నమ్మకం లేనివారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరడం మంచిదని ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు... రాష్ట్రంలో చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) అనేది ఉందా? అని నిలదీసింది. "రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సరిగా అమలు కావడంలేదు. చట్టబద్ధ పాలన జరగకపోతే... మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తాం" అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. న్యాయమూర్తులనే అవమానపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "‘ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి (సివిల్‌ వార్‌) దారి తీస్తుంది" అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. "న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది" అని తెలిపింది. ఇదే సందర్భంలో "మీది ధనిక రాష్ట్రం కదా! సుప్రీంకోర్టుకు వెళ్లి... సీనియర్‌ లాయర్లను నియమించుకోవచ్చు" అని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేసింది.   న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా హైకోర్టే పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్ట్‌లను అనుమతించరాదని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. కోర్టుల పై అభ్యంతరకర కామెంట్ల పై తగిన చర్యలు తీసుకోవాలని, పోస్టింగులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య, ముకుల్‌ రోహత్గీ తదితరులు హాజరై.. ఆయా సోషల్ మీడియా సంస్థల తరఫున కౌంటర్లు దాఖలు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సాల్వే, సజన్‌ పూవయ్య కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

ఇదో బీజేపీ-వైసీపీ ఫ్రెండ్లీ ఫైట్   నానిపై వేటేసి కమలాన్ని విరబూయిస్తారా?   టీడీపీ స్థానం ఆక్రమించే వ్యూహమేనా?   భాజపాకు దారిస్తున్న వైకాపా సర్కార్? ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తులుంటాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పీటముడి పడుతుంది. దానితో రెండు పార్టీలూ అభ్యర్ధులను బరిలోకి దించుతాయి. మిగిలిన చోటంతా కలసి పనిచేస్తే, అక్కడ మాత్రం విడిగా పోరాడుతుంటాయి. అంటే కలి‘విడి’ కదనమన్నమాట! ఇదేం విచిత్రమని అడిగితే,  అది ‘ఫ్రెండ్లీఫైట్’ అని నిర్వచిస్తారు. ఇది ఎన్నికల సమయంలో ఎప్పుడూ చూసే చిత్రమే. వామపక్షాలది మరో గమ్మత్తు. ఎన్నికల్లో తమది అవగాహనే తప్ప, పొత్తులు కావని సూత్రీక రిస్తుంటారు. అదో విచిత్రం!  ఇంచుమించు అలాంటి చిత్ర విచిత్రాలే, ఏపీ రాజకీయాల్లో వైకాపా-భాజపా మధ్య కనిపిస్తున్నాయి. ఢిల్లీలో అపూర్వ సహోదరుల్లా కలసిమెలసి ఉన్న ఈ రెండు పార్టీలూ, ఏపీ గల్లీలో మాత్రం కొట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో కవలల మాదిరిగా కలసి ఉన్న ఆ రెండు పార్టీలూ, గల్లీలో మాత్రం కీచులాడుకుంటున్నాయి. ఇదోరకం ఫ్రెండ్లీఫైటా? లేక వామపక్షాల మాటల ప్రకారం అవగాహనా రాజకీయమా? అన్నదే ప్రశ్న.   నువ్వు నన్ను కొట్టినట్లు నటించు-నేను ఏడ్చినట్లు నటిస్తానన్నట్లుంది.. ఏపీలో వైకాపా-భాజపా, సమర-సరస రాజకీయం. ఇటీవలి కాలంలో హిందూ ఆలయాల కేంద్రంగా జరుగుతున్న పరిణామాలతో.. ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలదళాలకు, జగనన్న సర్కారు ‘తెరవెనుక ప్రోత్సాహం’ ఇతోధికంగానే కనిపిస్తోంది. అంటే.. బీజేపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు, బీజేపీ నేతలపై ఎదురుదాడి వంటి కార్యక్రమాలతో, వైసీపీ సర్కారు చేతనయింత మేరకు బీజేపీని క్రేన్లతో పైకి లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తూనే ఉంది. అంటే బీజేపీకి దారి సుగమం చేసినట్టయితే, ఆ దారిలో ఇప్పటికే నిలబడి ఉన్న తెలుగుదేశం రథాన్ని, వెనుకనెట్టివేయవచ్చని ఇరు పార్టీల అవగాహన కావచ్చు. నిజానికి కమలనాధుల ఆశ కూడా అదే. ముందు టీడీపీని నిర్వీర్యం చేసి, ఆ స్థానంలో తాను జెండా ఎగురవేయాలి.  ఆ తర్వాత ఎలాగూ జగనన్న కేసుల జుట్టు, తమ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన సంగతి, ఎన్నికలప్పుడు చూడవచ్చన్నది కమలదళాల కల- కోరిక!  ఏపీ రాజకీ యాలు- బీజేపీ నేతల ప్రకటనలు చూసిన, మెడమీద తల ఉన్న ఎవరికయినా కలిగే అభిప్రాయమే ఇది.   తాజాగా ‘తెలుగుభాష-సాంస్కృతిక శాఖ’ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను, సాధారణ దృష్టితో చూడలేము. ఆయన ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు గురిపెట్టారు. ‘‘జగన్ భార్యతో సహా బ్రహోత్సవాలకు రావాలంటున్న బీజేపీ వాళ్లు, ముందు మోదీని వెళ్లి ఓసారి సతీసమేతంగా  భూమిపూజ చేసిన తర్వాత ఇతరులకు చెప్పమనండి. మోదీ గారు ఏ భార్యను తీసుకెళతారండి’’ అని నాని చేసిన వ్యాఖ్యను,  ఆషామాషీ గా చూడలేం కదా? ఆయన చేసిన ఈ వ్యాఖ్య దుమారం రేపింది. అది జాతీయ మీడియాలో కూడా హల్‌చల్ చేసింది. జగన్ ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్దలందరినీ కలసి వచ్చిన రోజునే, సహచర మంత్రి నాని ఏకంగా ప్రధానిపైనే మాటల దాడి చేయడం, అయినా జగన్ మౌనంగా ఉన్నారంటే దాని సంకేతామిటన్నది సుస్పష్టం. ఈలోగా నాని మాటలపై కమలదళం యాగీ మొదలుపెట్టింది. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇదే నాని మొన్నామధ్య.. కమలాన్ని కరోనా వైరస్‌తో పోల్చినప్పుడే గమ్మున కూర్చున్న కమలదళాలు, ఇప్పుడు మోదీని విమర్శిస్తే మాత్రం రోడ్డెక్కేస్తున్నాయి. అంటే పార్టీ కంటే ప్రధానికే విలువన్నమాట! సరే అది వారి అంతర్గత వ్యవహారమనుకోండి. నాని వ్యాఖ్యలపై కమలదళాలు, నింగీ నేలను ఏకం చేసేంత హడావిడి చేస్తున్నాయి. దీన్ని ఒక జాతీయ అంశంగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.   ఆ ప్రకారంగా.. భాజపేయుల ఆందోళనలో, ‘లక్షలాది’ మంది కార్యకర్తలు అరెస్టవడం, ఫలితంగా  దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయడం, దీనికి జగనన్న స్పందించి.. నానిని మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సాధ్యం కానిది, బీజేపీ సులభంగా సాధించిందన్న కొత్త ప్రచారానికీ తెరలేపవచ్చు. ఈ పరిణామాల ఫలితంగా.. ఏపీలో అసలైన ప్రతిపక్షం టీడీపీ కాదు, భాజపానే అన్న అభిప్రాయం కలిగించడం రెండో అంకమైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పనిలో పనిగా.. డిక్లరేషన్‌పై అవాకులు చవాకులూ పేలిన కొడాలి నానిని, మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని తమ విజయంగా, ముఖ్యంగా హిందువుల విజయంగానూ ప్రచారం చేసుకునేందుకు, రంగం సిద్ధం చేసుకుంటారన్న అనుమానాలూ లేకపోలేదు.   మామూలుగా అయితే.. ఈపాటికే నానిపై వేటు వేయాల్సి ఉంది. కానీ జగనన్న ఇంకా జాగు చేస్తున్నారంటే, అందులో అనేక మతలబులు ఉన్నాయనుకోవచ్చు. నానిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. భాజపాతో ఉన్న దోస్తీ కారణంగానే తొలగించారని, అది వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగుకు నిదర్శనమన్న అపప్రద ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఆయనను కొనసాగిస్తే, మోదీని ఎదిరించి నిలిచారన్న భావన తాత్కాలికంగానయినా ఏర్పడుతుంది. మరి అదే నిజమయితే.. పార్లమెంటులో అన్ని బిల్లులకూ వైకాపా మద్దతునివ్వడం, తాజాగా ఆగమేఘాలపై కేంద్ర పెద్దలకు వెళ్లి కలవడంలో, మతలబేమిటన్న ప్రశ్నలూ తెరపైకి రాక తప్పవు.   మొన్నామధ్య బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోయిన,  మూడు సింహాల కథనే తీసుకుందాం. అవి మాయమయ్యాయన్న వార్తతో మీడియా అక్కడకు వెళ్లింది. రథం ముసుగు తీసి చూపాలని  కోరినా ఈఓ కుదరదు పొమ్మన్నారు. అదే అక్కడికి వచ్చిన,  కమలదళపతి సోము వీర్రాజు ఆదేశించిన వెంటనే ముసుగు తీసి చూపడం ఆశ్చర్యం. డి క్లరేషన్‌పై సంతకం వివాదం ముదురుపాకాన పడి, మంత్రి నాని వ్యాఖ్యలపై హిందూ సమాజం మండిపడింది. ఆ సమయంలో మంత్రిపై విరుచుకుపడాల్సిన అదే భాజపా దళపతి..  ‘‘తమ్ముడికి పాపం తెలియక మాట్లాడుతున్నాడు. ఆలయ సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాద’‘ని సాత్వీకంగా చెప్పడమే ఆశ్చర్యం.   గత ఎన్నికల ముందు మోదీపై,  బాబు కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కుటుంబం లేని మోదీకి, తల్లి-భార్యను కూడా పట్టించుకోని మోదీకి కుటుంబ విలువలేం తెలుస్తాయని బాబు విమర్శించారు. దానితో కమలదళాలు బాబుపై మూకుమ్మడి దాడి చేశాయి.  ఇప్పుడు నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే కాస్తంత కూల్‌గా విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం, ఆ స్థాయి దాడి కనిపించకపోవడమే ఆశ్చర్యం. అన్నట్లు.. మోదీపై మాట తూలిన మంత్రి గారి వ్యాఖ్యలపై, చాలాకాలం తర్వాత ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ స్పందించారు. దేవాలయాలపై దాడులు, తిరుమల వ్యవహారంపై యాగీ అవుతున్నా వినిపించని ఆయన స్వరం, ఎట్టకేలకు నాని పుణ్యమా అని వినిపించింది.    -మార్తి సుబ్రహ్మణ్యం

హత్రాస్ ఘటనలో ట్విస్ట్.. యువతిపై అత్యాచారం జరగలేదు!!

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనపై యూపీ పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. మెడపై తీవ్ర గాయం కారణంగానే ఆమె మరణించిందని తెలిపారు.   హత్రాస్ లో అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు దళిత యువతిపై అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరచినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె అంత్యక్రియలు మంగళవారం అర్థరాత్రి.. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పోలీసులు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.   ఈ నేపథ్యంలో యూపీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని చెప్పారు.  "ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది. నమూనాల్లో వీర్యం లేదని ఈ నివేదిక స్పష్టంగా చెప్తోంది. దీనినిబట్టి ఆమెపై అత్యాచారం గానీ, సామూహిక అత్యాచారం గానీ జరగలేదని స్పష్టమవుతోంది" అని వివరించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా అత్యాచారం గురించి పేర్కొనలేదని, తనపై దాడి జరిగిందన్న విషయాన్నే ప్రస్తావించిందని ప్రశాంత్ తెలిపారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను సృష్టించేందుకు కొందరు వాస్తవాలను వక్రీకరించారని పేర్కొన్నారు.    ఇప్పటికే హత్రాస్ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. అసలు బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలు తీవ్ర గాయాలతో నరకం అనుభవించడం నిజం, మరణించడం నిజం. కాబట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

వైసీపీలోకి గంటా ప్రవేశం డేట్ ఫిక్స్.. విశాఖలో టీడీపీ పరిస్థితి..? 

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయనను పార్టీలో చేర్చుకోవడం పై ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పడంతో గంటా చేరిక ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం అయింది. అక్టోబర్ 3న సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ కానున్నట్లుగ వార్తలు వస్తున్నాయి. అదే రోజు అయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా సీఎం జగన్‌తోనే మాట్లాడుకొని తన చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి కూడా ఇవ్వవచ్చని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.   2019 ఎన్నికలలో రాష్ట్రం మొత్తం వైసీపీకి జై కొట్టగా విశాఖలోని నాలుగు నియోజకవర్గాలలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. దీంతో విశాఖలో పట్టు కోసం అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దక్షిణ నియాజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సైలెంట్ గా సీఎం జగన్ కు జై కొట్టగా.. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కూడా అధికార పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో నగరంలో ఇక మిగిలింది తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ మాత్రమే. ఆయన కృష్ణ జిల్లా వాసి మాత్రమే కాక కరుడుగట్టిన టీడీపీ నాయకుడు. అయితే ఆయనను కూడా వైసిపిలోకి తీసుకురావడానికి మంత్రి కొడాలి నాని, ఇప్పటికే పార్టీ మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన మాత్రం ఇంకా వైసీపీ అధిష్ఠానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం.

యూపీలో రాహుల్ గాంధీ అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం 

యూపీలోని హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా, దారిలోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తన కాన్వాయ్ తో యూపీ బయల్దేరిన రాహుల్ గాంధీని పోలీసులు గ్రేటర్ నోయిడా వద్ద నిలిపివేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాహుల్, ప్రియాంక‌ కాన్వాయ్‌ దిగి 172 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హా‌త్రాస్ మార్గంలో నడక ప్రారంభించారు. హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా రాహుల్ ముందుకే సాగ‌డం తీవ్ర ఉద్రిక్త‌తకు దారి తీసింది. అయ‌న్ను అడ్డుకునే క్ర‌మంలో పోలీసులకు రాహుల్ మద్దతుదారులకు మధ్య తోపులాట జ‌రిగింది. ఈ గంద‌ర‌గోళంలో రాహుల్ గాంధీ కింద‌ప‌డిపోయారు. ఆ త‌ర్వాత అయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.   అయితే తన పట్ల యూపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించి తీరును రాహుల్ తీవ్రంగా ఖండించారు‌. త‌న‌ను నెట్టివేశార‌ని.. లాఠీచార్జ్ కూడా చేశార‌ని అయన మండిప‌డ్డారు. త‌న‌ను తోసివేసి కింద ప‌డేసిన‌ట్లు రాహుల్ ఆరోపించారు. అయితే హ‌త్రాస్ తానొక్క‌డినే వెళ్లాల‌ని అనుకుంటున్నాని.. తనను ఏ సెక్ష‌న్ కింద అరెస్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న ‌ప్ర‌శ్నించారు. అయితే రాహుల్ గాంధీ నిబంధ‌న‌లను అతిక్ర‌మించింనందుకుగాను ఐపీసీ 188 సెక్ష‌న్ కింద అరెస్ట్ చేస్తున్న‌ట్టు పోలీసులు చెప్పారు. దీంతో యూపీ ప్ర‌భుత్వం తీరుపై రాహుల్ తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ మాత్ర‌మే ఈ దేశంలో న‌డుస్తారా.. ఓ సాధార‌ణ వ్య‌క్తి క‌నీసం న‌డ‌వ‌లేరా అని ఆయ‌న నిలదీశారు. ఈ ఘర్షణలో కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. తనను కూడా పోలీసులు నెట్టివేశారంటూ ఆమె ఆరోపించారు.

రోజాకు షాక్ ఇచ్చిన జగన్ ..ప్రత్యర్థి వర్గానికి కార్పొరేషన్ పదవి

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాకి వైసీపీలో పవర్ తగ్గిపోతోందా?.. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే పవర్ చూపించలేకపోతున్నారా?.. పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.   రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. మంత్రి పెద్దిరెడ్డి చొరవతో కేజే కుటుంబానికి పదవి దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.   నగరిలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే రోజాకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య విభేదాలున్నాయి. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు. కెబిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా కేజే అనుచరులు ఆమెను అడ్డుకొని, కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు రోజా వారిపై ఫిర్యాదు కూడా చేశారు.   అంతేకాదు, గతంలో కేజే కుమార్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ హాజరుకావొద్దంటూ.. అప్పట్లో ఆమె పార్టీ కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశం వైసీపీలో కలకలం రేపింది. అయితే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరుకావొద్దని రోజా కోరగా.. ఆ కార్యక్రమానికి ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు హాజరయ్యారు.   ఇక, ఈ ఏడాది మే నెలలో పుత్తూరులో కళ్యాణ మండపం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారులతో స్థలాన్ని పరిశీలించారు. అయితే, తన నియోజకవర్గంలో స్థలాన్ని పరిశీలించడానికి వస్తూ తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై రోజా అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇలా ఈ ఏడాది కాలంలో అనేకసార్లు రోజా మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒకవైపు తన వైరి వర్గానికి మద్దతుగా నిలుస్తూ, మరోవైపు తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజల్లో తనను పలుచన చేస్తున్నారన్న అసహనం రోజాలో ఉన్నట్లు తెలుస్తోంది.   ఇప్పుడు కూడా కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంపై రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కావాలని తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి, నారాయణస్వామిలపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట.   వైసీపీ అధికారలోకి వస్తే తనకి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఆశలపై జగన్ నీళ్ళు చల్లారు. ఆమెని కాదని పెద్దిరెడ్డి, నారాయణస్వామిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రోజా అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనై కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. చివరికి కంటితుడుపు చర్యగా ఆమెకి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే, ఆ పదవితో ఆమె సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీనికితోడు పెద్దిరెడ్డి, నారాయణస్వామి మద్దతుతో వైరి వర్గం రోజురోజుకి బలపడుతుండటం, ఆమె నియోజకవర్గంపై పట్టు కోల్పోతుండటంతో తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది.   ఇంతకాలం మంత్రుల పెత్తనాన్ని భరిస్తూ వచ్చిన రోజా.. ఇప్పుడు కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారట. అవసరమైతే ఈ విషయంపై జగన్ తోనే తేల్చుకోవాలని రోజా అనుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో నెలకొంది.

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కి చుక్కెదురు.. హైకోర్టుకు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌ బాబు కేసులో స్టే ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే, హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం వ్యాఖ్యానించింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.   సుధీర్ బాబు తహసీల్దార్ హోదాలో అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం స్టే ఎత్తేయడానికి నిరాకరిస్తూ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా

విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పాలకమండలి ఛైర్మన్‌కు పంపారు.    వరలక్ష్మికి చెందిన కారులో నిన్న అక్రమ మద్యం వెలుగుచూడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కారు డ్రైవర్‌ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని వాహనంపై బోర్డు తగిలించి ఆమె భర్త వెంకట కృష్ణప్రసాద్ మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వరలక్ష్మి మాత్రం అక్రమ మద్యం కేసులో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ప్రమేయం లేదని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్‌ ఇలా చేశాడని ఆమె అంటున్నారు. కేసు విచారణ అయ్యేంతవరకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరలక్ష్మి ప్రకటించారు.   విజయవాడ కనకదుర్గగుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దుర్గగుడిలో ఇటీవల వెండి సింహాల చోరీ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ఈ వివాదం తెరమీదకు వచ్చింది. గతంలోనూ అమ్మవారి చీర దొంగతనం కేసులో అప్పటి పాలకవర్గం సభ్యురాలిపై ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులు సైతం తాము మనసు పడ్డ పట్టుచీరలను లెక్కల నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నా.. పాలకమండలి సభ్యులు, అధికారుల తీరులో మార్పు రావడంలేదు. ముఖ్యంగా పాలకమండలి సభ్యులపై చీరల దొంగతనం, అక్రమ మద్యం రవాణా వంటి ఆరోపణలు రావడం పవిత్రమైన గుడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   దుర్గగుడి పాలక మండలి సభ్యత్వం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. ప్రభుత్వమే ఈ కమిటీని నియమిస్తుంది. రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడి పాలకమండలిలో స్థానం అంటే.. సాధారణ విషయం కాదు. ప్రభుత్వ విప్‌గా ఉన్న సామినేని ఉదయభాను సిఫార్సుతోనే నాగవరలక్ష్మికి పాలక మండలిలో స్థానం లభించింది. ఇప్పుడు ఆమె కుటుంబం అక్రమ మద్యం వివాదంలో చిక్కుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనుంచైనా గుడి పవిత్రతను కాపాడేవారికి పాలక మండలిలో స్థానం కల్పించాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.

టీటీడీకి జవహర్‌రెడ్డి! కీలక పోస్టులన్ని వారికే.. ధర్మారెడ్డి దారెటు?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పోస్టు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదలీ చేసిన జగన్ ప్రభుత్వం.. ప్రస్తుతం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పంపడంతో అదే శాఖ చూస్తున్న జవహర్‌రెడ్డిని టీటీడీకి బదిలీ చేయవచ్చంటున్నారు. జవహర్ రెడ్డి కూడా తనకు టీటీడీ ఈవో పోస్ట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారట. దీంతో సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి టీటీడీకి వెళ్లడం ఖాయమేననే తెలుస్తోంది.    రాష్ట్రంలో  ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అదే క్రమంలోనే మరో రెడ్డికి కీలక పోస్టు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని హడావుడిగా ఏపీకి రప్పించారు. టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగా.. ఇప్పుడు ఈవో పోస్టును కూడా వారికే ఇవ్వడమేంటనే చర్చ భక్తుల నుంచి, ఏపీ ప్రజల నుంచి వస్తోంది. టీటీడీలో పూర్తిగా తమ సామాజిక వర్గమే ఉండేలా జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.    మరోవైపు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి నియామకంపై చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. అదనపు ఈవో ధర్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. జవహర్ రెడ్డిని నియమించవద్దంటూ సీఎం జగన్ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సీఎం జగన్ టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని పంపిస్తే.. ధర్మారెడ్డి ఎక్కువ కాలం టీటీడీలో ఉండకపోవచ్చని, మూడు నాలుగు నెలల్లోనే వెళ్లిపోతారని టీటీడీ అధికారులే చెబుతున్నారు.    జవహర్ రెడ్డి ఈవోగా వస్తే టీటీడీలో చాలా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. చైర్మెన్, అదనపు ఈవోల మధ్య విభేదాలు పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల టీటీడీ నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదమయ్యాయి. టీటీడీ డిక్లరేషన్ పై ఇటీవలే పెద్ద వివాదం జరిగింది. సీఎం జగన్ తీరుకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అయినా జవహర్ రెడ్డిని ఈవోగా జగన్ సర్కార్ నియమించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల మధ్య కోల్ట్ వార్ తో మరిన్ని సమస్యలు రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా! తిరుపతిలో ఏం చేయబోతోంది?

తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ మరణంతో జరగబోతున్న ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవచ్చని, బిజెపికి ఆ సీటును ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ హాట్ గా మారింది. నిజంగా టీడీపీ తిరుపతిలో పోటీ చేయకూడదని నిర్ణయించిందా.. బీజేపీకి మద్దతు ఇవ్వబోతుందా అన్న చర్చ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీలోనూ జోరుగా జరుగుతోంది. తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పోటీ చేయకపోతే  అది సంచలనమే కాబోతోంది. ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.    తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుంటే.. అది ఆ పార్టీ చేసిన పెద్ద తప్పిదమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ నేతలు సైలెంట్ అయి పోయారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు సైతం కనిపించకుండా పోయారు. దశాబ్దాల పాటు మంత్రులు చేసిన సీనియర్లు కూడా ప్రజలకు, టీడీపీ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఏపీలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. అటు బీజేపీ మాత్రం పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. అలయాలపై దాడులు, టీటీడీ డిక్లరేషన్ వంటి విషయాల్లో దూకుడుగా వెళ్లారు కమలనాధులు. టీడీపీ నేతలు మాత్రం ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు.    టీడీపీలో నెలకొన్న స్థబ్దతతో  ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు వయసు మీద పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడున్నారనే  డౌట్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తిరుపతి సీటును బీజేపీకి ఆఫర్ చేస్తే.. టీడీపిపై ప్రజల్లో ఉన్న రూమర్ నిజం చేసినట్లు అవుతుందని కొందరు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే టీడీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని, టీడీపీని టార్గెట్ చేయవచ్చనే అభిప్రాయం కూడా వస్తుంది.    సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. తిరుపతిలో చనిపోయిన సిట్టింగ్ ఎంపీ వైసీపీ వ్యక్తే. అంటే అక్కడ వైసీపీకి అధికార పార్టీతో పాటు సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సానుభూతి కూడా ఉంటుంది. సో .. తిరుపతిలో విపక్ష పార్టీగా ఓడిపోయినా తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అధికారంతో పాటు సెంటిమెంట్ తో వైసీపీ గెలిచిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ చేయకపోతే వైసీపీని ఎదుర్కొనే సత్తా లేక పారిపోయిందనే విమర్శలు టీడీపీకి రావచ్చు. పార్టీకి భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లే టీడీపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన కొందరు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.    బీజేపీ బలపడితే ఏపీలో టీడీపీకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. జాతీయ పార్టీ బలంగా ఉన్న మెజార్టీ రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీనే నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలో ఏదో ఒకటే బలపడుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది కాబట్టి జాతీయ పార్టీగా బీజేపీ బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్క ప్రాంతీయ పార్టీనే స్ట్రాంగ్ గా నిలబడవచ్చు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీకి ఢోకా ఉండకపోవచ్చు. ఎటొచ్చి బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే. అందుకే టీడీపీని బలహీనపరుస్తూ ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   సార్వత్రిక ఎన్నికల తర్వాత  బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదని కూడా తెలుస్తోంది. అయినా బిజెపి కేంద్ర పెద్దల దృష్టిలో పడేందుకు, అదేపనిగా వారిని పొగుడుతూ లేఖలు రాస్తూ సోషల్ మీడియాలో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ తప్పనిసరిగా పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు. అప్పటి వరకు చంద్రబాబు ఆగలేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిజెపిని నమ్ముకోవడం కంటే సొంతంగా పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టిపెడితే మేలని కొందరు  టిడిపి నాయకులు అధినేతకు సూచనలు చేస్తున్నారు.    తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చివరి వరకు రెండు కండ్ల సిద్ధాంతం వినిపించారు చంద్రబాబు. చివరకు అదే తెలంగాణలో టీడీపీకి శాపంగా మారింది.  బీజేపీ పొత్తు కూడా అక్కడ టీడీపీని దెబ్బ తీసింది.  బిజెపి బలంగా లేకపోయినా వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పార్టీ దెబ్బతిన్నదని తెలంగాణ టీడీపీ నేతలే బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సోము వీర్రాజు టీమ్ కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఏపీలోనూ టీడీపీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి రావచ్చనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. తిరుపతిలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. అది టీడీపీకి గుది బండగా మారుతుందని,  అలాంటి అవకాశం ఇవ్వొద్దని తమ్ముళ్లు చెబుతున్నారు   అసెంబ్లీలో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఢీలా పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 24 సీట్లకు పడిపోయినా.. తర్వాత పుంజుకుని అధికారం చేపట్టిందని  గుర్తు చేస్తున్నారు. 1989లో టీడీపీ ఓడిపోయినా.. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష  హోదా కూడా రాకుండా మట్టి కరిపించిందని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పోరాడుతూ ఉంటే చాలని, ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే.. చేజేతులా మరో పార్టీకి బలపడే అవకాశం ఇచ్చినట్లేనని చెబుతున్నారు.   మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపై జరుగుతున్న ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. గతంలోనూ ఇబ్బందులు వచ్చినా పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీపై వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని చర్చలు, ప్రచారాలు జరుగుతున్నా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఏపీ  రాజకీయాల్లో కీలకం కాబోతుందని తెలుస్తోంది. సో.. చంద్రబాబు టీడీపీని ఫణంగా పెట్టేలా తిరుపతిలో బీజేపీకి మద్దతిస్తారా.. లేక బరిలో ఉండి అధికార వైసీపీని ఢీకొడతారా చూడాలి మరీ.

యూపీలో ఆగని అత్యాచారాలు.. సీఎం యోగిని మఠానికి పంపేయాలంటున్నమాయావతి 

దేశ వ్యాప్తంగా యూపీలోని హత్రాస్ ఘటన పై ఒక పక్క నిరసనలు వెల్లువెత్తుతుండగా మరో పక్క అక్కడ హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క హత్రాస్ ఘటనపై నిరసన వ్యక్తం అవుతున్న సమయంలోనే హత్రాస్ కు 500 కిలోమీటర్ల దూరంలో మరో 22 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరగగా తీవ్రమైన గాయాలతో ఆ యువతి మరణించింది. ఉదయం పనులకు వెళ్తుండగా తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని, ఇంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ యువతి తల్లి తెలియచేసింది. అయితే చివరకి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిందని.. ఒక రిక్షాలో తన కూతురిని ఇంటికి పంపించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి.. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారని ఆమె అన్నారు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తమ కూతురు మాట్లాడలేని, నిలబడలేని స్థితిలో ఉందని ఆ తల్లి చెప్పింది. అంతేకాకుండా తనను రక్షించాలని, చనిపోవడం తనకు ఇష్టం లేదని బాధితురాలు బోరుబోరున విలపించడంతో ఆమెను చికిత్స కోసం తరలిస్తుండగా బలరామ్ పూర్ కు సమీపంలోకి చేరుకోగానే ఆమె మరణించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో ఒకరు మైనర్ అని తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా రాష్ట్రం లోని బులంద్ షెహర్ లో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పొరుగున ఉండే 20 ఏళ్ల యువకుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల వయస్సు గల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. జియాన్ పూర్ లో బాలిక ఇంటి పక్కనే ఉండే యువకుడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.   ఇది ఇలా ఉండగా హత్రాస్ దారుణ ఘటనతో పాటు యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో యోగి విఫలం అయ్యారని, యోగిని తిరిగి గోరఖ్ పూర్ మఠానికి పంపించాలని మాయావతి ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయనకు అదీ నచ్చకపోతే.. రామ మందిర నిర్మాణ పనులను అప్పజెప్పాలని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా యూపీలో ఒక్క రోజు కూడా గడవడంలేదని ఆమె మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో యోగి విఫలమైతే వెంటనే రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. కనీసం హత్రాస్ ఘటన తర్వాత అయినా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుతాయని తాము బావించామని, కానీ బలరాంపూర్‌లో మరో ఘటన.. బులంద్ షెహర్ లో ఇంకో ఘటన.. ఇలా జరుగుతూనే ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో నేరస్థులకు ఫ్రీహ్యాండ్ దొరికిందని మాయవతి ఈ సందర్భంగా మండిపడ్డారు.

జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కలే

వైసీపీ విధానాలతో అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్ర 3 వ స్థానం   వైసీపీ ప్రభుత్వం తీరుపై అమలాపురం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతకుమారి ధ్వజం   వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆచరణలో ఆ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని లెక్కలు చెబుతూ వారికి ఆచరణలో  మొండిచెయ్యి చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి వెన్నుముక అని చెప్పబడుతున్న రైతుకు ఈ  ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ లో పంట ఉత్పత్తులు కొనేవారు లేక అయిన కాడికి అమ్ముకునే దుస్థితి తీసుకువచ్చారని, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆందోళన వెలుబుచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందించడంలో  విఫలం అయ్యారని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో ఇటీవల వరదలు, భారీ వర్షాలకు పంటలు నష్ట పోయినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. జగన్ వచ్చిన తర్వాత అతివృష్టి అనా వృష్టి తో  అన్నదాతలకు అన్ని కష్టాలే మిగిలాయని ఆందోళన వెలుబుచ్చారు.    ఈ పాలనలో ఏ పంటకు మద్దతు ధర లభించలేదని ధాన్యం, పసుపు, మొక్కజొన్న,కంది, శనగ పంట సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రైతులకు రూ.1,728 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు.గతంలో 22 వేలు  ఉన్న మిర్చి ధర 8 వేలకు పడిపోయిందని ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి 1815 ఉండగా రూ.1100 నుంచి 1300 కు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.క్వింటా ధాన్యానికి రైతు 500 నుంచి 700 వరకు నష్టపోయాడని మొక్కజొన్నకు మద్దతు ధర 1760 ఉండగా 1400 కు కొనుగోలు చేశారని వేరుశనగ రూ.5090 ఉండగా రూ.4500 మినుములు 5700 ఉండగా 5000  కొనుగోలు చేశారని తెలిపారు.    జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలతో దేశంలోనే రాష్ట్రం 3 వ స్థానం లో ఉందని, 2018 లో 664 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా  జగన్ అధికారం చేపట్టాక 2019లో  1029 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది  ఇప్పటి వరకు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.బడ్జెట్లో 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింప చేస్తామని చెప్పి 45,00,263 మందికి కుదించారన్నారు.15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారని ఇది నమ్మక ద్రోహం కాదా? అని ప్రశ్నించారు.సున్నా వడ్డీకి  రైతురుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పారని, 4వేల కోట్లు ఇస్తామని చెప్పి 2019 బడ్జెట్ లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.ఇప్పుడు ఉచిత  వ్యవసాయ విద్యుత్ అని చెబుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.రేపు వచ్చే బిల్లులతో వారి నెత్తిన భారం మోపడానికి జరుగుతున్న ఎత్తుగడగా అభివర్ణించారు.   టీడీపి హయాంలో వ్యవసాయ రంగ ప్రగతి సాధించిదని ఆమె తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్ టిడిపి ప్రభుత్వం మూడు నాలుగు రెట్లు చేసిందని 2013-14 లో వ్యవసాయానికి బడ్జెట్ 6,128 కోట్లు కాగా టిడిపి ప్రభుత్వం  2018-19 నాటికి రూపాయలు 19,070  కోట్లకు పెంచిందని ప్రకటనలో పేర్కొన్నారు.ఐదేళ్లలో రూపాయలు 81,554 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని రైతులకు రూ. 15,279 కోట్ల మేర రుణ మాఫీ చేశామని వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సగటున 11%  సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు నిలబెట్టారని అనంతకుమారి ప్రకటనలో తెలిపారు. 

పాపం.. అధికారాల్లేని మంత్రులు!

పాపం.. అధికారాల్లేని మంత్రులు!   మంత్రి క్యాంపు ఆఫీసు ముందే చెత్తకుప్ప   మంత్రి చెప్పినా వినే దిక్కులేదట   కలెక్టరుకు లేఖ రాసిన మంత్రి మేకపాటి   తెలంగాణలోనూ మంత్రుల పరిస్థితి దయనీయమేనట   ఆంధ్రాలో మంత్రి పదవులు రాలేదని కొద్దికాలం కుమిలిపోయిన సీనియర్లు, ఇప్పుడు ఆ పదవులు రాకపోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. పదవులివ్వకుండా జగనన్న తమ పరువు కాపాడారని సంతోషిస్తున్నారట. నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పినా చెత్త తొలగించని వైనం చూసి, తమకు పదవులు రాకపోవడమే మంచిదయిందని తమకు తాము ఓదార్చుకుంటున్నారట. అటు పదవులు పొందిన మంత్రులదీ అదే భావన. మునుపటి మాదిరిగా జగనన్నకు, ఇప్పుడు ఎవరినీ ఓదార్చే తీరిక లేకపోవడంతో.. పాపం మంత్రులు తలుపులు వేసుకుని, అద్దం ముందు నిలబడి తమను తామే ఓదార్చుకుంటున్నారట.   అధికారంలోకి వస్తే మంత్రులయి, పెత్తనం సాగించవచ్చని వైసీపీ నేతలు భావించారు. తీరా అధికారంలోకి వచ్చి, పదవులు దక్కించుకున్నా పెత్తనమంతా సీఎంఓదే కావడంతో నిరాశ చెందుతున్నారట. అటు అధికారులూ మాట వినక, ఇటు జనంలో పలుకుబడి పలచనవుతుండటంతో జుత్తుపీక్కోవలసి వస్తోందిట. మంత్రి పదవులు పొందిన వారిని చూసి, ఎమ్మెల్యేలు ఈర్ష్య పడుతుంటే.. ఎమ్మెల్యేల స్వేచ్ఛను చూసి, మంత్రులు ఈర్ష్య పడుతున్న వైచిత్రి కనిపిస్తోంది.   నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి, జగనన్న అత్యంత సన్నిహితుడే. విపక్షంలో ఉండగా, ఆర్ధికంగా నాలుగుచేతులేసిన వారిలో మేకపాటి కుటుంబం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత, మేకపాటికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ, పాపం జిల్లాలో ఆయన మాట చివరకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ కూడా పట్టించుకోకపోవడం లేదట. దీనితో  మంత్రిని చూసి, సొంత పార్టీ నేతలే జాలిపడాల్సిన దుస్థితి. స్వయంగా మంత్రిగారి క్యాంపు ఆఫీసు వద్దే పేరుకుపోయిన కొండంత చెత్తను తొలగించాలని, మంత్రి గారి ఆఫీసు నుంచి చాలా ఫోన్లు వెళ్లాయట. అయినా ఖాతరు చేసే దిక్కులేదు. దీనితో అగ్గిరాముడయిన మంత్రి, సదరు అధికారికి ఫోన్ చేసి తన వద్దకు హాజరుకావాలని హుకుం వేశారు. ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. ఆ అధికారి మంత్రి కంటే నాలుగాకులు ఎక్కువే చదవడంతో, డోంట్ కేర్ అన్నారు. దానితో కన్నెర్ర చేసిన మంత్రి గారు, ఆ అధికారి సంగతి తేల్చాలని జిల్లా కలెక్టరులకు లేఖ రాశారట. ఒకవేళ కలెక్టర్ మంత్రి గారి మాట విని, సద రు అధికారిపై చర్య తీసుకుంటే మున్సిపల్ ఉద్యోగ సంఘాలు ఊరుకోవు. చర్య తీసుకోకపోతే.. ఇప్పటికే సగం పోయిన మంత్రి పరువు, తర్వాత పూర్తిగా పోవడం ఖాయం. చూడాలి.. కలెక్టరు గారు ఏం చేస్తారో? నిజానికి జగనన్న క్యాబినెట్‌లో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరి మాటనే చెల్లుబాటవుతోంది. మిగిలిన వారి ఈతిబాధతల గురించి, ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. వారి శాఖలన్నీ సీఎంఓనే పర్యవేక్షిస్తోంది. మంత్రులకు ‘ఆలోచించుకునే కష్టం’ కూడా కలగనీయడం లేదట. సచివాలయ స్థాయిలో కార్యదర్శి- ముఖ్య కార్యదర్శులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లదే హవా. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రను ఊపేసి, నాటి సీఎం కిరణ్‌కునమార్‌రెడ్డినే ఖాతరు చేయని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి చూసిన వారు, ఆశ్చర్యపడాల్సి వస్తోంది.   ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించి, ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమయ్యారు. అధికారంలోకి వచ్చి 15 నెలలయినా ఇప్పటికీ, క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల పేర్లు చాలామందికి తెలియవంటే  ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పేరుకు పెద్ద శాఖలు నిర్వహిస్తున్న మంత్రులకూ పెద్దగా అధికారాలు లేవట. పేరుకు చాలా పెద్ద, కీలకమయిన రెవిన్యూ శాఖ మంత్రికి పెద్దగా పవరు లేదట. సరే అప్పటి నిమ్మకాయల చినరాజప్ప- నాయని నరసింహారెడ్డి.. లేకపోతే ఇప్పటి మేకతోటి సుచరిత-మొహమద్ అలీ హోంమంత్రులుగా ఉన్నా, లా అండ్ ఆర్డర్‌తోపాటు... డీఎస్పీ నుంచి సీఐల బదిలీ వరకూ సీఎంలే చూసుకుంటారు.  కాబట్టి, హోంమంత్రుల అధికారాలు-ఆవేదన గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే... చంద్రబాబును ప్రతీ విషయంలో వ్యతిరేకిస్తూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న  జగనన్న, ఈ  విషయంలో మాత్రం వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తుండటం విశేషం. అప్పుడు బాబు-ఇప్పటికీ కేసీఆర్.. అధికారాన్ని సీఎంఓకే అనుసంధానం  చేశారు. కెఇ కృష్ణమూర్తి లాంటి సీనియరే, ఎమ్మారో-ఆర్డీఓ బదిలీలు మీరే చేసుకోమని సీఎంఓకు దండం పెట్టి వచ్చారు. బాబు తీసుకునే నిర్ణయాలేమిటో, తమ జిల్లా కలెక్టర్లు చెబితే గానీ మంత్రులకు తెలిసేది కాదు.   తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. తెలంగాణలోనూ హరీష్‌రావు లాంటి వారికి తప్ప, ఎవరికీ అధికారాలు లేవు. అంతా సీఎంఓ ఆదేశాల మేరకే శాఖలు నడుస్తున్నాయి. ఫలానా వారిని నియమించుకునే అధికారం, మంత్రులకు లేదన్నది బహిరంగ రహస్యం. ఒకప్పుడు టీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలలో హవా చెలాయించి, జిల్లాల్లో ఏకపాత్రాభినయం చేసిన ప్రముఖులంతా, ఇప్పుడు తమ స్థానమేమిటో గ్రహించి, లౌక్యంగా వెళుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్ తర్వాత మరొక మంత్రికి పెద్దగా అధికారాలు ఉన్నట్లు కనిపించదు. గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వంటి కొద్దిమంది హవా కనీసం వారి శాఖలోనయినా నడిచేది.   ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డినయినా, తెలంగాణలో కేసీఆర్‌ను అయినా మంత్రులు కలవాలంటే గగనమే. వాళ్లు పిలిస్తే తప్ప, తమంతట తాము వెళ్లి కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో చంద్ర బాబు ఎంతో మెరుగని చెబుతుంటారు. వన్ టు వన్ కాకపోయినా, వెళ్లే ముందో-వచ్చే ముందో కనీసం బాబు దగ్గర ధర్మదర్శనం ఉంటుంది. తిరుమల వెంకన్న మాదిరిగా, ఆయన నిలబడితే సందర్శకులు క్యూలు కట్టి, తమ ఈతిబాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. బాబు అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినా.. వర్కవుట్  చేద్దాం. చూద్దాం. మాహాడదాం.. అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ కేసీఆర్-జగన్ వద్ద అది కూడా ఉండదన్నది ఆయా పార్టీ వర్గాల్లో బహిరంగంగా వినిపించే వ్యాఖ్య. ఎవరి స్కూలు వారిది మరి! -మార్తి సుబ్రహ్మణ్యం

హైదరాబాద్ 'బాద్' షా ఎవరు?

‘గ్రేటర్’ ఎన్నికల కసరత్తు షురూ   కాంగ్రెస్-బీజేపీ బలమెంత?   టీడీపీని నమ్మని సెటిలర్లు   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు మొదలయింది. తెలంగాణలో అసెంబ్లీ, మునిసిపల్, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలన్నీ అయిపోగా, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే మిగిలిపోయాయి. సమైక్య రాష్ట్రం ఉన్నంత వరకూ.. కార్పొరేషన్‌లో బలంగా ఉన్న బలంగా ఉన్న, టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత బలహీనపడ్డాయి. అయినప్పటికీ నగరంలో సీట్లు సంపాదించుకున్న టీడీపీ, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమయింది. ఫలితంగా నగరం- శివార్లలోని సెటిలర్లు వివిధ కారణాల వల్ల ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి జై కొడుతున్న ఉత్తరాది సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలివిగా టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్న పరిస్థితి.   ఇక కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం వల్ల, అది కూడా చేతులెత్తేసింది. ఈవిధంగా ఒకప్పుడు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన ఈ రెండు పార్టీలను, టీఆర్‌ఎస్ పూర్తిగా వెనక్కినెట్టి, గత ఎన్నికల్లో తొలిసారి కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసింది. వచ్చే ఏడాదితో, పాలకవర్గ పదవీకాలం పూర్తవుతుంది. అయితే, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచన. అందుకే ఆ పార్టీలో ఎన్నికల సమరోత్సాహం తొంగిస్తోంది.   ఒకప్పుడు ఖాతా తెరవని టీఆర్‌ఎస్.. మళ్లీ కార్పొరేషన్‌పై రెండోసారి జెండా ఎగురవేయలని పట్టుదలతో ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, విపక్షాల వైఫల్యం వల్ల అది ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. పాతబస్తీలో కాంగ్రెస్ ఇంతవరకూ ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడంతో, సహజంగా టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీనే అక్కడ మరోసారి  పాగా వేసేలా ఉంది. న్యూసిటీలో కొంతవరకూ సర్కారుపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ చీల్చుకునే ఓట్లు, టీఆర్‌ఎస్‌కు లాభించనుంది. నగరంలోని కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వారి నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్‌ఎస్ నష్టపోయే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోయినా, సిట్టింగ్ ఎమ్మెల్యే-కార్పొరేటర్లపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందన్నమాట.   ఇక గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన 14, 68,618 ఓట్లను, ఈసారి గణనీయంగా పెంచుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో తెరాసకు 43.85 శాతం ఓట్లు వచ్చాయి. కాగా మజ్లిస్ 5,30,812 ఓట్లతో 15.85 శాతం ఓట్లు, టీడీపీ 4,39,077 ఓట్లతో 13.11 శాతం; బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం; కాంగ్రెస్ 3,48,388 ఓట్లతో 10.4 శాతం; ఇతరులు 2,27,742 ఓట్లతో 6.5 శాతం ఓట్లు సాధించారు. ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా నివసించే, శివారు నియోజకవర్గాలన్నీ కారెక్కడం విశేషం. ఈసారి కూడా అదే ట్రెండు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.   నిజానికి నగరంలో టీఆర్‌ఎస్, రాజకీయంగా పెద్దగా కార్యక్రమాలు చేసిందేమీ లేదు. ఇప్పటివరకూ కమిటీలు లేవు. అసలు నగర పార్టీకి ఓ ఆఫీసు అంటూ లేకపోవడమే ఆశ్చర్యం. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఆలయ కమిటీలు వేయలేదు. తొలి నుంచీ రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే, స్థానికంగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్‌లో మాత్రం, ఒక్క నామినేటెడ్ పదవి కూడా భర్తీ చేయలేదు. మొత్తానికి, టీఆర్‌ఎస్‌కు ఒక బాధ్యత-ఒక రాజకీయ వ్యవస్థ అంటూ లేదు. అయినా గత ఉన్నికల్లో కేసీఆర్-కేటీఆర్‌ను చూసే ప్రజలు ఓటు వేసే పరిస్థితి కొనసాగింది.   ఇక భాజపా హడావిడి తప్ప, పార్టీ విస్తరించిన దాఖలాలు లేవు. ఇటీవలే నగర కమిటీని చీల్చి, కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి కమిటీలు ప్రకటించారు. దానిపైనా నేతల్లో  తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. హంగామా చేసే నాయకులకు కొదవ లేని నగరంలో, జనం వద్దకు వెళ్లే నాయకులు తగ్గిపోవడం  ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. హిందుత్వ అజెండానే నగరంలో పార్టీని బతికిస్తోంది తప్ప, రాజకీయ పార్టీగా సొంతగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. గతంలో టీడీపీతో కలసి కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ను సాధించిన బీజేపీ.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన సీట్లు కేవలం నాలుగే నాలుగంటే! దీన్నిబట్టి నగరంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతూనే ఉంది.   పట్టుమని పదిమందిని తీసుకురాలేని వారిని రాష్ట్ర-నియోజకవర్గ నాయకులుగా నియమిస్తున్న విధానం, పార్టీకి నష్టంగా పరిణమించింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి చుట్టూ తిరిగి పైరవీలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, పార్టీ విస్తృతిపై పెడుతున్న దాఖలాలు లేవంటున్నారు. పెద్ద బొట్లు పెట్టుకుని,  నినాదాలు చేసి.. మీడియాలో షో చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని విస్తరించాలన్న ఆలోచన ఎవరికీ లేదు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే, బీజేపీ రాజకీయంగా బలపడిందన్నది చరిత్ర చెబుతోంది. ఈసారి కూడా టీడీపీతో పొత్తు లేనందున, బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి.   నగరంపై పట్టు-అవగాహన ఉన్న జీఆర్ కరుణాకర్-చింతల రామచంద్రారెడ్డి-సుభాష్‌చందర్జీ వంటి దూకుడుగా వెళ్లే నేతల సేవలు, ఈ ఎన్నికల్లో వినియోగించుకుంటేనే, పార్టీకి కొద్దిగానయినా పరువు దక్కుతుందన్నది సీనియర్ల సలహా. టీడీపీ-బీజేపీ కలసిపోటీ చేసినప్పుడు.. చింతల రామచంద్రారెడ్డి మొండిపట్టుదల వల్లే, అప్పుడు పార్టీకి అన్ని సీట్లు దక్కాయి. ఆయన వైఖరితో నాటి మంత్రి విజయరామారావు కూడా విసిగిపోవాల్సి వచ్చింది. చింతల వ్యూహం వల్ల.. కార్పొరేషన్‌లో బీజేపీ సంతృప్తికర స్థానాలు సాధించి, సుభాష్‌చందర్జీ డిప్యూటీ మేయర్ కాగలిగారు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో దూకుడుగా వెళితేనే, ఉపయోగమని పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు. కొత్తగా నియమించిన అధ్యక్షులలో ఆ సత్తా ఉన్న వారెవరూ కనిపించడం లేదంటున్నారు.   ఇక గతంలో కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన టీడీపీ పరిస్థితి,  ప్రస్తుతం దయనీయంగా ఉంది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే పార్టీని వదిలేశారన్న భావన ఉంది. టీఆర్‌ఎస్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని ఆయనే చంపేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా ఉంది. తెలంగాణలో బాబు పార్టీని వదిలేయడంతో, దిక్కులేక వివిధ పార్టీల్లో చేరిన వారి పరిస్థితి కూడా, విషాదంగానే ఉంది. బీజేపీ-టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు అక్కడ ఎలాంటి గుర్తింపు, ఆదరణ లేదు. తమకే దిక్కులేకపోతే, మీరు వచ్చి ఏం చేస్తారని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. టీడీపీలో ఎంతో గౌరవం పొందిన నేతలు ప్రస్తుతం, ఇతర పార్టీల్లో అనాధల్లా మిగలిన దుస్థితి. అయినా ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకునే నాయకత్వం లేదు.   నగరంలో చివరకు సెటిలర్లు కూడా, టీడీపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా, ఏదో ఎదురీది పార్టీ కమిటీలు వేసేందుకు కష్టపడుతున్నారు. ఎన్టీఆర్‌తో కలసి పనిచేసిన అనుభవం ఉన్నందున, అంతో ఇంతో నగరంలో పార్టీ ఉనికి కాపాడగలుగుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పనిచేసిన వారే, పార్టీలో మిగలడం గమనార్హం. ఇంత క్లిష్ట పరిస్థితిలో టీడీపీ, గతంలో వచ్చిన ఒక్క సీటును దాటుతుందా అన్నది ప్రశ్న.   ఇక కాంగ్రెస్‌ను, నాయకత్వ సమస్య వెన్నాడుతోంది. పిజెఆర్, కోదండరామిరెడ్డి, దానం నగేందర్, పిట్ల కృష్ణ వంటి నాయకులు ఇప్పుడు, భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రజాదరణ ఉన్న నేతలు  లేకపోవడంతో, నియోజకవర్గాల్లో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇమేజ్ ఉన్న ఒక్క నాయకుడూ ఆ పార్టీకి కరువయ్యారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్లు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తప్ప, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావడం అనుమానమే. -మార్తి సుబ్రహ్మణ్యం

ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్! ఉద్యోగుల బకాయిలు క్లియర్

తెలంగాణలో తరుచూ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవైనా ఎన్నికలు ఉంటే తప్ప ప్రభుత్వం సమస్యలపై స్పందించడం లేదు. అందుకే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసే నిరుద్యోగులు, సమస్యల పరిష్కారానికి తిప్పలు పడుతున్న జనాలు, పెండింగ్ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారిది ఇదే అభిప్రాయం. జనాలు అనుకుంటున్నట్లే కేసీఆర్ సర్కార్ పని తీరు కూడా ఉంటోంది. తాజాగా అది మరోసారి నిజమైంది.    తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు ఉద్యోగులే. కొంత కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. నాలుగేండ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ పత్తా లేకుండా పోయింది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు ప్రహాసనంగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఎంతగా మెత్తుకుంటున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక కరోనా సమయంలో ఉద్యోగాల వేతనాల్లో సగం కోత  పెట్టింది సర్కార్. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా.. ఆదాయం లేదనే కారణంతో మూడు నెలల పాటు ఉద్యోగులకు సగం జీతమే ఇచ్చింది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం మరింత ఎక్కువైంది.   శాసనమండలి ఎన్నికల్లో ఉద్యోగుల తమకు వ్యతిరేకంగా పని చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. దీంతో దిద్దుబాట చర్యలు చేపట్టింది. కొన్నేళ్లుగా తమ వేతనాల బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరటనిచ్చింది. పెన్షనర్లకు 2 విడతల్లో, ఉద్యోగులకు 4 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. ఈ మేరకు జీవో రిలీజైంది. పింఛనుదారులకు అక్టోబర్, నవంబర్ లో 2 విడతలుగా బకాయిలు చెల్లిస్తారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బకాయిల్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో 4 విడతలుగా చెల్లించబోతున్నారు. కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జీతాలు కట్ చేసింది ప్రభుత్వం.    కరోనా టైమ్ లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజా ప్రతినిధులకు జీతాల్లో కోత విధించారు కేసీఆర్. పింఛన్లలో కూడా కోత విధించడమేంటంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టులోనూ విచారణ జరిగింది. అయినా వెనక్కి తగ్గలేదు కేసీఆర్. దీంతో  అరకొర జీతాలతో బండి నెట్టుకొచ్చిన ఉద్యోగులు, పింఛనుదారులు త్వరలోనే ఆ బకాయిల్ని అందుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్లే తమ బకాయిలు చెల్లిస్తున్నారని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించాలంటే మళ్లీ ఎన్నికలు వస్తే బాగుండని చెబుతున్నారు.