హత్రాస్ ఘటనలో ట్విస్ట్.. యువతిపై అత్యాచారం జరగలేదు!!
posted on Oct 1, 2020 @ 5:57PM
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనపై యూపీ పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. మెడపై తీవ్ర గాయం కారణంగానే ఆమె మరణించిందని తెలిపారు.
హత్రాస్ లో అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు దళిత యువతిపై అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరచినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె అంత్యక్రియలు మంగళవారం అర్థరాత్రి.. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పోలీసులు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో యూపీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని చెప్పారు. "ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది. నమూనాల్లో వీర్యం లేదని ఈ నివేదిక స్పష్టంగా చెప్తోంది. దీనినిబట్టి ఆమెపై అత్యాచారం గానీ, సామూహిక అత్యాచారం గానీ జరగలేదని స్పష్టమవుతోంది" అని వివరించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా అత్యాచారం గురించి పేర్కొనలేదని, తనపై దాడి జరిగిందన్న విషయాన్నే ప్రస్తావించిందని ప్రశాంత్ తెలిపారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను సృష్టించేందుకు కొందరు వాస్తవాలను వక్రీకరించారని పేర్కొన్నారు.
ఇప్పటికే హత్రాస్ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. అసలు బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలు తీవ్ర గాయాలతో నరకం అనుభవించడం నిజం, మరణించడం నిజం. కాబట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.